SriKasi bhatla - Copy (2)

“నాలాంటి వాడు మధ్యలో ఎక్కడో ఉంటే తప్పేం లేదు కదా” : కాశీభట్ల వేణుగోపాల్ తో ముఖాముఖి [1]

Download PDF   ePub    MOBI

గత ఐదేళ్లుగా పరిచయం ఉన్నా, మేం ఇలాంటి విషయాలు మాట్లాడుకుంది తక్కువ. అయినా ఇలాంటి ప్రశ్నలకు ఆయన దగ్గర ఎలాంటి జవాబులు ఉంటాయో నాకు తెలుసనే అనుకునేవాణ్ణి. కాబట్టి ఈ సంభాషణ పరమార్థమల్లా కాశీభట్ల గురించి నాకు తెలిసింది బయటి వాళ్లకి చూపించటమే అనుకున్నాను. రిసీవింగ్ ఎండ్ నేను కాదనీ, చదవబోయే వాళ్లకి నేను ఒక సంధానకర్త మాత్రమే అనీ అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడటం మొదలుపెట్టాకా నాకు తెలియకుండానే శ్రోత పాత్రలో ఒదిగిపోయాను. అంతే కాదు, ఆయన తన రచనా వ్యాసంగంలో తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న ఎంపికలూ ఏవీ రాండమ్ కాదనీ, వాటన్నింటి వెనకా ఒక పటిష్టమైన నమ్మకాల నిర్మాణం ఉందనీ ఈ సంభాషణ వల్ల అర్థమైంది.
మొదట అసలు ఇలాంటి ఇంటర్వ్యూలేవీ ఒక వ్యక్తి సారాన్ని సాకల్యంగా పట్టి చూపించలేవన్న సంగతి చెప్తూ ఆయన ఒక డిస్‌క్లెయిమర్ తో ఇలా మాట్లాడటం ప్రారంభించారు:—

నేనూ చీకటి”లో చెప్పాను. మనిషి వ్యక్తిత్వం ఒక ఐస్బర్గ్ (iceberg) లాంటిది. దాని మొత్తం బాడీలో తొంభై శాతం నీటిలోనే ఉంటుంది. ఉపరితలానికి కనిపించేది చాలా తక్కువ. అదే బయటకి తెలిసేది. అలాంటి వ్యక్త వ్యక్తిత్వం నుంచి మాత్రమే ప్రపంచం మనిషిని గ్రహించుకోవాలి. దాన్ని మించి ఏం ఆలోచించినా అది assumption. అది ఊహ, కల్పన, ఆలోచన. వాటి ద్వారా ఏం నాన్సెన్సు పుట్టగలదో అది పుడుతుంది. నీ అసలు సారం ఏంటనేది ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. నీ తల్లికి, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ స్నేహితులకి ఎవరికీ తెలియదు. చివరకు నీ రచనల్లో కూడా అది కనపడదు. కాశీభట్ల ఎసెన్స్ అనేది నాన్సెన్స్. అసలు కాశీభట్ల ఎప్పటికీ బయటకు రాడు.

మీ అమ్మ గారు మిమ్మల్ని కవిగా చూడాలనుకునేవారని చెప్పారు. అది ఎక్కడో తప్ప ఏ అమ్మా ఆశించని అరుదైన కోరిక. మీ జీవితం రచన వైపు మళ్లటానికి తొలి ప్రేరణ అదేనా?

అమ్మ కన్నడిగ. పురంధర దాసు కీర్తనలవీ అద్భుతంగా పాడేది. ఆమెకు పదో ఏట పెళ్లయింది. పదమూడో ఏటనే మొదటి సంతానం కలిగింది. నేను పదకోండో సంతానం. అందర్నీ ఎలా పెంచిందో మరి పెంచిందామె. నా వరకూ వచ్చేసరికి చాలా తక్కువ ఆస్తిపాస్తులు మిగిలాయి. నాకు ఎనిమిదో నెలలోనే మాటలు వచ్చేశాయని అనేవాళ్లు. ఆమె… వీడేదో నాలుక మీద అక్షరాల్తో పుట్టాడూ, స్వచ్ఛంగా ఒత్తులూ పొల్లులతో సహా మాట్లాడేస్తున్నాడూ అని చిన్నప్పట్నించీ ఆమె నా చేత అమరకోశం వల్లె వేయించింది. అలాగే కాళిదాసు ఆమెకు ఇష్టుడైన కవి. రఘువంశం ఇంట్లో సటీకం ఉండేది. రోజుకొక శ్లోకం నా చేత టీక తో పాటూ చదివించేది. నేను కూడా దాన్నో సాధన అనో కసరత్తనో అనుకునేవాణ్ణి కాదు. అదొక అలవాటైపోయింది. అమరకోశం ప్రధమ కాండ అంతా వల్లె వేయించిన తర్వాత ఓ రోజు కూచోబెట్టి చెప్పింది. ‘ఒరే నాన్నా ఇవి మంత్రాలు కాదు. ఇది బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైంది కాదు. ఇది ఒక నిఘంటువు. ఒక అర్థానికి ఉన్న నానా పదాలు ఈ ఒక్కొక్క శ్లోకంలో తెలుస్తాయి’ అని చిన్న చిన్నగా నేర్పించడం మొదలుపెట్టింది. వయసొచ్చిం తర్వాత అడిగాను అమ్మని ‘ఎవరైనా ఆక్టరో, డాక్టరో, కలెక్టరో కావాలని కోరుకుంటారు, నీకేమే (నేను ఏమే అనే పిలిచేవాణ్ణి అమ్మని) ఈ కవి కావడం కోరికా’ అని. కొంత నిశ్శబ్దం తర్వాత ఒక మాటనింది. కోటీశ్వరుడైనా సుడిగాడికి పోయినపుడు (సుడిగాడంటే కన్నడంలో వల్లకాడు) – వల్లకాటికి పోయినపుడు ఈ ప్రపంచంలో అతి దరిద్రమైన ఆశని వదిలిపోతాడురా, కానీ కవి అన్నవాడు అత్యద్భుతమైన అక్షరాన్ని వదిలిపోతాడూ ’ అంది. అది ఎందుకో ఆ వయసులో నాకు బలంగా నాటుకుపోయింది.

తొలి రాతల గురించి చెప్పండి?

నేను మొదట చందోబద్ధంగా రాయడం నేర్చుకున్నాను. మా గురువుగారు భాగవతుల జగన్నాధం గారు. ఆయన మంచికవి. ఆయన ద్వారా కందలూ, సీసాలూ, ఆటవెలదులూ రాయడం మొదలుపెట్టాను. తర్వాత కాస్త సామాజిక దృష్టి పెరిగి శ్రీశ్రీ ప్రభావం పడింది. ధనిక పేద వర్గాలూ, ధనికులందరూ దుర్మార్గులూ, వాళ్లంతా ధనికులయ్యింది పేదవాళ్ల కడుపులు కొట్టే… ఇట్లాంటి నాన్సెన్సికల్ థాట్ అంతా తలకెక్కించేసుకున్నాను. “నేనూ చీకటి”లో ఒక చోట రాశాను: “మావోసేటుంగ్ టంగ్ మని గంట కొడితే మూతికి బట్టల్తో గోడల మీద బ్రష్షుల్తో దాడులు” అని. ఆ అడాలసెన్స్, ఎర్లీ యూత్‌లో ఆ ప్రభావాలుండేవి.

