veluri

సాహితీ ముచ్చట్లు

Download PDF    ePub   MOBI

(సాహిత్యానికీ రచయితలకూ సంబంధించి మీకు తెలిసిన ఇలాంటి ముచ్చట్లూ పిట్ట కథలూ ఏమన్నా ఉంటే పదిమందితో పంచుకోవటానికి editor@kinige.com కు పంపించండి. మీరు పంపినవి మీ పేరుతో ప్రచురిస్తాం.)

పరశురామప్రీత్యర్థం

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి తన “ఆంధ్ర రచయితలు”లో వేలూరి శివరామశాస్త్రి పేరు ఎత్తుకుని పేరా కాకముందే ఇలా అంటారు: “శాస్త్రి గారి జననము 1892లో. 1926 సంవత్సరము శాస్త్రి గారి జీవితలో నొక పెద్ద మార్పు తెచ్చినది. ముప్పది నాల్గేండ్ల వయస్సు దాటిన తరువాత నున్న శివరామశాస్త్రి గారు వేఱు.”

ఏమైంది 34 ఏళ్ల వయస్సులో శివరామశాస్త్రి గారికి? ఈ ముడి వేసేసి, అప్పుడు ఆయన జీవిత కథ చెప్పడం మొదలుపెడతారు. వేలూరి చిన్న వయసులోనే పెద్ద పండితుడు. సంస్కృతంతో పాటూ ఇంగ్లీషు, ఫ్రెంచి, బెంగాలీ భాషల్లో కూడా దిట్ట. దానికి తోడు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారి దగ్గర శిష్యరికం. పద్య రచనా, శతావధానాలతో పాటూ, తమ గురువులైన తిరుపతి వేంకట కవుల తరుపున పండిత fireయుద్ధాల్లో పాల్గొనేవారు. “నినున్ గెల్వగ వచ్చినా నిదె సభం జేయింతువో? వత్తువో?” అని తొడలు చరిచే నూనూగు మీసాల పౌరుషం. గురువుల గొడుగు దాటి బయటకు వచ్చి సంసారంలో పడ్డాకా చాలా నిష్టగా సాహిత్య సేవలో నిమగ్నుడయ్యారు. పురాణ గ్రంథాల అనువాదం, ఫ్రెంచు సాహిత్యం ప్రేరణతో వచన వాంఙ్మయ రచన, షేక్ స్పియర్ ప్రేరణతో నాటక రచన, ‘ధ్వన్యాలోకం’ తెనిగింపు, అన్నింటికన్నా ముఖ్యంగా ఏడాశ్వాసాల ప్రబంధం “మణిమేఖల” రచన… ఇలా కాలాన్ని గడిపారు. “మణిమేఖల” విన్న వాళ్లందరూ దాని సొగసు గురించి ఇంకో పదిమందితో చెప్పేవారట. అప్పుడు తగిలింది మొదటి దెబ్బ. ఈ గ్రంథాలన్నీ పెట్టెన పెట్టుకుని తోటి కవి స్మృతి సభకు వెళ్తే దొంగలు ఆ పెట్టె కొట్టేశారు. అయినా నిస్పృహను దాటుకుని ఎలాగో పుంజుకున్నారు. తరువాత వంగ వాఙ్మయం ప్రభావంలో పడి వంద పైగా కథలు, ఆరు నాటకాలు రాశారు. ఇంకా ఎన్నో భాష్యాలు, అనువాదాలు, వేదాంతంపై చిన్న చిన్న పుస్తకాలు కూడా రాశారు. ఒక రోజు ఉన్నట్టుండి ఇల్లు తగలబడింది. ఇంత సాహిత్యాన్నీ అగ్నిదేవుడు నాలికల్తో పూరాగా జుర్రుకుని ఋజువు లేకుండా తుడిచిపెట్టేశాడు. ఇదీ 1926 వ సంవత్సరములో 34 యేళ్ల వయసులో వేలూరి గారి జీవితంలో వచ్చిన పెద్ద మార్పు. విద్యను దోచుకోవటం అసాధ్యం అంటారు నిజమే. కానీ విద్యా ఫలాల్ని దోచుకోవచ్చు. కళాకారుణ్ణి సృజన వైపు నెట్టే ఎన్నో ఉత్ప్రేరకాల్లో, ఆ కళ అనశ్వరంగా కాలానికి ఎదురు నిలిచి ఒక పేరుగా తననూ నిలబెడుతుందన్న ఆశ కూడా ఒకటి. పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, చెప్పుకున్నా చెప్పుకోకపోయినాను. మరి అలాంటిది ఒక్క రోజులో మొత్తం సృజనంతా ఆనవాళ్లు లేకుండా తుడుచిపెట్టుకుపోతే. (మనం మెయిల్లోనో, ఆన్లైన్లోనో దాచుకునే పీడీఎఫ్ వెర్షన్లు మాత్రం నిజంగా అంత శాశ్వతమా?) వేలూరి వారికి ఇది ఎంత పెద్ద దెబ్బో ఆయన తర్వాత రాసిన పద్యాల్లోని వేదన చెబుతుంది:

