SriKasi bhatla - Copy

“పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఉంటే ఇలాంటి రచనలు చేసేవాణ్ణే కాదు.” : కాశీభట్ల వేణుగోపాల్ తో ముఖాముఖి [2]

Download PDF   ePub   MOBI

ఇది కాశీభట్ల ఇంటర్వ్యూ రెండవ భాగం. మొదటి భాగం ఇక్కడ.
మీర్రాసిందంతా కవిత్వమే అనే అభిప్రాయానికి మీరేమంటారు. వచనం, కవిత్వం విభజనల్ని మీరంగీకరిస్తారా?

కవిత్వం అంటే ఏమిటనే దానికి నా నిర్ణయాలు నేను చేసుకుని ఉన్నాను. వచన కవిత్వం అనేది ఉన్నప్పుడు కవితా వచనం ఎందుకుండకూడదు? “Sound and meaning combined to convey a feeling or an idea is poetry” అన్నది కవిత్వానికి నిఘంట్వర్థం. సౌండ్ ఉండాలి… అంటే రైమ్, రిథం, ఒకలాంటి galloping, ప్రాసలు, ఉపమలు, ఉత్ప్రేక్షలు… ఇవన్నీ ఉండాలి నాకు కవిత్వం అంటే. కాళిదాసు కూడా అదే అంటాడు. రఘువంశం మొదలుపెడుతూ “వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే” అని పార్వతీ పరమశ్వరుల్ని ప్రార్థిస్తాడు. వాక్కు అంటే ‘వర్ణాత్మక శబ్దం ఇతి వాక్కు’. శబ్దం ఉండి తీరాలి కవిత్వానికి. దాంతో పాటూ అర్థమూను.

“పార్వతీ పరమేశ్వరులైన మీరు ఎలా కలిసి ఉన్నారో అట్లా శబ్దమూ అర్థమూ కలిసి నా కవిత్వంలో ఉండేట్టుగా నేను ఈ కావ్యాన్ని రాసేట్టుగా నన్ను దీవించండీ” అని ఆయన ప్రార్థన. ఆయన తన కవిత్వంలో ఈ దారి నుంచి ఎప్పుడూ తప్పలేదు. నేను రఘువంశం నుంచి ఎప్పుడూ కోట్ చేసే శ్లోకమే మళ్లీ కోట్ చేస్తున్నాను: “శ్రేణీ బంధాద్వి తన్వద్భిరస్తంభాం తోరణ స్రజమ్ సారసైః కలనిర్హ్రాదైః క్వాచిదున్నామితాననౌ”. దిలీపుడు సుదక్షిణ అడవుల్లో పోతూంటారు. అపుడు పైన మధురమైన ధ్వనితో సారస పక్షులు వెళ్తున్నాయి. మామూలుగా దూరంగా పోతున్న కొంగలు ఇట్లా “V” ఆకారంలో కనిపిస్తాయి కదా. అవి ఎట్లా ఉన్నాయని చెప్తున్నాడంటే, “స్తంభాలు లేని తోరణానికి కట్టిన పూమాలల్లా ఉన్నటువంటి ఎగురుతోన్న సారస పక్షుల ధ్వనికి (కల నిర్హాదానికి), తలలెత్తి చూసినవాళ్లై దిలీపుడు సుదక్షిణా ఉన్నారూ” అని చెప్తున్నాడు. “కొంగలెగురుతుంటే ఆ శబ్దానికి వీళ్లిద్దరూ తలెత్తి చూశారూ” అని చెప్పలేకా? కవిత్వం అంటే అలా ఉండాలని నా ఉద్దేశం.

“ఇరాక్ పై అమెరికా చర్యను ఖండించండీ”, “గుజరాత్ గాయం”, “నిర్భయ”… ఇలా రాస్తే రాయండి. శ్రీశ్రీ అనుంటే అనుండొచ్చు గాక “కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా” అని. కానీ సబ్జెక్ట్ ఏదైనా సరే అందులో కవిత్వం ఉండాలి. నా వరకూ ఉపమలూ, ఉత్ప్రేక్షలూ, శబ్దమూ లేకపోతే, అవి కవిత్వం కాదు. “నేనూ చీకటి”లో ఒక నాలుగు లైన్లు ఉంటాయి: “తప్తతమోకోణపాణీ స్థిత లుప్త తంత్రీ వీణియయై ఆమె/ ఆలాపన మరిచిన అభిశప్త గాంధర్వుడిలా నేను/ శిలారామంలో మౌనాలై మేము గాయాల గానసభలు చేస్తున్నాం” అని. నా కవిత్వం గొప్పదని కాదు గానీ, నాకు కవిత్వం ఇలానే ఉండాలి.

