chowrasta cover

చౌరస్తా

* * *

“ఇల్లు మంచిగున్నద్సార్, ఎన్త, మూడొందల గజాలా, మేడం లేదా ఇంట్ల..”chaurasta

“లేద్రా, బిడ్డను తీస్కని వాల్లమ్మగారింటికిపోయింది ఇప్పుడే బస్టాండ్ల ఇడిశొస్తున్న.. నువ్ కానొచ్చినవ్ చౌరస్తమీద,”

“మరి పిలగాడు పోలేదేంది.”

“మా గాశారానికి వాడు పట్నానికి బాగ అల్వాటైండ్రా.. తాతింటికి పోదామంటె ఆడ టీవీ ఉండది, కంప్యూటరుండది, ఎట్లుండాలె అని గయ్యిమన్నడు..”

“కంప్యూటరా.. గిప్పుడే, నాకిప్పటికి రాదు అది ఓపెన్చేసుడు..”

“వానిది టెక్నో స్కూల్ రా, సదువుకంటెక్కువ గివ్వే నేర్పుతరాడ, చట్, కరెంట్ పాయెకద, రూంలకెల్లి బైటికొస్తడు సూడు మావోడు.. బేటా.. సంకీర్త్.. అన్నయ్యొచ్చిండ్రా.. మాట్లాడవా.. దా..”

“హాయ్..ఆమ్ సంకీర్త్, యువర్నేం..”

“శ్రీనివాస్, కరెంట్ ఐదిటిదాక రాదు, ఆడుకుందామా ఏమన్న, లింగోజ్, చెట్టిర్క, మీ ఇంటెన్క శింతచెట్టెక్కి ఓనగాయల్దెంపుదామా.. చార్పత్త ఆడొచ్చా నీకు..”

“డాడీ, వాట్ హి ఈజ్ సేయింగ్..”

“ఏమంటున్నౌ, గోటీలాడ్తావు..”

“హ హ, సీనా.. వానికివేం తెల్వద్రా.. చిన్నప్పటిసంది హాస్టల్లనే.. మనూర్లె ఇంగ్లీష్మీడియమ్ సదువుల్లేవని పట్నం పంపింది మీ మేడం..”

“సొంతూర్లుంటె సదువు రాదని, పరాయూరికి పంపి సొంత బాశ రాకుండ చేస్తుర్రా సారూ.. ఎంత సదివేం ఫాయిదా.. మన భాశ మనక్రాపోతే..”

“ఔరా.. నా భయం కూడ గదే.. ఇప్పటి పోరలు సదువులల్లవడి మొదాలేదో, కొనాకేదో మరుస్తుర్రు.. నేనెట్లన్నా తెలుగు సదివి కాలవడ్డందుకు మావోనికి నేర్పిస్తగని, పట్నంలుండేటోల్లేంచేస్తర్రా”

“గందుకే మన తెలంగాన మనక్రావాలె సార్..”

“తెలంగాన రాంగనే మన బతుకులు అనావతం మారైరా.. ముందుగాల్ల రాజకీయం చేశెటోల్లు మారాలె, వాల్లకు నియ్యతుంటే మన పొలగాల్లకు మంచి సదువులూ, కొలువులూ దొరుకుతై. లేకపోతె మల్ల 1956, 1969 కతైతది.. పైసా ఫేక్ తమాష దేఖ్ నడుస్తది.. కాని ఒక్కటైతె నిజంరా.. కేసీఆర్నెన్ని తిట్టుకున్నా మల్ల మనల్ని ముంగటేస్కుని మాట్లాడేది నడిశేదిగాయిన్నే.. మనకు వేరే దిక్కు లేద్రా.. నాకంటెక్కువ నీకే తెల్సు, గప్పట్ల సదువిడ్శిపెట్టి ఉద్యమంల తిర్గినౌకద..”

“కరక్టెగని, రోజులట్ల లేవు సార్, బీజేపి ఉన్నదీసారి, ఆఖర్కు ఎట్లాగూ రెండు కలిశెటట్టె కొడ్తాందిగని, ఎట్లైనా..”