శ్రీశ్రీ ప్రభావం నుంచి నేను బయటపడటానికి కారణం శేషేంద్ర గారు. అంతకుమునుపు ఆయన పేరు వినివుండటమే. యాధృచ్ఛికంగా కర్నూలు కమిషనర్ గా వచ్చారాయన. మా కాలేజీ మీటింగ్ దేనికో పిలిచాం. ఆయన ఆధునిక మహాభారతంలో ఇంక్లూడ్ చేసిన “మయూరపర్వం” అని ఒకటుంది. అప్పట్లో ఆ దాన్ని ‘శేషజ్యోత్స్న’ అనే చిన్న పుస్తకంగా వెలువరించి ఉన్నారు. ఆయన కవిత్వం చదివే పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది. అది వింటూ ఒక విధమైన ట్రాన్స్ లోకి వెళిపోయాను. అరె! కొట్టు, కట్టు, నరుకు, చంపు, రక్తం, ఆకలీ, కేకలూ… నేను చదువుతున్నదీ, రాస్తున్నదీ… ఇది కాదు కవిత్వం… దీనికతీతంగా ఏదో ఉందీ అనిపించింది నాకు. (నిజానికి శేషేంద్ర కూడా కమ్యూనిస్ట్ ప్రభావంతో రాశారు.) నేను రాస్తున్నది శుద్ధ వచనం అనిపించింది. కాళిదాసును అమ్మ అదే పనిగా ఎందుకు నేర్పించిందీ, అని మళ్లీ నేను రఘువంశం చదవటం మొదలుపెట్టాను. ‘ఉపమా కాళిదాసస్య’ అని ఎందుకన్నారో ఆ పుస్తకం మళ్లీ చదివితే అర్థమవుతుంది. ఎంత గొప్ప ఊహలతనివీ!

అలా నెమ్మదిగా శేషేంద్ర ప్రభావంలోకి జారుకున్నాను. ఆ విధమైన కవిత్వం… ప్రకృతీ, వెన్నెలా, ప్రేయసీ ఇట్లాంటి నాన్సెన్స్ రాయటం మొదలుపెట్టాను. ప్రతీ కవికీ ఆ వయసులో అది అత్యంత సహజమైన విషయం. ఆ ప్రభావం నుంచీ బయటపడటానికి నాకు ఐరోపీయ సాహిత్యం సాయపడింది. మన కృష్ణశాస్త్రులూ, శ్రీశ్రీలూ వీరందరూ ఒకరితర్వాత ఒకరుగా వెనకపడటం మొదలుపెట్టారు.

తర్వాత కథలు కూడా చదవటం మొదలుపెట్టాను. మల్లాది రామకృష్ణశాస్త్రి గారు మంచి కథలు రాశారు. ఒక్కోసారి అనిపిస్తుంది, మనం వీళ్లందర్నీ మరిచిపోయి ఇంకా ఒక పోతననీ, శ్రీనాధుణ్ణీ, ఒక వేమననీ ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం. బర్రెలు కాచుకునేవాణ్ణి కూడా పోతన ఎవర్రా అని అడిగితే ‘కవీ’ అంటాడు. అదే మల్లాది రామకృష్ణశాస్త్రి ఎవరంటే తెలియదంటాడు. వీళ్లందరూ ఎందుకు కొట్టుకుపోతున్నారు. వాళ్లందరూ ఇంకా ఎందుకు చిరస్థాయిగా ఉండిపోయారు. అంత గొప్ప కవిత్వం రాశారనో, మరోటనో కాదు. మరెందుకూ అంటే వాళ్లు ముందు మౌఖికంగా ప్రజల్లోకి వచ్చారు. ఒక ప్రతి రాసేస్తే దాన్ని చూసి మరొకడు చదివి నేర్చుకునేవాడు, చీకటి పడగానే పదిమందీ కాలక్షేపానికి ఊరికట్ట దగ్గరకు జేరేవారు, ఆ పద్యం తెలిసినవాడు అక్కడ కూర్చుని చదివితే విన్నవాళ్లలో కనీసం ఐదారుగురు దాన్ని వంటబట్టించుకుంటారు, మరలా వాళ్ల ద్వారా ఇంకొందరికి చేరుతుంది, కాబట్టి అక్షర జ్ఞానం లేకున్నా, లిపి తెలియకున్నా ఆ ప్రజల బుర్రల్లో వేమన అలా ముద్రపడిపోయాడు. ఆ కాలంలో పోతన భాగవతం చదవాలీ అంటే ఇంకొకరు మనకు వినిపించాలి. అందుకే పురాణ ‘శ్రవణాలు’. ఇప్పట్లో అలా జరిగే సౌలభ్యం లేదు.

అంటే లిపి సాహిత్యానికి చేటు చేసిందంటారా?

అలాగని కాదు. మన జనాభా విస్ఫోటం కూడా కారణం. చిన్నప్పుడు పాడేవాళ్లం “మూడు రంగులా జెండా నీడన ముప్ఫది కోటుల జన హృదయం” అని. ఇప్పుడు నూట ఇరవై కోట్లు దాటేసింది. అవే నదులు, అవే వనరులు… సాహితీ వనరులు కూడా అవే. And reaching people has become more difficult.

జనాభాతో పాటు చదివే వాళ్లు కూడా అనులోమానుపాతంగా పెరగాలేమోగా?

ఇక్కడ తిండికీ బుద్ధికీ సంబంధం ఉంది. ఒక ముద్దను ఒకడు తినే రోజు నుంచీ, ఒకే ముద్దను పది మంది తినాల్సిన స్థాయికి ఈ జనాభా విస్ఫోటం జరిగింది. తద్వారా వాడు రోజులో ఎక్కువ భాగం తిండి సంపాదించటానికి కేటాయిస్తాడు. తిండి వేట అంటే మరీ పాశవికం అని కాదు. వాడూ, వాడి పెండ్లాం, వాడి పిల్లలు, తల్లీదండ్రీ… వీళ్లందరి కోసం సంపాదించటం వైపే వాడి మొగ్గు ఎక్కువగా ఉంటుంది. బుద్ధి వికాసానికి సమయం కేటాయించడం బాగా తగ్గిపోయింది. కొండొకచో లుప్తం కూడా అయిపోయింది.

‘ఫలానా పుస్తకం నువ్వు చదివావా’ అంటే, చదవకపోవటం వల్ల వచ్చే నష్టం ఏమిటీ అని వాడాలోచిస్తున్నాడు. నేను కాఫ్కాని చదవలేదు. చదవకపోవటం వల్ల నాకొచ్చే నష్టం ఏమిటి? ఏమీ లేదు. ఎటూ అర్థం కాని కాఫ్కాని చదవటానికి ఒక గంట కేటాయించే కంటే, ఆఫీసులో ఓ గంట ఓవర్ టైమ్ చేస్తే నాకు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. నేను ఇంటికి నా భార్యకి పూలో పళ్లో తీసుకెళ్లచ్చు, లేదా నా పిల్లలకి చాక్లెట్లు తీసుకెళ్లొచ్చు. అది నా లోపలి మనిషికి మరింత సంతృప్తి కలిగించే విషయం.

దీనికి ఎవరూ ఎవర్నో బ్లేమ్ చేయాల్సిన పని లేదు. బ్లేమ్ చేసి సాధించేది లేదు. ఎవడికైతే ఇన్నేట్ గా సాహిత్యం పట్ల ఆసక్తి ఉందో వాడు రాసుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు. రోజుకి ఇరవై నాలుగు గంటలుంటే అలాంటి వాడు తనకు ఇరవై మూడు గంటలే అనుకుంటాడు. ఆ ఒక్క గంటా తన ప్రవృత్తికి కేటాయించుకుంటాడు.

సరే, శైలి పరంగా శ్రీశ్రీ నుంచి శేషేంద్ర వైపు వెళ్లారన్నారు. మరి ఆ కమ్యూనిస్టు దృక్పథం ఏమైంది?

కమ్యూనిస్టులంటే మంటే కానీ, కమ్యూనిజం నాలో ఇప్పటికీ ఉంది. నువ్వు సంపాదించని డబ్బు నీది కాదు. అందుకే నా వారసత్వపు ఆస్తి కూడా కాదనుకున్నాను.

