poruginti jpeg

పొరుగింటమ్మాయి

Download PDF   ePub  MOBI

ప్రపంచం అంతా నిద్రావస్థలో ఉంది. నాకు మాత్రం నిద్ర కరువయింది. మనసెందుకో అలజడిగా, అలసటగా ఉంది. వీధి తలుపు తెరిచి గేటు దగ్గరకు వచ్చాను. పోనీ వాకింగ్ కు వెళదామన్నా తెల్లవారడానికి ఇంకా చాలా సమయమే ఉంది. మా వీధిలో ఎప్పుడూ వెలిగే ఆ కాసిని దీపాలు ఈ రోజు వెలగడం లేదు.

ఎదురింట్లో మాత్రం పెద్దగా లైట్లు వెలుగుతున్నాయి. ఆ ఇంటి నుండి చిన్నగా ఎవరివో ఆడవారి ఏడుపులు వినిపిస్తున్నాయి. చెవులు రిక్కించి అక్కడ నేను విన్నది ఏడుపేనని మరోసారి రూఢీ చేసుకున్నాను.

రాకూడని కష్టం ఏదో వచ్చిందా కుటుంబానికి. ఏం జరిగిందో తెలియాలంటే తెల్లవారాలి. అంతవరకు నా మనసు ఆగలేదు, ఏం జరిగిందో తెలుసుకోవాలి.

కానీ నేను వెళ్ళినా వాళ్ళు బహుశా నన్ను గుర్తుపట్టకపోవచ్చు, ఎందుకంటే ఉద్యోగ కారణంగా నేను నెలలో ఇంటి పట్టున ఉండేది చాలా తక్కువ. నాకు అంతగా ఎవరితోనూ పరిచయాలు లేవు. వెంటనే ఓ ఆలోచన వచ్చింది. నా భార్య నాలా కాదు, అందర్నీ కలుపుకుపోయే మనిషి. ఒకటి రెండు సార్లు ఎదురింటి వారి గురించి ఏదో మాట్లాడటం విన్నాను.

నా మనసు నిలవటం లేదు, సాటి మనిషి కష్టంలో ఉంటే ఓదార్చడానికీ సాయం చేయడానికీ పరిచయం అవసరంలేదు. వెంటనే లోపలికి వెళ్లి బెడ్ రూంలో పడుకున్న నా భార్యను నిద్ర లేపాను. పగలంతా ఇంటి పనులతో అలసిపోయి పడుకున్న తనకి నిద్రాభంగం కలిగించకూడదని మనసు చెపుతున్నా వినలేదు.

మొదట నిద్ర మత్తులో నేను చెప్పింది సరిగా అర్థం చేసుకోలేదు. మళ్ళీ చెప్పుకొచ్చాను. మొదట కంగారు పడ్డా తమాయించుకుని, మంచం మీద నుండి లేచి నుంచుంది. చెదిరిన జుట్టును సవరించుకుని, చీర సరిచేసుకుంది.

ఇద్దరం ఇంటి ప్రహారీ దగ్గరకు వచ్చాం. తన చెవులతో విన్నాకా, నా వైపు తిరిగి “నిజమే నండి, నేను వెళ్ళి విషయం కనుక్కుని వస్తాను” అంటూ బయలుదేరింది.

ఎవరిదో బాధకు ఎందుకు నాకీ తపన. చుట్టుపక్కల ఎవరికీ లేని ఆరాటం నాకు మాత్రమే ఎందుకు? ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు.

ఇంతలో రాధ తిరిగి వచ్చింది. వస్తూనే వరండాలో మెట్ల మీద కూలబడి పోయింది. నాకు నోటి మాట రావడం లేదు. “ఏం… ఏం జరిగింది,” నా గొంతులోని తడబాటు నాకు తెలుస్తూనే ఉంది.

