photo for kinige

బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ: పాలపర్తి ఇంద్రాణి తో

Download PDF   ePub   MOBI

గత ఏడాది విడుదలైన మంచి పుస్తకాల్లో ఒకటి “ఱ”. (దీనిపై మెహెర్ సమీక్ష ఇక్కడ.) త్వరలో ప్రింటు పుస్తకంగా రాబోతోన్న ఈ పుస్తకం గురించి దాని రచయిత పాలపర్తి ఇంద్రాణితో ఇంటర్వ్యూ:

వచనంలో పుస్తకం రాయటం మీకు ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. ఈ అనుభవం ఎలా ఉంది. Poetical grammar కీ prose grammar కీ తేడా ఏం కనిపించింది. Did it come easy?

కవిత్వం రాయడంలో నాకు కలిగే ఆనందం వచనం రాయడంలో కలగలేదు. ఒక్కో వాక్యం రాయడమే కష్టంగా అనిపించింది. నాకు ఆలోచన కలిగినప్పుడల్లా కొన్ని వాక్యాలు రాస్తూ పోయాను. అంటే తోచింది రాయడం పక్కన పెట్టేయడం అన్న మాట. ఎప్పుడో రెండు నెల్ల తర్వాత ఇంకొంచెం రాయడం అలా. ఒక్కసారి రాసింది మార్చడం లేదు. రాయడంలో ఒక నిర్మాణం గాని, ముందస్తు ప్రణాళిక గాని ఏవీ లేవు.

ఎందుకా ఇబ్బంది? చదవటానికి మాత్రం మీ వచనం effortless గా వచ్చినట్టే అనిపించింది. మధ్య మధ్యలో రాయటం వల్ల కలిగే ఎమోషనల్ డిస్‌కనెక్షన్ కూడా ఎక్కడా అనిపించలేదు.

కవిత్వం రాస్తున్నప్పుడు మనసు స్పందించి రాయడం, వచనం రాస్తున్నప్పుడు ఆలోచన వేధించి, రాయడానికి పురిగొల్పడం వల్ల వచనం – అంటే ఈ నవల – రాయడంలో నాకు ఇబ్బంది అనిపించింది.

అప్పటి నా మానసిక స్థితి ఒకటే విషాద గీతాన్ని పదే పదే ఆలపిస్తూ ఉండడం వల్ల బహుశా మీకు ఎమోషనల్ డిస్కనెక్షన్ కనిపించ లేదేమో.

నేను నిజ జీవితంలోను ఎక్కువ మాట్లాడను. దుఃఖాన్ని హాస్యంతో కప్పి ఉంచుతాను. అదే ధోరణి నా రాతలో కూడా అక్కడక్కడా మీకు కనిపించి ఉండవచ్చు.

కానీ ఇబ్బంది ఉన్నా ఇకమీదట వచనం కూడా రాస్తాను.

మీరన్నట్టు ఇందులో పాత్రల స్వరూప స్వభావాలన్నీ పూర్తిగా కల్పితం అనిపించలేదు.

కల్పితం అని నేను ప్రకటించాక ఇంక ఆ విషయం మాట్లాడను. అయితే పాత్రలు ఎప్పుడైనా నిజ జీవితం నుండే పుడతాయి. ఒక్కో పాత్ర నిజంగా కల్పితమే అయినా మనం చూసిన ఇద్దరు ముగ్గులు మనషుల స్వభావాల కలగలుపు వల్ల,అందులో మన కల్పనల జోడింపు వల్ల ఆ పాత్రలు సజీవమై కళ్ళ ముందు ప్రత్యక్షమౌతాయి – అని అనుకుంటాను.

ఈ నవల రాసాకా దాదాపు 10 పేజీల వరకూ తీసివేసాను. ఎందుకు- అంటే చెప్పలేను. వద్దు అని అనుకుని తీసివేసాను.

చాలామంది స్త్రీ రచయితలు తమ ఫిమేల్ ఐడెంటిటీని రచనల్లో నిలుపుకోవాలని చూస్తారు. మీ నవలికలో అది పెద్దగా కనపడ లేదు.

స్త్రీ రచనల గురించి మీరు చేసిన పరిశీలన నిజమే.

అయితే నేను ఇంద్రాణి ని కదా. :) నా స్వభావాన్ని గురించి కొంచెం చెబితే మీ ప్రశ్నకు సమాధానం అవుతుందేమో.

నాకు ఎప్పుడూ అమ్మాయినన్న విషయం గుర్తుకు రాదు. ఎవరైనా వచ్చి గుర్తు చేస్తే తప్ప. అలాగే నేను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ జెండర్ నాకు ఱ - పాలపర్తి ఇంద్రాణిగుర్తుకు రాదు. ఇది వ్యక్తిత్వ లోపం కావచ్చు.

నాలో ఆడుతూ పాడుతూ ఉండే ఓ చిన్న పిల్ల, సున్నితమైన ఓ అమ్మాయి , ఏదీ లెక్క చేయని, తిరుగుబాటుదారుడైన ఓ యువకుడు ఉన్నాడని ఇన్నేళ్ళ తరువాత నా సొంత పరిశీలన. చిన్న పిల్లతో పెద్ద ఇబ్బంది లేదనుకోండి. సున్నితమైన మనసున్న ఈ అమ్మాయి ప్రేమ, మోహం, విరహంలాంటి రకరకాల భావోద్వేగాలకి గురి అవుతూ దుఃఖిస్తూ ఉంటుంది. దేన్నీ లెక్క చేయని ఆ యువకుడు వచ్చి- ఇంక చాల్లే పద పోదాం అంటూ ఆమె ఎన్నడూ చూడని వెలుగు దారుల్లోకి తీసుకు వెళ్తాడు.చీకటి గుయ్యారాల్లోకి పరుగులు తీయిస్తాడు. నన్నెప్పుడూ కిందికిలాగే నాలోని ఆమె నాకు ఇష్టం లేదు. బురదలోకి దించినా సరే నాలోని ఈ యువకుడే నాకిష్టం. నా రచనలకు మూలం. నాలోని ఈ యువకుడే కవిత్వం రాస్తాడు. రచనలు చేస్తాడు. భావుకురాలైన ఈ స్త్రీ కూడా రచనలు చేస్తుంది ఎప్పుడైనా. కానీ ప్రేమ,విరహం లాంటి స్త్రీత్వపు భావాలని కవిత్వంలో ప్రకటించదు. బహుశా అటువంటి ఆ దుః ఖాలను,ఆ యువకుడు చేసిన సాహసాలను ఆ యువకుడే ఎప్పుడో ఇంకోసారి, బహుశా రాస్తాడు.

ప్రతీ అధ్యాయం ముందూ జత చేసిన కవితలు కొన్ని అతికినట్టు అనిపించలేదు. 

ఓ కవితతో ప్రతి అధ్యాయాన్ని ప్రారంభించాలని అలా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను.మొ దట నేను కవయిత్రిని కదా.. :) అలాగే అక్కడక్కడా చిన్ని చిన్ని పాటలు. నవలిక రాసిన కొత్తలో మీ పుస్తకం చూపించండి చదువుతాను అని ఓ మిత్రులు అడిగితే ఇచ్చాను. వారు వెంటనే నన్ను అనుకరిస్తూ తన నవలలో ఇటువంటి మార్పులు చేసేయడం విశేషం.

 *

Download PDF   ePub   MOBI

Posted in 2014, ఇంటర్వ్యూ, జనవరి and tagged , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.