chowrasta cover

చౌరస్తా

Download PDF

ఐదు రూపాయలకు నాలుగు గప్‌చుప్‌లు.. నోర్మూసుకోనీకి నోట్ల వెట్టుకునుడే..

వేడిమీదున్న పప్పు, ప్యాజ్ తోని పల్సటి రసం అంచుకువెట్టుకొని

పట్.. పట్.. పట్..ట్ ట్టాక్. కడుప్పలిగింది.. గప్చుప్దేనా.. భాయి.. గప్‌చుప్.. దేనా..

వానాగిన జెర్శేపటికే ఏడనో తవశుభ ఆశిశ మాగే..

చౌరస్త పక్కటి అరటిపండ్లబండిమీంచా.. పంద్రాగస్టా ఛబ్బీస్ జనవరా..

సర్ఫరోషీకీ తమన్నా పారి పొర్లనీకి.. అఛ్చా.. జనగనమన చైనా ఫోన్ రింగ్టోనైందా..

పోస్టర్‌మీద బల్లిమొఖం తమన్నా తడాఖా.. తడ్ఖా..

ఎలెవెన్ స్టార్ బేకరీసందులకెల్లి ఎవలాల్లు దిల్పసంద్ వాసనలు మోసుకచ్చేది.. పట్టుచీరాంటి..ముప్పయ్యారుంటదా? వొయిసు కూడ? చూశినట్టుందేడనో..

“పిలగా, పొద్మీకి చిట్టిపైశలియ్యిమను మీ అమ్మను..”

రేషన్‌షాపు కోమటి నర్సు పెండ్లామా..

బారాబజే కాలే, ఉజ్వలా వైన్స్ ముంగట క్యూ.. ఎండలవడి..

బ్లెండర్స్ ప్రైడ్ 890, బ్లాక్ డాగ్ 1580,

పదహరువందలు పోస్తేగని మత్తెక్కని మనుషులంటరా లోకమ్మీద, ఏందో, లేనోడు లేకేడిస్తే ఉన్నోడు బలిశేడిశినట్టు.. పట్నంల ఫారిన్ స్కాచ్ పదివేలుంటదట, ఏమాటగ్గామాటనే, మహేష్‌బాబు బ్రాండ్ “రాయల్ స్టాగ్” కంటే కిరాక్ మందుంటదా..

ఔగని బిజినెస్ మ్యాన్ స్టాగ్ తాగుతడా..

కుయ్ య్ య్ య్ య్ య్ య్ కుయ్యి య్యి య్యి య్యి

య్య్ ఇయ్య్ ఇ క్ ఉ య్ య్ య్ య్ య్ య్ య్ య్..

వందా.. ఒన్నాటైటా.. పోలీసోడేటుంటే గాడ అంబులెన్స్ గూడ ఉండాల్లే..

రక్షక్ లకెల్లెవరూ చెయ్యూప్తాంది.. నాకేనా..

“మాక్యొడే.. రా.. ఏంరా కర్క సీను.. ఏది గెలుస్తదియ్యాల, రాత్రికి పోలీస్ ఠానకొచ్చి చెప్పిపో.. భేంకడే, బద్దలు వలుగుతై రాపోతే.. మాకు తెల్వదన్కుంటార్రా మీరు, ఎంతరా నువ్వు, బచ్పన్ గానివి నా ముంగట, ఇంకోపారి నీ పేరినిపిస్తే సుట్టపోనివని గూడ సూడ, బామ్మర్దీ, సావకిప్పుడే..”

బావగాడు.. ఎస్సై అన్న బల్పుతోని కుక్కదొబ్బుల్దొబ్బుకుంట పోయిండు కమాండర్ జీపెక్కి తూప్రాన్ పొంటి

ఈ పాస్పండ్ల లంజొడ్కు ఏడుండో.. ఫోన్ లేప్తలేడు..

