chowrasta cover

చౌరస్తా

Download PDF

ఐదు రూపాయలకు నాలుగు గప్‌చుప్‌లు.. నోర్మూసుకోనీకి నోట్ల వెట్టుకునుడే..

వేడిమీదున్న పప్పు, ప్యాజ్ తోని పల్సటి రసం అంచుకువెట్టుకొని

పట్.. పట్.. పట్..ట్ ట్టాక్. కడుప్పలిగింది.. గప్చుప్దేనా.. భాయి.. గప్‌చుప్.. దేనా..

వానాగిన జెర్శేపటికే ఏడనో తవశుభ ఆశిశ మాగే..

చౌరస్త పక్కటి అరటిపండ్లబండిమీంచా.. పంద్రాగస్టా ఛబ్బీస్ జనవరా..

సర్ఫరోషీకీ తమన్నా పారి పొర్లనీకి.. అఛ్చా.. జనగనమన చైనా ఫోన్ రింగ్టోనైందా..

పోస్టర్‌మీద బల్లిమొఖం తమన్నా తడాఖా.. తడ్ఖా..

ఎలెవెన్ స్టార్ బేకరీసందులకెల్లి ఎవలాల్లు దిల్పసంద్ వాసనలు మోసుకచ్చేది.. పట్టుచీరాంటి..ముప్పయ్యారుంటదా? వొయిసు కూడ? చూశినట్టుందేడనో..

“పిలగా, పొద్మీకి చిట్టిపైశలియ్యిమను మీ అమ్మను..”

రేషన్‌షాపు కోమటి నర్సు పెండ్లామా..

బారాబజే కాలే, ఉజ్వలా వైన్స్ ముంగట క్యూ.. ఎండలవడి..

బ్లెండర్స్ ప్రైడ్ 890, బ్లాక్ డాగ్ 1580,

పదహరువందలు పోస్తేగని మత్తెక్కని మనుషులంటరా లోకమ్మీద, ఏందో, లేనోడు లేకేడిస్తే ఉన్నోడు బలిశేడిశినట్టు.. పట్నంల ఫారిన్ స్కాచ్ పదివేలుంటదట, ఏమాటగ్గామాటనే, మహేష్‌బాబు బ్రాండ్ “రాయల్ స్టాగ్” కంటే కిరాక్ మందుంటదా..

ఔగని బిజినెస్ మ్యాన్ స్టాగ్ తాగుతడా..

కుయ్ య్ య్ య్ య్ య్ య్ కుయ్యి య్యి య్యి య్యి

య్య్ ఇయ్య్ ఇ క్ ఉ య్ య్ య్ య్ య్ య్ య్ య్..

వందా.. ఒన్నాటైటా.. పోలీసోడేటుంటే గాడ అంబులెన్స్ గూడ ఉండాల్లే..

రక్షక్ లకెల్లెవరూ చెయ్యూప్తాంది.. నాకేనా..

“మాక్యొడే.. రా.. ఏంరా కర్క సీను.. ఏది గెలుస్తదియ్యాల, రాత్రికి పోలీస్ ఠానకొచ్చి చెప్పిపో.. భేంకడే, బద్దలు వలుగుతై రాపోతే.. మాకు తెల్వదన్కుంటార్రా మీరు, ఎంతరా నువ్వు, బచ్పన్ గానివి నా ముంగట, ఇంకోపారి నీ పేరినిపిస్తే సుట్టపోనివని గూడ సూడ, బామ్మర్దీ, సావకిప్పుడే..”

బావగాడు.. ఎస్సై అన్న బల్పుతోని కుక్కదొబ్బుల్దొబ్బుకుంట పోయిండు కమాండర్ జీపెక్కి తూప్రాన్ పొంటి

ఈ పాస్పండ్ల లంజొడ్కు ఏడుండో.. ఫోన్ లేప్తలేడు..

“అలో, లంజొడ్కా ఏడున్నవ్, నెంటూర్ అడివిల ఎవన్ది చీకుతున్నవ్, కుందేల్లు పడ్తున్నావ్. జల్ది రా, మా బావగాడు బెదిరిచ్చిపోయిండిప్పుడే, వానమ్మన్... CI తానకి పోదామియాల, కుందేల్లు మర్శిపోకు, ఏస్కరా..”

బేకార్ మాక్యొడే గాడు, రొండ్రోజులకోపారి కొడ్కండ్ల దొమ్మరి గుడిశెల పొంటి పొయ్యే వీన్కి మా అక్కనెట్లిస్తం.. మాదర్ఛోత్గాడు.. పోలీసైతె ఐపోతాది.... ఎండల్దొబ్బుతాన్నై..

“రాజిగా, ఓ స్పెషల్ షర్బతీరా.. బగర్ బరఫ్..”

సర్కారాస్పిటల్ల శవాల మీది బరఫ్ తెచ్చి పోస్తరట అక్కడక్కడ జ్యూస్ సెంటర్లల్ల..