మా నాన్నకి మొత్తం మూడెందొల ఎకరాలు. మేం పదకొండు మంది సంతానం. అప్పుడే ఆయన ఖర్మో మా ఖర్మో గానీ, డొక్కల కరువు అని రాయలసీమలో కరువొచ్చింది. ఇరవై ఏళ్ల పాటు చుక్క వర్షం లేదు, అణాకీ అర్ధణాకూ భూములమ్ముకునే పరిస్థితి. నాకు ఆరుగురు అక్కలు. అందరికీ పెళ్లిళ్లు చేయాలి. నాన్న వేదపండితుడు. అది డబ్బు తెచ్చేది కాదు. ఇక ఆయనకు మిగిలింది ఒకటే దారి. ఒక్కొక్క ముక్కగా పొలాలన్నీ విరుచుకుంటూ వెళిపోయారు. ఆఖరుకు నా దగ్గరకు వచ్చేసరికి ఇరవై తొమ్మిదెకరాల మామూలు చేను, ఒక మూడెకరాల వరి మడి, ఒక పాత కొంపా మిగిలాయి. దాన్ని కూడా నేనూ మా అన్న పంచుకునే పరిస్థితి. అప్పుడు నేను మా తండ్రి గారితో అన్నాను “అప్పా” (అలాగే పిలిచేవాణ్ణి, కన్నడ ప్రభావం), “బాండు పేపరు తెప్పించి రాయించేయండి అవన్నీ అన్నయ్య పేర” అన్నాను. ఆయనలాగే తెప్పించాడు. నేను సంతకం పెట్టేశాను. దాంతో 28 యేళ్ల ప్రాయంలో అలా ఆస్తి కూడా వదిలించేసుకున్నాను.

అసలు నిజానికి టెన్త్ క్లాసులోనే… ఒకసారి ఫీజు కట్టాల్సి వచ్చింది. మా తండ్రి గారి దగ్గరకు పోయినపుడు, ఏవో మాటలు జరిగాయి మా ఇద్దరి మధ్యన. దాదాపుగా ఎట్లాంటి మాటలంటే, “తెరవని తలుపులు” లో తండ్రీ కొడుకుల మధ్య జరుగుతుంది చూడండి యుద్ధం… అలాంటి యుద్ధం, కాని అంత మరీ తీవ్ర స్థాయిలో కాదు. ఎందుకంటే అప్పటికి ఇంకా కుర్రవాణ్ణి. చలం “మ్యూజింగ్స్” లో తన తండ్రితో కొట్లాడిన ఒక సందర్భాన్ని గురించి రాస్తాడు. “పదహారు సంవత్సరాల క్రితం అతను చేసిన తప్పుకు పశ్చాత్తాపం అతని కళ్లల్లో కనపడింది” అంటాడు. ఎందుకు పుట్టించాన్రా వీడిని అన్నట్టు అన్నమాట. అలాగే చూశారు మా తండ్రి.

ఆ తర్వాత సరిగ్గా వారం రోజుల పాటు ఒక ఫాక్టరీలో నైట్ షిఫ్టులు కూలి పని చేశాను. ఆ కూలి డబ్బుతో టెన్త్ క్లాసు ఫీజు కట్టి పెద్ద మొనగాణ్ణనుకున్నాను. తర్వాత డిగ్రీ వరకూ మా పెద్దక్కయ్య దగ్గరుండి చదువుకున్నాను. ఆమె నన్ను దాదాపు దత్తు తీసుకుంది. ఇప్పటికీ అందరికీ ఆమెను అమ్మగానే పరిచయం చేస్తాను.

తర్వాత డిగ్రీ అయ్యాకా… అప్పట్లో నా మిత్రుడు ఒకడు కర్నూల్లో మొట్టమొదటి డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ తెచ్చాడు. “ఏరా చేరతావా” అని అడిగాడు. “సలక్షణంగా, పిలిచి అన్నం పెడతానంటే ఎవరు వద్దంటారు” అన్నాను. డోన్, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు అవన్నీ సూట్ కేసు పట్టుకుని తిరిగి రైస్ కుక్కర్లవీ అమ్మటం, దుకాణంలో ఉన్నపుడు కౌంటర్ బాయ్ గా, నౌకరుగా… చేశాను. ఉదయాన్నే నేనే పోయి షట్టరు తీసేవాణ్ణి. అదేదో చిన్నతనం అని ఎప్పుడూ అనుకోలేదు. నా డబ్బు నాకు వస్తోంది.

అప్పుడే తాగుడు అలవాటైంది. పొద్దున్నే సూట్ కేసు పట్టుకుని ఊళ్లు తిరిగి, బయట హోటళ్లలో భోజనాలు చేసి, రాత్రి కలెక్షన్లు తీసుకుని పదీ పదిన్నరకి షాపుకి చేరేవాణ్ణి. అప్పటికి ఈ ‘ఉషా’, ‘రాలీ’ ఇలా రకరకాల కంపెనీల సేల్స్ మేనేజర్లూ వాళ్లూ వచ్చే వాళ్లు. వాళ్లతో కూర్చుని తాగటం సరదాగా ఉండేది. పన్నెండున్నరా, ఒంటిగంటప్పుడు ఇంటికి చేరేవాణ్ణి. అప్పుడు మా వాళ్లు గవర్నమెంటు క్వార్టర్స్ లో ఉండేవాళ్లు. నాకు అది ఇబ్బందికరంగా అనిపించేది. దాంతో తర్వాత ఇంటి బయట ఒక పాక వేసుకున్నాను. కొంచెం ఎలక్ట్రిఫై చేసి, ఒక లైటూ, ఫానూ, ఒక మడతమంచం… రాత్రి లేటయితే అక్కడే పడుకునేవాణ్ణి. పొద్దున్న లేచి మళ్లీ మామూలే. ప్రతీ రోజూ ముందు రోజుకి నకలే.

అలాగే ఒకానొక సమయంలో ఒక పేపర్ మిల్లుకి సెక్యూరిటీ స్టాఫ్ ని సప్లయి చేసే కాంట్రాక్ట్ చేశాను. అలాగే వాళ్లకే సున్నమూ బొగ్గూ సప్లయి చేసే కాంట్రాక్టులు కొన్ని చేశాను. అట్లా రోజుకి ఐదు వేలు ఆరు వేలు కూడా డబ్బొచ్చేది. దాంతో నా వ్యసనం అనబడే ఈ తాగుడుకి అడ్డు లేకుండా పోయింది.

ఇదంతా సాగుతున్నపుడు మీలోని రచయిత ఏం చేస్తున్నాడు?

అలా డబ్బు సంపాదించే రోజుల్లోనే డబ్బు గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. The creation of money. అప్పటి బార్టర్ సిస్టం నుంచి ఇప్పటి కరెన్సీ వరకూ. మన సామాజిక జీవితాల్ని నిర్దేశించే ఇదేమిటి. ఈ విచికిత్సతో… నేను చదివిన కాలేజికి చాలా పెద్ద లైబ్రరీ ఉండేది, ఆ లైబ్రేరియనూ ఇంకో ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు నాకు తెలిసిన వాళ్లుండేవాళ్లు. కాబట్టి అప్పటికి నేను అక్కడి విద్యార్థిని కాకపోయినా నన్ను లోపలికి అనుమతించేవారు. నాకు దొరికిన ఖాళీ సమయమంతా అక్కడే గడిపేసేవాణ్ణి. రాండమ్ గా చదివేవాణ్ణి. ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్, ఒక ఫిలాసఫీ అనేది లేకుండా చదువుకుంటూ వచ్చాను. అప్పుడే నాకు ఐరోపీయ సాహిత్యం పరిచయం అయింది. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క డైనమైట్.