“సీనా, పా రా, ఈ లొల్లి వొడువని ముచ్చటగని, యాల్లకమాల ఇంత తిందాంపా.. మటన్ వొండిపోయింది మేడం..”

“డాడీ, నేను వీడియోగేమ్ ఆడుకుంటున్నా.. మీరు తినండి.. నేన్తర్వాత్తింట..”

“సరే బేటా, సీన్గా, మూలుగ బొక్కలేస్కోరా మంచిగుంటై.. ఔ ర, అడుగుదామని మర్శిపోయిన, క్రికెట్ మ్యాచులల్ల ఎట్ల బెట్టింగ్ పెడ్తర్రా.. చెప్పు నాకోపారి..”

“ఏంలే సా.. ఇప్పుడూ, ముంబై హైద్రావాద్ మాచ్ హైద్రవాద్ల అనుకోర్రి, హోమ్ గ్రౌండ్ కావట్టి మనోల్లకే గెల్వనీకి ఛాన్సెక్కువుంటది.. అట్ల, హైద్రావాద్ కు 100 కు 60 అన్న, 70 అన్న, ముంబైకి 100 కు 120 అట్ల రేటింగ్ ఇస్తరు.. గెలుస్తదనుకున్న టీమ్ కు తక్కువ రేటింగిస్తరెప్పుడైనా.. ఇది మ్యాచ్ కు ముందుగాల్ల కత, మ్యాచ్ మొదలైనంక రేటింగులు మారుతై.. ఇట్లకాక, ఒక్కో బాల్కు కూడ బెట్టింగ్ పెడ్తరు, అది మనూర్లె నడ్వది, పట్నంల నడుస్తది బాగ, మనూర్లె నాలెక్క నలుగురున్నరు, మా మీద పట్నంల ఇద్దరుంటరు, వాల్లమీద ముంబైల నలుగురు, చెన్నైల ఇద్దరుంటరు.. ఇదంత ఒక్క గ్రూప్ కత, ఇసోంటి బెట్టింగ్ గ్రూపులు ఇరవైగల్లున్నై దేశమ్మీద.. నిజానికి రేటింగ్స్ ఎక్కువుంటై, మేము సిండికేటై తక్కువ రేట్చెప్తం.. హైద్రబాద్ కు ఒరిజినల్గ 100 కు 80 ఉంటే, మేము 60 చెప్తమిక్కడ, ఆ 20 రూపాయిలు మా కమీషన్.. అవి కాకుంట మ్యాచ్ కింత అని పైసలిస్తరు మాకు.. ఒక్కోమ్యాచ్ కు ఆరేడువేలేస్కుంట.. కూసొని ఫోన్లల్ల గిరాకి నడిపే నాకె అన్ని పైసలొస్తే, ఇగ బెట్టింగ్ పెట్టినోల్లకెన్నొస్తయో.. ఇండ్ల ఒకటే కష్టం.. బెట్ ఓడిపోయినోల్లకాడ పైసలు వసూలు చేసుడు.. ఎప్పటియప్పుడు కలెక్షనియ్యకుంటే మా మీదున్నోల్లు దొబ్బుతరు.. ఊర్లె అందరూ తెల్శినోల్లై ఉద్దెర పెడ్తరు.. ఒకోపారి పోలీస్లకు చెప్తమనిబెదిరిస్తరు.. సిన్మా టాకీస్ పాండురంగారావ్ రొండు లక్షలియ్యాలె నాలుగు మ్యాచులోడిపోయిండు వర్సగా.. రేపిస్తా ఎల్లుండిస్తా అని తింపుతుండు.. ఇవాల రాత్రి సీ.ఐ తోని ములాఖతైదామనుకుంటున్న సార్, పైసలు వొసూల్ చేయనీకి.. మల్ల వానికెంత ఇయ్యల్సొస్తదో.. ఏమ్ సార్, గివన్నడుగుతుర్రు, పైసలు పెట్టిర్రా ఏంది ఇయాల మ్యాచ్ల..”

“నాతోనేడైతద్రా పైసల యవ్వారం.. ఐనా ఎవలు గెలుస్తరో తెల్వకుంట వేలకు వేలెట్ల పెడ్తర్రా..”