వినాయక షర్బత్ పాలెస్.. రొండు టైర్లు పంచరైన తోపుడుబండిమీద...

“తమ్మీ ఎట్లున్నవే”

ఎవడీడు.. కొమురన్నా..

“నమస్తన్నా.. ఎట్లుంట, సగం సంకనాకి తిర్గుతున్నా..”

“గట్లంటవేంరా.. ఔగనీ, రేపు పట్నంల మీటింగుంది.. ఆరు సుమోలు, రొండు డీసీయమ్లు మాట్లాడ్తున్న మన పోరగాల్లను తీస్కని రారాదు, హరీషన్నను కలిపిస్త..”

“పోయినేడాది సమ్మె చేశిన కేసులింకా అట్లనే ఉన్నై.. పోలీస్నాకొడుకులు వారానికొకడు ఇంటికచ్చి గదిరిస్తుర్రు, ముందుగాల్ల గా కేసులు మాఫ్ చేపియ్యన్నా.. పోరగాల్లను తెస్తగని..”

“చేపిద్దాం ర, చేపిద్దాం.. రేపైతే గానీ”

“గట్ల నడ్వదన్నా.. హరీషన్నకోపారి ఫోన్చేశి మాట్లాడిపియ్యిప్పుడే, వొస్త రేపు..”

“రేపు మీటింగ్ ఐనంక కల్పిస్త తమ్మీ, మన యూత్ ఓ రెండొదలమందుంటరా.”

“ఇప్పుడు మాట్లాడ్పిస్తేనే వొస్తా అన్నా.. నమ్కం పోయ్యింది.. నీతోని కాపోతె ఇడ్శిపెట్టన్నా.. FIR ఫైల్ ఐ, డిగ్రి కాలేజ్లకెల్లి తీశేశిర్రు, గడీకి పోలీసోడొచ్చి గెలుకుతాంటె ఎవ్వడు కొలువిస్తలేడు, ఎట్లాగు నలుగుర్ల గలీజ్గాన్నైనా ఇంకా మావులవోయేదేముందని IPL బెట్టింగ్ ల బ్రోకర్ దందా చేస్తున్న ఆకలికి. జెర్శేపట్కిందనే ఎస్సై నోట్లూంచిపోయిండు.. నీకు మా పోరలు అప్పుడుయాదికిరాలె కొమ్రన్నా..”

“వారీ, ఊకుంటే పైల్వాన్ మాటలు మాట్లడ్తున్నవ్, పొద్దుగాల్ల లేస్తే ఒకలిమొఖం ఒకలం సూస్కునేటోల్లం.. పైలం మరి, రోజులు మంచిగలేవు..”

“మంచిదన్నా.. పొయ్యి రా..”

వీనక్కన్.. గలీజ్ కొడ్కులు అంతా.. హరీషన్న పేరు ఖరాబ్ చేస్కుంట..

పాస్పండ్లోడొస్తే మంచిగుండు.. ఆకలైతాంది, నిన్న రాత్రికి తిన్న ఫ్రైడ్ రైసే..

ఇంటికిపోతే అమ్మా, అక్కా ఒక్క లొల్లి కాదు, ఎస్సై గాన్తోని అక్క పెండ్లెత్తిపోయినప్పటిసంది..

ఎవల్తోనన్న మాట్లాడాలనుంది చానసేపు.. లోపలున్నదంత కక్కబుద్దైతుంది..

అసోంటి మనిషేడ దొర్కుతడు, మనల్ని వినే మనిషుంటడా నిజంగ..

బడిల సక్కగ సదూకుంటె పోయేది, లంగసోపతులువట్టి ఇట్లై..

ఐనా మంచి చెడు చెప్పెటోడు లేపోతే నేనేం జేస్త, ఇంట్ల ఎవర్ది వాల్లకేనాయె,

బాపుకనుమానం నేనాయనకు పుట్టలేదని.. లేని దేవున్ని ఏడికెల్లన్న గుంజుకరావొచ్చుగని, ఉన్న అనుమానం పోగొట్టుడు ఎవన్తోనైతది..

పాస్పండ్లోడొచ్చేదాక మెడికల్‌షాప్ ముంగటున్న ముంజెకాయల్దింటా.. సల్లగా..

"సీనా, అరేయ్.. ఇటు.. ఇసంత ఇసంత.."

ఇయ్యాల ఎంతమంది పిలుస్తర్రబై నన్ను, మల్లెవలు.. బడిల తెలుగు చెప్పిన రాముల్సారా..

“నమస్తె సార్, ఎట్లుర్రు, అంత మంచిదేనా సా..”

నా కతంత చెప్పినంక సార్ కేమన్పిచ్చిందోఏమో..