మనం ఎక్కడున్నాం? అసలు మనకు ఆలోచనా వ్యవస్థ అనేది ఎందుకు ఎదక్కుండా పోయింది? నాకు అప్పుడు తోచిన జవాబులు కొన్నే. కమ్యూనిజం మనిషిని ఎదగనీయదు. మనిషి ఆలోచనా వ్యవస్థని ఎదగనీయదు. ఒకే కోణంలో ఇదే చూడు నువ్వు, ఇదే తయారు చేయి, అంటుంది. దాంతో డైకాస్ట్‌లు (మూసలు) రావటం మొదలుపెట్టాయి. ఎవడో ఒక మూస చేసి పెట్టేస్తే ఇక మీట నొక్కగానే నకళ్లు వచ్చేయటం. కళ కాస్తా క్రాఫ్ట్ అయిపోయింది. మీరు కొండపల్లి బొమ్మలూ, నిర్మల్ పెయింటింగ్సే తీసుకోండి. దాని మీద కళాకారుడి సంతకమేం ఉండదు. అంటే కింద పేరని కాదు. అన్నీ ఒకలాగే ఉండటం. అదీ క్రాఫ్ట్.

మనిషి ఆలోచన వృద్ధి చెందటం అనేది మనలాంటి మతం చేత కంట్రోల్ చేయబడుతున్న దేశాల్లోను, అటు కమ్యూనిజం చేత కంట్రోల్ చేయబడుతున్న దేశాల్లోనూ కూడా లేకుండా పోయింది. కమ్యూనిస్ట్ రష్యాలో చాలామంది కళాకారుల సృజనల్ని బయటకి రాకుండా చేశారు వాళ్లు. మరో పక్క మతం కూడా అంతే. పాపాన్నీ, పుణ్యాన్నీ తయారు చేసింది. ఫలానా ఆలోచన నీకు రావడమే పాపం, తర్వాత అందుకోసం నీ ప్రక్షాళన. అంటే అక్కడితో నీలోని ఆలోచనను నువ్వు నరికేసుకుంటున్నావు.

శుకబ్రహ్మాశ్రమం స్థాపించిన విద్యాప్రకాశానంద గిరిస్వామిని అడిగాను. ఈ మతంలోని పుణ్యం పాపం ఈ చట్రాలన్నీ మనం తయారు చేసుకున్నవే కదండీ అని. ఆయన బాగా చదువుకున్నాడు, “నిజమే నాయనా, మనకు మనమే తయారు చేసుకున్నవే కాని, సమూహంగా తయారు చేసుకోలేదు. సమూహంలో కొద్దో గొప్పో తలకాయ ఉన్నవాడు తయారు చేసినవి ఇవి. సమూహం ఛిద్రం కాకూడదని తయారు చేశారు. సమూహాన్ని కట్టిపడేయటానికి కొన్ని సమూహానికి అర్థం కాని విషయాలు అవసరం. గొర్రెల్ని రెండు కుక్కలు కంట్రోల్ చేస్తాయి. అలా తయారైనవి ఇవి. గొర్రెల మంచికే. ఆ గొర్రెల కాపరిని మేము భగవంతుడంటున్నాం. భగవంతుడున్నాడని మేం విశ్వసిస్తాం. భగవంతుడు లేదూ అనుకున్నా కూడా మీరు సరైన దారిలోనే ఉన్నారు” అన్నాడు. ఆయన మాటలు కొంత సత్యం కనిపించింది. నిజమే, కుక్కలు రెండు వంద గొర్రెల్ని కంట్రోల్ చేసినట్టుగా ఈ మతం అనేది వీళ్లకు అవసరమేమో అనిపించింది. ఎందుకంటే దైనందిన జీవితంలో ఇంత ఆలోచన అవసరం లేదు వాడికి.

రాయాలీ అన్న తపన కన్నా ముందే ఈ సత్యాన్వేషణ మిమ్మల్ని లాక్కుందన్నమాట.

అవును. యవ్వనంలో శేషేంద్ర శర్మ ప్రభావంలో పడి రాసిందేదో అక్కడితోనే ఆగిపోయింది. అప్పుడే ‘రంగనాయకి లేచిపోయింది’ అని కథ కూడా రాశాను. (1973లో అనుకుంటాను ఆంధ్రపత్రికలో అచ్చయ్యింది.) మా ఇంటి దగ్గర ఒకావిడ ఉండేది. చాలా చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించటంతో ఇద్దరు పిల్లల్ని తీసుకుని అన్నయ్య ఇంటికి వచ్చేసింది. కుట్టుపని చేసేది. ఒక రోజు ఆ కుట్టుమిషనుకి ఏదో రిపేరొస్తే చేయించుకొస్తానని పక్క ఊరు వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. అందరూ లేచిపోయిందని అన్నారు. కానీ అది మాత్రమే కారణం కావచ్చా అని నా తలలో. మనం రోజూ చూస్తుంటాం పేపర్లో ‘గుర్తు తెలియని శవాలు’ అని. ఎక్కడో ఏదో ఏక్సిడెంట్ అయి వుండచ్చు, లేదా ఆమెకు హార్ట్ ప్రాబ్లెమో ఏదో ఉండి ఎక్కడో పడిపోయుండచ్చు, కొద్ది రోజులు చూసి మున్సిపాలిటీ వాళ్లు మార్చురీలో పారేసి ఉండొచ్చు… ఏదైనా అయి ఉండొచ్చు. నేను ఆమె చనిపోయిందని రాశాను.

అప్పట్లోనే ఏవో అంతర్ జిల్లా కవిత్వ పోటీలు జరుగుతుంటే కూడా వెళ్లాను. కవిత్వానికి కాంపిటేషన్లేవిటి అన్న విచక్షణ ఉండేది కాదు. భాష పట్ల నాకు కంట్రోల్ ఉందన్న అహంకారం ఒకటి దానికి తోడు. సరే వెళ్లాక అక్కడ వాళ్లేదో టాపిక్ ఇచ్చారు. శిశిర వసంతం పేరుతో కవిత్వం ఏదో రాశాను. అప్పట్లో మా గురువు గారు దావూద్ సాహెబ్ గారు, సంస్కృతం, ఇంగ్లీషు, అరబ్బీ భాషల్లో మంచి పండితుడాయన. ఒకప్పుడు నెల్లూరులో పాన్ షాపు నడిపేవాడు. అది నెల్లూరు కవి పండితులందరికీ అడ్డాగా ఉండేది. అద్భుతంగా పద్యాలు రాసేవాడు. ఆయనకు నేనంటే ఇష్టం. ఆ కవిత్వం కాంపిటీషన్లో నా ఖర్మ కాలి ఫస్ట్ ప్రెయిజేదో వచ్చింది. నాకు నాలుగు పుస్తకాలేవో బహుమతిగా ఇచ్చారు. తర్వాత నేను కామర్స్ క్లాసులో ఎక్కడో కూర్చుని ఉండగా తెలుగు ప్రొఫెసర్ దావూద్ సాహెబ్ గారు పిలుస్తున్నారని కబురొచ్చింది. ఆయనంటే మాకందరికీ భయం. అలా భయం భయంగానే వెళ్లాను. ఆయన అన్నాడు: “ఒరే నువ్వు చాలా బాగా రాస్తున్నావు. కానీ నీ మెదడింకా ఎదగాల్సి వుంది. దానికి నీకు పుస్తకాలకంటే మనుషులెక్కువ పని చేస్తారు. ప్రపంచాన్ని విస్తృతంగా పర్యటించటానికి ప్రయత్నించు. అధ్యయనం చేయి. రాసిన వాక్యాన్ని సపోర్ట్ చేసుకోగలవూ అన్నప్పుడే ఒక వాక్యాన్ని రాయి. పది మంది పది ప్రశ్నలేస్తే ఆ పదిమందినీ కన్విన్స్ చేసేట్టుగా ఆ వాక్యం ఉండాలి. లేదంటే ఆ వాక్యాన్ని నీకై నువ్వు సపోర్ట్ చేసుకునేట్టుగా ఐనా ఉండాలి. అంతవరకూ రాయద్దురా నువ్వు” అన్నారు. నేను దాన్ని ఆదేశంగా తీసుకున్నాను. ఆయన నా మంచి కోరే చెప్పాడనుకున్నాను, ఆ రోజుతో రాయటం ఆపేశాను. అంటే డైరీలూ అవీ ఇవీ రాసుకుంటూనే వచ్చాను. కానీ వాటిని పత్రికలకి పంపించటం మానేశాను. అప్పటికీ ఎమర్జన్సీటైంలో ప్రభుత్వం అణిచివేత సహించలేక దొంగపేర్లు పెట్టుకుని పత్రికలకి రాశాను. అవి తప్ప ఇంకేం రాయలేదు.