ఉ. కాల్చితి విల్లు సర్వమును గాల్చితి పాత్రములూచుముట్టుగా

గాల్చితి వెల్లయున్ ధనము కాల్చితి వెల్లయు ధాన్యరాసులన్

గాల్చితి వున్న వెల్లయును గాల్చిన గాల్చితికాక గ్రంతముల్

గాల్చిన నీకు నోజ్వలన! కడ్పది నిండెనొ? కాలు నిండెనొ?

ఈ సంఘటనతో ఆయన ఉత్సాహం ఉసూరుమందట. సూరవరం అనే ఊళ్ళో తోట కొని అక్కడో కుటీరం కట్టుకుని చాలా ఏళ్లు ఒంటరిగా గడిపారట. తర్వాత కూడా ఏవో రాశారు. కానీ మరి ఆ “మణిమేఖల”! ఇంకా ఎన్నో రచనలు! అవన్నీ ఉంటే ఇప్పుడు విశ్వనాథ పుస్తకాలున్న అరల్లోనే దీటుగా ఈయన పుస్తకాలు కూడా బారులు తీరి ఉండేవేమో. అయినా అది అంత తేడా కలగజేస్తుందా? వాళ్లంటూ పోయాకా, మనం భుజాలకెక్కించుకుంటే విశ్వనాథకేం ఒరిగిందీ, వదిలేస్తే వేలూరికి ఏం పోయిందీ అని కూడా అనిపిస్తుంది. ఈ ఉదంతం మనకేదో చెప్పాలి. మన కీర్తి కాపీనాల గురించీ, వాటి పెళుసు పునాదుల గురించీను. అవన్నీ ఒప్పుకున్నా కూడా… ఆ కవి మనసులో పుట్టిన ప్రపంచం, అతణ్ణి కొన్నాళ్లు ఊగించి అందులోనే మంత్రముగ్ధుడై బతికేట్టు చేసిన ప్రపంచం, ఇప్పుడు ఎవరికీ ఎప్పటికీ అబేధ్యంగా మారిపోవటం, మూసుకుపోవటం… ఆయనకు కాకపోయినా, మనకే ఏదో లోటు.

ఆనందగజపతిన్యాయం

విజయనగరం ఆనంద గజపతి మహారాజు ప్రధాన పాత్ర వహించిన ఎన్నో పిట్ట కథల్లో ఇదొకటి. ‘ప్రిన్స్ ఛార్మింగ్ డార్లింగ్’ అనే చిరు వ్యాసంలో తనికెళ్ళ భరణి రాశారు. ఒకసారి రాజావారి అంతరంగిక ananda gajapati rajuకార్యదర్శి చాగంటి జోగారావూ, రాజా వారూ కలిసి సాయంత్రం పూట వ్యాహ్యాళికి బయల్దేరారు:

“జోగారావు గారూ మీ అబ్బాయేం చేస్తున్నాడయ్యా?”

