71dsTKd4ILL._SL1360_

పొసగని సంస్కారం

Download PDF    ePub    MOBI

ఒక బ్రాహ్మణ అగ్రహారంలో దైవాన్నీ, ఆచారాల్నీ ధిక్కరిస్తూ, నిరసిస్తూ బ్రతికిన నారాయణప్ప అనేవాడు మరణిస్తాడు. అతనికి భార్యాపిల్లలు లేరు. చంద్రి అనే శూద్ర స్త్రీ మాత్రం అతనితో వుంటూ వుంటుంది. అగ్రహారంలో వున్న ఒకరిద్దరు బంధువులతోనూ అతనికి సంబంధాలు లేవు. ఇపుడు ఆ శవానికి సంస్కారం ఎవరు చేయాలి ఎలా చేయాలి అన్నది పెద్ద ధర్మ సందేహమవడం, అగ్రహారంలోని మహాపండితుడు ప్రాణేశాచార్యతో సహా ఎవరూ దానికి పరిష్కారం చెప్పలేకపోవడం, ఆ శవం కుళ్ళిపోవడం, అగ్రహారమంతా దుర్వాసన వ్యాపించడం – ఇలా మొదలవుతుంది “సంస్కారం” అనే ఈ నవల.

నారాయణప్ప ప్లేగు వ్యాధితో మరణిస్తాడు. ఆ వ్యాధి అగ్రహారమంతా వ్యాపించి మరికొందరు చనిపోతారు. శవాన్ని ఏం చేయాలన్న సమస్యకి పరిష్కారం మాత్రం దొరకదు.

ఆ నారాయణప్పకి కాస్త ఆస్తి వుంటుంది. అతనికి సంస్కారం చేసినవాళ్ళకి అది దక్కుతుందన్న ఆశ ఒకపక్క అలాంటి వాడికి సంస్కారం చేస్తే కులభ్రష్టులమవుతామేమోనన్న భయం ఒకప్రక్క ఆ అగ్రహారం బ్రాహ్మణులని పీడించడంతో సమస్య తేలదు.

నారాయణప్ప బ్రతికున్నంత కాలం పండితుడు, నిష్టాగరిష్టుడు అయిన ప్రాణేశాచార్యని సవాలు చేస్తూ వుంటాడు. అతను చనిపోయాక ఊరంతా సమస్యకి పరిష్కారం కోసం ప్రాణేశాచార్య మీద ఆధారపడుతుంది. కానీ ప్రాణేశాచార్యకి ఏం చెప్పాలో తెలియదు. ధర్మశాస్త్రాలన్నీ తిరగేసి సమాధానం దొరకక దేవాలయానికి వెళ్ళి భగవంతుడి ముందు కూర్చుంటాడు, నువ్వే సమాధానం చెప్పాలి అంటూ. ఆ భగవంతుడేమీ చెప్పడు. ఆకలితో, దిగులుతో ఏడుస్తున్న ఆచార్యులవారిని చీకట్లో పట్టుకుని నారాయణప్ప ఉంపుడుగత్తె అయిన చంద్రి ఓదారుస్తుంది. రోగిష్టి భార్యని కట్టుకుని స్త్రీసుఖం ఎరగకుండా బ్రతుకుతున్న ప్రాణేశాచార్య చంద్రి యిచ్చిన అనుభవంతో ఆత్మశోధన(?) లో పడతాడు. ఈ సంఘటన జరిగిన రాత్రే చంద్రి నారాయణప్ప శవాన్ని ఒక తురక వ్యక్తి సహాయంతో తగలబెట్టించేసి, తన స్వగ్రామానికి వెళ్ళిపోతుంది.

ఆ విషయం ఎవరికీ తెలియదు. శవం యింకా ఆ యింట్లోనే ఉందనుకుంటూ వుంటారు. ప్రాణేశాచార్య పరిష్కారం చెప్పలేకపోవడంతో మఠానికి వెళ్ళి గురువుగారి సలహా అడుగుదామని అగ్రహారంలోని మగవాళ్ళందరూ బయల్దేరి పోతారు. ఆడవాళ్ళని పుట్టిళ్ళకి పంపుతారు.

భార్యని వదిలిపెట్టి వెళ్ళలేక ప్రాణేశాచార్య అగ్రహారం లోనే ఉండిపోతాడు. వాళ్ళటు వెళ్ళగానే ఆయన భార్య మరణిస్తుంది. ఆవిడ్ని దహనం చేసి, ఆయన కాళ్ళు నడిపించిన దిశగా నడిచిపోతాడు. దారిలో పుట్ట అనే వ్యక్తి కలుస్తాడు. అతనితో సంభాషణ. ప్రయాణం. రెండు రోజులపాటు ఏవేవో ఆలోచనలు. అనుభవాలు. వాటన్నిటిలోనుంచీ చివరికి ఏదో తెలుసుకున్నాననుకుంటాడు. వెనక్కి వెళ్ళి నారాయణప్ప శవానికి తానే సంస్కారం చేసి, చంద్రి దగ్గరికి వెళ్ళి ఆమెతో ఉండిపోదామని నిర్ణయించుకుని ఆగ్రహారానికి తిరుగు ప్రయాణమవుతాడు. ఇదీ కథ.

ఈ కన్నడ నవలకు నేను సుజాత పట్వారి గారి అనువాదం చదివాను. నవలకు వ్రాసిన ముందు మాటలోనే అనువాదకురాలు కొన్ని విషయాలు ప్రస్తావించారు. కొన్ని పాత్రలని ముఖ్యంగా స్త్రీ పాత్రలని, సంఘటనలని రచయిత ప్రణాళిక ప్రకారం సృష్టించినట్లు కనిపించిందనీ, అది తనని కొంత ఇబ్బందికి, అసహనానికి గురి చేసిందనీ అన్నారు.

