illustrationcolor

విరామ చిహ్నం

Download PDF ePub  MOBI

స్టేషన్లో రైలాగడం గది కిటికీ లోంచి కనపడ్డది.

“ఆ రైలేగా, కర్టెన్లు వేసెయ్యకూడదూ?” కళ్ల వెనక సగం తెరుచుకున్న లోకాల్లోంచి ఆమె.

“అంతదూరానికి కనపడతామనే?” సగం లోకాల తలుపుల్ని పెదాల్తో మూస్తూ అతను.

“అంతదూరమూ మనకి కనపడకూడదని”

మూడూ, నాలుగూ, ఐదో పాట కూడా ఐపోవచ్చింది కేసెట్లో. . .

వొళ్ళెరక్కుండా అంటాడు “నీతో ఎప్పటికీ. . .”

“మాట్లాడకలా, చిరాకు” మత్తుగా విసుక్కుంది.

“నిజం చిట్టితల్లీ! ఇదివరకెప్పుడూ ఇంతలా. . .” ఆ క్షణంలో నిజమని నమ్ముతూనే చెబుతాడు.

“చెప్పానా! వద్దని” మాటల్ని వేళ్ళతో పొడవుగా, నిలువుగా నిలిపేసింది.

*

పాటలు ఆగిపోయాయి.

కర్టెన్లు తీసిన కిటికీలోంచి చూస్తూ. “నయం, ఇంకా అరగంట టైముంది. టికెట్టెక్కడ పెట్టానో” టేబుల్ పైనా, మంచం కిందా తనని తాను తిట్టుకుంటూ వెతుక్కుంటున్నాడు.

సంచీలోకి అన్నీ సర్దేసి “ఇది తీసికెళ్ళవూ? పాటలూ, మనమూ, ఎప్పుడైనా వింటావుగా!” అందించబోయింది.

“ఫర్వాలేదు, ఇక్కడే ఉండనివ్వు. నా దగ్గర చాలా కలెక్షన్లు ఉన్నాయి. హమ్మయ్య! దొరికింది టికెట్టు.” సంచీ తీసుకుని టైం చూసుకుంటూ తలుపు తెరిచాడు.

*

రెండో వైపు పాడుతుంది కేసెట్టు ఇందాకటి కన్నా చాలా పెద్ద వాల్యూమ్ లో..

నాలుగు, ఐదు, ఆరో పాట…

వెళ్ళిపోతున్న రైలుని కిటికీలోంచి చూస్తుందామె.

పాటలైపోయాయి.

కిటికీ రెక్కలు పెద్ద చప్పుడుతో మూసుకోవడం అంతదూరానికి ఎలానూ కనపడదు.

*

Download PDF ePub  MOBI

Posted in 2014, జనవరి, మ్యూజింగ్స్ and tagged , , , , , , .

3 Comments

  1. నేను అప్పటి నుంచి అనుకొన్నాను స్వాతి ,దేని గురుంచి రాయాలని నాకు ఇది బాగా నచ్చింది. తిలక్ గుర్తుకొచ్చాడు….

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.