cover page

పచ్చనాకు సాక్షిగా అలాక్కాదు

Download PDF   ePub  MOBI

మీది వ్యవసాయ కుటుంబమా?

మీది చిత్తూరు జిల్లానా?

మీ అమ్మా అయ్యా రెక్కలు ముక్కలు చేసుకొని మిమ్మల్ని సాకారా ?

చినిగిన నిక్కర్లేసుకొని బడికెళ్లారా ?

అర్దాకలితో రోజుల తరబడి నిద్రపొయ్యారా?

కడుపునిండా మాసం కూర తినేది సాలుకు రెండుసార్లేనా?

చేలో పిట్టలు తరిమారా?

మీకు తెలుగు భాషలోని యాసలంటే మక్కువా?

మీకు పల్లె సంస్కృతంటే ఆసక్తా?

పై ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి అవును అనేది మీ సమాధానం అయితే, ఈ పచ్చనాకు సాక్షిగా పుస్తకం మీ కోసమే.

పచ్చనాకు సాక్షిగా… ఇప్పుడు మిట్టురోడి పుస్తకంలో తొలి భాగంగా రిలీజ్ అవుతోంది. రచయిత నామిని. మొత్తం నలభై కథలు.

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక గుడిసె. ఆ గుడిసెలో ఒక నులక మంచం. ఆ గుడిసె వారికి ఒక ఎకరానికి ఎక్కువ, రెండెకరాలకు తక్కువా పొలం. ఆ గుడిసెలో ఒక అమ్మా, నాన్న, ఒక అన్నయ్య, ఒక అక్కయ్య, ఒక చిన్న కొడుకు ఉన్నారు. వారి కథలే ఈ పచ్చనాకు సాక్షిగా …

పొద్దు పొడవక ముందుండీ, రాత్రి దాకా అందరూ కనా కష్టం చేసేటోళ్లు. బక్క మడుసులు, బక్క ఆవుల అరక. సంకటి పచ్చడి కడుపు నిండా ఉంటే ఆ రోజుకు పండగే.

చాలా కారణాలుగా ఇవి అమూల్యమైన కథలు. కాలానికి తట్టుకొని నిలబడ్డాయి, నిలబడ్తాయి. చిత్తూరు జిల్లా యాసను రచయిత విరివిగా వాడాడు. నిరంతరం యాసలు మారే ఈ కాలంలో ఈ పుస్తకం ఆ యాసకు ఒక స్నాప్ షాట్.

ఉన్నది చాటంత పొలమే అయినా కనాకష్టంతో బంగారం పండించేవాళ్లు. బక్కావుల నుండి ఎడ్ల అరకకు మారినా, శనగ, వరి, మిరప, కూరగాయలు వంటి పంటలన్నింటిలోనూ వృద్ధి కళ్ల చూసినారు. ఈ వృద్ధికి కాయకష్టం, ప్రకృతి సహకారంతో పాటు ఆ కాలంలోని గ్రీన్ రివల్యూషన్ సాంకేతిక విప్లవ ప్రభావం తెరవెనుక తన వంతు పాత్ర పోషించింది.

ఈ కాలంలో కథలు వ్రాస్తున్న వారంతా పొలిటికల్లీ కరక్టుగా ఉండటం కోసం కులం అనేది మన సమాజంలో ఒక భాగం అనే విషయం మర్చిపొయి ఒక మిథ్యా ప్రపంచాన్ని సృష్టించుకొని దానిలోనే కథలన్నీ వ్రాస్తున్నారు. కానీ ఈ పచ్చనాకు సాక్షిగా అలాకాదు. చూసిని ప్రపంచాన్ని చూసినట్టే చెప్పారు. అక్క పెళ్లి కాగానే బడి మానేసిన మాదిగ పల్లి నాగరాజు కత (మా నవ్వులోడి దఃఖం), క్లాస్ లోని మాదిగపల్లి అంజలికి గర్భగుడిలోని పటాలు చూపించి ఒప్పించలేని చేతకానితనం. (మా అంజలి కోరిక)

“ఒరే నా బట్టా, అసలు నీది మా వూరు గాదు, మా కమ్మ కులం గూడా కాదు నీది. అనంతపురం జిల్లాలో కదిరి వుండాది జూడు, అదీ నీ వూరు. అక్కడ అడక్క తినే సుగాలోళ్లు వుంటారు జూడూ, వాళ్లూ నీ అయినోళ్లు … (నా మింద అలిగిన మా అమ్మ) అంటూ హాస్యాలాడుకునే సన్ని వేశాల్లోనూ కులాల గురించి తను చూసింది రచయిత కథల్లో రాశాడు.

ఇంకా ఈ కతల గురించి రాయడానికి మనసు కదలడంలేదు. ఎందుకంటే ఇవన్నీ మనసుకు దగ్గరైన కథలు. మీరూ చదవండి మీ మనసేం చెపుతుందో చూడండి.

 *

Download PDF   ePub  MOBI

Posted in 2014, జనవరి, పుస్తక సమీక్ష and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.