కన్నడ బ్రాహ్మణ స్త్రీలను శారీరక మానసిక అందాలు రెండూ లేనివారుగా చిత్రించడం, నవల మొత్తంలో అలా సాధారణీకరించే ప్రయత్నం జరగడం కృతకంగా వుందని అన్నారు. అలాగే అన్ని రకాల, వర్ణాల స్త్రీలకీ కూడా ఎలాంటి సామాజిక సమస్యలు, విలువలపరమైన సమస్యలు ఉండకపోవడం, వారు ముఖ్య పాత్రధారి ప్రాణేశాచార్యకు ఎదురయ్యే నైతిక, సాంస్కృతిక సంఘర్షణలకు పూర్వాపరాలుగా వుండిపోవడమే తప్ప సొంత వ్యక్తిత్వాలకు నోచుకోకపోవడం వంటి వాటిని ప్రస్తావించారు.

ఇదేమిటో చూద్దామని కొంత ఆసక్తితో చదవడం మొదలుపెట్టిన నేను చాలా ఆశ్చర్య పోయాను. “కొన్ని” పాత్రలు, సంఘటనలు కాదు నవల అంతా ‘ప్రణాళిక’ ప్రకారమే నడిచింది సహజత్వానికి చాలా చాలా దూరంగా, ఊహించుకోడానికీ అవకాశమివ్వనంత తర్కరహితంగా.

చిన్నా చితకా పాత్రలు కావు. ముఖ్య పాత్ర ప్రాణేశాచార్యే మనకి ప్రపంచంలో ఎక్కడా ఎప్పటికీ కనబడే అవకాశం లేని పాత్ర. వైరుధ్యానికి పరాకాష్ట. ఈయన గొప్ప పండితుడు. కాశీలో సంస్కృతం అభ్యసించాడు. అక్కడ వేదాంతం చదువుకుని వచ్చి దక్షిణ భారతమంతా పేరుగాంచిన వేదాంత శిరోమణి. కానీ ఆయనకి నారాయణప్ప శవాన్ని ఏం చేయాలి అనే చిన్న విషయం తెలియదు!!

తెలియదు అని పూర్తిగా అనడానికీ లేదు. ఎందుకంటే అందరూ ఒకచోట చేరగానే ఆయన నోటినుంచి మొదట వచ్చిన వాక్యం “సంబంధీకులు లేకపోతే ఏ బ్రాహ్మణుడైనా చేయొచ్చని ధర్మశాస్త్రం చెప్తోంది.” అన్నదే.

అంత చిన్న విషయం తర్వాత సమస్య ఎందుకు అయింది అన్న విషయమే హేతుబద్ధంగా వుండదు. నారాయణప్ప సాలగ్రామాన్ని వీధిలోకి విసిరి కొట్టాడని, మద్యమాంసాలు స్వీకరించాడనీ, శూద్ర స్త్రీ తో సంబంధం పెట్టుకున్నాడనీ ఇవన్నీ ప్రాణేశాచార్యకీ తెలుసు. దానితో పాటూ అతనికి పిల్లల్లేరనీ, బంధువులతో సంబంధాలు లేవనీ కూడా తెలుసు. తెలిసే ఆ పరిష్కారం చెప్పాడు. మరి మళ్ళీ అది సమస్య ఎందుకవుతుంది? తెలుసు కానీ ఒక్క క్షణం మర్చిపోయాడు. మర్చిపోయి మామూలుగా పరిష్కారం చెప్పేశాడు, కానీ అందరూ నారయణప్ప భ్రష్టుడయ్యాడన్న విషయాన్ని గుర్తు చేయడంతో సంకటంలో పడ్డాడు అనుకుందామా అంటే – అందరూ గుర్తు చేశాక కూడా “… వాడు బ్రాహ్మణీకం వదిలేసినా వాణ్ణి బ్రాహ్మణీకం వదల్లేదు. వాడికి బహిష్కరణ వెయ్యలేదు. శాస్త్రోక్తంగా వాడు బహిష్కృతుడు కాకుండానే చావడం వలన వాడు బ్రాహ్మణుడిగానే చచ్చినట్లు లెక్క…” అని అపుడూ మళ్ళీ స్పష్టంగానే చెప్తాడు.

మరి ఇక సమస్య ఏమిటి? తెలీదు. నవల నడవడానికి ఒక సమస్య కావాలి కనుక రచయిత దానిని “సమస్య” చేశారు అని అర్ధమవుతూనే వుంటుంది. అనువాదకురాలు చెప్పినట్లు ఇది కేవలం రచయిత “ప్రణాళిక” తప్ప నిజంగా జరిగే సంఘటన కాదు. నిజంగా అయితే ఈ సమస్యని పరిష్కరించడానికి కాశీకి వెళ్ళి చదువుకొని వచ్చిన పండితుడి అవసరమే లేదు. అగ్రహారం లోని అతిమామూలు బ్రాహ్మణుడైనా ఈ విషయంలో ఏం చేయాలో చెప్పేస్తాడు. (పోనీ ఎక్కువ చదివాడు కనుక ప్రాణేశాచార్య చిన్న సమస్యని జటిలం చేశాడు అని సమర్ధించుకునేందుకూ రచయిత ఎక్కడా అవకాశం యివ్వరు.)

లేదు, డబ్బు కోసం సందేహిస్తున్నారని అనుకుందామా అంటే ఇలాంటి పంచాయితీలూ ఎక్కడా లేనివీ, ఎవరూ ఏనాడూ తీర్పు చెప్పలేకపోయినవీ కాదు. కోట్ల రూపాయల ఆస్తులు, ఇంకా క్లిష్టమైన వారసత్వ గొడవలు వున్న సందర్భాలలో కూడా శవాన్ని కుళ్ళబెట్టి చర్చల్లోకి దిగడం ఎక్కడా కనలేదు. వినలేదు.