“అలో, లంజొడ్కా ఏడున్నవ్, నెంటూర్ అడివిల ఎవన్ది చీకుతున్నవ్, కుందేల్లు పడ్తున్నావ్. జల్ది రా, మా బావగాడు బెదిరిచ్చిపోయిండిప్పుడే, వానమ్మన్… CI తానకి పోదామియాల, కుందేల్లు మర్శిపోకు, ఏస్కరా..”

బేకార్ మాక్యొడే గాడు, రొండ్రోజులకోపారి కొడ్కండ్ల దొమ్మరి గుడిశెల పొంటి పొయ్యే వీన్కి మా అక్కనెట్లిస్తం.. మాదర్ఛోత్గాడు.. పోలీసైతె ఐపోతాది…. ఎండల్దొబ్బుతాన్నై..

“రాజిగా, ఓ స్పెషల్ షర్బతీరా.. బగర్ బరఫ్..”

సర్కారాస్పిటల్ల శవాల మీది బరఫ్ తెచ్చి పోస్తరట అక్కడక్కడ జ్యూస్ సెంటర్లల్ల..

వినాయక షర్బత్ పాలెస్.. రొండు టైర్లు పంచరైన తోపుడుబండిమీద…

“తమ్మీ ఎట్లున్నవే”

ఎవడీడు.. కొమురన్నా..

“నమస్తన్నా.. ఎట్లుంట, సగం సంకనాకి తిర్గుతున్నా..”

“గట్లంటవేంరా.. ఔగనీ, రేపు పట్నంల మీటింగుంది.. ఆరు సుమోలు, రొండు డీసీయమ్లు మాట్లాడ్తున్న మన పోరగాల్లను తీస్కని రారాదు, హరీషన్నను కలిపిస్త..”

“పోయినేడాది సమ్మె చేశిన కేసులింకా అట్లనే ఉన్నై.. పోలీస్నాకొడుకులు వారానికొకడు ఇంటికచ్చి గదిరిస్తుర్రు, ముందుగాల్ల గా కేసులు మాఫ్ చేపియ్యన్నా.. పోరగాల్లను తెస్తగని..”

“చేపిద్దాం ర, చేపిద్దాం.. రేపైతే గానీ”

“గట్ల నడ్వదన్నా.. హరీషన్నకోపారి ఫోన్చేశి మాట్లాడిపియ్యిప్పుడే, వొస్త రేపు..”

“రేపు మీటింగ్ ఐనంక కల్పిస్త తమ్మీ, మన యూత్ ఓ రెండొదలమందుంటరా.”

“ఇప్పుడు మాట్లాడ్పిస్తేనే వొస్తా అన్నా.. నమ్కం పోయ్యింది.. నీతోని కాపోతె ఇడ్శిపెట్టన్నా.. FIR ఫైల్ ఐ, డిగ్రి కాలేజ్లకెల్లి తీశేశిర్రు, గడీకి పోలీసోడొచ్చి గెలుకుతాంటె ఎవ్వడు కొలువిస్తలేడు, ఎట్లాగు నలుగుర్ల గలీజ్గాన్నైనా ఇంకా మావులవోయేదేముందని IPL బెట్టింగ్ ల బ్రోకర్ దందా చేస్తున్న ఆకలికి. జెర్శేపట్కిందనే ఎస్సై నోట్లూంచిపోయిండు.. నీకు మా పోరలు అప్పుడుయాదికిరాలె కొమ్రన్నా..”

“వారీ, ఊకుంటే పైల్వాన్ మాటలు మాట్లడ్తున్నవ్, పొద్దుగాల్ల లేస్తే ఒకలిమొఖం ఒకలం సూస్కునేటోల్లం.. పైలం మరి, రోజులు మంచిగలేవు..”

“మంచిదన్నా.. పొయ్యి రా..”

వీనక్కన్.. గలీజ్ కొడ్కులు అంతా.. హరీషన్న పేరు ఖరాబ్ చేస్కుంట..

పాస్పండ్లోడొస్తే మంచిగుండు.. ఆకలైతాంది, నిన్న రాత్రికి తిన్న ఫ్రైడ్ రైసే..