“వాళ్ళ పెద్దమ్మాయి చనిపోయిందండి. ఎలాగో నేనెవరినీ అడగలేదుగానీ, ఏదో ప్రమాదంలో చనిపోయిందని మాత్రం తెలుస్తుంది. శవాన్ని కాసేపటి క్రితమే తీసుకు వచ్చారనుకుంట, అంతా అదే బాధలో ఉన్నారు. ఎవరినీ పలకరించి కారణాలు అడగాలని పించలేదు. ఇద్దరు పిల్లలు, చక్కని సంసారం, పాపం నిండా ముప్ఫయ్యేళ్ళు కూడా లేవు. ఎప్పుడూ నవ్వు ముఖంతో కనపడేది. పచ్చని వంటి ఛాయ, పెద్ద కళ్ళు, గుండ్రటి ముఖానికి దోసగింజ బొట్టు, కళ్ళకు కాటుకతో, నుదుటన సింధూరంతో, చీర కట్టులో లక్ష్మీ దేవిలా ఆ ఇంటికే కళగా మసిలేది. అలాంటమ్మాయి ఇంత తొందరగా అందరినీ వదిలి వెళిపోయిందంటే నాకే మనసంతా ఎదోలా ఉంది, పాపం మరి ఆ కుటుంబం పరిస్థితి వేరే చేప్పాలా,” అంటున్న రాధ మాటలతో మునుపు నేను  చూసిన ఆ అమ్మాయి రూపం నా కళ్ళ ముందు కాసేపు కదలాడి మాయం అయిపోయింది.

నా ఆలోచనల నుండి బయటకు వస్తూ, “నీకు ఎలా తెలిసింది ఆమె ప్రమాదంలో చనిపోయిందని,” అని అడిగాను.

“ఆ అమ్మాయి తల నిండుగా ముఖం కనిపించకుండా బేండేజీ కట్టి ఉంది. అంటే ఏదో ప్రమాదంలో చనిపోతే పోస్టుమార్టం జరిగి ఉండాలి,” అంది.

“సరే నువ్వు ఇలా వెంటనే వచ్చేస్తే వాళ్ళు వేరేగా అనుకుంటారు. పద నేనూ నీతో పాటు వస్తాను ఇద్దరం వెళదాం,” అంటూ లోనికి వెళ్ళాను.

నా వెనకాలే తనూ వస్తూ, “రాత్రి నుండి వాళ్ళు ఏం తిన్నట్టులేదు. కాస్త టీ చేసుకు వస్తాను,” అంటూ వంట గదిలోకి వెళిపోయింది.

వంట గదిలోనుండి రాధ మాటలు వినిపిస్తున్నాయి. “పోనీ ఆత్మహత్య లాంటిది చేసుకున్నదనుకున్నా, అంత కష్టం ఏమోచ్చిందో ఎంత ఆలోచించినా తెలీటం లేదు. ఆమెను మేనమామకే ఇచ్చి చేశారు. అతను ఇంట్లో ఉన్నా లేనట్టే ఉంటాడు. రత్నాలాంటి ఇద్దరు బిడ్డలు. ఆర్థికంగా బాగానే ఉన్నవాళ్లు. తల్లితండ్రీ, అంతా ఉమ్మడిగానే ఉంటారు. కానీ చాలా కాలంగా ఆ అమ్మాయి ఈ కుటుంబానికి దూరంగా ఉంటుంది. ఏం గొడవలో ఏమో. ఆ ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక’ బయటకు మాత్రం ఇంటిలో అత్తకూ (అంటే అమ్మమ్మకూ), ఆ పిల్లకూ క్షణం పడటం లేదని వేరుగా రాజమండ్రిలో కాపురం పెట్టారని చాలా రోజుల క్రితం నాతో చెప్పింది వాళ్ళ అమ్మ. ఇప్పుడు ప్రమాదం కూడా ఆ ఊళ్ళోనే జరిగిందనుకుంటా,” రాధ తన ధోరణిలో తాను మాట్లాడుకుంటూ పోతోంది.

నన్నేవో ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతలో రాధ వెళదామా అనే సరికి తిరిగి ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. ఇద్దరం ఆ ఇంటి వాకిట్లోకి వెళ్లాము.

మేము వెళ్ళే సరికి ఇంకా ఎవరూ వచ్చినట్టులేదు. వరండాలో ఆ ఇంటి మగవారు నలుగురూ విచారంగా కూర్చుని ఉన్నారు. మేం తిన్నగా గదిలోకి నడిచాం. పెద్దగా ఉంది గది. ఆ గదికి మధ్యగా పడుకోబెట్టారు శవాన్ని. ముఖానికి బేండేజీ కట్టి, పై నుండీ దుప్పటి కప్పి ఉంది. తల దగ్గర కొంత బియ్యం పోసి, అగరవత్తులు వెలిగించారు. రాధ ఆమె గురించి చెప్పిన రూపు రేఖలు ఏమీ తెలియడం లేదు.