“అన్నింటికి తెల్వది గానీ, కొన్ని మ్యాచులకు ముందే తెలుస్తది ఎవలు గెలుస్తరో.. మాకు ఫోన్లొస్తై పైకెల్లి, ఓడిపోయే టీమ్మీద రేటింగ్స్ ఎక్కువ ఇయ్యిమంటరు.. అది చూశి జనాలుదానిమీద బెట్ పెట్టాలని.. లఫంగి దందా సార్, సుకూన్గ పైసలొస్తుంటే ఎవడొద్దంటడు.. కానీ, నాకు ఇడ్శిపెట్టాలనున్నద్సార్, మందిని ముంచి కమాయిస్తున్న, ఎట్లైనా అక్క పెండ్లిచేయనీకిదంతా.. మీకెర్కేగా ఎస్సై తోని మా అక్క పెండ్లి చౌపట్ ఐందని, అప్పట్సంది వాడు పగవట్టి ఎడ్డిస్తుండు ఏడ కానొస్తేగాడ, పైసా సార్, అంత పైస, మనకాడ నాలుగు పైసలుంటెఅందరు మన ముడ్డెన్కనే..”

(పొడిశేటి పొద్దోలె ఎలమందా, పోరు దారెంట వోతుండె ఎలమందా )

“ఫోనొస్తున్నదరా నీకు, పాట జబ్బర్దస్త్ పెట్టినౌ కదా, ఎవల్రా ఫొన్..”

“పాస్పండ్లోడు, అదే బట్టల్దుక్నం నవీన్ గాడు.. ఊర్లెకొచ్చినట్టుండు , మరి నేను పోత సారింక, సీఐ సాబ్ ని కల్వాలె రాత్రి.. మ్యాచ్ టైమ్కు ఫోన్చేస్త మల్ల, పెట్టాలన్పిస్తె పెట్టుర్రి, చేద్దాం, మనచేతిల పని”

“ఆ, అట్లనేరా.. ఆ అవుసరం రాదుతీ.. మంచిగుండు, వొస్తుండు ఇంటికప్పుడప్పుడు..”

* * *

Posted in 2014, కథ, జనవరి and tagged , , , .

7 Comments

  1. Pingback: “నేల విడిచి సాము చేయని రచయితలంటే గౌరవం”- వంశీధర్ రెడ్డి | వాకిలి

  2. ” ఏందో, లేనోడు లేకేడిస్తే ఉన్నోడు బలిశేడిశినట్టు. అసోంటి మనిషేడ దొర్కుతడు, మనల్ని వినే మనిషుంటడా నిజంగ. ఎంత సదివేం ఫాయిదా. మన భాశ మనక్రాపోతే. బతుకుడంటే ఏందో తెల్సా.. సావకుండ ఉండుడే రా లోకమ్మీదవడి అందినకాడికి దొబ్బుకతినుడే.”

    మశాల్ చేతపట్టిన వంశీ సారూ! మీ భాషలో పదునుంది. జిందగి చౌరస్త ల వినిపించిన గతకాలపు ముచ్చటోటి
    “ జీనా హైతో మర్నా సీఖో. కదం కదం పర్ లడ్నా సీఖో.” చౌరస్తా అంధేరీలో చతికిలబడినోళ్లకి తీరైన తూరుపుతోవేదో చూపరాదురండి.

  3. కథ అదిరింది భయ్యా! కళ్ళ ముందు రోజు చూసే ప్రపంచాన్ని చాల బాగా capture చేసారు. మీ భాషలో పదునుంది, మీ కథలో దమ్ముంది. తెలంగాణ నాడిని బ్రహ్మాండంగా పట్టారు.

  4. ఇది కథనా … జిందగి. ఇర్గదీసిన్రు సారూ. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు రచయితల్ల దమ్మున్న రచయితలు వేరు. గా దమ్ము గీ చౌరస్త ల గనవడ్డది . పతంజలి గుర్తుకచ్చిండు పో. నార దీసుడంటే గిదే . చింపి ఆరేసినందుకు తారీఫ్ జేస్తున్న.- గొరుసు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.