cheppukondi chuddam

చెప్పుకోండి చూద్దాం – జనవరి 2014

ఈ శీర్షికన ఏదైనా ఒక తెలుగు రచనలోంచి కొంత భాగాన్ని ఉదహరిస్తాం. దాని ఆధారంగా కింద అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. మీ సమాధానాన్ని ఇక్కడ కామెంటుగా గానీ (దాన్ని పెండింగ్ లో ఉంచుతాం), లేదా editor@kinige.com కు మెయిలుగా గానీ పంపవచ్చు.

1.

తన వెనక భాగం అతని కేసి అదిమి; వెనకగా తిప్పిన తన చేతితో అతని వీపు నిమురుతోంది.

“యేం నీలిగావుగా!” అన్నాడు.

మనసు చివుక్కుమని – మంచం అంచు మీదికి జరిగింది.

“రా, రా, మళ్ళీ వెధవబెట్టుసరి కూడా!” అన్నాడు.

ఆమె మాటాడలేదు.

రెండు నిముషాలు గడిచాయి.

చెయ్యివేసి దగ్గరికి తిప్పుకున్నాడు. ఆమె కళ్ళలో తడి.

“యిప్పుడు నిన్నేం చేశానని యేడ్పు? నీకేం లోటు జరిగింది? యిప్పుడు నేనేం వద్దనలేదుగా?” అన్నాడు చిరాకుగా ముఖం చిట్లించుకుంటూ.

వక నిముషం మౌనంగా వుండి కనురెప్పలు వాల్చి, “శరీరం మాంసపు యంత్రం కాదు, మీట నొక్కి నురగ కక్కించుటానికి. శరీరం వొక శతతంత్రుల వీణ. మీటి ఆ తంత్రువుల మీద మూర్ఛనలు పోతేనే రసాసిద్ధి” అంది స్వప్నంలోంచి పలికినట్లుగా.

ఫక్కున నవ్వాడు.

ఆమె మనసు మీద బ్రహ్మజెవుడు అచ్చు పడినట్లయింది. మౌనంగా వుండిపోయింది.

ప్రశ్న: ఈ సంభాషణ ఏ రచనలోది. క్లూ: ఈ రచన బుచ్చిబాబుకి అంకితమివ్వబడింది.

2.

“సరిగ్గా కూకొని నా సుట్టూ సేతు లేసుకోండి. కాంత ఎచ్చగుంటది పాపం! బాబుగారు ఒణికిపోతున్నారు.”

ఆ మాటలు చాలా వెగటుగా ధ్వనించాయి రావు గారికి. ఆమె మరీ దగ్గరగా జరిగి ఆయన వొళ్లోకి వాలింది. ఆమె రొమ్ముల బరువు ఆయన మోకాళ్ళ మీద ఆన్చింది. మోకాళ్లు మరి కాస్త దగ్గరగా ముడుచుకొని దీర్ఘంగా అవమానకరమైన ఆలోచనాపరంపరలో మునిగిపోయారు. ఆమె అలా మాట్టాడుతూనే వుంది.

ప్రశ్న: ఈ రచన పేరేమిటి? క్లూ: ఇది పాశ్చాత్య గౌరవం అందుకున్న తెలుగు కథ.

*

గత సంచిక జవాబులు:

గత సంచికలో అడిగిన ప్రశ్నలకూ ఎక్కువమందే స్పందించారు. కానీ దాదాపు అందరూ మొదటి ప్రశ్నకే జవాబు చెప్పారు గానీ, రెండవ ప్రశ్నకు చెప్పలేదు.

రెండు ప్రశ్నలకూ సరిగ్గా సమాధానం ఇచ్చిన వారు స్వాతి కుమారి బండ్లమూడి:

AanandoBrahma

మొదటిది: యండమూరి ఆనందోబ్రహ్మ- సోమయాజి ఫుట్ బాల్ మాచ్ కి వెళ్లబోయే ముందు రాత్రి, మందాకిని అతనికి చెప్పకుండా భర్త సమస్యల వల్ల ఊరొదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది.

chivaraku_migiledi

రెండవది: బుచ్చిబాబు “చివరికి మిగిలేది”. అధ్యాయం- స్వయం సంస్కారం

(Image Courtesy: http://www.flickr.com/photos/dumbledad/4988915427/)

Posted in 2014, చెప్పుకోండి చూద్దాం, జనవరి.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.