మళ్లా నేనే అబ్‌స్ట్రాక్ట్ కవిత్వమూ కూడా రాశాను. “ఒక బహుముఖం” చదివితే తెలుస్తుంది. కవిత్వం ఇలా ఉండాలి అని ఎవరూ సూత్రీకరించలేరు. స్థలకాలాల్ని బట్టి. నా అభిప్రాయం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను.

వ్యాకరణాన్నీ వాక్య నిర్మాణాన్నీ నిర్లక్ష్యం చేయవచ్చన్న ఎరుక ఎలా కలిగింది?

దానికి నేనివ్వగలిగిన జవాబు ఒకటే. మన జీవితం, అసలు ఇన్ జెనరల్ గా జీవితమే, ఒక పెద్ద సంక్లిష్ట వాక్యం. దానికి మొదలూ లేదు, తుదా లేదు. మనం ఎక్కడ మొదలయ్యామో మనకి తెలియదు. ఆకస్మికంగా మొదలయ్యాం మనం. పుల్‌స్టాప్ పెట్టడానికి ఏ గుర్తూ లేదు మన దగ్గర. హఠాత్తుగా ముగిసిపోతాం. ఈ మొత్తం ప్రపంచం, ఈ మొత్తం జీవితపు అమరిక… అంతా ఒక పెద్ద సంక్లిష్ట వాక్యం. మన ఆలోచన కూడా అంతే. నేను కాగితం మీద పెట్టేది నా ఆలోచన. ప్రతీ ఆలోచన పుట్టిం తర్వాత ఎన్నో శకలాలుగా విచ్ఛిన్నమై చివరకు మాయమైపోతుంది. అచ్చం ఒక మెరుపులాగనే. మెరుపు మొదలూ తుదీ మనకు తెలియదు. క్షణమాత్రం మన కళ్లముందు కనపడుతుంది. శాఖోపశాఖలుగా చీలిపోతుంది. ఎక్కడా ఖచ్చితంగా ముగియకుండానే అది ఆరిపోతుంది. హిందీలో ఒక పదం ఉంది. “కౌంద్ జానా” అంటారు. ఆరిపోవటం అని. ఎట్లా ఆరిపోవటం అంటే… ఎర్రగా కాలిన చువ్వని నీళ్లలో పెడితే “షుయ్” మని ఒక సౌండ్ వస్తుంది. మెరుపు అట్లానే ఆరిపోతుంది. మన ఆలోచన కూడా అంతే. ఏ ఆలోచన ఎక్కడ నుంచి పుడుతుందో మనకి తెలియదు. శాస్త్రీయంగా చూస్తే ప్రతీ ఆలోచనా ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్. దాన్ని ఏది ట్రిగ్గర్ చేస్తుందో మనకి సరిగా తెలియదు. ట్రిగర్ అయినపుడు అదీ ఒక మెరుపులాగే ప్రవర్తిస్తుంది. శాఖోపశాఖలైన ఆలోచనలుగా విడిపోతుంది. దాన్ని యథాతథంగా కాగితం మీద పెడితే అది వ్యాకరణాన్ని మన్నించదు. ఒక ఆలోచన ఎలా పోయేదాన్ని అలా పెట్టేస్తే అది పాఠకునికి దుగ్రాహ్యంగా అయిపోతుంది. నా రచనల్లో నేను చేసేది అదే. I want to grab everything but I am unable to do so. అది మానవ సాధ్యం కాదు. ఎవరికైనా సరే, మనిషి ఆలోచనను యథాతథంగా అనువదించటం అసాధ్యం. కానీ నేను అదే చేయటానికి ప్రయత్నిస్తున్నాను.