దాని తర్వాత మళ్లీ రాసింది “నేనూ చీకటి”నే. మధ్యలో పాతికేళ్లు ఏదీ ప్రచురించలేదు. చదవటం, చదవటం, చదవటం. జనాన్ని గమనించటం. పదిమందిలో కూర్చున్నా కూడా నోర్మూసుకుని కూచునేవాణ్ణి. ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారు, అలా పదిమందీ కూర్చున్నప్పుడు కామన్ సబ్జెక్ట్ ఒకటుంటుంది, దానికి ఆ పదిమందీ ఎలా రియాక్ట్ అవుతున్నారు… అది గమనించటమే నా పని. అలా చాలా యేళ్లు మిన్నకుండిపోయాను.

ఈలోగా చాలా చదివానన్నారు. ఈ చదవటంలో మీపై బాగా ప్రభావం చూపించిన రచయితలు?

మా దావూద్ సాహెబ్ గారే చెప్పేవారు. గొప్ప పుస్తకం అని చెప్పి ఏ పుస్తకాన్నీ చదవద్దు నువ్వు. వీలైతే ముందు పేజీలు చింపేసి చదువు. పుస్తకం చదివేటపుడు నీ అభిప్రాయాన్ని నువ్వు ఏర్పరుచుకో. వాళ్లూ వీళ్లూ చెప్పిన మాటలు వినకు. గొప్ప వాడన్నప్పుడు ఎప్పుడూ గొప్పగా రాయాల్సిన అవసరం లేదు.

నన్ను డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో చేర్చుకున్న స్నేహితుని దగ్గరే ముగ్గురు రచయితలు నాకు పరిచయమయ్యారు: అయాన్ రాండ్ (Ayn Rand), ఖలీల్ జిబ్రాన్ (Kahlil Gibran), ఫ్రిట్జఫ్ కాప్రా (Fritjof Capra). వీళ్లు ముగ్గురూ మూడు భిన్న సంస్కృతులకు చెందిన వారు. అయాన్ రాండ్ దాదాపు నబొకొవ్ లాగే రష్యా నుంచి పారిపోయి అమెరికా చేరింది, తనదైన సిద్ధాంతాన్ని చెప్పింది, అది తప్పా ఒప్పా అన్నది తర్వాతి సంగతి. ఇక జీవిత తాత్త్వికతను చెప్పిన వాడు ఖలీల్ జిబ్రాన్, ఎప్పుడూ కలవని జియాదాకు అతను రాసిన ప్రేమ లేఖలు. ఇంక కాప్రా మతాన్నీ సైన్సునూ అనుసంధానిస్తూ రాసిన శాస్త్రవేత్త.

వీళ్లతో పాటూ సార్త్ర్ (Sartre) ప్రభావం కూడా నాపై పడింది. అస్తిత్వ వాదాన్ని తవ్వటం మొదలుపెట్టాను. ‘నేను’ అన్నది అన్నింటికీ మూలభూతం. అంటే “లేదు లేదు, నువ్వు సమూహం కోసం బతకాలం”టూ పుట్టినప్పట్నించీ మనకు నూరిపోస్తూంటారు. అదంతా నాన్సెన్సికల్. మనం మన కోసం బతుకుతాం. చేయాలనిపిస్తే ఇంకొకళ్లకు చేస్తాం. ఈ సొసైటీ ఎవరు నన్ను నిర్దేశించటానికి. I’m just a speck of that conglomeration.

మీ రచనలన్నీ ఫస్ట్ పెర్సన్లో “నేను” అని సాగటానికి అదొక కారణమా?

అవును. ఈ కసినంతా కక్కుకోవటానికి అది పనికొస్తుంది. రచయిత ఒక పాత్రగా ఐపోతే, ఆ పాత్ర ద్వారా రచయిత కావాలనుకున్నదంతా చెప్పొచ్చు అన్నది ఒక కారణం. నాకు లోపలున్న భావాలన్నీ ఆ పాత్ర ద్వారా చెప్పొచ్చు. ఫిలాసఫీ గురించే కాదు, ఆర్ట్ గురించే కాదు, సెక్స్ గురించే కాదు, ప్రపంచంలో ఉన్న దౌర్భాగ్యాలన్నింటి గురించీ చెప్పటానికి… “నేను” ఒక పాత్ర ఐపోతే దాని ద్వారా చెప్పుకోవచ్చు. ఆ “నేను”కి పేరు ఉండదు, కానీ చాలా చోట్ల “గడ్డపోడు” గానే ఉంటాడు. కాబట్టి నేనే. ఇంకోటేంటంటే, అది నాకొక సంతకం లాంటిది. “కావేరి”, “లెనిన్” ఇలా కొన్ని పాత్రలు పదే పదే వస్తాయంటారు. అదంతా నా సంతకం. నేను కావాలనే అలా చేస్తాను.

“నాకు గుర్తింపు కోసం ఏం పట్టింపు లేదండీ, ఏదో నేను రాయాలనుకున్నది నేను రాస్తున్నాను” అనేది దొంగమాట. నన్ను గుర్తించాలి అనేది నాకుంది. చిన్నప్పటి నుంచీ నాకు అలా ఉంది. I want to be aloof from the ordinary throngs. మామూలు మూకల్నించీ భిన్నంగా ఉండాలి. కారణం మా అమ్మ “నువ్వు స్పెషల్ రా” అని పదే పదే అంటూండటం నా మనసులో ఎక్కడో నాటుకుందేమో. వయసులో కాస్త అందంగా ఉండటం కూడా కారణం కావొచ్చు. సహజాతంగా ప్రతీ ఒక్కడికీ అహం ఉంటుంది. చూపించుకునే అవకాశం రాదు. స్థలకాల పరిస్థితులు వాణ్ణి చూపించుకోనివ్వవు. ఎక్కడకో సుంకిరెడ్డిపల్లికి పోయి నేను ఫలానా అంటే పోరాబచ్చా అంటారు. కాబట్టి కనీసం మనల్ని చూపించుకోగలిగిం దగ్గరైనా మనల్ని చూపించుకోవాలని నాకు చిన్నప్పణ్ణించీ ఉండేది. ఇప్పటికీ అదే చేస్తున్నాను.

ఇంకోటి: నేను రాసినవేవీ అభూత కల్పనలు కావు. అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం ఇవన్నీ తీసుకుని… ఆ వేపపువ్వు, ఈ గన్నేరుపువ్వు, ఈ మల్లెపువ్వూ ఇవన్నీ తీసుకొచ్చి ఒక దారంలో కుడతాను. కథ అంటూ నా రచనల్లో ఏమీ ఉండదు. కథా సూత్రమూ, కథా పాత్రలూ చాలా తేలిపోయేవిగా ఉంటాయి. బలమైన వ్యక్తిత్వాలూ అట్టాంటివేవో అంటుంటారుగా, అవేవీ ఉండవు. మామూలు సాదాసీదా cheapest of cheap stratum లో ఉన్న మనుషులే ఉంటారు, మానసికంగా. కారణం ఏమిటంటే, మన డార్కర్ సెల్వ్‌స్ మనందరికీ తెలుసు, తెలిసినా బయటపెట్టుకోవటానికి మనమేనాడూ ఇచ్ఛగించం. వాటిని చూపించాలి.

ఆ చీకటి కోణాల్ని ప్రత్యేకించి తెచ్చి పేజీ మీద పరచాల్సిన అవసరమేంటి?