“సీనా.. ఇంటికివోదాం పా, గీడ్నే, భారత్‌నగర్ గల్లిల, తిన్నంక మాట్లాడుకుందాం.. మా పొలగాన్ని సూస్తివా.. ఏడోతర్గతి ఇప్పుడు, పట్నంల సదుకుంటుండు, ఎండకాలం సెలవులకొచ్చిండు”

సార్ ప్యాషన్ ప్లస్ ఎక్కి ఇంటికివోయి..

* * *

“ఇల్లు మంచిగున్నద్సార్, ఎన్త, మూడొందల గజాలా, మేడం లేదా ఇంట్ల..”chaurasta

“లేద్రా, బిడ్డను తీస్కని వాల్లమ్మగారింటికిపోయింది ఇప్పుడే బస్టాండ్ల ఇడిశొస్తున్న.. నువ్ కానొచ్చినవ్ చౌరస్తమీద,”

“మరి పిలగాడు పోలేదేంది.”

“మా గాశారానికి వాడు పట్నానికి బాగ అల్వాటైండ్రా.. తాతింటికి పోదామంటె ఆడ టీవీ ఉండది, కంప్యూటరుండది, ఎట్లుండాలె అని గయ్యిమన్నడు..”

“కంప్యూటరా.. గిప్పుడే, నాకిప్పటికి రాదు అది ఓపెన్చేసుడు..”

“వానిది టెక్నో స్కూల్ రా, సదువుకంటెక్కువ గివ్వే నేర్పుతరాడ, చట్, కరెంట్ పాయెకద, రూంలకెల్లి బైటికొస్తడు సూడు మావోడు.. బేటా.. సంకీర్త్.. అన్నయ్యొచ్చిండ్రా.. మాట్లాడవా.. దా..”

“హాయ్..ఆమ్ సంకీర్త్, యువర్నేం..”

“శ్రీనివాస్, కరెంట్ ఐదిటిదాక రాదు, ఆడుకుందామా ఏమన్న, లింగోజ్, చెట్టిర్క, మీ ఇంటెన్క శింతచెట్టెక్కి ఓనగాయల్దెంపుదామా.. చార్పత్త ఆడొచ్చా నీకు..”

“డాడీ, వాట్ హి ఈజ్ సేయింగ్..”

“ఏమంటున్నౌ, గోటీలాడ్తావు..”

“హ హ, సీనా.. వానికివేం తెల్వద్రా.. చిన్నప్పటిసంది హాస్టల్లనే.. మనూర్లె ఇంగ్లీష్మీడియమ్ సదువుల్లేవని పట్నం పంపింది మీ మేడం..”

“సొంతూర్లుంటె సదువు రాదని, పరాయూరికి పంపి సొంత బాశ రాకుండ చేస్తుర్రా సారూ.. ఎంత సదివేం ఫాయిదా.. మన భాశ మనక్రాపోతే..”

“ఔరా.. నా భయం కూడ గదే.. ఇప్పటి పోరలు సదువులల్లవడి మొదాలేదో, కొనాకేదో మరుస్తుర్రు.. నేనెట్లన్నా తెలుగు సదివి కాలవడ్డందుకు మావోనికి నేర్పిస్తగని, పట్నంలుండేటోల్లేంచేస్తర్రా”

“గందుకే మన తెలంగాన మనక్రావాలె సార్..”

“తెలంగాన రాంగనే మన బతుకులు అనావతం మారైరా.. ముందుగాల్ల రాజకీయం చేశెటోల్లు మారాలె, వాల్లకు నియ్యతుంటే మన పొలగాల్లకు మంచి సదువులూ, కొలువులూ దొరుకుతై. లేకపోతె మల్ల 1956, 1969 కతైతది.. పైసా ఫేక్ తమాష దేఖ్ నడుస్తది.. కాని ఒక్కటైతె నిజంరా.. కేసీఆర్నెన్ని తిట్టుకున్నా మల్ల మనల్ని ముంగటేస్కుని మాట్లాడేది నడిశేదిగాయిన్నే.. మనకు వేరే దిక్కు లేద్రా.. నాకంటెక్కువ నీకే తెల్సు, గప్పట్ల సదువిడ్శిపెట్టి ఉద్యమంల తిర్గినౌకద..”

“కరక్టెగని, రోజులట్ల లేవు సార్, బీజేపి ఉన్నదీసారి, ఆఖర్కు ఎట్లాగూ రెండు కలిశెటట్టె కొడ్తాందిగని, ఎట్లైనా..”

“సీనా, పా రా, ఈ లొల్లి వొడువని ముచ్చటగని, యాల్లకమాల ఇంత తిందాంపా.. మటన్ వొండిపోయింది మేడం..”

“డాడీ, నేను వీడియోగేమ్ ఆడుకుంటున్నా.. మీరు తినండి.. నేన్తర్వాత్తింట..”