“…….”

“జోగారావు గారూ మిమ్మల్నే”

కళ్లనిండా నీళ్లు కుక్కుకున్నాడు జోగారావు గారు.

“అదేమిటండీ, ఏమయిందీ?”

“వాడు పుట్టుగుడ్డి బాబూ. ఏమీ చేయలేని అసమర్థుడు”

రాజావారు కడుపులో చెయ్యెట్టి దేవినట్టయింది. చాలా నొచ్చుకున్నారు.

“ఓ పన్జేస్తే! మీ వాడికి సంగీతమేమన్నా నేర్పిస్తే”

“నేర్పిస్తే ఏదో కాలక్షేపంగా ఉండొచ్చు…,” నసిగారు జోగారావు గారు.

“కాలక్షేపం కాదండీ.. జీవనభృతి.. అపారమైన కీర్తీనూ…”

“సరే వెంటనే… ఫలానా చోట సంగీత కళాశాల నిర్మిద్దాం”

“మా ఒక్క కురాడి కోసం – కళాశాలా…”

“ఏమోనండీ ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుందీ. ఈ విజయనగరం సంగీత కళాశాలకి మీ వాడి వల్ల బీజం పడాలని రాసుందీ… జరిగింది!”

వదంతిగా బతక గలగటం. . .

“ఇక్కడే ఒక స్త్రీతో వుండేవాడు – అతని వద్దకి వచ్చే వాళ్ళే తక్కువ. అతనెల్లప్పుడూ నల్లమందు తినేవాడు – అతనిది చాలా నికృష్టమైన జీవితం – నా పక్కవాడే ఐనా నేనతడిని తప్పించుక తిరిగేవాణ్ణి.” దాదాపు పదైదు సంవత్సరాలు ఊరూరూ తిరిగి, మనిషి మనిషినీ కలుసుకొని శరత్ జీవిత చరిత్ర రాసిన హిందీ రచయిత శ్రీ విష్ణు ప్రభాకర్ కి ఎదురైన ఒక జవాబు ఇది.

శరత్ అంటే చాలామందికి కాస్త మేధో పటాటోపం సమకూరగానే సిగ్గు పడి దాచుకునే వానరబుల్ ప్రేమకథ. మన తెలుగు వాళ్లకి శరత్ ముఖం తెలుసు, అతని కాల్పనిక ప్రపంచాలూ తెలుసు. కానీ Sarat_అతని జీవితం గురించి తెలిసింది చాలా తక్కువ. దిగంబర కవి జ్వాలాముఖి “శరత్ జీవన దర్శనమే ఒక జాతీయ నవల” అని రాసిన వ్యాసంలో శరత్ జీవితం గురించి కొన్ని తెలియని విషయాలు చెప్పారు. తన జీవితం గురించి తెలియటం శరత్ కు అంత ఇష్టం లేదని కూడా ఈ వ్యాసంలో తెలుస్తుంది.

“కొన్నాళ్ళ తర్వాత మీరూ వుండరు. నేనూ వుండను. నా వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోవాలనే అభీష్టాన్ని ఎవరూ వ్యక్తం చేయరు. ఆనాడు నా రచనల్ని మాత్రమే తీసుకొని చర్చిస్తారు. కాని, నా జీవితాన్ని తీసుకొని ఎవరూ చర్చించరు.”

నిజమే, ఎవరూ శరత్ విషయంలో ఎవరూ అతని రచనలు చదివి అతని జీవితాన్ని గురించి తెలుసుకోవాలీ అనుకోరు. కానీ చాలా ఇష్టంగా దగ్గరగా చదివిన వారికి మాత్రం, ఆ పద్ధతైన ప్రపంచాల వెనుక పూర్తిగా ముసుగు తీయటానికి వెరుస్తున్న పరమ అరాచక హేలా ప్రపంచాల సందడి వుందని కొంతైనా అనుమానం కలుగుతుంది.