ఇంకోటీ… మన మెదడుకు మరపు అనేది లేదనేది నా ఉద్దేశం. ఇదో చెత్తబుట్ట. మొత్తం అంతా తనలోకి పారేసుకుంటుంది. అది ఎప్పుడు ఏ రూపంలో బయటకు వస్తుందనేది తెలీదు. మరపు అంటే కేవలం గుర్తు తెచ్చుకోలేనితనం (recollection problem) అని నా అభిప్రాయం. ఆ చెత్తబుట్టలోంచి మనకు కావలిసిందాన్ని తోడుకోవటంలో ఉన్న కష్టాన్ని మనం మరపు అనుకుంటుంటాం. కానీ ఈ మెదడు ఏదీ మర్చిపోదు. అన్నీ లోపల పడి ఉంటాయి. సైఫర్ కాబడకుండానే పడి ఉంటాయి. దాని డిసైఫరింగ్ అనేది, మళ్లీ అదో సైన్స్. Mnemonics.

నా రాతల్లో నేను విషయం నుంచి అటూ-ఇటూ పోతున్నట్టు ఉంటుంది. కానీ మూలంతో ఎక్కడో ఏదో సంబంధం ఉంటుంది. పాఠకులు అయోమయపడే అవకాశం ఉందని ఒప్పుకుంటాను. కానీ ఆ అయోమయాన్ని నేను కావాలని సృష్టిస్తున్నా అనుకుంటారు. కాదు. నేను నా ఆలోచనని ఉన్నదున్నట్టు కాగితంపై పెట్టాలనుకోవటం వల్ల అలా జరుగుతుంది. ఆలోచన యథాతథంగా పెట్టడం అంటేనే వ్యాకరణాన్ని కాలదన్నడం.

మీ నవలల్లో మీకు నచ్చిందిగా “దిగంతం” పేరు చెప్పుకున్నారు. ప్రత్యేకత ఏమిటి?

ఈ “దిగంతం”లో వాడి అమ్మంటే విపరీతమైన ఇష్టం వాడికి, ఆ వేశ్య నాగరత్న అన్నా వాడికి ఇష్టమే. ఆ నవలలో ఎక్కడా కనపడని మీనన్ అన్నా కూడా వాడికి ఇష్టమే. అలా అందర్నీ ప్రేమిస్తూనే వాడు తనదైన అస్తిత్వాన్ని కలిగి ఉంటాడు. దానికి ముందుమాటలో రాశాను, ప్రాణము వేరే, ప్రాణప్రదము వేరే అని. మా అమ్మ నాకు ప్రాణ ప్రదమైందే, కానీ ప్రాణం మాత్రం కాదు. మా అమ్మ చచ్చిపోయినంత మాత్రాన నేను ఏట్లో దూకో రైలు కింద పడో చచ్చిపోను. మనం చచ్చేవరకూ కంటిన్యూ చేస్తూనే ఉంటాం జీవితాన్ని. మనిషికి తనదీ అనేటువంటి అస్తిత్వం అత్యంత అవసరమైన మూల వస్తువు. నేను, నేను, నేను… నేను తర్వాతే సర్వ ప్రపంచమూ. దీనికి కొంచెం వ్యంగ్యం కలిపి నేను చెప్పుకుంటూ వచ్చాను. పెద్ద ఉద్యోగం పోయినా, గుమాస్తా బతుకు బతుకుతున్నా, సిగరెట్ బదులు బీడీ కాలుస్తున్నా… నేను నేనే. వాడి అమ్మతో నిరంతరం ఒక డైలాగ్ ఉంటుంది. ఆమెకు వినపడదు, మాట్లాడదు. కానీ నిరంతరం వాడు ఆమెతో మాట్లాడుతూనే ఉంటాడు. అది ఒక లౌడ్ సాలిలాక్వీ లాంటిది.

అలాగే నా మిగతా రచనలు నేనూ చీకటీ, తపనా, మంచుపూవూ వీటిల్లోలా transcending physical mundane life అనేది ఇందులో లేదు. మామూలు కింది అట్టడుగు జీవితాలు ఎట్లా ఉంటాయో అట్లానే ఉంటుంది. వాడు ఆ జీవితాన్ని తనదిగా చేసుకున్నాడు. దాన్ని దాటి పోవాలనుకోడు. వాడు రోజూ అనుకుంటూనే ఉంటాడు, పోయిన్నెల కాలెండర్ అలాగే ఉండిపోయిందని. అది అలక్ష్యం కాదు. వాడికి గతంతో ఉన్న అనుబంధాన్ని సింబలైజ్ చేయటానికి నేనది పెట్టాను. మామూలు మనిషి. సాదా సీదా మనిషి.

