kottapustakaalu

కొన్ని కొత్త పుస్తకాలు

Download PDF    ePub    MOBI

మిట్టూరోడి పుస్తకం

MitturodiPustakamమిట్టూరోడొచ్చాడు. నామిని ‘మిట్టూరోడి పుస్తకం’ కొత్త ఎడిషన్ వచ్చింది. గత ఎడిషన్ కీ ఈ ఎడిషన్ కీ ఒక్క ముఖచిత్రం మాత్రమే తేడా కాదు (పాతది బాపు ముఖ చిత్రం, ఇప్పుడు తోట వైకుంఠం ముఖచిత్రం). లోపల కొన్ని కథలు ఇప్పటి దాకా పుస్తక రూపంలో వెలుగు చూడనివి వచ్చి చేరాయి. అంతే కాదు, ఇన్నాళ్లుగా మనం కేవలం నామిని అక్షరాల్లోనే రూపాలు వెతుకున్న పాత్రలు ఇప్పుడు ఫొటోల్లో మూర్తులుగా ఈ పుస్తకం చివర ప్రత్యక్షమయ్యారు. నామిని అమ్మ ‘సినక్క’, నాన్న ‘నారప్ప’, ‘బూలోక రంబ’, ‘ఉమ్మడు’, ‘గూనయ్యోరు’, ‘మునికన్నడు’, ‘కర్రెక్క’, ‘బక్కత్త’… వీళ్లందరి ఊహా చిత్రాలకూ ఇప్పుడు ముఖాలు అతికించుకోవచ్చు మనం.

~ లభ్యం 

మరువం

free_Maruvam‘మరువం’ బ్లాగుతో సందడి చేసిన ఉషారాణి తొలి కవితా సంపుటి ఇది. కవిత్వాకాశంలోకి ఎగిరిన, ఎగురుతోన్న, ఎగరాలని రెక్కలల్లాడిస్తోన్న గువ్వ పంక్తుల గుంపు ఈ పుస్తకం నిండా. కొన్ని గువ్వలు గర్వంగా ఎత్తుల్లో, కొన్ని ఆ ఎత్తుల ఆకాంక్షల్ని మాత్రం దాచుకున్న ఎదల్తో తుళ్లిపోతూ. మన్ముందు సున్నితంగా తెల్లగా విప్పారనున్న రేకల మృదుత్వానికై ప్రస్తుతం ఇక్కడ తేలివచ్చి సోకుతోన్న మరువంపు తావి ఎన్నో ప్రమాణాలు చేస్తోంది. మరిచిపోకూడని ఇంకో మాట, ఈ పుస్తకం చేతుల్లో తీసుకోవటానికి చూడముచ్చటగా ఉంది.

~ లభ్యం

ఊహాచిత్రం

Ooha_Chitram“ఒక భావుకుని సుందర స్వప్నాల్నీ, ఒక మంచి మనిషి ఆశయ వాంఛల్నీ, వైవిధ్యభరితంగా వెలువరించిన కథానికలు ఇవి. చదివించే గుణంతో పాటుకథ చెప్పే విధానంలో తనదైన నైపుణ్యాన్ని రుజువు చేసుకున్నాడు సత్యప్రసాద్. సామాజిక కేంద్రం నుండి సాగిన మానవసంబంధాల వృత్తాలు ఈ కథాంశాలు. రచయిత అధ్యన శీలానికి, జీవితానుభవానికీ మాత్రమే కాక, ఒక కథాశిల్పి ప్రయోగశీలతకి కూడా ఇవి నిదర్శనాలు.” అంటున్నారు సాహితీ విమర్శకులు విహారి.

~ లభ్యం

విశ్వవిజేత విజయ గాథ

ViswaVijethaVijayagathaదాసరి నారాయణరావు అభిమానుల కోసం, అరుదైన ఫొటోలంటే ఇష్టపడే వారి కోసం, తెలుగు సినిమా క్లాసిక్స్ గా మిగిలిపోయిన కొన్ని సినిమాల తెర వెనుక సంగతులంటే చెవి కోసుకునేవారి కోసం… ఈ పుస్తకం. ఈ పేజీల్లో మన గుర్తులో మిగిలిపోయిన సినిమాలెన్ని ఉన్నాయో చూస్తే, ఒకటి గుర్తొచ్చి ఆశ్చర్యమేస్తుంది. దాసరి నారాయణరావు కన్నా గొప్ప దర్శకులుండవచ్చు, కానీ హిట్లు రాల్చటంలో ఆయనంత కన్సిస్టెన్సీ ఉన్న దర్శకులు తెలుగులో అప్పటికీ ఇప్పటికీ లేరేమో అని. పుస్తకాన్ని కలెక్టర్స్ ఎడిషన్లా చాలా ఖరీదుగా ముద్రించారు. చేతిలోకి తీసుకున్నాకా పేజీలన్నీ తిప్పి చూడకుండా వదిలిపెట్టం.

