transcompet

కవితానువాదాల పోటీ ఫలితాలు

గత సంచికలో మేం ప్రకటించిన కవితానువాదాల పోటీకి మంచి స్పందన వచ్చింది. రాబర్ట్ బ్రౌనింగ్ కవిత “మీటింగ్ ఎట్ నైట్”కు అనువాదం రాసి పంపమన్నాం. మొత్తం పన్నెండుగురు ఎంతో ఉత్సాహంగా రాసి  పంపారు. వాటిని పరిశీలించిన నిర్ణేతల అభిప్రాయం ప్రకారం, అన్నీ చక్కటి అనువాదాలే ఐనా, వాటిలో మూల కవిత కలిగించే అనుభూతిని పూర్తి స్థాయిలో పట్టుకున్నవి తక్కువనే చెప్పాలి. “తర్జుమాలో తప్పిపోయేదే కవిత్వం” అంటారు గనుక అది సహజమే. వచ్చిన వాటిలో రెండు అనువాదాలు మాత్రం (వేర్వేరు అంశాల దగ్గర) మూలానికి చేరువ కాగలిగాయి. కాబట్టి ఈ నెల రెంటినీ విజేతలుగా ప్రకటిస్తున్నాం.

నాగరాజు రామస్వామి అనువాదం:

సమాగమ రేయి

మసక కాంతుల సముద్రం,

విస్తరించిన నల్ల నేల ,

నింగి లోఅంచు మీద

పసుపు పచ్చని భారీ అర్ధ చంద్రుడు !

సైకతతల తడి తిన్నెలను తాకిన పడవ అడుగు,

నిదుర లేచిన విహ్వల విస్మిత ఉత్కళిక వలయ శ్రేణి !

రేవును చేరుకున్నది నా నావ.

.

ఆ పిదప –

వెచ్చని సంద్ర సౌరభాల సాగర తీరాల వెంట

నా నడక ;

ఒక మైలు నడచి,ఓ మూడు పొలాలు గడచి

ఒక తోటలోని కుటీరాన్ని చేరుకున్నాను.

తలుపు తట్టిన తక్షణం

ఆ గాజు కిటికీ వెనుక

అగ్గిపుల్ల గీసిన శబ్దం, ఒక నీలి జ్వాల,ఓ మంద్ర స్వరం !

రెండు గుండెలు కొట్టుకున్న సన్నని సవ్వడి కన్నా

మందాతి మందంగా వుంది

భయాలనూ ఆనంద భూములనూ దాటివచ్చిన

ఆ కంఠ స్వనం !

మానస చామర్తి అనువాదం:

సంయోగము

ఊదా రంగు సముద్రం, కన్నులు స్పృశించని అంచులతో కవ్వించే నల్లటి నేల;

ఎక్కడో భూమిని ముద్దాడేందుకు స్వర్ణకాంతులీనుతూ క్రిందకు వంగిన అర్థ చంద్రం;

ఉలిక్కిపడ్డట్టుగా లేచి, ఉవ్వెత్తుగా ఎగసి,

గుండ్రంగా చుట్లు చుడుతూ పరుగులిడుతున్న అలలు.

నీటిని చీల్చుకుంటూ ఉరికిన నావ, తీరాన్ని ఢీకొంటోంటే,

చిత్తడి నేలలో దించాను లంగరు , వేగాన్ని నిలువరించేందుకు.

.

ఉప్పునీటి పరిమళాలను వెదజల్లుతూ మైలు పొడవు సాగరతీరం;

చేను కనపడేందుకు దాటాల్సిన పొలాలు ఇంకో మూడు ;

కిటికీ అద్దం మీద మునివేళ్ళ చప్పుడు, చురుగ్గా గీసిన శబ్దం -

రాజుకున్న అగ్గిపుల్లకు ఒక్కసారిగా లేచిన నీలిమంట..

భయోల్లాసాలు పెనవేస్తోంటే, గుసగుసగా పలుకుతోన్న గొంతేదో

ఒకటికొకటైన రెండు గుండెల చప్పుడు కన్నా రహస్యంగా వినవస్తోంది.

.

విజేతలు నాగరాజు రామస్వామి, మానస చామర్తిలకు కినిగె పత్రిక తరపున హార్ధికాభినందనలు. పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ఇతర అనువాదకులకూ శుభాకాంక్షలు. మీ విలువైన ప్రాతినిధ్యాన్ని మున్ముందు కూడా ఆశిస్తున్నాం.

(Image Courtesy: http://www.flickr.com/photos/dotnetsensei/11243134793/)

Posted in 2014, కవితానువాదాల పోటీ, జనవరి and tagged , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.