amaravathi_kadhalu

అమరావతీ కథలు అపురూప శిల్పాలు

Download PDF   ePub  MOBI

“అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని వాటిమధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గల గల పారుతున్న కృష్టానది. అద్గదీ అమరావతి.”

అమరావతి కథలు సత్యం శంకరమంచి రచించిన 100 కథల సంపుటి. సత్యంగారి రచనకు బాపూ గారి బొమ్మలు, ముళ్ళపూడి వెంకట రమణగారి ముందు మాట మరింత వన్నెతెచ్చాయి. ఈ కథల్లో తనకు పరిచయమున్న ఊరిని, ఊరివారినీ మనకు పరిచయం చేసారు. కథ నిడివి చిన్నదైనా కథ చెప్పిన తీరు, కథా amaravathi_kadhaluవిషయం నిరాడంబరంగా ఉంది. అమరావతి ఊరితో ఆయనకున్న అనుబంధం ప్రతీ కథలోనూ కనిపిస్తుంది. రాజులు, దొరలు, దొంగలూ, సామాన్య ప్రజలూ, అందరూ కథా పాత్రలే. ఒకింత హాస్యము, వ్యంగ్యమూ కలబోసి చెప్తారు. ప్రతీ కథా క్లుప్తంగా, సూటిగా, మనసుకు హత్తుకునే విధంగా ఉంది. ఈ కథలను చదువుతున్న పాఠకుడి మనసుకు కృష్ణానది గలగలలు వినిపిస్తాయి. అమరావతి పరిసరాలు ఒక్కసారి పలకరిస్తాయి. అతి సరళంగా ఉండే ఆయన శైలి మామూలు పాఠకుడు కూడా సులువుగా అర్థం చేసుకోగలడు.

ఒకనాటి అమరావతి నగరం దేదీప్యమానంగా వెలగడం చూపుతూనే, ఈనాడు ఎంత నిరాదరణకు గురౌతున్నదో చెప్పుకొచ్చాడు రచయిత. ఒకనాడు రథాలతో, గుర్రాలతో, సైనిక విన్యాసాలతో పురవీధులు ఎంతో రమణీయంగా ఉండేవి. ఇప్పుడు ఆ వీధుల వెంట కుక్కలూ, గాడిదలూ నడుస్తున్నాయి. ముత్యాల మూటలు బళ్ళకెత్తి నడిచిన ఆ వీధులంట ఇప్పుడు పొట్టు బస్తాల వెళుతున్నాయి. శుభ్రం తగ్గిపోయి, రోడ్లంట చెత్త పేరుకుపోయింది. ఆ గుడిగోపురాలు, బౌధ్ధారామము అన్నీ పూర్వ వైభవాన్ని కోల్పోయాయి. వీటన్నింటినీ చూస్తూ మౌన సాక్షిగా నిలిచింది కృష్ణవేణి.

మొత్తం పుస్తకంలో నాకు నచ్చిన కొన్ని కథల గురించి చెప్తాను:

వరద:— కృష్ణ పొంగి ప్రళయ రూపం దాల్చింది. అమరావతిని అతలాకుతలం చేసేసింది. పూరిళ్లూ భవంతులూ అన్నీ మూకుమ్మడిగా కొట్టుకుపోయాయి. వరద శాంతించాకా పేదా, గొప్ప భేధం పోయింది. శాస్త్రిగారికీ, సంగడికీ ఉన్న దూరాన్ని చెరిపేసిందీ వరద. ఆకలికి కులంలేదంటూ మనషులు తమ చుట్టూ కట్టుకున్న గోడల్ని కూల్చి వెళ్ళి పోయింది. ఊరి వారంతా సహపంక్తి భోజనాలరగించారు. కృష్ణకు మళ్లీ వరద వచ్చే నాటికి కొత్త గోడలు పుట్టుకొస్తాయి.

సుడిగుండంలో ముక్కుపుడక:— ఎలికలోళ్ల బాచిగాడి తాతలు తండ్రులూ అంతా రత్నాల కోసం కృష్ణ సుడిగుండాలు గాలించినవారే. ఒక్క రత్నమూ దొరకలేదు, శ్రమకు ఫలితం దక్కలేదు. ఒకరోజు యధావిధిగా బాచిగాడూ, భార్య సింగి సుడిగుండం ఎండిన గుంటలో రతనాల కోసం వెతుకుతున్నారు. వీళ్ల పని చూసిన భూమయ్య భార్య సూర్యకాంతానికి అక్కడే పోయిన తన ముక్కుపుడుక సంగతి గుర్తొస్తుంది. భార్య ఈ సంగతి చెప్పేసరికి భూమయ్య తెల్లారే లోగా ఆ ముక్కుపుడుక వెతికి తేవాలని జంటకి హుకుం జారీచేస్తాడు. పసివాడి ఆకలిని కూడా లెక్కచేయక అదే పనిగా వెతుకుతారు. చివరికా ముక్కుపుడక దొరికే సరికి పెద్ద రత్నమే దొరికినంత ఆనందిస్తారు. ఆశ చావని ఆ జంట పరుల సొమ్ము ఆశించక ఇంకా కృష్ణలో వెతుకుతూనే ఉంది.