అంటే ఆ transcendent sphere లేకపోవటం వల్లే మీకు ఆ నవల ఇష్టమా?

అలాగని కాదు. “దిగంతం” చదివితే ఏ రీడరైనా మగవాడన్నవాడు ఐడెంటిఫై చేసుకోగలడు. అలా చాలామంది ఐడెంటిఫై చేసుకోగలిగేట్టుగా నేను అది రాయగలిగాను అనే తృప్తి నాకుంది. అందుకే నాకది ఇష్టం. నిజానికి భాషపరంగా ఇంకో పరంగా చెప్పుకోవాలంటే మళ్లీ “నేనూ చీకటే” నా కిష్టం అంటాను.

భాషాపరంగానైతేనేం, కవితాత్మకమైన గొంతు పరంగా ఐతేనేం “నేనూ చీకటి” పూర్తిగా వేరే. అది అసలు నా జాన్రా (genre) కాదని చెప్తాను. నా రచనల్లో మిగతా అన్నింటినీ ఒక పక్క పెట్టొచ్చు, నేనూ చీకటిని ఒక పక్క పెట్టొచ్చు. కారణం అందులో ఉన్న భాష, కవిత్వం, కవితా వచనం. మిగతా రచనల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను “నేనూ చీకటి”లో చూపించలేదు. వాళ్లనీ వీళ్లనీ కోట్ చేయటం అవీ ఏముండవు అందులో. ఒక్కోసారి కవిత్వం తన్నుకొచ్చేస్తే అలాగే పేజీలకు పేజీలు వచ్చేస్తుంది. అందుకే “నేనూ చీకటి”లో కథ గోలీమార్, కథ అంటూ ఏమీ లేదు. చీకటి గురించి చెప్పాలనుకున్నది చెప్పానంతే. చీకటి అంటే గలీజు, అసహ్యం అని కాదు. నా అజ్ఞానం. మనకు తెలియనితనం. మరుక్షణం ఏమిటనేది మనకు తెలియదు.

కానీ దిగంతం మాత్రం నేను చూసిన జీవితం. వాతావరణం మాత్రం కొద్దిగా వేరే. అంతే. నిజానికి అలాంటి వాతావరణంలోనూ నేను చాలా రోజులు బతికాను. అంతేగాక, కె.ఎన్.టి శాస్త్రి ‘దిగంతం’ నవలని సినిమా చేస్తానని వచ్చినపుడు, మేం ఇద్దరం కూర్చుని దాన్ని స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు, దాన్ని సీన్ బై సీన్ అనలైజ్ చేస్తూ రాస్తున్నప్పుడు… I fell flat for my own self. ఆర్ట్ ఫిలింస్ తీస్తుంటారుగా, పూరి గుడిసెను అత్యంత సౌందర్యవంతంగా amber light లో చిన్న దీపం పెట్టేసి లేదా చిన్న మంట పెట్టేసి ముగ్గురూ దగ్గరగా కూర్చున్నట్టుగా దరిద్రాన్ని రొమాంటిసైజ్ చేస్తూ అశోక్ సింఘాల్ ఫొటోలా… అలా అరె భలే చేశావే అని నా భుజం నేనే తట్టుకున్నాను.

మీ పాత్రలు కొన్ని అవే వేర్వేరు పేర్లతో వేర్వేరు నవలల్లో కొనసాగుతున్నట్టు అనిపిస్తాయి. “నేనూ చీకటి”లో భగవాన్లు, “నికషం”లో అలెక్స్ రామ సూరి.

అవును. ఆ రెండు పాత్రల మధ్యా ఉన్న సంబంధం గురించి నేనూ చెప్పాలనుకుంటున్నాను. నాకున్న గట్టి నమ్మకం ఏంటంటే, ఈ భూమ్మీద ప్రతీ ఒక్కరూ అనాథే. బయలాజికల్ గా తల్లులూ, తండ్రులూ, అక్కలూ, అన్నలూ ఉండొచ్చు. వివాహం ద్వారా భార్యా పిల్లలూ ఉండొచ్చు. కానీ మనిషి ఎప్పుడూ ఒంటరే. ఆ భావన అతన్ని పూర్తిగా ఎప్పుడూ వదిలిపోదు. ఒక్కోసారి కావాలనే ఆ భావనను మీదికి తెచ్చుకుంటాడు. మనకెవ్వరూ లేని క్షణాలు సందర్భాలూ చాలా తగులుతుంటాయి జీవితంలో. ఎవరన్నా ఆసరా దొరికితే బాగుండు అనిపిస్తుంది. ప్రతీ ఒక్కరికీ ఉంటాయి ఈ క్షణాలు. ఈ అనాథ కారెక్టర్స్ వెనుక మూలం ఆ క్షణాలే.