~ లభ్యం

ఊబిలో దున్న

OobiloDunna బ్లాగరు వేణు ఈ పుస్తకం ప్రత్యేకత ఇలా చెప్తున్నారు: “డాక్టర్ కేశవరెడ్డి గారు ‘అతడు అడవిని జయించాడు’ 1984లో రాశారు. అప్పటికి 14 సంవత్సరాలముందే 1970లో నాగరాజు గారి ‘ఊబిలో దున్న’ నేరుగా పుస్తకరూపంలో వచ్చింది. ఈ రెండు నవలలూ ‘చైతన్య స్రవంతి’ (ఛాయల) లో రాసినవే. రెండిటికీ స్ఫూర్తినిచ్చిన నవల ఒకటే- అది హెమింగ్వే రాసిన ‘The old man and the sea’.”

ఊబిలో కూరుకుపోయిన దున్నను – రాజకీయంగా అవినీతి అసమర్థతల ఊబిలో కూరుకుపోయిన సమాజానికి ప్రతీకగా చేసుకుని పుస్తకం. ప్రతీ వ్యక్తి నుంచీ తన వంతు నిరంతర ప్రయత్నం ఉంటే తప్ప ఆ ఊబిలోంచి బయటపడదన్న ప్రతిపాదనను మన ముందుంచుతుంది.

~ లభ్యం

పెద్దిభొట్ల సుబ్బరామయ్య నవలలు

Peddibhotla“అయితే ఈ జీవితం గురించి మనకి చెప్పేది ఎవరు? నేను చూడని కొత్తకోణం వైపు బైనాకులర్స్ పెట్టి చూపించేది ఎవరు? ఒక పుస్తకం. ఒక జిజ్ఞాస. ఒక ప్రశ్న. ఇదిగో అలాంటి ప్రశ్నలన్నింటినీ తలకెత్తుకోని తిరిగే పెద్దమనిషి ఒకాయన వున్నాడు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య అంటారు ఆయన్ని. మృత్యువుని రక్తం రంగులో కళ్ళారా చూసినవాడు. తల్లిప్రేమని అభద్రత రూపంలో అనుభవించిన వాడు. కష్టాన్ని కన్నీటి రుచిలో తెలుసుకున్నవాడు. జీవితం అంటే కషాయం అని కనిపెట్టిన మానసిక శాస్త్రవేత్త. ఆ కషాయాన్ని ఏ మిశ్రమాలలో కలపాలో తెలుసుకున్న సరికొత్త రసవాది. కథ అనే అంబులపొదిలో అక్షయతూణీరాల్లాంటి పాత్రల్ని పెట్టుకోని మనసుని కరుణాస్త్రబద్ధుల్ని చేయగల విలుకాడు.” అంటున్నారు అరిపిరాల సత్యప్రసాద్

~ లభ్యం

రియాలిటీ చెక్

RealityCheckరాజిరెడ్డి వాక్యాలు ఎక్కువ లోపలి వైపే చూస్తాయి. అక్కడ కనపడిందాన్ని ఏ అలంకారమూ దిగేయకుండా ఉన్నదున్నట్టుగానే పట్టుకోవాలని అతని ప్రయత్నం. ఈ ప్రయత్నంలోని నిష్ట ఎంత శుద్ధమైనదంటే, అది కథా కవితల్లాంటి ఇంకే తోవల్లోనూ ఇమడక తనదైన ప్రక్రియల్ని కూడా వెతుక్కుంటోంది. ఈ ప్రయత్నంలోంచి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త గొంతు, తెలుగు వచనానికి ఒక కొత్త వాక్యమూ సమకూరాయి. సాక్షి ఫన్ డేలో ఆయన రాసిన స్థల పురాణాలు (ముఖ్యంగా హైదరాబాదు స్థలపురాణాలు) ఇప్పుడు పుస్తకంగా వెలువడ్డాయి. బహుశా ఇప్పటి హైదరాబాదుని తనలో బిగించి పట్టుకున్న కాలనాళికగా మున్ముందు ఈ పుస్తకం నిలిచిపోతుందేమో.

~ లభ్యం

సంజీవదేవ్ జీవన రాగం

SanjeevDevJeevanaRagam“రావెల సాంబశివరావు తను అందించదలచిన పుస్తకానికి కావల్సిన అంశాలను సంజీవదేవ్ రచనల్లోంచి, లేఖల్లోంచి, ముచ్చట్ల నుంచి, మౌనంలోకి సంగ్రహించి గ్రహించి జీవనరాగంగా శ్రుతిలయలు తప్పకుండా పొదిగారు. “పొదగడం”తో ఎవరికైనా శ్రమ, శ్రద్ధ వున్నప్పుడే ఫలితం వుంటుంది. ఏరిన ముత్యాలను తన వాక్యాల జిగినీ గొలుసుతో సర-పరిచారు. చదివాక ‘రా.సా.రా’ యింత చక్కగా రాశారా అని అభినందిస్తారు మీరంతా. సంజీవదేవ్‌ని సంపూర్ణంగా చదివిన వారిని యీ రచన ఆత్మీయంగా స్పృశిస్తుంది. చదవని వారికి స్వాగత తోరణం అవుతుంది. సంజీవదేవ్ సమగ్ర సాహిత్యానికి యిది పీఠికగా నిలుస్తుంది.” అంటున్నారు శ్రీరమణ

~ లభ్యం

Download PDF   ePub    MOBI

Posted in 2014, కొత్త పుస్తకాలు, జనవరి and tagged , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.