“సరే బేటా, సీన్‌గా, మూలుగ బొక్కలేస్కోరా మంచిగుంటై.. ఔ ర, అడుగుదామని మర్శిపోయిన, క్రికెట్ మ్యాచులల్ల ఎట్ల బెట్టింగ్ పెడ్తర్రా.. చెప్పు నాకోపారి..”

“ఏంలే సా.. ఇప్పుడూ, ముంబై హైద్రావాద్ మాచ్ హైద్రవాద్ల అనుకోర్రి, హోమ్ గ్రౌండ్ కావట్టి మనోల్లకే గెల్వనీకి ఛాన్సెక్కువుంటది.. అట్ల, హైద్రావాద్ కు 100 కు 60 అన్న, 70 అన్న, ముంబైకి 100 కు 120 అట్ల రేటింగ్ ఇస్తరు.. గెలుస్తదనుకున్న టీమ్ కు తక్కువ రేటింగిస్తరెప్పుడైనా.. ఇది మ్యాచ్ కు ముందుగాల్ల కత, మ్యాచ్ మొదలైనంక రేటింగులు మారుతై.. ఇట్లకాక, ఒక్కో బాల్‌కు కూడ బెట్టింగ్ పెడ్తరు, అది మనూర్లె నడ్వది, పట్నంల నడుస్తది బాగ, మనూర్లె నాలెక్క నలుగురున్నరు, మా మీద పట్నంల ఇద్దరుంటరు, వాల్లమీద ముంబైల నలుగురు, చెన్నైల ఇద్దరుంటరు.. ఇదంత ఒక్క గ్రూప్ కత, ఇసోంటి బెట్టింగ్ గ్రూపులు ఇరవైగల్లున్నై దేశమ్మీద.. నిజానికి రేటింగ్స్ ఎక్కువుంటై, మేము సిండికేటై తక్కువ రేట్చెప్తం.. హైద్రబాద్ కు ఒరిజినల్గ 100 కు 80 ఉంటే, మేము 60 చెప్తమిక్కడ, ఆ 20 రూపాయిలు మా కమీషన్.. అవి కాకుంట మ్యాచ్ కింత అని పైసలిస్తరు మాకు.. ఒక్కోమ్యాచ్ కు ఆరేడువేలేస్కుంట.. కూసొని ఫోన్లల్ల గిరాకి నడిపే నాకె అన్ని పైసలొస్తే, ఇగ బెట్టింగ్ పెట్టినోల్లకెన్నొస్తయో.. ఇండ్ల ఒకటే కష్టం.. బెట్ ఓడిపోయినోల్లకాడ పైసలు వసూలు చేసుడు.. ఎప్పటియప్పుడు కలెక్షనియ్యకుంటే మా మీదున్నోల్లు దొబ్బుతరు.. ఊర్లె అందరూ తెల్శినోల్లై ఉద్దెర పెడ్తరు.. ఒకోపారి పోలీస్‌లకు చెప్తమనిబెదిరిస్తరు.. సిన్మా టాకీస్ పాండురంగారావ్ రొండు లక్షలియ్యాలె నాలుగు మ్యాచులోడిపోయిండు వర్సగా.. రేపిస్తా ఎల్లుండిస్తా అని తింపుతుండు.. ఇవాల రాత్రి సీ.ఐ తోని ములాఖతైదామనుకుంటున్న సార్, పైసలు వొసూల్ చేయనీకి.. మల్ల వానికెంత ఇయ్యల్సొస్తదో.. ఏమ్ సార్, గివన్నడుగుతుర్రు, పైసలు పెట్టిర్రా ఏంది ఇయాల మ్యాచ్‌ల..”

“నాతోనేడైతద్రా పైసల యవ్వారం.. ఐనా ఎవలు గెలుస్తరో తెల్వకుంట వేలకు వేలెట్ల పెడ్తర్రా..”

“అన్నింటికి తెల్వది గానీ, కొన్ని మ్యాచులకు ముందే తెలుస్తది ఎవలు గెలుస్తరో.. మాకు ఫోన్లొస్తై పైకెల్లి, ఓడిపోయే టీమ్మీద రేటింగ్స్ ఎక్కువ ఇయ్యిమంటరు.. అది చూశి జనాలుదానిమీద బెట్ పెట్టాలని.. లఫంగి దందా సార్, సుకూన్గ పైసలొస్తుంటే ఎవడొద్దంటడు.. కానీ, నాకు ఇడ్శిపెట్టాలనున్నద్సార్, మందిని ముంచి కమాయిస్తున్న, ఎట్లైనా అక్క పెండ్లిచేయనీకిదంతా.. మీకెర్కేగా ఎస్సై తోని మా అక్క పెండ్లి చౌపట్ ఐందని, అప్పట్సంది వాడు పగవట్టి ఎడ్డిస్తుండు ఏడ కానొస్తేగాడ, పైసా సార్, అంత పైస, మనకాడ నాలుగు పైసలుంటెఅందరు మన ముడ్డెన్కనే..”