అరాచకం అవధులు ఏ కాలానికైనా మార్పులేకుండా నికరంగానే ఉంటాయి. దాని అట్టడుగు తలం గట్టిది. అక్కడిదాకా వెళ్లి కొట్టుకున్నాక ఇక అంతకన్నా లోతుకు జారలేరు. ఈ వ్యాసం చదివితే శరత్ ఆ అట్టడుగుని అందుకున్నాడనే అనిపిస్తుంది:

“శరత్ తాగేవాడు – తాగేసిన ఖాళీ సీసాల్ని వచ్చి పోయేవారి దృష్టిలో పడేట్లు బహిరంగంగా, అందరి చూపుల్నాకర్షించేట్లుగా ఒక అలంకారంలా ప్రదర్శించేవాడు – అలానే నల్లమందు తినే విషయంలో కూడా ఎలాంటి దాపరికం ఉండేది కాదు – ఆయనలో ఎక్కడా సహజంగా రచయితల్లో కనిపించే ‘ఆదర్శశూరత్వం’ కాని, హిపోక్రసీ కాని, కీర్తికండూతికాని, అహంభావుకత కాని ఏ మాత్రం కనిపించేది కాదు. ఆయన్ని చూడగానే ‘సభ్యలోకం’ ఛెళ్లున చెంప దెబ్బ తిన్నట్టుగా దిమ్మ తిరిగిపోయేది – ఆయన ప్రవర్తనలో ఎక్కడా దురుసుతనం కూడా వుండేది కాదు – సభ్యలోకానికి సవాలుగా నిలుచున్న శరత్ పెద్దలనబడేవారికి శేషప్రశ్నగానే కలతపెట్టాడు.”

కానీ మరి శరత్ ప్రపంచాలు ఈ అట్టడుగు దాకా వెళ్లే ధైర్యం చేసినట్టు కనిపించవు. (ఒక్క ‘దేవదాసు’లో తప్ప.) శరత్ తాను వెళ్లిన లోతుల్లోకి తన సాహిత్యాన్ని పట్టుకెళ్లే ధైర్యం చేయలేకపోయాడేమో. శరత్ కన్నా, మన చలానికే ఆ ధైర్యం ఎక్కువ అనిపిస్తుంది. ఒక సారి రవీంద్రనాథ్ ఠాగూర్ “నీవు ‘స్వీయ చరిత్ర’ ఎందుకు రాయవూ?” అని శరత్ ప్రశ్నిస్తే – “గురుదేవా! ఇంత గొప్పవాణ్ణవుతానని తెలిసివుంటే, నేను మరో రకంగా బతికి వుండేవాణ్ణి” అని శరత్ సమాధానమిచ్చాడట. ఇదే శరత్తుకూ, చలానికీ ఉన్న తేడా. చలంలో ఈ ద్వంద్వాలు లేవు.

జ్వాలాముఖి వ్యాసంలో నచ్చిన ఒక వాక్యం: “ఆయా స్త్రీలతో వుండే సంబంధాల్ని బట్టి శరత్ ఒక వదంతిగానే బతికినంతకాలం మిగిలిపోయాడు”.

లాఘవం – ఉద్వేగం

Valmiki_Ramayanaఈ మధ్య ఎక్కడో చదివిన వాక్యం “ఉలిని లాఘవంగా తిప్పటం వల్ల పుట్టే శిల్పం ఒకలా ఉంటే, ఉలిని ఉద్వేగంతో ఊగిపోనీయటం వల్ల పుట్టే శిల్పం మరోలా ఉంటుంది.” ఇందులోని సూచనని రచనకూ అన్వయించుకోవచ్చనిపించింది. రచనల్నీ అలా రెండు రకాలుగా విడదీయవచ్చనిపించింది: కలాన్ని మెళకువగా నడిపించి రాసిన రచన ఒకలా ఉంటుంది. కలం నిభాయించలేని ఉద్వేగంతో కాగితాన్ని చింపుకుంటూ రాసే రచన ఒకలా ఉంటుంది. ఈ మధ్య ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి రాసిన వ్యాసం “గురజాడ వాల్మీకి”లో ఇదే భావం మరోలా వివరింపబడింది. ఆయన మాటలివి:

Electric shock వంటి అనుభవాఘట్టనం ఏ సహృదయుని కొట్టి వివశుని చేస్తుందో అతని హృదయమును చీల్చుకొని కవిత్వం ఎగసిపడుతుంది. దానికి తగిన భాషా సహకారం దొరికితే అదే స్వాదయోగ్యమయిన కావ్యం అవుతుంది. ఆ కావ్యములోని ప్రతి మాట పఠితను పట్టుకొని అంతరింద్రియాలలో మారుమ్రోగుతుంది.

తలలో కల్పించుకొనిన ఆవేశమునూ కవిత్వములాగే కనపడుతుంది. అదీ స్వాదుగానే అనుభవములోకి వస్తుంది. కాని తాత్కాలికంగా మెరసి పోతుంది. ఇందులో కవి దిద్దుతుంటాడు. మొదటిదానిలో కవిని పట్టుకోలేము. పాలలో వెన్నవలె అంతటా నిండిపోయి అగోచరుడవుతాడు.

సంస్కృత వాంఙ్మయంలో మొదటి కక్ష్యకు చెందిన వారు వాల్మీకి, భవభూతి, జయదేవుడు మొదలయిన వారు. రెండవ కక్ష్యలోని వారు కాళిదాసు, మాఘుడు, శ్రీహర్షుడు మొదలయినవారు. పూర్వాంధ్ర వాఙ్మయంలో పోతన్న, త్యాగయ్య ప్రభృతులు ప్రథమ కక్ష్యకు, తిక్కన్న, సూరన్న, శ్రీనాథుడు మొదలగు వారు రెండవ కక్ష్యకు చెందుతారు.

ఒక కొంటె కిరణం, నలిగిన కాయితం ఉండ.

“సీన్ తీసే ముందు రోజు అసిస్టెంట్ డైరెక్టరు – స్క్రిప్టు చూసి కావలసిన స్పెషల్ ప్రాపర్టీస్ (అంటే మంచం, టూత్ బ్రష్, దువ్వెన మరచెంబు – ఇలాంటివి) లిస్టు వేసుకుని ప్రొడక్షన్ మేనేజరుకి చెప్పిBAPU_WIKIPEDIA మర్నాడు సెట్ లో ఉండేట్లు చూస్తాడు. ఆ లిస్టులో చూస్తే ‘ఒక కొంటె కిరణం, నలిగిన కాయితం ఉండ’ అని ఉన్నాయి. స్క్రిప్టులో చూస్తే ‘పడుకున్న అబ్బాయిని కిటికీ లోంచి ఒక కొంటె కిరణం వచ్చి పొడిచింది. అతను అటు తిరిగి దుప్పటీ మొహం మీదికి లాక్కున్నాడు’ అని వుంది. ఇంకో సీనులో ‘అతని మొహం నలిగిన కాయితంలా వుంది’ అని వుంది. గ్రాఫిక్స్ అందుబాటులో వున్న ఈ రోజుల్లో రమణ గారి భావం తప్పక తీసుకురావచ్చు – కానీ ఆ రోజుల్లో మా అసిస్టెంటు కాగితం వుండలోంచి మొహం ఎలా తయారు చేదాం అనుకున్నాడో ఇప్పటికీ అర్థం కాదు.” – బాపు ‘మా సినిమాలు’ వ్యాసం నుంచి.

(Image Courtesy: Wikipedia)

Download PDF    ePub   MOBI

Posted in 2014, జనవరి, సాహితీ ముచ్చట్లు and tagged , , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.