అవసరం అంటే, నేను ముందు నుంచీ భిన్నంగా ఉండాలనుకున్నాను.

కరెక్టే, అదే రాయాల్సిన అవసరం ఏముంది. ప్రేమ గురించీ, సున్నితత్వం గురించీ, అందం గురించీ రాయచ్చు కదా. వాటి గురించి కూడా నేను రాసినంత బలంగా ఎవరూ రాశానని అనుకోను. నేను పచ్చి సెక్స్ గురించి కూడా చాలా అందమైన పదాల్లో రాశాను. వాటి గురించి కూడా రాస్తూనే ఉంటాన్నేను. “నికషం” చదవండి. అందులో పాత్ర తాను తండ్రి అయ్యే వీల్లేదని సైంటిఫిక్ గా తేలిన తర్వాత, స్టూడియోలో ఏడ్చుకుంటాడు, బట్టలన్నీ విప్పేసి చూసుకుంటాడు, వాడి మర్మాంగాలన్నీ మామూలుగానే ఉంటాయి, వాడి సెక్స్ జీవితం మామూలుగానే ఉంటుంది, కానీ స్పెర్మ్ కౌంట్ లేదు వాడికి, ఇంటికొచ్చిం తర్వాత భార్యకీ అతనికీ మధ్య అనుబంధాన్ని సెక్స్ ద్వారానే చూపించాను. ఒక purgation లాంటి సెక్స్ అది. ఇద్దరు పెళ్లయిన ఆడవాళ్లు, బాగా చదువుకున్న వాళ్లు నాకు ఫోన్ చేశారు. ఇంతకంటే గొప్పగా మగవాడూ ఆడదాని మధ్యలో ఇటువంటి సందర్భంలో దీన్ని గురించి రాసినవాళ్లు మాకింత వరకూ తగల్లేదండీ అన్నారు.

అంటే నేననేది చీకటి కోణాలు అందర్లోనూ ఉంటాయి. కానీ తెలుగు సాహిత్యంలో దాన్నే ఒక ఇతివృత్తంగా ఇంత రాసినవారు తక్కువ.

ఉన్నారండి, ఇన్నర్ సెల్ఫ్ ని బయటపెట్టినవాళ్లు. బుచ్చిబాబు కొద్దిగా చేసే ప్రయత్నం చేసి వెనక్కు అడుగు వేశాడు. “చివరకు మిగిలేది” అనే పెద్ద కథని ఆయనే నవలగా తయారు చేసుకున్నాడు. It’s a nonsensical novel. అతని కథలే బెస్ట్. చండీదాస్ కూడా రాశాడు. కానీ అతని “హిమజ్వాల” కన్నా “అనుక్షణికం” – టూమెనీ పాత్రలున్నా – ఇంకా మంచి నవల అనిపిస్తుంది.

కానీ ఆ డార్కర్ సెల్ఫ్ ‌ని బ్రాకెట్ చేసి చూపించాలనే ఆ డ్రైవ్ మీలోనే ఎక్కువ కనిపిస్తుంది. దాని వెనకనున్నదేమిటి?

మనుషుల్లో ఉన్న హిపోక్రసీ. నా చుట్టూ ఉన్న మనుషుల్లోని హిపోక్రసీ. నేను డైరెక్ట్ గానే చెప్పేవాణ్ణి. ఎవరైనా ఒక మాట అన్న తర్వాత, “కాదు మీలో ఇది కాదు, ఇంకోటి ఉందీ” అని. ఈ మధ్య వచ్చిన కథ చదివి కొంతమంది, “అబ్బ ఈ కథ సార్, సూపర్బ్ సార్” అని అన్నారు. నేను ముగ్గుర్ని అడిగాను, “సార్ నిజంగా మీకర్థమైందా?” అని. “కాలేదనుకోండీ, కానీ మీ స్టయిల్ కదా అది,” అని సమాధానం. “అట్లాంటప్పుడు అద్భుతం అని ఎట్లా అంటారు. లోపల ఉన్నదేదో చెప్పేయండి. బాలేపోతే బాలేదని నిష్కర్షగా చెప్పేయండి. ఇట్లాంటి కథల బదులు రామకోటి రాసుకో అని చెప్పండి, సంతోషిస్తాను”.

మిమ్మల్ని హిపోక్రసీ చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట.

చిన్నప్పటి నుంచీ భరించీ భరించీ… మా తండ్రి గారితో నాకు మొదలైంది. ఆయన వేదం చదివారు, తన దగ్గరకొచ్చే వాళ్ళ నుండి పది రూపాయల తాంబూలం తీసుకుని మరీ ఈ పని చేయచ్చూ ఆ పని చేయకూడదూ అని చెప్పేవారు. నేనూ గుళ్లో పూజారిగా కూడా పని చేశాను. ఓ ముగ్గురు ఆడవాళ్లు బాగా గుర్తు. అందమైన ఆడవాళ్లు వైధవ్యం పాలై గుండ్లు గీయించుకుని వచ్చేవారు. నాకు గొంతు దాకా వచ్చేది అడగాలని. అమ్మా మనస్ఫూర్తిగా గుండు గీయించుకున్నారా అని. వీళ్లందరికీ మా నాన్న అవీ ఇవీ చెప్తూండేవాడు. ఆయన చెప్పేది వేరే, ఆయన పాటించేది వేరే. నికార్సైన అంటరానితనం చచ్చిపోయేదాకా పాటించాడాయన. “కాలం కథ”ల్లో ‘మునక్కాయ దొంగలు’ అనేదాంట్లో రాశాను కూడా. సామ్యేలు అనీ నా స్నేహితుడు మా నాన్న లేని టైంలోనే మా ఇంటికి వచ్చేవాడు. ఏవంటే వాడు మాదిగ. మా నాన్నకి వాడు రావటం ఇష్టం లేదు.

ఈ హిపోక్రసీ చూసినపుడు అనిపించేది, వీళ్ల వెనకాల ఉన్నదేమిటసలు? వీడి వెనక ఇది వుండి తీరుతుందీ అన్నది నేను స్థిరపరచుకుంటాను. అది తెలుసుకోవాలనుకుంటాను. మళ్లీ ఐస్బర్గు పోలికనే తీసుకువస్తాను. ఆ కింద దాగినదాన్ని ఎక్స్‌ప్లోర్ చేయటంలో నాకు ఆనందం ఉంది. ఏదో హాలీవుడ్ డిటెక్టివ్ సినిమా ఒకటి వుంది. ఇద్దరు డిటెక్టివ్‌లో పోలీసులో ఒక గదిలోకి ప్రవేశిస్తారు. వాళ్లలో ఒకడంటాడు: I smell a rat, everything looks very clean and tidy అని. అంతా పెర్ఫెక్టుగా ఉందీ, అంటే ఎక్కడో ఏదో తప్పుందీ అని. ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ లోపల ఉంది. ఎవరన్నా ఇంటికొస్తున్నారంటే, “వాళ్లొచ్చేస్తున్నారు, టేబుల్ మీద కాఫీ మరకలు, ఆ బట్ట తీసుకొచ్చి కప్పేయి, సోఫా మీదున్న జాకెట్లూ బనీన్లూ అన్నీలోపల సర్దేయి,” అంటూ వచ్చేవాళ్ళ కోసం సిద్ధమై మనం దొంగల్లాగా ఉంటాం.

మనం ఇంకోళ్ల కోసం మనం కాకుండా ఎందుకుంటాం? అది నన్ను చిన్నప్పణ్ణించీ తొలుస్తున్న ప్రశ్న. మనలో తొంభై తొమ్మిది శాతం గడపదాటి సమాజంలో అడుగుపెట్టగానే హిపోక్రటికల్ గా మారిపోతాం.

అరాచకంగా కనపడటానికి మరీ డెలిబరేట్ ప్రయత్నం చేస్తున్నారేమో?