అందుకే చదవడం మొదలు పెట్టిన కాసేపటికే ఇది బయటి ప్రపంచంలో ఏ మూలా జరిగే విషయం కాదు. రచయిత మనసులో నుండి వచ్చిన ఉహాజనిత సమాజం, పాత్రలు అని మనకు అర్ధమయి పోతుంది. అయితే యిబ్బంది ఏమిటంటే కనీసం ఆ ఊహకైనా మనం ప్రస్తుతం నివసిస్తున్న మానవసమాజం నుంచి ఒక చిన్న దుర్బలమైన లంకె కూడా లేకపోవడం. మొత్తం సంఘటనలు, పాత్రలు, మనస్తత్వాలు – అన్నీ తర్కానికి అందని అభూతకల్పనలే కావడం! ‘ప్రణాళిక’ తప్ప మరేమీ లేకపోవడం.

ఈ ప్రణాళిక ఎంత హాస్యాస్పదంగా వుంటుందంటే నారాయణప్ప చనిపోగానే “దేవుడి దయ వల్ల ఇంకా ఏ బ్రాహ్మణుడూ భోంచేయలేదు.” అంటారు రచయిత. ఇంకా ఏ బ్రాహ్మణుడూ భోంచేయకపోవడంలో ఉన్న దేవుడి దయ ఏమిటి? అది ఎవరికి ఉపయోగపడే దయ? ఇంత స్పష్టంగా బయటపడుతుంది ప్రణాళిక. అయితే “ఏదో” చెప్పాలన్న ప్రణాళిక వుంది కానీ “అది ఏమిటి?” అన్న విషయంలో మళ్ళీ స్పష్టత లేదని నవల పొడుగునా వున్న వైరుధ్యాలు తెలియచేస్తాయి.

ఈ రకమైన రచనలన్నిటిలోనూ సాధారణంగా ఒకే రకమైన లోపాలు చూస్తుంటాం. అవన్నీ ఈ నవలలో ఉన్నాయి. ఒక మూడిటిని మాత్రం ప్రస్తావిస్తాను.

1. మిడిమిడి జ్ఞానాన్ని “శాస్త్రం” గా చూపడం :

ఇది మొదటి లోపం. శాస్త్రం గురించి పెద్దగా అవగాహన లేనివాళ్ళనీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళనీ చూసి రచన చేయడానికి పూనుకున్న రచయితలు తమ రచనలో అలాంటి పాత్రనే సృష్టించరు. ఒక గొప్ప పండితుడిని సృష్టిస్తారు. అతనికి తాము చూసిన మిడిమిడి జ్ఞానం వాడి లక్షణాలు ఆపాదిస్తారు. తమకి తెలిసిన మిడిమిడి జ్ఞానపు వ్యక్తి నోటి వెంట తాము విన్న మాటలన్నీ ఈ పండితుడి నోట పలికిస్తారు. నిజమైన పండితులు అలా మాట్లాడతారా లేదా అని పరీక్షించుకోరు. తెలుసుకోరు. కనీసం వూహించరు!

ఉదాహరణకి ఈ కథలో ప్రాణేశాచార్య లాంటి గొప్ప శాస్త్ర పండితుడు రోగిష్టి భార్యని కట్టుకోవడం ద్వారా ముక్తి సంపాదిద్దామనుకున్నాడని వ్రాయడమే హాస్యాస్పదం.

“సన్యాసి అవ్వాలి లేదా త్యాగపు జీవితం గడపాలి అనే కోర్కెతో, కావాలని రోగి అయిన ఆమెను పెళ్ళిచేసుకున్నాడు.” –అన్న వాక్యం చదివితే నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. శాస్త్రం చదువుకున్న “చాదస్తులకి” అంత “అభ్యుదయ” భావాలే వుంటే ఇక గొడవేముంది? శాస్త్రం వంటబట్టించుకున్నవాళ్ళు పెళ్ళికి సవాలక్ష చూస్తారనీ, పిల్ల లక్షణంగా వుంటే తప్ప పెళ్ళాడరనీ మనకి తెలుసు కదా!

ధర్మబద్ధంగా కామాన్ని తీర్చుకోవడమూ, సత్సాంతానానికి జన్మనివ్వడమూ శాస్త్రం తెలిసిన ప్రతివాడూ వివాహంలో కోరుకునే విషయాలు. నిజంగా శాస్త్రం తెలిసినవాడు, శాస్త్రం ప్రకారం నడిచేవాడు అనారోగ్యంతో వున్న స్త్రీని పనిగట్టుకుని పెళ్ళాడడు.

ఈ నవలలో ప్రాణేశాచార్య చేసే ప్రతీ ఆలోచనా, ప్రతీ సంభాషణా నిజంగా శాస్త్రం తెలిసినివాడు, శాస్త్రాన్ని నమ్మినవాడు ఎంతమాత్రమూ చేయనివీ, చేయలేనివీ.

ప్రాణేశాచార్య ఒక కుహనా పండితుడు, శాస్త్రం తెలుసని చెప్పి జనాన్ని మోసం చేస్తున్నాడు కానీ నిజానికి అసలు శాస్త్రంలో ఏముందో అతనికి తెలీదు అంటే అది సమంజసంగా వుండేది. కానీ నవల ఆసాంతమూ రచయితా, మిగిలిన పాత్రలూ కూడా ఆయన పాండిత్యాన్నీ, తేజస్సునీ పొగుడుతూనే వుంటారు.