పుణుకుల బుట్టలో లచ్చితల్లి:— ధనానికి మనిషి ఇచ్చే ప్రాముఖ్యం, ఆ ధనంతో మనిషికి వచ్చే ప్రాముఖ్యాన్ని చక్కగా తెలుపుతుందీ కథ. పుణుకుల సుబ్బాయి కాస్తా డబ్బురాగానే సుబ్బారావుగారు గా మారినట్టు.

రాగి చెంబులో చేపపిల్ల:— ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏల? బాంఢ శుద్ధిలేని పాకమేల? చిత్త శుద్ధిలేని శివ పూజలేలరా? అని వేమన అన్నట్లు, ఆచారాలనేవి మనం తెచ్చి పెట్టుకున్నవే. సుబ్బమ్మగారు అచారం పేరుతో ఎంత మూఢత్వంలో కూరుకుపోయి ఉన్నదో ఈ కథ చెపుతుంది.

అన్నపూర్ణ కావిడి:— అన్నపూర్ణకావిడితో యాచించి తెచ్చుకున్న కాస్తలో తనకన్నా బీదవారికి అన్నం పంచి, తాను మిగిలితే తింటాడు లేదంటే కృష్ణాజలంతో కడుపు నింపుకుంటాడు శరభయ్య. జీవితం పై విరక్తి నుండి వైరాగ్యంలోకి వచ్చిన శరభయ్య, తనకున్న దాంట్లోనే నలుగురికీ పంచుతూ తృప్తిగా పోయాడు.

కాకితో కబురు:— జువ్వి తన మనసులోని బాధనంతా కాకులతో, ఉడతలతో, రామ చిలకలతో చెప్పుకునేది. వేయి కళ్లతో అతని రాక కోసం ఎదురు చూసేది. ధ్యాసంతా మామ చింతాలు మీదనే, ఎప్పటికైనా తన బతుకు పండిస్తాడని ఆ చిన్నదాని ఆశ. ఎప్పటికీ తీరని ఆశ. నేను ఏడవటం లేదని మామతో చెప్పమంటూ కాకితో కబురంపిస్తుంది.

తులసి తాంబూలం:— సుష్టిగా భోజనం చేసాకా, కమ్మగా వేసుకునే తాంబూలమే ఆ ఇంటి వారికి భోజనమై ఆకలి తీర్చింది. వామనయ్య, తాయారమ్మల నోరు పండించింది.

బాకీ సంతతి:— తండ్రి చేసిన అప్పు తీర్చడం కోసం తన రక్తాన్ని కరిగించాడు. ఏడాదంతా కష్టించి పండించిన పంటను కళ్ళెం నుండే తీసుకెళ్ళినా సహించాడు, కడుపుకు గంజి తాగాడు, బాధ పెట్టినా ఊరుకున్నాడు కానీ, బాకీ మొత్తాన్ని జమచేసుకోడానికి పొలం దున్నే ఎద్దుల్ని జప్తు చేయటం దాకా వచ్చేసరికి సహించలేకపోయాడు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో విరుచుకు పడ్డాడు. కోపంతో బుసలు కొట్టాడు. కానీ తన ఎద్దుల్ని తిరిగి ఇచ్చేస్తాననే సరికి అంత ఆవేశమూ చల్లారిపోయింది. కృతజ్ఞతతో చిన్న పిల్లాడై ఏడుస్తాడు.

అంపకం:— శివయ్య తన ఒక్కగానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతూ, అల్లుడికి కూతురి మీద కోపం వస్తే తనకు కబురు చేయమని తాను తక్షణమే ఇంటి ముందుంటాననీ అంటాడు. ఆ కోపం తన మీద తీర్చుకో మంటాడు. ఆడపిల్లను కన్న ప్రతి తండ్రీ తన బిడ్డను అత్తవారింటికి పంపేటప్పుడు పడే ఆవేదనా రూపమే అంపకం.

తృప్తి:— పది మందికి వంట చేసి వడ్డించే వారికి, అతిథులు కడుపు నిండుగా భోంచేసి వంటకాలు బాగున్నాయంటే చాలు, ముఖంలో వేయి తారా జువ్వల వెలుగు వస్తుంది, ఆ మాటలతోనే కడుపు నిండి పోతుంది. పూర్ణయ్య తీరు అదే. పది మందికీ పెట్టడంలోనే తన తృప్తి చూసుకుంటాడు.

ఈ కథలు మచ్చుతునకలు మాత్రమే. ఇంకా ఈ 100 కథల్లో మనకు గుర్తుండిపోయే కథలు చాలానే ఉన్నాయి. ఈ పుస్తకం 1979 సంవత్సరానికి గాను ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని దక్కించుకుంది. వీటిని ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగల్ హిందీలో ధారావాహికగా నిర్మించారు. సత్యం శంకరమంచి ఈ కథల ద్యారా అమరావతికి చెరగని గుర్తింపు తెచ్చారు.

– శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub  MOBI

Posted in 2014, జనవరి, పుస్తక సమీక్ష and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.