(పొడిశేటి పొద్దోలె ఎలమందా, పోరు దారెంట వోతుండె ఎలమందా )

“ఫోనొస్తున్నదరా నీకు, పాట జబ్బర్దస్త్ పెట్టినౌ కదా, ఎవల్రా ఫొన్..”

“పాస్పండ్లోడు, అదే బట్టల్దుక్నం నవీన్ గాడు.. ఊర్లెకొచ్చినట్టుండు , మరి నేను పోత సారింక, సీఐ సాబ్ ని కల్వాలె రాత్రి.. మ్యాచ్ టైమ్‌కు ఫోన్చేస్త మల్ల, పెట్టాలన్పిస్తె పెట్టుర్రి, చేద్దాం, మనచేతిల పని”

“ఆ, అట్లనేరా.. ఆ అవుసరం రాదుతీ.. మంచిగుండు, వొస్తుండు ఇంటికప్పుడప్పుడు..”

* * *

“రేయ్, శాల నవీన్‌గా.. సీయై తోని మాట్లాడిన, రుచి దాబా కాడ్కి రమ్మన్నడు, కుందేల్లు తెచ్చినవ్ కదా, అవి దాబావోనికిచ్చి గంటల కూరొండుమను, బులెట్లు కూడ చెయ్యమను, అదేరా, పెనమ్మీద వైన్ పోశి చేస్తరుకదా.. గది.. జల్ది.. నేను ఓ గంటలొస్తా ఏడు వరకు, దొమ్మరిండ్లల్లాగ్గాదు లంజొడ్కా.. ఇప్పుడాన్కి తాపీయనీకి పైసలు తెస్తా. ఔసుల చారిచ్చేదుండు, మొన్నటి మ్యాచ్ పైసలు.. ఆయన కాడ తెస్తా..”

శీ ఒక్కపారి లంగగాడని పేరువడ్డంక ఎంత మంచిగుందామన్నా ఉండి కలవడనీయది జమానా.. థూత్.. లౌడల జిందగీ.. అటుతిరిగి ఇటుతిరిగి మల్ల చౌరస్త కాడికే వొచ్చిన్నా, ఇక్కడిదిక్కడ్నే గోల్ గోల్ ఫిర్ రహా మైనే ముసాఫిర్ కె తరాహ్.. మల్లెవలుల్లో ఫోను..

“సీనా ఏడున్నవ్ రా..” గీ టైమ్‌ల అమ్మెందుకు ఫోన్‌చేస్తుంది..

“చౌరస్త కాడున్ననే, ఔసుల చారింటికి పోతున్న, ఏమైందే, ఆగమాగమ్మాట్లాడ్తున్నవ్.. మల్లేం లొల్లి”

“మీ అక్క దెంకపోయింద్రా.. ఇంటిపక్కన బాపనాయినతోని.. మీ బాపింట్ల లేడు, ఏం చెప్పాల్నో తెలుస్తలేదు, నా సావుకు కన్న కొడ్కా మిమ్ముల..”

“ఏడ్వకే, ఏం చెప్తవ్, ముప్పయ్యేళ్ళొచ్చినా ఇంట్ల కూకోవెట్టి బీడీలు చుట్టించుకుంట బాసన్లు తోమిస్తుంటే అదేం చేస్తది, ఎవలో ఒకన్తోని పోకుంట, గాభరకాకు ఇజ్జతు పోతదని, ఎస్సై గాన్తోని పీటల మీది లగ్గమాగిపోయినప్పుడే మనిజ్జత్ పోయింది.. వానికంటె ఎవన్తోనున్నా అక్క మాగుంటది.. పని మీదున్న, ఇంటికచ్చినంక మాట్లాడ్త.."

దీనమ్మన్ ఇదో లొల్లి.. అల్లుడు సచ్చిండని అమాస ఆగుతదా.. నోట్లకింత ముద్దవడాలంటే దినాం ఆగుతె పనులౌతయా..

* * *

“నమస్తే సీఐ సాబ్, గుస్సా ఐతుర్రట నా మీద ఎందుకు..”

“మస్తు కంప్లెయింట్లొస్తున్నై రా నీ మీద ఊర్లె పోరలను బెట్టింగులని పాడుచేస్తున్నవని”

“లే సార్ గిదే ఆఖరింక, మల్ల దిగేది లేదిండ్లకు, కని, టాకీస్ గాయిన పైసలిస్తలే సార్ రొండియ్యాలె.. గవిప్పిచ్చిర్రంటే నేనిడిశిపెడ్త దందా.. పైకెల్లి మస్తు ప్రెజరున్నది కలెక్షన్ చేస్తలేనని.. నవీన్‌గా సార్ కు మందు కలుపు, 100 పైపర్స్ నడుస్తదా సార్, కుందేలు బుల్లెట్లు కూడున్నై.”