చివరికి ప్రత్యర్ధి నారాయణప్ప కూడా “నేను బ్రాహ్మణ్యాన్ని నాశనం చేస్తాను. నా బాధేమిటంటే నాశనం చేయడానికి మీలో తప్ప అగ్రహారంలో ఇంకెవరిలోనూ అసలు బ్రాహ్మణ్యమే లేదు.” అంటాడు ప్రాణేశాచార్యతో. ఇదింకో వైరుధ్యం.

ఒక్క నారాయణప్ప నోటివెంట వచ్చిన ఈ మాటలే కాదు. నవల పొడుగునా ఇదే ధోరణి వుంటుంది. బ్రాహ్మణ్యం నాశనం చేయాల్సిన విషయమా కాదా! బ్రాహ్మణ్యంలో ఏ గొప్పదనమూ లేకపోతే అది ఒక్క ప్రాణేశాచార్యలో తప్ప మరెవరిలోను మిగలలేదని బాధపడడమెందుకు? బ్రాహ్మణ్యాన్ని వదులుకున్న వారి పట్ల నిరసననీ, పాటించే ప్రాణేశాచార్య పట్ల గౌరవాన్నీ నవల ఆసాంతమూ ప్రకటించడం ఎందుకు?

2. సిద్ధాంతంలో వైఫల్యానికీ, ఆచరణలో వైఫల్యానికీ మధ్య స్పష్టత లేకపోవడం :

ఇది యిలాంటి రచనలలో వుండే మరో లోపం. సిద్దాంతాన్ని బాగా వల్లించే వాడు కూడా ఆచరణలో కొన్ని సార్లు విఫలమవ్వవచ్చు. దానికి కొన్ని ప్రలోభాలు, బలహీనతలు కారణం కావచ్చు. ఇది శాస్త్రం తెలిసినవారందరూ ఒప్పుకునే విషయమే. శాస్త్రం తెలిసినవారందరు చేసే సాధనే ఆ వైఫల్యాలని జయించడం కోసం కదా! వైఫల్యాలే ఉండకపోతే ఇక సాధన ఎందుకు?

అయితే శాస్త్రం తెలుసుకుని జీవితంలో చాలావరకు దానిని ఆచరిస్తూ ఎపుడో ఒకసారి వైఫల్యం చెందినవాడూ, అసలు శాస్త్రాన్నే ఒప్పుకోకుండా తిరిగేవాడూ ఒకటేనని తీర్మానించడమే అసంబద్ధమయిన విషయం. నియమంగా నిగ్రహంగా ధర్మబద్ధంగా బ్రతకాలని ప్రయత్నిస్తూ ఎపుడో ఒకసారి అందులో విఫలమయినవాడూ, అసలు నియమంగా బ్రతకడమే చేతకానివాడూ ఒకటేనని నిర్ణయించడమే తప్పు.

సరే పోనీ బయటి నుంచి చూసేవాళ్ళు అలాగే భావించవచ్చు. ఒక సిద్దాంతానికి కట్టుబడి బ్రతుకుతున్న వాడు అందులో ఒక్కసారి విఫలమవగానే బయటివాళ్ళు “వాడికీ నీకూ తేడా లేదురా” అనేయవచ్చు. కానీ వైఫల్యం చెందినవాడు కూడా అలాగే అనుకుంటాడా? ఒక సిద్ధాంతాన్ని నమ్మి అన్నాళ్ళు సాధన చేసినవాడు కూడా అలాగే అనుకుంటాడా!

ఇక్కడ సిద్దాంతం అంటే శాస్త్రము, సంప్రదాయమే కానవసరం లేదు, మనిషి నమ్మే ఏ సిద్ధాంతమయినా కావచ్చు. తాను అప్పటివరకూ ఆచరిస్తున్న ఏ సిద్దాంతం విషయంలోనైనా ఒకసారి విఫలుడైన వ్యక్తి ఏం చేస్తాడు అన్నది ప్రశ్న. అది తెలియకపోతే, కనీసం ఉహించలేక పోతే పాత్రౌచిత్యం దెబ్బ తింటుంది. దానిని సరిగా పట్టుకోకుండా ప్రణాళిక ప్రకారం సృష్టించిన పాత్ర హాస్యాస్పదంగా తయారవుతుంది.

ఉదాహరణకి, ఎప్పుడూ తొంభై శాతం పైన మార్కులు తెచ్చుకునేవాడు ఒకసారి పరీక్షలో ఉత్తీర్ణుడు కాకపొతే వాడి ఆలోచన ఎలా వుంటుంది? వాడు దాన్ని ఎలా విశ్లేషిస్తాడు? “ఛీ, నేను ఎప్పుడూ సున్నా మార్కులు తెచ్చుకునేవాడి కన్నా హీనం” అనుకుంటాడా? అప్పటిదాకా వాడు చేసిన సాధన, సాధించిన విజయమూ మర్చిపోయి “ఇకనుంచి నేనూ సున్నా మార్కులే తెచ్చుకుంటాను. ఇదే బావుంది.” అనుకుంటాడా?

జీవితమంతా ఒక సిద్ధాంతాన్ని నమ్మినవాడు ఒకసారి దానిని ఆచరించడంలో విఫలమయితే వెంటనే దానికి వ్యతిరేకమైన సిద్దాంతం లోకి మారిపోవడం సహజమేనా? అలా జరిగే అవకాశం అసలెపుడయినా వుంటుందా?

ఉంటుంది. మొదట తాను గడిపిన జీవితమూ, తన ప్రవర్తనా బలహీనతలతోనూ, ప్రలోభాలతోనూ కూడినది అయితే, అలాంటి జీవితంలో ఒకసారి వైఫల్యం ఎదురయి, బుద్ధి పనిచేయడం ప్రారంభిస్తే అప్పుడు బలహీనతలతో కూడిన మొదటి జీవితాన్ని వదిలేయడం జరుగుతుంది.