ఇంటికిపోతే అమ్మా, అక్కా ఒక్క లొల్లి కాదు, ఎస్సై గాన్తోని అక్క పెండ్లెత్తిపోయినప్పటిసంది..

ఎవల్తోనన్న మాట్లాడాలనుంది చానసేపు.. లోపలున్నదంత కక్కబుద్దైతుంది..

అసోంటి మనిషేడ దొర్కుతడు, మనల్ని వినే మనిషుంటడా నిజంగ..

బడిల సక్కగ సదూకుంటె పోయేది, లంగసోపతులువట్టి ఇట్లై..

ఐనా మంచి చెడు చెప్పెటోడు లేపోతే నేనేం జేస్త, ఇంట్ల ఎవర్ది వాల్లకేనాయె,

బాపుకనుమానం నేనాయనకు పుట్టలేదని.. లేని దేవున్ని ఏడికెల్లన్న గుంజుకరావొచ్చుగని, ఉన్న అనుమానం పోగొట్టుడు ఎవన్తోనైతది..

పాస్పండ్లోడొచ్చేదాక మెడికల్‌షాప్ ముంగటున్న ముంజెకాయల్దింటా.. సల్లగా..

“సీనా, అరేయ్.. ఇటు.. ఇసంత ఇసంత..”

ఇయ్యాల ఎంతమంది పిలుస్తర్రబై నన్ను, మల్లెవలు.. బడిల తెలుగు చెప్పిన రాముల్సారా..

“నమస్తె సార్, ఎట్లుర్రు, అంత మంచిదేనా సా..”

నా కతంత చెప్పినంక సార్ కేమన్పిచ్చిందోఏమో..

“సీనా.. ఇంటికివోదాం పా, గీడ్నే, భారత్‌నగర్ గల్లిల, తిన్నంక మాట్లాడుకుందాం.. మా పొలగాన్ని సూస్తివా.. ఏడోతర్గతి ఇప్పుడు, పట్నంల సదుకుంటుండు, ఎండకాలం సెలవులకొచ్చిండు”

సార్ ప్యాషన్ ప్లస్ ఎక్కి ఇంటికివోయి..

Posted in 2014, కథ, జనవరి and tagged , , , .

7 Comments

  1. Pingback: “నేల విడిచి సాము చేయని రచయితలంటే గౌరవం”- వంశీధర్ రెడ్డి | వాకిలి

  2. ” ఏందో, లేనోడు లేకేడిస్తే ఉన్నోడు బలిశేడిశినట్టు. అసోంటి మనిషేడ దొర్కుతడు, మనల్ని వినే మనిషుంటడా నిజంగ. ఎంత సదివేం ఫాయిదా. మన భాశ మనక్రాపోతే. బతుకుడంటే ఏందో తెల్సా.. సావకుండ ఉండుడే రా లోకమ్మీదవడి అందినకాడికి దొబ్బుకతినుడే.”

    మశాల్ చేతపట్టిన వంశీ సారూ! మీ భాషలో పదునుంది. జిందగి చౌరస్త ల వినిపించిన గతకాలపు ముచ్చటోటి
    “ జీనా హైతో మర్నా సీఖో. కదం కదం పర్ లడ్నా సీఖో.” చౌరస్తా అంధేరీలో చతికిలబడినోళ్లకి తీరైన తూరుపుతోవేదో చూపరాదురండి.

  3. కథ అదిరింది భయ్యా! కళ్ళ ముందు రోజు చూసే ప్రపంచాన్ని చాల బాగా capture చేసారు. మీ భాషలో పదునుంది, మీ కథలో దమ్ముంది. తెలంగాణ నాడిని బ్రహ్మాండంగా పట్టారు.

  4. ఇది కథనా … జిందగి. ఇర్గదీసిన్రు సారూ. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు రచయితల్ల దమ్మున్న రచయితలు వేరు. గా దమ్ము గీ చౌరస్త ల గనవడ్డది . పతంజలి గుర్తుకచ్చిండు పో. నార దీసుడంటే గిదే . చింపి ఆరేసినందుకు తారీఫ్ జేస్తున్న.- గొరుసు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.