“లంగ నక్రాలాపురా ఛూతేగా.. నీకెవ్వడు పైసలిచ్చేది లేదు, ఇప్పట్కే నిన్ను శాన దూరం రానిచ్చిన”

“ఊకెనే రానిచ్చిన్రా సార్, మీకెన్ని లక్షలు కమాయించిపెట్టలే నేను.. నవీన్‌గా, బీరిపోయినవేంరా బాడకావ్, గిలాసల ఐస్ గడ్డెయ్యి..”

“గవన్ని పాత ముచ్చట్లు, ఇప్పట్సంది మల్ల నీ పేరిన్పిస్తే బొక్క బొక్కకు నీల్లు పోసుకుంట కొడ్త కొడ్కా.. సమఝైందా.. పోర్రింక, ఛల్..”

* * *

“సీనా, సీఐ గాడు, టాకీసోడు ములాఖతై మనల్ని హౌలగాల్లను చేస్తున్నట్టున్నర్రా.. ఇప్పుడేం చేద్దాం, కొమ్రన్నతోని మాట్లాడ్తెట్లుంటదోపారి.”

“శాలోడా.. ముందుగాల్ల పాండురంగన్తోని మాట్లాడాల్రా, పైసల్లేవ్, పైసలు.. పైసలు కావాలె మనకు, సర్కస్ చెయ్యాలేదో ఒకటి.. హలో, అన్నా, నమస్తెనే.. నేను కర్క సీనన్ని.. ఏమైందే, బెట్ పెడ్తలేవియ్యాల్రేపు, మీదికెల్లి చాన సీక్రెట్ యవ్వారం అచ్చిందియాలటి మ్యాచ్ మీద, పెడ్తవా ఏమన్న, పెట్రాదే, లక్ష్యలల్లుందియాల బిజినెస్, ఉద్దెరా.. వందలైతే నీదాకెందుకే, నీ పేరుమీద నేనే పెట్టెటోన్నికద, లక్షలల్ల కత ఇయాల, టైమ్‌లేదు, 100 కు 180 నడుస్తుంది సన్ రైజర్స్ మీద, ఏమంటవ్, మల్ల ఫోన్చేస్తవా..పైసలయ్యెట్టుంటె ఫోన్చేస్తవా.. తొందర్గన్నా.. మ్యాచ్చాలైతె రేటింగ్స్ మార్తై..”

“పిచ్చిసాలే గానివా రా.. వానికెందుకు ఫోన్చేశినవ్ ర, వాడిప్పుడు సీయై గాన్తోని చెప్తడు, వాడొచ్చి మన బద్దలు బాశింగాల్చేస్తడు.. దేడ్ సాలే..”

“పాండురంగడు సీఐ కి ఫోన్చేయడు, జెర్శేపాగు.. అసలు కత చెప్తా.. కొమ్రన్నతోని మాట్లాడినంక. హలో, కొమ్రన్నా.. పండుకున్నావే, 8 గిట్ల కాలేకదనే, రేప్పొద్దుగాల్ల రెండొందల మందొస్తుర్రు మన పోరలు, థాంక్స్ ఎందుకే, నీగ్గాపోతెవలికి చేస్తన్నా.. అన్నా, మ్యాచ్ కేమన్న పెడ్తావే, పక్కా ఇన్ఫర్మేషనుంది, హా, లక్షలల్ల నడుస్తుందియ్యల, రేపటి మీటింగ్ కర్చులు ఎల్తై నీకు, కష్టమా.. సరే అన్నా.. రేపు మీటింగైతే కానిద్దాం తీ.. సరే అన్నా.. ఉంటా..

రేయ్, సాయంత్రమ్ అమ్మ మాట్లాడ్నుండె, అక్క మా ఇంటిపక్క బాపనాయినతోని దెంకపోయిందట, ఆర్నెల్లకింద ఎస్సైతోని పెండ్లెత్తిపోకముందుకెల్లే అక్కంటే ఆయనకు ఇష్టమట, మూడ్నెల్ల సంది లవ్..

కులాలొకటి కాదని ఆగీ ఆగీ ఇయాల ఇట్ల..

(పొడిశేటి పొద్దోలె ఎలమందా..)

రేయ్ సూడు, టాకీసోడు ఫోన్.. నేన్చెప్పలే ఈడు పైసలిస్తడిస్తడని..

హలో, అన్నా, రమ్మంటవా, మూడిస్తవా, సరే, జాక్ పాట్ పో నీకియ్యాల, వొస్తున్నా అన్న..