ఈ నవలలో అదే జరిగిందని చెప్పాలని రచయిత ఉద్దేశ్యం. ప్రాణేశాచార్య మొదట గడిపిన జీవితం శాస్త్రాన్ని గుడ్డిగా నమ్మడం అనే బలహీనతతో కూడిన జీవితం అనీ, చంద్రితో అనుభవం తర్వాత ఆయనకి సత్యం తెలిసివచ్చిందనీ చెప్పాలన్న ప్రయత్నం. బానేవుంది.

అయితే అది ఎలా చెప్పారనేది ప్రశ్న. చంద్రితో అనుభవాన్ని విశ్లేషించుకున్నపుడు ప్రాణేశాచార్య – అది తనకే తెలియకుండా, తన బాధ్యత లేకుండా జరిగిపోయిన చర్య అనీ, అందులో ఆలోచన లేదనీ, అది ఆచితూచి చేసిన పని కాదనీ – అనుకుంటాడు. సుఖం వుందని మాత్రం గ్రహిస్తాడు. ఆ సుఖాన్ని అనాలోచితమైన స్థితిలో కాక ఆలోచనతో, తెలివితో వున్నపుడు పొందడమే తాను సాధించ వలసిన విజయంగా భావిస్తాడు. ఇది అసహజం.

అనాలోచితంగా ఇంద్రియాలు కోరుకునే సుఖాన్ని ఆలోచనని ఉపయోగించి పొందాలనుకోవడం! బుద్ధి పనిచేయని సమయంలో చేసిన పనిని బుద్ధి ఉపయోగించి చేయాలనుకోవడం! ఇది అసంబద్ధం. ఇలా ఎవరూ అనుకోరు.

“బుద్ధిలేకపోవడమే బావుంది. అందులోనే సుఖం వుంది.” అనుకునేవారు కొందరుంటారు. కాదనలేము. కానీ “బుద్ధిని ఉపయోగించి బుద్ధితో అవసరంలేని సుఖాన్ని పొందుతాను.” అని ఎవరైనా అనుకుంటారా! ఈ నవలలో ప్రాణేశాచార్య అనుకుంటాడు!!

3. మానవత్వమూ, సంప్రదాయమూ రెండు పరస్పర విరుద్ధ విషయాలుగా చిత్రీకరించడం :

మానవత్వమూ, సంప్రదాయమూ రెండు పరస్పర విరుద్ధ విషయాలుగా చిత్రీకరించడం అన్నాము కానీ నిజానికి అలా చిత్రీకరించడం కుదరదు. చిత్రీకరించాలన్న వ్యర్ధప్రయత్నం మాత్రం మిగులుతుంది. అంతే. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి.

ఒక అవాస్తవాన్ని వాస్తవంగా చూపాలని ప్రయత్నించినా నవలలో ఏర్పడే వైరుధ్యాలు దాన్ని పట్టి ఇచ్చేస్తాయి.

అగ్రహారంలో సంప్రదాయాన్ని, శాస్త్రాన్ని పట్టుకుని ప్రాకులాడే బ్రాహ్మణులకి మానవత్వం లేదనీ, శాస్త్రాన్ని ధిక్కరించి తిరిగే నారాయణప్పకి మానవత్వం ఉందనీ చెప్పాలనే ఒక ప్రయత్నం కనిపిస్తుంది 71dsTKd4ILL._SL1360_ఈ నవలలో.

చంద్రి నారాయణప్ప శవాన్ని తగలబెట్టడం కోసం చేపల వ్యాపారం చేసే అహమ్మద్ బ్యారి సహాయం కోరినపుడు అతను “ఒకప్పుడు చేతిలో డబ్బుల్లేకపోతే ఎడ్లని కొనుక్కోవడానికి బాకీ యిచ్చిన మహానుభావుడాయన” అంటూ నారాయణప్ప చేసిన మేలు తల్చుకుంటూ వచ్చి శవాన్ని బూడిద చేసి వెళ్తాడు.

ఇక్కడ శాస్త్రాన్ని నమ్మకపోయినా నారాయణప్ప మంచితనము, మానవత్వము అతనికి సహాయాన్ని అందించిందని చెప్పడం రచయిత ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆ ఉద్దేశ్యం నెరవేరలేదని మనకి అర్థమవుతుంది. అహమ్మద్ బ్యారి నారాయణప్ప తనకి చేసిన మేలుకి ప్రత్యుపకారం చేశాడు నిజమే, కానీ దానికి నారాయణప్ప శాస్త్రాన్ని నమ్మకపోవడమూ, అహమ్మద్ బ్యారి ఆ శాస్త్రానికి సంబంధించిన వాడు కాకపోవడమూ కారణాలు కావని రచయిత చెప్పకనే చెప్తున్నారు. నారాయణప్ప శాస్త్రాన్ని నమ్మేవాడూ, ఆచారపరుడూ అయినా కూడా అవసరమయితే అహమ్మద్ బ్యారి ఆ సహాయం చేసి వుండేవాడే కదా! అంటే ఇక్కడ శాస్త్రంతో సంబంధం లేకుండా ఒక మనిషి మరొక మనిషికి చేసిన మేలు వుంది. అంతే.

అయితే శాస్త్రాన్ని నమ్మేవారు మరోమనిషికి సహాయమే చేయరనీ, శాస్త్రాన్ని నమ్మని వాడు కాబట్టే నారాయణప్ప తోటిమనిషికి సహాయడ్డాడనీ చెప్పడానికీ వీలులేదు. ఈ అహమ్మద్ బ్యారీకి, ఊర్లో నాటకాలేసే కుర్రాళ్ళకీ సహాయపడిన నారాయణప్ప తనతో పాటు ఒకే వీధిలో వుండే తోటి బ్రాహ్మణులకి మాత్రం ఏనాడూ సహాయపడడు.

