nedunuri

కొన్ని పాత పాటలు

Download PDF

(అ)

 

ఏనాడు రానివారు | మరది వచ్చారు,

ఇంటిలో జొన్నల్లేవు | నేనేమి సేతు

సన్నబియ్యమెట్టి | జొన్నలు దెత్తు

జొన్నలు ఒక జాము | జార కుమ్మేను [1]

తడి పిడక పొడిపిడక | దాయలు వేసి

ఏడు చిల్లులకుండ | ఎసరెట్టినాను

మూడు చిల్లుల ఈడిముంత [2] | మూ తెట్టినాను

దాహము వదినగారు | దాహాలనిమ్ము

ఉడికీది జొన్నకూడు | మొల్లల్లు తేలె [3]

ఊరు చేరున వుంటె | ఉండుము మరది

వెళ్ళెతె వెళ్లండి | వేగంబుగాను,

దయయుంచు నామీద | దండములు మరది

_____________________________

1. తెల్లగాదంపుట; 2. పొడుగు మెడగల మట్టి ముంత; 3. సగము ఉడికిన జొన్న కూడును మొల్లలు లేక మొల్లకాయలందురు

 

 (ఆ)

 

అంతల్ల పుంతల్ల మే |నత్తకొడుకు

నన్ను జూడవచ్చి | నరకాన బడును

కదలాడు మెదలాడు | కఱుకోలలాగ [4]

ఉలకడు పలకడు | ఉలవగింజల్లె

_____________________

4. నాగలి కఱ్ఱు

(ఇ)

 

సోమన్న వీధులకు | సోది అడగెల్తె

బతకడని చెప్పేరు | భాగ్యవంతుల్లు

అప్పకి అయిదోతనము | లేదు కాబోలు

ఆతనికి నా ఉసురు | అంటె కాబోలు

(ఈ)

 

అమ్మకు బొమ్మంచు | అప్పకు కరకంచు

చెల్లెలికి చేమంతి | చీరలనిచ్చి

తమ్ముడుకి, పిచ్చికి, బీరాకు [5] | తలపాగ

కోరంగి అద్దకము | నాకిచ్చు సామి

(ఉ)

 

ముసలోడు మా తాత | పసినిమ్మపండు

ముసలిదాన్ని పెళ్లాడి | మూలకూర్చుండి

పడుచుదాన్ని పెళ్లాడి | బయటకొచ్చాడు

__________________________

5. లేత ఆకు పచ్చరంగుగా నుండునది

(ఊ)

 

జోల పాట

 

అబ్బాయి మామల్లు ఎటువంటివారు?

అంచుపంచెలవారు అంగీల వారు

నిలువుటంగీలవారు నియోగివారు

అబ్బాయి తండ్రులు యెటువంటివారు

ఊరకుక్కల జేరి యూరేగువారు

గుడ్డి గుఱ్ఱములెక్కి గోడెక్కువారు

 

(ఋ)

 

వదిన వేవిళ్లుపాట

 

వదినా? వదినా? వేవిళ్లా?

నీతో యెవరు చెప్పేరు?

నాతో మాయన్న చెప్పేడు.

అంతాపుణ్యం వచ్చిందా?

అనంతుడి నోము నోచేనా?

బావినీళ్లకు పోయేనా?

బాలింత కట్టు కట్టేనా?

మా అన్నగారు కట్టిన మేడలో

గజ్జెల పాపణ్ణి యెత్తుకొని

ఘల్లు ఘల్లున తిరిగేనా?

 

(ౠ)

 

వెల్లుల్లిపాయలు | తోకమిరియాలు

ఉడికించె కృష్ణమ్మ | కుగ్గుపోయంగ

చేదని త్రాగేడు | చిన్న కృష్ణమ్మ

మందని త్రాగేడు | మాయకృష్ణమ్మ

 

(ఎ)

 

ఆకుదోటలోయి | పోక దూలాలు

అవి మా పుట్టింటి | ద్వారబంధాలు

ద్వారబంధపు చూచి | ధనమడిగినారు

నాయన్న సిరి చూచి | సంపదడిగేరు

 

(ఏ)

 

గోవిందయన్నారు | గొడ్డలెత్తేరు

ఆనందమన్నారు | అడవి నరికేరు

కోతులెక్కిన కొమ్మ | కొట్టేసినారు

పక్షులెక్కిన కొమ్మ | పడనరికినారు

 

(ఐ)

 

చల్ది అన్నములోకి | చల్ల కావాలి

చల్లని పుట్టిళ్లు | నాకు కావాలి

ఏడుగురు కొడుకులకు | వెనక కావాలి

వెల్లావు మందల్లు | నాకు కావాలి

 

(ఒ)

 

ఆడవార్ని కన్నావు | అమ్మమన్నావు

సిరిదేవి నీ యిల్లు | చిన్నబోయింది

మగవార్ని కన్నావు | అమ్మమన్నావు

నాతల్లి నీయిల్లు | తామరవల్లి

 

(ప్రెస్ అకాడెమీ ఆర్కయివుల నుంచి)

Download PDF

Posted in 2014, జనవరి, పాత రచన and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.