ఈ రెండు పాత్రలకీ మధ్య పోలికలు కూడా బాగా కలుస్తాయి. వాడూ అనాథే, వీడూ అనాథే. వాడు కుప్ప తొట్టెలో దొరికాడు, వీడు రొచ్చు మోరీ దగ్గర, వాడికి స్ఫోటకం, వీడికి బొల్లి. భగవాన్లు లిటరేచర్ లో దిట్ట, రామసూరి పెయింటింగ్లో, మ్యూజిక్ లో దిట్ట.

నాలో ఉన్న డార్కర్ సైడ్స్ కి మూర్త రూపమే భగవాన్లు. అవి నాలోనూ నేను భరించలేనివి. వాటిని తుడిచేయాలనుకున్నాను. అందుకే భగవాన్లను చంపేశాన్నేను. (Neal Cassady లాగా: అతను కూడా నలభయ్యీ నలభై రెండేళ్ల వయస్సులో ఒక రైల్వే ట్రాక్ మీద చచ్చిపడి కనిపించాడు.) అలా వాణ్ణి చంపేశాక ఒక విధమైన catharsis… ఇప్పుడు నేను పరిశుభ్రపడ్డాను అన్న మిథ్యా భావన. అది రాసిన ఇరవై రెండేళ్లకు నేను “నికషం” రాశాను. ఈ మధ్యనున్న కాలంలో నాకు నా గురించి మరింతగా తెలియసాగింది. ఇప్పటికీ నాకు తెలియని నన్ను నేను వెతుక్కుంటూనే ఉన్నాను, కనుక్కుంటూనే ఉన్నాను. ఆ వెతుకులాటలో, ఆ దేవులాటలో, ఆ దొమ్మీలో కొంత రియలైజేషన్ నాకు కలిగింది. Bhagavanlu cannot be killed. భగవాన్లు చావడు, వాడు నాతో పాటూ నా సమాధి దాకా వచ్చి తీరతాడు. అలా వాడు ఫీనిక్స్ లా మళ్లీ పైకి లేచి అలెగ్జాండర్ రామసూరి అనే పేరు తొడుక్కున్నాడు. వాడు చంపబడడు అన్న నిజం ఇప్పుడు తెలుసు కాబట్టి “నికషం”లో నేను వాణ్ణి దూరంగా పంపేశాను. అదీ ఆ రెండు పాత్రల మధ్యా ఉన్న సంబంధం. ఇరవై ఏళ్లుగా నేను నడుచుకుంటూ వచ్చిన దారుల్లో నాకు తెలిసిందేమిటంటే, మనలో చీకటి తత్త్వం చచ్చిపోదు, అది మనతో పాటూ చావాల్సిందే.

మీరు రచనల్లో వేరే రచయితల, సంగీత కారుల, పెయింటర్ల పేర్లు ఎక్కువగా కోట్ చేస్తుంటారుగా. దాన్ని వట్టి నేమ్ డ్రాపింగ్ అనుకునే అవకాశం ఉందని మీకనిపించలేదా?