అగ్రహారంలో మిగిలిన పది ఇళ్ళ వాళ్ళు కలిసికట్టుగా వుండి ఒక్కొక్క యింట్లో ఒక్కొక్కరకం పూల చెట్లు పెంచుతుంటారు. అందరూ అన్ని రకాల పూలూ కోసుకుని దేవుడికి పూజ చేస్తూ వుంటారు. పూలూ, పళ్ళు ఒకరికి ఇచ్చి మనం వాడుకోవాలన్న భావంతో వుంటారు. ఒక్క నారాయణప్ప ఇంట్లోని పూలు మాత్రం చంద్రి కొప్పుకే పరిమితమవుతుంటాయి.

ఇవన్నీ నవలలో చెప్పిన విషయాలే. అంటే ఏమిటి? ఎవరి స్నేహాలు వాళ్ళకి వున్నాయి. ఎవరికి నచ్చినవాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకోవడం అందరిలోనూ వుంది.

కాబట్టి ఇలాంటి విషయాలని ఎంతగా మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నించినా చదివేవారికి అసలు విషయం అర్థమయిపోతూనే వుంటుంది. అంతేకాదు. “గరుడాచారి నారాయణప్పతో గొడవపడి సంబంధాలు తెగతెంపులు చేసుకున్నా అతని మరణవార్త వినగానే నోటి దగ్గర ముద్దని వదిలేసి లేచాడు” లాంటి కొన్ని వాక్యాల వల్ల అంతకు మించిన సత్యమూ పట్టుబడుతుంది.

ఇలాంటి లోపాలు లెక్కలేనన్ని వున్నాయి ఈ నవలలో. ఇటు ప్రాణేశాచార్య పాత్రని ఎంత అసంబద్ధంగా చిత్రించారో అటు ప్రాణేశాచార్యకి పోటీగా సృష్టించిన నారాయణప్ప పాత్రనీ అంతే అభాసుపాలు చేస్తారు రచయిత.

ప్రాణేశాచార్యతో అతని వాదనలు, అన్నిటినీ ధిక్కరించే అతని ప్రవర్తనా – అవన్నీ కేవలం మొండితనంతో చేసినవే తప్ప నిజంగా హేతుబద్ధంగా విషయాన్ని పరిశీలించి తెలివితో చేసిన పనులు కావని చంద్రి అతని గురించి చేసిన ఆలోచనలలో మనకి అర్ధమవుతుంది.

ఏరోజూ దేవుడి ముందు చేతులు జోడించని నారాయణప్ప జ్వరం తలకెక్కినప్పటినుంచి, స్పృహ తప్పేంత వరకూ “..భగవంతుడా.. నారాయణా.. రామచంద్రా..” అంటూ కలవరించడం ఆమెకి విచిత్రంగా అనిపిస్తుంది. అతని విషయాలన్నీ గుర్తు చేసుకుని, పైకి ఎలా ప్రవర్తించినా అతని మనసులో శాస్త్రం పై నమ్మకం వుందనీ, కనుక ఇపుడు శాస్త్రోక్తంగా సంస్కారం చేయకపోతే తప్పకుండా దయ్యం అవుతాడనీ అనుకుంటుంది చంద్రి.

తీసుకున్న వస్తువు పట్ల సరైన అవగాహన లేకపోతే అది పాత్రల ఔచిత్యాన్ని ఎంతగా దెబ్బతీస్తుందో అర్ధమయింది కదా! ఇక సన్నివేశచిత్రణలో ఏర్పడిన లోపాలని కూడా ఒక్కసారి ప్రస్తావించి ఈ సమీక్షని ముగిస్తాను.

మొదట ‘సమస్య’ మొదలయే సన్నివేశమే తీసుకుందాం.

“సంస్కారం చేస్తే నారాయణప్ప ఆస్తి దక్కుతుందన్న ఆశ ఒకపక్క, కులభ్రష్టులమవుతామేమోనన్న భయం ఒకప్రక్క ఆ అగ్రహారం బ్రాహ్మణులని పీడించడం వల్ల ఆ సంస్కారం సమస్య అయింది” ఇది కదా చిత్రించాలి ఆ సన్నివేశంలో!

కానీ ఈ రెండు మాటలూ కూడా (ఆస్తి వస్తుందన్న మాట, కులభ్రష్టులవుతారన్న మాట) అసలు ఎక్కడినుంచి వచ్చాయో ఆ సన్నివేశం చదివితే అర్ధం కాదు.

ఆ చర్చ అంతా పరమ అడ్డగోలుగా వుంటుంది. మొదట ప్రాణేశాచార్య పరిష్కారం చెప్తూ ఏమంటాడు? సంబంధీకులు ఎవరూ లేకపోక పొతే ఏ బ్రాహ్మణుడైనా చేయచ్చు అని కదా! కాబట్టి చర్చ అక్కడినుంచి మొదలవాలి కదా! అంటే సంబంధీకులు ఎవరూ లేరు కనుక ఇపుడు “వేరే” ఎవరు చేయాలి అన్న విషయం కదా చర్చింపబడాలి! కానీ అది వదిలిపెట్టి సంబంధీకులు ఎందుకు చేయరు? సంబంధాలు ఎందుకు చెడిపోయాయి? అన్న విషయం చర్చిస్తూ వుంటారు అందరూ (శవాన్ని అక్కడ పెట్టుకుని).

ఏ సందర్భంలోనైనా ఒకరో ఇద్దరో చర్చని పక్క దారి పట్టించేవారు వుంటారు. అపుడు మిగిలినవారు దాన్ని మళ్ళీ దారిలో పెడతారు. కానీ ఇక్కడ అలా జరగదు. పోనీ అందరి ఇంగితమూ నాశనం అయ్యిందన్న విషయాన్నే రచయిత చెప్పదల్చుకున్నారు అనుకుందాం అంటే, దానికి కారణం ఏమిటి? శాస్త్రంలో లోపమా? ధనంపై ప్రలోభమా? ఆ రెండిట్లో దేనిని ఎన్నుకోవడానికీ రచయిత అవకాశం కల్పించరు. ఎందుకంటే అప్పటికి శాస్త్రం వలనా ఇబ్బంది రాలేదు. ధనం ప్రసక్తీ అప్పటికి రాలేదు.