లేదు, డెలిబరేట్ గా ఎప్పుడూ నా అసలు నన్ను దాచుకోలేదు. అది చిన్నప్పణ్ణించీ వచ్చింది. కానీ నాలో ఉన్న అరాచకత్వానికి ఒక క్రమశిక్షణ ఉందండి. నాది disciplined anarchy. నేనెంత డిసిప్లెయిన్డ్ గా ఉంటానో, నా అనార్కీ కూడా అంతే డిసిప్లెయిన్డ్ గా ఉంటుంది.

మీదైన గొంతు మీకు పట్టుబడిన తొలి సందర్భం “నేనూ చీకటి”నే అనుకుంటాను. దాని గురించి చెప్పండి.

“నేనూ చీకటి” రాయటం పూర్తి చేసేటప్పటికి నా వయసు 38. నేను మూడుసార్లు దేశ సంచారం చేశాను. దాన్ని అక్కడక్కడా రాసుకుంటూ వెళ్లాను.

మొదలెడితే ఒకే ఊపులో రాసుకుంటూపోయే రచయిత కాదన్నమాట.

లేదు, అలాంటిదేమీ లేదు. నేను ఒకేసారి మూడు పుస్తకాలు చదవగలను. ఒకేసారి రెండు రచనలూ చేయగలను. నేను ఒక నేను కాదు, మీరు ఒక మీరు కానట్టే. అందుకే అది సాధ్యపడుతుంది.

1989లో “నేనూ చీకటి”ని కన్యాకుమారిలో పూర్తి చేశాను. తర్వాత దాన్ని పబ్లిష్ చేయటానికి నాకు ఏడేళ్లు పట్టింది. అప్పటికి నాకు ధనవంతులైన స్నేహితులున్నారు. “పత్రికలవాళ్లనీ ఇంకోళ్లనీ అడుక్కోవడం ఏందిరా. ఒక పదివేలు పెడితే మనమే వేసేయచ్చు, వేసేద్దాం పా” అన్నారు చాలామంది. But I wanted it to come out by virtue of its quality. డబ్బులుంటే ఎవరైనా వేసుకోవచ్చు. కానీ నాకు అలా ఇష్టం లేదు. కాబట్టి వెయిట్చేశాను.

అందులో జానకి పాత్ర వెనుక నూర్‌బానో అనే ఒకామె ఉంది. అది “కాలం కథలు” లో రాశాను. లక్నోలో పుట్పాత్ మీద స్పృహ లేకుండా పడి ఉంటే ఆమె నన్ను ఇంట్లోకి తీసుకువెళ్లింది. ఒక పది రోజులు నేనామెను చూడలేదు. ఎవరో పనిమనిషి వచ్చి బ్రెడ్డూ, పాలూ, చాయ్ తెచ్చి ఇస్తుండేది. ప్రతీ రోజూ పై నుంచి ఆమె సంగీతం మాత్రం వినపడేది. ఇక వెళిపోబోయే ముందు ఆమెను చూశాను. పగిలిపోయిన బీరువాలు, అందులో ఉర్దూ సాహిత్యం, ఆ మాహోల్, మీకు సంగీతం రాకపోయినా సరే మీరు సంగీతాన్ని చుట్టూతా కప్పుకుని బయటకొస్తారు. ఆమె ఆ రోజు అద్భుతంగా గానం చేసింది. “నేను ఎదురుచూస్తున్నది వసంతాల కోసం” (మెరె ఇంతెజార్ థీ బహారోంకీ) అని మొదలుపెట్టి, “కానీ ఎదురొస్తున్నవన్నీ బతికున్న శవాలు” (జిందాయే లాష్) అంటూ పూర్తి చేసింది. అహిర్ భైరవ్ (అంటే మన చక్రవాకరాగం)లో పాడింది.

ఎప్పటికైనా నేనూ అంటూ వదిలిపోయే జ్ఞాపకాల్లో ఈమె ఉండాలీ అని ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను. ఆ రోజు ఆమే లేకపోయి ఉంటే నేను ఆ పుట్పాత్ మీదే చచ్చిపోయేవాణ్ణి. ఆమె ఒక నవాబ్‌ ఉంచుకున్న వేశ్య. వాడికున్న వందలాదిమందిలో ఆమె ఒకతె. ఆమె ఎలా బతికిందో ఏమైందో వాడు మాత్రం ఒక మొహల్లాలో ఒక చిన్న బిల్డింగ్ ఆమె పేర్న పెట్టాడు. ఆమె “నేను చీకటి”లో జానకిగా మారింది. అంటే రొమాంటిసైజ్ చేశాను బాగా. అందునా ‘ప్యాసా’ ప్రభావం ఒకటుంది. అలాగే కర్నూల్లో వ్యభిచారం ముమ్మరంగా జరిగే ఏరియా ఒకటి ఉండేది ధర్మపేట అని. ఆ లక్నోలో ఆవిణ్ణి తీసుకొచ్చి ధర్మాపేటలో పెట్టాను. గౌరీమనోహరి బియస్సీ ఫైనల్ అని చెప్పి ఆమె కాఫ్కా పుస్తకం మీద రాశాను. మీరు మీ సోకాల్డ్ రివ్యూ ఆఫ్ కాశీభట్లలో రాశారు: ఇంత చదువూ చదివి ఈ వ్యభిచార వృత్తి చేయటంలో అర్థం పర్థం కనిపించదూ అని.

మీకొక ఇన్సిడెంట్ చెప్తాను. ఇక్కడొక కులం ఉంది. కత్తర కులమంటారు దాన్ని. అందరూ వ్యభిచారంలోనే ఉండేవారు. వాళ్ళలో ఒక అమ్మాయి పదహారు పదిహేడేళ్ల వయస్సుంటుంది. చదువుకుంది. ఇంటర్మీడియట్ చేసి ఎ.ఎన్.ఎమ్ కోర్సు చేసింది. గవర్నమెంటు ఉద్యోగం సంపాయించింది. మంచి ఉద్యోగం, మంచి జీతం. ఒక రోజు నేను వేరే ఊరికి వెళ్తూ బస్టాండులో బస్ ఎక్కి కూచున్నాను. ఆ అమ్మాయి డ్యూటీ మీద పల్లెలకు వెళ్లాలి. అలా మెడికల్ కిట్ పట్టుకుని, తెల్ల చీరలో చాలా ముద్దుగా ఉంది. బస్ కోసం వెయిట్ చేస్తోంది. ఇంతలో ఒక జీపాగింది. ఇద్దరు దగ్గరకెళ్లి ఏదో మాట్లాడారు. ఆ అమ్మాయి తల అడ్డంగా ఆడిస్తూ ఎట్లాగో ఉంది. దాని తర్వాత ఇంకొకడు వచ్చాడు, ముగ్గురూ కలిసి ఈడ్చుకుపోతున్నారు. అరవడం మొదలుపెట్టింది. కానిస్టేబుల్ వచ్చాడు. నేను కూడా దిగి వెళ్లాను. అందర్లాగే సినిమా చూశాన్నేను. ఆ కానిస్టేబుల్ అన్న మాట: “ఏమే నీకేం కొత్తనా ఇది. సార్ పిలుస్తున్నాడు పో.” ఆ పాప నిస్సహాయంగా జీపెక్కి కూర్చుని వెళ్లిపోయింది. చదువుకుని, మంచి ఉద్యోగాలు చేస్తూ, వ్యభిచార వృత్తిలో బలవంతంగా పని చేస్తున్నవాళ్లు చాలామందిని చూపించగలను. చదువుకూ దానికీ సంబంధం ఉండదు. ఒకసారి ముద్ర పడ్డ తర్వాత ఎవరైనా సరే. లక్నోలో ఆమే, ఆమె పుస్తకాలు, ఆ వాతావరణం అది నన్ను వదల్లేదు, ఈ రోజుకీ నన్ను వదల్లేదు.