శవానికి కొంత దూరంగా కూర్చుని ఉన్నారు నలుగురు ఆడవాళ్ళు. బహుశా ఆమె తల్లి, అత్త, తోబుట్టువులు అయి ఉంటారు. ఆ గది నంతా ఎక్కువగానే వ్యాపించి ఉంది అగరబత్తుల వాసన. వాళ్లంతా శవానికి అంత దూరంగా ఉండటం, తల్లి తప్ప మిగతావారంతా మౌనంగా ఉండటం, పైగా అందరూ ముక్కులకు గుడ్డలు అడ్డం పెట్టుకు మరీ కూర్చుని ఉండడం, అంత దూరంగా ఉండి రోదించడం కొంచె చిత్రంగా అనిపించింది.

జీవం ఉన్నపుడు మనిషితో ఉండే అనుబంధాలూ ఆప్యాయతలూ అన్నీ, ఆ గూటిలోని చిలక ఎగిరిపోయాకా మాయమైపోతాయి కాబోలు, ఎప్పుడు కాటికి తీసుకుపోతారా అని చూస్తారు కాబోలు. కన్న తల్లి కూడా బిడ్డ శరీరం కుళ్లి పోయిందని ముక్కు మూసుకుంటుంది. అక్కడితో తల్లి, బిడ్డా బంధాలు ఆవిరై, కాటికి తీసుకు పోవాలనే బాధ్యత మాత్రమే మిగిలి ఉంటుంది కాబోలు. ఇంతేనా శరీరానికి, మనిషికీ ఉన్న సంబంధం. మరి ఎందుకు శరీరం మీద ఈ వ్యామోహం. ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ఆ గది నుండి వీధి అరుగు మీదకు వచ్చాను.

బయట ఉన్న మగవాళ్లు నలుగురిలోనూ పెద్దాయన ఆమె తండ్రి అనుకుంటాను. నన్ను కూర్చోమంటూ కుర్చీ చూపించాడు. నేను ఇబ్బందిగానే వెళ్ళి కూర్చున్నాను. ఆయనతో మాటలు ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. నేను అడిగే లోపే ఆయనే మొదలు పెట్టాడు, “పెళ్ళయి పదేళ్ళయింది, ముత్యాల్లాంటి బిడ్డలు, కళ్ళ ముందే ఉంటుంది కదాని నా బావమరిదికే ఇచ్చి చేశాను. అందరం కలిపే ఉంటున్నాం. కొద్దికాలంగా అత్తకీ తనకూ పడేది కాదు. ఆవిడా కూడా అంతే. మనవరాలే లెమ్మని ఎక్కడా తగ్గేది కాదు. ఓ ఏడాది క్రితం మేము వేరుగా ఉంటాం అంటూ గొడవ చేసింది. ఎంత నచ్చచెప్పినా విన్నదికాదు. చివరికి రాజమండ్రిలో కాపురం పెట్టించింది. సంవత్సరం మధ్య కావడం వల్ల పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. అల్లుడు వారానికి రెండురోజులు వెళ్ళి వస్తున్నాడు. దానికి చిన్నతనం నుండీ భక్తి ఎక్కువ. ఎంత అనారోగ్యంగా ఉన్నా, కార్తీకమాసం నెలంతా పూజలు చేయడం మానదు. మొన్న ఆఖరు రోజు దీపాలు వదలడానికి వెళ్లిందల్లా కనిపించటం మానేసింది. వెతకని చోటు లేదు. చివరకు గోదావరిలో శవం దొరికిందని కబురు వస్తే అల్లుడు రాత్రే వెళ్లాడు. దీపాలు వదులుతూ కాలుజారి పడిపోయి ఉంటుందని అంటున్నారు. పోలీసులు పోస్టుమార్టం అయ్యాక శవాన్ని ఈ రోజే అప్పగించారు,” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి. భర్త వైపు చూశాను. అతను మా మాటలు వినపడనట్టు ఏదో లోకంలో ఉన్నాడు. poruginti jpeg borderకనుబొమలు ముడేసి వేళ్లు నలుపుకుంటున్నాడు.

“తెల్లవారుతోంది నేను ఓసారింటికి వెళ్ళి శ్మశానానికి మీతో వస్తాన”ని చెప్పి బయలుదేరాను.

మనసంతా చికాకుగా ఉంది, కళ్ళు మంటగా ఉన్నాయి, మంచం మీద పడుకున్నానే గానీ మనసంతా తెలియని బాధ, అది ఎందువల్ల కలిగిందో కూడా చెప్పలేను. ఆ ఆలోచనల నుండి నన్ను నేను బలవంతంగా తప్పించుకోవడానికి మార్గం ఒక్కటే… నిద్ర. అలా కళ్ళు మూసుకున్న నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఏదో అలికిడికి మెలకువ వచ్చింది, ఎదురుగా రాధ నన్ను నిద్ర లేపుతుంది. “వాళ్ళంతా శ్మశానానికి వెళ్ళి చాలా సేపయిందండి లేవండి”. అప్పుడు వదలిపోయింది నిద్ర మత్తు. పావు గంటలో తెముల్చుకుని బయలుదేరాను.