సరే తర్వాత, బంధువులు ఎందుకు చేయలేకపోతున్నారు అని చర్చిస్తారు కదా, అపుడు ప్రాణేశాచార్య, గతంలో నారాయణప్ప, గరుడాచారి తమ మధ్య ఇక ఏ సంబంధాలూ వద్దు అని ఒట్టు పెట్టుకున్నారు కనుక, ఇపుడు నారాయణప్పకి గరుడాచారి సంస్కారం చేస్తే ఆ ఒట్టు తప్పినట్లు అవుతుందన్న సందేహం అక్కరలేదనీ దానికి ప్రాయశ్చిత్త కర్మలున్నాయనీ, కాకపోతే దానికి ఖర్చు అవుతుందనీ అయితే ఆ ఖర్చంతా గరుడాచారి పెట్టుకోవాలని చెప్పడానికి తనకి అధికారం లేదనీ అంటాడు. అంటే అప్పుడు కూడా ప్రాణేశాచార్య ఒట్టు తప్పితే చేసుకోవలసిన ప్రాయశ్చిత్త కర్మ గురించి చెప్తాడు తప్ప సంస్కారం చేస్తే ప్రాయశ్చిత్తం అవసరమని చెప్పడు. సంస్కారం చేసిన వాడు కులభ్రష్టుడు అవుతాడనీ అనడు.

కానీ అందరూ చిత్రంగా ఆ రెండు మాటలూ ఎత్తుకుంటారు. “నేనా మాట అనలేదు. నా ఉద్దేశ్యం అది కాదు.” అని ఈ ప్రాణేశాచార్య చెప్పడు.

పైపెచ్చు ధర్మశాస్త్రాలన్నీ ముందేసుకు కూర్చుని వెతుకుతాడు. భర్త జబ్బుతో వుంటే దేవుడిముండు కూర్చుని పాటలు పాడే చలనచిత్ర కథానాయికలా దేవాలయానికి వెళ్ళి “అక్కడ శవం కుళ్ళిపోతోంది. ఏం చేయాలో చెప్పవయ్యా మారుతీ” అంటూ కీర్తనలు పాడతాడు!

అలాగే నారాయణప్ప పోయాడని దోసిట్లో ముఖం దాచుకుని వెక్కిళ్ళు బిగబట్టి చెప్పిన చంద్రి.. ఆతర్వాత కాసేపటికి ప్రాణేశాచార్య తేజస్సు చూసి మురిసిపోయి ఇలాంటివాడి వల్ల నాకో కొడుకు పుట్టాలి అనుకుంటుంది. రెండురోజుల నుంచీ భోజనం లేక, సమస్యకి సమాధానం తెలియక బాధపడుతున్న ప్రాణేశాచార్యతో గుడి దగ్గర చీకట్లో అనుభవాన్ని పొంది (నారాయణప్ప శవం అక్కడ యింట్లో కుళ్ళుతూ వుండగానే) ఆనందిస్తుంది.

ఇలా ఉంటాయి సన్నివేశాలు!

సంభాషణలు, విశ్లేషణలు, ఆలోచనలు కూడా అంతే గందరగోళంగా వుంటాయి. అసలు రచయిత ఏం చెప్పదల్చుకున్నారు? ఆచారాలు వదిలి దేవుడ్ని మాత్రం పట్టుకోవాలని చెప్పాలనుకున్నారా? అసలు దేవుడ్నే వదిలేయాలని చెప్పాలనుకున్నారా?

కోరికలు ఉండడం తప్పు కాదు, కోరికలు తీర్చుకునేందుకే జీవితం అని చెప్పదల్చుకున్నారా! లేక కోరికలు బలవంతంగా చంపుకోకూడదు, వాటిని తీర్చుకుంటూ క్రమంగా కోర్కెలు లేని స్థితికి ఎదగాలి అని చెప్పదల్చుకున్నారా!

శాస్త్రాన్ని నమ్ముతున్నామనేవారు కూడా ప్రలోభాలకి లోబడిపోయి శాస్త్రాన్ని వదిలిపెట్టేస్తారని చెప్పదల్చుకున్నారా! లేక చాలా ప్రలోభాలున్నవారు కూడా శాస్త్రము, సమాజము ఏర్పరచిన నియమాలకు భయపడి ఆ ప్రలోభాలను నిగ్రహించుకుంటారని చెప్పదల్చుకున్నారా!

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఈ నవల మొత్తం చదివినా మనం కనిపెట్టలేము. ఎందుకంటే ఒక వాక్యం అలా ఒక వాక్యం ఇలా వుంటుంది.

ముగింపు గురించి కూడా ఒక మాట చెప్పుకుందాం.

నవల ముగింపులో ప్రాణేశాచార్య “ఓ సమాధానం చెప్పేముందు పశ్చాత్తాపపడుతున్న గర్వం కానీ పాపినయ్యానన్న దుఃఖం కానీ రెండూ ఉండకూడదు. లేకుంటే ఈ ద్వంద్వపు అంతస్సంఘర్షణ పోదు.” అనుకుంటాడు. “మన నిశ్చయంతో మనం సంపాదించుకునే స్వరూపం మాత్రమే ఖచ్చితంగా మనది!” అన్న నిశ్చయానికి వస్తాడు.

ఇదీ రెండురోజుల సంఘర్షణ తర్వాత ఆయన కనిపెట్టే సిద్దాంతం.