ఆ అమ్ మ్ మ మ్మ.. నవీన్‌గా.. సమఝైందా కతేమన్న, దిమాక్ ఏమన్న తిరుగుతందా.. ఇయ్యాలదాకా మనకు తెల్వని సంగతేందంటే.. కొమ్రన్నకూ, సీఐ గాన్కీ బినామీ మనటాకీసోడు.. నాలుగు రోజులల్ల సీఐ ట్రాన్ఫర్ ఐతుండట.. మన ఆంధ్రజోతి రగ్గాడు లేడా, వాడు చెప్పిండియ్యల పొద్దుగాల్ల గప్చుబ్బండికాడ, కని నేన్నమ్మలే వాడు చెప్పినా..పెద్దమనుసుల్తోటి పీకులాటెందుకని ... సీఐ మనకు పైసలిప్పియ్యకుంట బైటికి నూకినప్పుడు కన్ఫర్మ్ ఐంది నాగ్గూడ, మూడ్రోజులల్ల పోయేటోడు బాకీ ఎందుకు తీరుస్తడ్రా..ఎగ్గొట్టి పోతడుగని..”

“మరి పొద్దుగాల్ల కొమ్రన్న కల్శినపుడే పోరగాల్లను తెస్తా అని చెప్తె, అప్పుడె బెట్ పెట్టనీకి పైసలిచ్చెటోడేమో కద.. గీ తిర్గుడు, లొల్లంతెందుకురా”

“లేద్రా.. ఎవనికైనా అడ్గంగనే సాథ్ ఇస్తే మర్శిపోతర్రా.. పొలిటీషియన్స్ ఐతే అసలు నియ్యతే ఉండది.. వానికి ప్రానం మీదికొచ్చినప్పుడు మనం హెల్ప్ చేస్తే సచ్చెదాక గుర్తుంచుకుంటడు.. మనగ్గూడ విలువిస్తడు.. పొద్దుగాల్లనే కొమ్రన్నకు వొంగుంటే, పైసలిచ్చెటోడు, సుమోలకు, డీసీయం లకూ మాట్లాడుమని.. అదే ఇప్పుడు గీ రాత్రి పోరగాల్లను పంపిస్తున్నమని చెప్పినంక నిద్ర వడ్తది వానికిపుడు పుర్సతుగ.. మనమేం అడిగినా అదిస్తడు ఇప్పుడు.. కొమ్రన్న టాకీసోనికి ఫోన్చేశి మనకు మూడు లక్షలీమని చెప్పుంటడు, అదిలెక్క.. పా.. టాకీస్కాడ్కి పోయి పైసల్దెచ్చుకుమ్దాం..”

“దీనమ్మ, గిన్ని కతలున్నయా రా దీన్ల, సల్లగా ఓ ఖజురా బీర్తాగుదాం పా, దమాగ్ హిలాయించింది నాకు ఇదంత ఇని..”

“ఆ పైసలల్ల, నీకు యాభైవేలిస్త, మాల్ తెచ్చుకుని దుక్నం నడిపిచ్చుకో సాలే.. మీ అయ్య రేపో ఎల్లుండో పోయెటట్టుండు, జెర పైస ఎన్కేశి మంచిగుంచరాద్రా పెద్దమనిషిని..”

“బెట్ పైసలు నాకిస్తెట్ల రా.. వాల్లడిగితెట్లా..”

“బెట్టా..నా.. బట్టా.. మనకు పైసలిచ్చింది టాకీసోడు, వాడు మనకెలాగూ రొండు లక్ష్యలిచ్చేదుండు.. అవ్వే ఇవి.. పాండురంగడు లొల్లి పెడ్తే.. వాని థియేటర్ల ప్రతి శుక్రవారం కొత్త సిన్మాల్ని పైరసీ చేస్తరట, ఎర్కేనా.. అది రగ్గాని పేపర్లొస్తుంది.. దాంట్లకెల్లి ఔతలవడి మనల్నడగనీకి అప్పుడు C.I గాడు కూడా ఉండడు..”

“కొమ్రన్న అడ్గితే..”

“వాడెట్ల అడుగుతడు, మనకిచ్చిందెవడు, టాకీసోడు, కొమ్రడు మూస్కొని కూసుంటడు, గిట్లనే ఓ రెండు మీటింగ్‌లకు పోరగాల్లన్తీస్కపోతె అన్ని మర్చిపోతడు.. వానికిప్పటిదాకా మనంచేశ్నపనికి ఈ పైసలే మూలకొస్తైరా.. సీ ఐ గాడు ఇయన్ని పట్టించుకోడు, వాని ట్రన్స్ ఫర్ పనిమీద వాడుంటడు.. ఇగ మా ఫకీర్ బావ గాడంటవా.. వాడు నీల్గితె వాని గుడిశెల మ్యాటర్ పబ్లిక్ ఐతది.”

“ఔరా.. రగ్గాడు పేపరోడు, రేప్రేపు వాడేమన్న లఫ్డా చేస్తే ఎట్లరా.”

“హ హ, రేయ్, మా అక్క వోయింది రగ్గాని కజిన్ తోనే.. ఆయిన కాలేజ్ లెక్చరర్రా.. మంచిగ సదూకున్నోడు.. ఇగ రగ్గాడు నా పార్ట్ నర్ ఎప్పట్సందో.. పా.. టాకీస్లోపలికి పోదామ్పా..”