మనకు కనిపించని విషయాలపైకి నా టార్చ్ లైట్ ఎందుకంటే ఇందుకే. మామూలు విషయాలు చెప్పటానికి చాలామంది ఉన్నారు. జీవితాన్నీ ప్రపంచాన్నీ సౌందర్యవంతం చేయటానికీ, మనసును చల్లబరచటానికీ, ఉపశమనంగా రాయటానికీ కోట్లాదిమంది రచయితలున్నారు. నాలాంటి వాడు మధ్యలో ఎక్కడో ఉంటే తప్పేం లేదు కదా. ఇప్పుడు కాదు, ఇంకెన్ని రాసినా నేను డార్కర్ సైడ్ ఆఫ్ లైఫ్ గురించే రాస్తాను. ఈ లాబరింత్ (labyrinth) ను నేను ఎక్స్‌ప్లోర్ చేస్తూనే వెళ్తున్నాను. బయటకు దారి దొరుకుతుందేమో తెలియదు. దొరకదేమో కూడా. By the time I’ll be dead. నేను చచ్చిపోయింతర్వాత ఏమవుతానన్నది అస్తిత్వవాదం ప్రకారం నాకు సంబంధం లేదు. నా రచనలన్నీ నేను బతికుండగానే తగలబెట్టి ఎవడన్నా దాని మీద ఒంటేలుకు పోయినా కూడా నాకేం ప్రోబ్లెం లేదు. I wanted to speak out my inner self. That’s what I am doing, and I’ll be doing.

దాని కోసం నాకు ఇంకా ఇంకా ప్రపంచ జ్ఞానం కావాలి. అది సముద్రం. మనం తీసుకెళ్లే పాత్రని బట్టి మన ఇంటికి జ్ఞానం వస్తుంది. పెద్ద బిందె తీసుకెళ్తే పెద్ద బిందెడు వస్తుంది. నా దగ్గరున్న జ్ఞానం ఉద్ధరిణులతో తెచ్చుకున్నదని నేను అనుకుంటాను, హిపోక్రటికల్ గా మాట్లాడుతున్నా అనుకోకపోతే. ఒక కొత్త పుస్తకం ఒక కొత్త పేజీ చదివిన ప్రతీ రోజూ నాకు మరుగుజ్జు భావన కలుగుతుంది. ఓ నాలుగు పుస్తకాలు రాసి పారేశాం ఇక కాలరెత్తుకు తిరగొచ్చు అనే భ్రమలు నాకు లేవు. ఇప్పటికీ ఐ ఫీల్ షార్ట్. నాకు సైన్సు తెలీదు. కంప్యూటర్ నాలెడ్జి లేదు. ఇక్కడ నాకు పుస్తకాలు దొరికే సౌలభ్యం లేదు, గైడ్లు తప్ప ఏమీ దొరకవు. స్నేహితులెవరైనా వెతికి పంపిస్తే చదువుతాను. కొద్దిగా భాష రావటం నాకున్న సౌలభ్యం. ఇంగ్లీషు బానే వచ్చు, తెలుగూ కొంత తెలుసు. తద్వారా నా జ్ఞానార్జనకు మంచి మాధ్యమం ఏర్పడింది.

[ఇంటర్వ్యూ మిగిలిన భాగం వచ్చే బుధవారం]

Download PDF   ePub    MOBI

Posted in 2014, ఇంటర్వ్యూ, జనవరి and tagged , , , , , , , , , , , .

12 Comments

 1. నాకు కాశీభ్టల గురించి తెలుసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన నా జీవితాన్ని అయోమయంలోకి నెట్టేశారు. ఆయన కనక లేకపోతే .. అస్థిత్వవాదంను తవ్వుతూ గడిపేవాన్నే కాదు. ఇది ఎంత వరకూ వెళ్తుందో తెలియదు. ఒకసారి ఆయన్ని కలిశాను… మరికొన్ని సార్లు ఆయనతో ఫోనులో మాట్లాడాను. హఠాత్తుగా ఆయనపై కోపం వచ్చి .. మాట్లాడ్టం మానేశా. ఎందుకో ఇప్పటికీ అర్ధం కాదు. మళ్లీ ఒకసారి కలిసి .. దిగంతం గురించి చర్చించాలనుంది. అస్థిత్వవాదంను, బీయింగ్ అండ్ నధింగ్ నెస్ ను గురించి, కాఫ్కా గురించి చర్చించాలని అనిపిస్తోంది.
  – శ్రీనుపైండ్ల
  జర్నలిస్ట్

 2. తనను తాను ప్రదర్శించుకోవడం ఓ కళ,
  ఇంత ఆకట్టుకునే విధంగా విభిన్నతను విప్పిచెప్పడంలో
  కొంత తెలివితో కూడిన హిపోక్రసీ కనిపిస్తున్నట్లుంది.

  కథలు పెద్దగా చదవలేదు కాబట్టి ఇదోక గుడ్డి అంచనా మాత్రమే.

 3. నాకు నేనుగా కనపడే వెనక కనపడని చీకటి కోణంలోని అసలైన నేనుకు ఎదురుగా నిలుచొని చెయ్యి పట్టి మరి నను బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారండి మీరు.

  ఇప్పటి వరకు మీ పేరు వినడమే తప్ప మీ మాటలు రాతలు విన్నవి కాని చదివింది కాని లేదు. అల జరగడానికి కూడా పెద్దగ కారణాలేమి లేవనే చెప్పాలి.

  కాని మీ ఇంటర్వ్యు పుణ్యమా అని నాలోని బలమైన బలహీనమైన అనేకానేక ప్రశ్నలకి మాత్రం గట్టి సమాధానం వెతుక్కొవల్సిన అవసరం నాకెంతైన ఉందని బలంగా అర్ధమవుతుంది.

 4. నిన్న ఏదో సందర్భంగా కాశీభట్ల వేణుగోపాల్ గారితో మాట్లాడుతూ ఉంటె ” ప్రపంచం అంతా వైతరిణి లో కొట్టుకుపోతోందమ్మా ” అన్నారాయన .. ” అంతేకాదండీ … వైకల్యం లో కూడా ” అని నేను అనగానే , వొప్పుకున్నారాయన .. ఎందుకలా అన్నావు అన్నారు .. నేను మీ రచనల్ని వెనుక నుంచీ ముందుకు చదివానండీ .. అని చెప్పాను .. ఎందుకో అనుకోకుండా ‘నికషం నుండీ నేనూ-చీకటి ” చదివాను నేను . ఎప్పటినుండో ఇలాంటి ఇంటర్వ్యూ ఒకటి ఆయనతో చేద్దాం అనుకున్నాను . మెహర్ గారు చేసారు . ఇంకా కొన్ని సమాధానాల్లా కనబడే అంతరంగపు సెర్చ్ లైట్లు అయన నుండీ రావలసి ఉంది .. రెండో భాగం కోసం వెయిట్ చేస్తున్నాను .

 5. నా లాంటి వాళ్ళకి మీ ఇంటర్వ్యూ చక్కని పీఠిక లా అనిపించింది కాశీభట్ల వేణుగోపాల్ గారి రచనలను అర్ధం చేసుకోవడానికి ఈ ఇంటర్‌వ్యూ చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాాదాలు. మిగిలిన భాగం గురించి ఎదురు చూస్తూ

 6. నా లాంటి చదువరులు కాశీభట్ల వేణుగోపాల్ గారి రచనలను అర్ధం చేసుకోవడానికి ఈ ఇంటర్‌వ్యూ చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాాదాలు. మిగిలిన భాగం గురించి ఎదురు చూస్తూ…….అయ్యగారి భుజంగారావు

 7. అద్భుతమైన ముఖాముఖి.అంత వినయంగా కాశీ భట్ల చెప్పాక జ్ఞానవంతులుగా చెప్పబడేవారు తమ కన్నముందున్నవాళ్ళవోతమ కాలం వాళ్ళవో చదవడంచదవాలని తెలుసుకోవాలి

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.