చదువుతుండగానే దీని కన్నా తికమక సిద్దాంతం లేదని అర్థమయిపోతుంది. మన ప్రస్తుత స్వరూపం మన నిశ్చయంతో సంపాదించుకున్న స్వరూపం కాదని మనకెలా తెలుస్తుంది! ఎప్పుడుతెలుస్తుంది? ఎప్పటికపుడు మన స్వరూపం మన నిశ్చయంతో సంపాదించుకున్న స్వరూపమే కదా (ఆ నిశ్చయం మారేవరకు)!

ఎవరయినా ఒక పని చేస్తున్నంత కాలం ఒక రకంగా బ్రతుకుతున్నంత కాలం అది తాము నిశ్చయంతో చేస్తున్న పని అనే కదా అనుకుంటారు! శాస్త్రాన్ని నమ్మి ఆచారాలు పాటించేవాడు, నమ్మకుండా ఆచారాలని నిరసించేవాడు యిద్దరూ కూడా అది తాము తమ నిశ్చయంతో చేస్తున్నామనే అనుకుంటారు.

ఆమాటకొస్తే ప్రాణేశాచార్య కూడా తన నిశ్చయాలతోనే కదా జీవితమంతా గడిపింది! రోగిష్టి భార్యని చేసుకుంటాను, త్యాగమయ జీవితాన్ని గడుపుతాను, కాశీకి వెళ్ళి చదువుకుంటాను – ఇవన్నీ ఆయన నిశ్చయాలే కదా! చంద్రితో గడపడం ఒక్కటే ఆయన నిశ్చయంతో, ఆలోచనతో కాక అనాలోచితంగా చేసిన పని. ఇది నేనంటున్న మాట కాదు. నవలలో ఆయన అన్న మాటే.

అంతకుముందు ప్రతివిషయాన్నీ శాస్త్రానికి ముడిపెట్టి ఆలోచించేవాడిని. చంద్రితో గడిపేటపుడు మాత్రం ఆ పని చేయలేదు. దొరికినదానిని, పరిస్థితులు సమకూర్చినదానిని అలాగే అనుభవించాను తప్ప ఆలోచించలేదు. – అని ఆయనే అనుకుంటాడు.

ఇలా ఆయన సంఘర్షణ, విశ్లేషణ, వాటినుంచి చివరికి ఆయన కనిపెట్టిన సిద్ధాంతం, ఆ సిద్దాంతం ఆధారంగా ఆయన గడపాలనుకుంటున్న శేషజీవితం – వీటన్నిటి మధ్యా ఏ పొంతనా కనిపించక పోవడం ఈ నవల ప్రత్యేకత.

– ధీర

Download PDF    ePub    MOBI

Posted in 2014, జనవరి, వ్యాసం and tagged , , , , , , , .

7 Comments

 1. మీ పరిశీలన నిశితంగానూ, విశ్లేషణ స్పష్టంగానూ ఉన్నాయి. నేనీ నవల (బహుశా మీరు చదివిన ఆంగ్లానువాదమే) చదివి చాలా ఏళ్ళయింది. ఆ కాలంలో ఇంప్రెసయినట్టే గుర్తు తప్ప వివరాలేమీ గుర్తు లేవు. మీ విశ్లేషణ బావుంది.

 2. The question Goda has raised, in response to Dhira’s article on Sanskara, is crucial in the understanding of the creative exercise.Does the writer have a design?No one begins to write without a design.But what happens is the design continuously redraws itself as the work progresses.After a few pages of life,the characters come of age and take charge of their destinies.Without a constitution it is anarchy in a country.And the success of a constitution depends on the scope it allows its people to act freely and responsibly.
  The design is necessary,But the question is:’Does the slip show?’Art, as has been famously observed,lies in concealing the art.
  The design of a work of art,of Valmiki or of any other writer,is what is discovered and reconstructed by the reader,not constructed by the writer.The success of a work is in proportion to the extent the characters assert themselves,and do not meekly submit to the designs of the author.The creativity of a writer,and the authenticity of the work as art,is defined by the writer’s willingness to submit to the will of the characters,and does not force his preconceived ideas on them.Creativity is not exposition of the known,but an exploration of the unknown.And the unknown unfolds itself as the creative process progresses.
  Without this creative encounter with the unknown,a work is at best an illusration.It cannot claim to be a work of art.

 3. Dhiragaru,
  congratulations on presentation of a logical paper. your commitment to point out illogical presentation of thoughts and creation in a famous work is commendable. I am referring this article to some of my friends. I suggest you write this in ENglish and publish in a proper place.I will refer this to my friends.
  Regards,
  KAmeswari

 4. Dhiragaru,

  Your article is very logical. At present days, things are being focused in a an opposite direction than they actually are. The way you brought out the incoherent thoughts and descriptions of the novel is commendable. And specially the strength to oppose the popular opinion is incomparable

  Regards,
  Kameswari.

 5. మీరూ ఈ “నవల అంతా ‘ప్రణాళిక’ ప్రకారమే నడిచింది సహజత్వానికి చాలా చాలా దూరంగా” అన్నారు. నాకు ఒక ధర్మసందేహం. ఒక ప్రణాళిక ఉండడం తప్పా? సహజత్వం మరీ అంత ముఖ్యమా? అలా అనుకుంటే రామాయణం గురించి ఏమనాలి?

 6. Mee vyasam chaala opikaga aa vipareetamaina navala anta chadivi , anta kante opikaga visleshinchi rasarandi !

  Jantuvulu kooda toti praani chanipote spandistaayi. Anaatha preta sanskaaramu cheyyadamu dharmamani chadivinattu gurtu. Daaniki meeru cheppinattu sastra gjnanamu akharledu , maanavata drushti vunte chaalu .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.