* * *

“దీనమ్మా.. రాత్రి పదకొండైనా జనం తగ్గలేదింకా ఉజ్వలా వైన్స్ ల.. నవీన్‌గా, ఓ బీ.పి ఫుల్లోటి తీస్కో మా అయ్యకు, అక్క గురించి మాట్లాడాలె ఇంటికి వోయినంక, మందులుంటేనే ఇంటడుమావోడు, మీ అయ్యగ్గూడోటి తీస్కపోతావ్రా.. సాలే, తాగీ తాగీ గిట్లైండుకదరా మీ అయ్య, పొద్దుగాలా శంకర్ హాస్టల్ పోరలను రెడీ ఉంచు.. మీటింగాడికి.. రేయ్, ఓటి చెప్తా.. దిమాగ్ల దాస్కో.. బతుకుడంటే ఏందో తెల్సా.. సావకుండ ఉండుడే రా లోకమ్మీదవడి అందినకాడికి దొబ్బుకతినుడే..”

(బత్కులేమో ఎండిపాయె మొండిమాను బత్కులాయె.. రాజిగ ఈ రాజ్యమేలెటోడు కూల, రాజిగ..)

“ఏం రో.. గీ రాత్రి ఫోన్.. రింగ్‌టోన్ మార్చినవా, నారన్న పాట.. ఇప్పటిదాకా వేరేదొచ్చె కదరా..”

“ఇది రగ్గాడు చేస్తెనె వొస్తద్రా.. అలో.. చెప్రా రగు, ఏం నడుస్తుంది.. టాకీసోని పైసలొచ్చినై.. ఏమైంది.. రాముల్సారా.. ముప్పై వేలు గెల్శిండా ఇయ్యాల, అమ్మనీ, నా ముంగట పత్తిత్తుమాటలు చెప్పె కదరా.. సరే, అక్కా బావా ఏడున్నరు, నీతాన్నే ఉన్నరు కదా.. గంటల మా ఇంటికి తీస్కరా.. ఆలోపు మా అయ్యను లైన్ల వెడ్తా.. ఎక్కువ మాట్లాడ్తె మనమే వాల్లను బైట ఉంచుదాం రా, ఉంట మరి”

అమ్మనీ.. సార్ గా.. నంగిలెక్కలువడి నంగా నాచ్ చేశ్నవ్కదా..

గంతేతీ, నేననుకున్నదే కదా,

బతుకుడంటె గిదేకద, లోకమ్మీదవడి అందినకాడికి దొబ్బుకతినుడే..

చౌరస్త కాడి చీకట్లల్ల రెండు కర్రె కుక్కలు

ఓ దానిమీదోటి పడి.. ఎన్కకెల్లి..

*

Download PDF

Posted in 2014, కథ, జనవరి and tagged , , , .

7 Comments

  1. Pingback: “నేల విడిచి సాము చేయని రచయితలంటే గౌరవం”- వంశీధర్ రెడ్డి | వాకిలి

  2. ” ఏందో, లేనోడు లేకేడిస్తే ఉన్నోడు బలిశేడిశినట్టు. అసోంటి మనిషేడ దొర్కుతడు, మనల్ని వినే మనిషుంటడా నిజంగ. ఎంత సదివేం ఫాయిదా. మన భాశ మనక్రాపోతే. బతుకుడంటే ఏందో తెల్సా.. సావకుండ ఉండుడే రా లోకమ్మీదవడి అందినకాడికి దొబ్బుకతినుడే.”

    మశాల్ చేతపట్టిన వంశీ సారూ! మీ భాషలో పదునుంది. జిందగి చౌరస్త ల వినిపించిన గతకాలపు ముచ్చటోటి
    “ జీనా హైతో మర్నా సీఖో. కదం కదం పర్ లడ్నా సీఖో.” చౌరస్తా అంధేరీలో చతికిలబడినోళ్లకి తీరైన తూరుపుతోవేదో చూపరాదురండి.

  3. కథ అదిరింది భయ్యా! కళ్ళ ముందు రోజు చూసే ప్రపంచాన్ని చాల బాగా capture చేసారు. మీ భాషలో పదునుంది, మీ కథలో దమ్ముంది. తెలంగాణ నాడిని బ్రహ్మాండంగా పట్టారు.

  4. ఇది కథనా … జిందగి. ఇర్గదీసిన్రు సారూ. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు రచయితల్ల దమ్మున్న రచయితలు వేరు. గా దమ్ము గీ చౌరస్త ల గనవడ్డది . పతంజలి గుర్తుకచ్చిండు పో. నార దీసుడంటే గిదే . చింపి ఆరేసినందుకు తారీఫ్ జేస్తున్న.- గొరుసు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.