శ్మశానం చేరుకునేసరికే జరగాల్సిన తంతు అంతా అయిపోయింది. ఆమె తండ్రి, భర్త, వచ్చిన వారంతా స్నానాలు చేసి ఇంటికి బయల్దేరుతున్నారు. తమతో వెనక్కి వచ్చేయమన్నారు గానీ, కాసేపు అక్కడే గడపాలనిపించించి ఆగాను. ఎంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉందీ చోటు. ఆమె చితికి నిప్పంటించి ఎంతో సమయం కాలేదు. జన్మనిచ్చిన కన్న తల్లి కూడా చీదరించుకున్నా, ఈ అగ్ని కీలలు మాత్రం ప్రేమగా తమ ఒడిలోకి చేర్చుకున్నాయి. ఎంత గొప్ప బతుకు బతికినా మనిషి చేరుకోవలసిన ఆఖరు మజిలీ ఇదే కదూ. ఏదో సత్యం తెలిసినట్టు మనసులో వైరాగ్య భావన అలముకుంది నాలో.

అయినవాళ్ళే అన్నీ ముగించుకుని వెళిపోయారు నేను మాత్రం ఇంకా మథన పడుతున్నాను అనుకుంటూ బయటకు నడిచాను. నేను ఆ గేటు దాటుతుండగా నా ముందుకు స్పీడుగా వచ్చి ఆగిందో ఆటో, అందులో నుండి ఒక అమ్మాయి దిగింది. నన్ను దాటుకుంటూ శ్మశానం గేటు వైపు వెళ్లింది. అక్కడే ఆగి, పొగల్లేస్తున్న చితి వైపు చూస్తూ నిలబడిపోయింది. ఎందుకో ఆమె ఏడుస్తోందని నాకనిపించింది. దగ్గరకు వెళ్లాను. “ఏమ్మా, మీ వాళ్లందరూ ఇప్పుడే ఇంటికి వెళ్లిపోయారు,” అన్నాను. ఆమె కన్నీరు కారుతున్న చెంపలతో నా వైపు చూసింది. ఎందుకో అడగాలనిపించింది, “ఆమె నీకే మవుతుంది?” అన్నాను. ఆమె కళ్లు తుడుచుకుంటూ “నాకేమీ కాదు” అంది.

నాకు చిత్రంగా అనిపించింది. అయినా అంత భావోద్వేగంలో ఉన్న ఆ అమ్మాయిని ఇంకా ప్రశ్నలడగటం ఇష్టం లేక, “నేను బండి మీద వచ్చాను. మళ్లీ ఇంటికే వెళ్తున్నాను. అక్కడ దింపమంటే దింపేస్తాను,” అన్నాను.

“చితి పేర్చి కాల్చి మరీ నన్ను వదిలించుకున్నారు. వాళ్ల దృష్టిలో ప్రస్తుతం నేను కాలిపోయిన శవాన్ని. వట్టి బూడిదని. నన్ను ఇంటికెలా తీసుకెళ్తారు?” అంది.

నాకు చుట్టూ అంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది.

“ఏంటమ్మా నువ్వనేది?” ఏదో అనబోయాను.

ఆమె ఇక ఏడుపు పట్టలేక అక్కడే కూలబడిపోయింది.

ఇంతలో ఇంతదాకా ఆమె తప్ప ఎవరూ లేరనుకున్న ఆటో లోంచి ఒక యువకుడు దిగాడు. వడి వడిగా ఆమె పక్కన మోకరిల్లాడు. భుజాల మీద చేతులు వేసి ఓదార్పుగా మాట్లాడుతున్నాడు. ఆమె తనను తాను సంభాళించుకుంది. అతను ఆసరాగా ఆమెను పొదివి పట్టుకుని ఆటో వైపు నడిపించుకెళ్లాడు. నా నోరు పెగిలేలోగానే వాళ్ల ఆటో కదిలి వెళిపోయింది.

నేను చితి వైపు చూశాను. కాలుతోన్న అనాథ శవం వైపు.

*

Download PDF   ePub MOBI

Posted in 2014, కథ, జనవరి and tagged , , , .

4 Comments

  1. పొరిగింటి అమ్మాయి మనసుని కదిలించింది. మెహర్ గారు. మనసుని కదిలించే కధ రాసిన శ్రీ శాంతి గారికి అభినందనలు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.