అనుకోవడం కాదు, అంటున్నారు. ఈ రోజుకీ అంటున్నారు. I never bothered about the reader. పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఉంటే ఇలాంటి రచనలు చేసేవాణ్ణే కాదు. నేను ఇంకో పాపులర్ రైటర్ అయి ఉండేవాణ్ణి. నేను చెప్పాలనుకున్నది నా దైన పద్ధతిలో చెప్పటానికి సిద్ధపడిన తర్వాతనే కలం పట్టాను. నేను కొద్దిమంది పాఠకుల్నే రీచ్ అవుతానని నాకు తెలుసు కూడా. “నేనూ చీకటి” ప్రచురణ కోసం ఏడేళ్లు ఆగాల్సి వచ్చినపుడే ఆ సంగతి నాకు అర్థమైంది. వాకాటి పాండురంగారావు అద్భుతమైన నవల అన్నాడు చిత్తుప్రతి చదివి. కానీ ప్రచురించే ధైర్యం చేయలేకపోయాడు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ నాలుగేళ్లు పెట్టుకున్నాడు. ఆయనా ధైర్యం చేయలేదు. కానీ ఆయన హయాంలోనే ఏదో పోటీ పెడితే, వెంకట కృష్ణ అని ఒకాయన దాన్ని తిరగరాసి పంపించాడు. జడ్జీలందరూ ఔట్ రైట్ రిజెక్ట్ చేసేశారు. కానీ వల్లభాచార్యులు అసిస్టెంట్ ఎడిటర్ గా ఉండేవాడు. ఆయన శ్రీకాంతశర్మతో కూర్చుని ఈ నవల టేబిల్ మీద పెట్టుకుని, “తెలుగు సాహిత్యానికి ఇది ఒక విలక్షణమైన రచన. గొప్పదో దిబ్బదో మనకు తెలియదు. నువ్వూ నేనూ ఎలాగూ వెళిపోతున్నాం. వెళిపోయేలోపులో ఈ నవల మనం సీరియలైజ్ చేయాలి” అన్నాడు. అప్పుడు ఇంద్రగంటి కూడా చదివాడు. చదివి… ఫిరంగి పేల్చినట్టుగా పేల్చాడు. మొదటి పేజీలో విషయ సూచిక, అది కాంగానే రెండు పేజీల కలర్ ఇల్లస్ట్రేషన్‌తో “నేనూ చీకటి” ప్రకటన… బాంగ్! మూడువారాల పాటు కలర్లో ఫుల్ పేజీలు ప్రకటనలిచ్చాడు. తర్వాత ఆయన అట్లాంటాకు వెళ్లినప్పుడు అక్కడ “నేనూ చీకటి” గురించి గంటసేపు మాట్లాడాడు.

ఇదే ఊపులో నేను “తపన” పంపాను ఆయనకి. గోడకి కొట్టిన బంతిలాగా వెనక్కు వచ్చింది. చిన్న ఉత్తరం కూడా రాశాడు. “ముళ్లకిరీటాన్ని ఎవరైనా ఒక్కసారే ధరిస్తారు. రెండోసారి నా వల్ల కాదు స్వామీ మీకు నమస్కారం” అంటూ. ఈలోగా నా స్నేహితుడు షౌకత్ అలీ “నేనూ చీకటి”ని పబ్లిష్ చేయటం, గుంటూరు శేషేంద్ర శర్మ ముందు మాట రాయటం ఇవన్నీ జరిగాయి. ఈలోగా స్వాతి నవలల పోటీ ఏదో పెడితే మళ్లీ ఆ స్నేహితుడే తాను చదువుతానని తీసుకున్న “తపన” చిత్తు ప్రతిని రీరైట్ చేసి పోటీకి పంపించాడు. అక్కడ పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారికి అది నచ్చింది. డెభై ఒక్క నవలల్లోంచి దాన్ని ఇంకో రెండు నవలల్నీ కలిపి ఎంపిక చేసి అక్కడ జంపాల చౌదరికి పంపాడు. వృత్తిరీత్యా సైకోఅనలిస్ట్ అయిన ఆయనకి ఇందులో సైకో అనాలసిస్ నచ్చటంతో ఆ లక్షరూపాయలు వచ్చాయి. “తపన” ఆవిష్కరణ సభలో శేషేంద్ర, శివారెడ్డి, జయప్రభలతో పాటూ శ్రీకాంతశర్మ కూడా ఉన్నాడు. అప్పుడు నేను మాట్లాడుతూ “ఆ రోజు దీన్ని మీరు వెనక్కి పంపకపోయి ఉంటే నేను లక్షాధికారిని అయ్యేవాణ్ణి కాదండీ శ్రీకాంతశర్మ గారూ” అన్నాను. “అందుకోసమైనా నన్ను నువ్వు గుర్తుంచుకుంటావు కదయ్యా జీవితకాలం” అన్నాడాయన సరదాగా.

కొంతమంది రచయితల పేర్లు చెప్తాను (మీ దగ్గర తరచూ విన్నవి). వెంటనే మీక్కలిగే భావం చెప్పండి. What they mean to you, or what they represent to you అన్నది.

Franz Kafka: He can never be solved. He is a mystery,a mist. He wrote with a very thick mask. కాఫ్కానే బతికొచ్చి చెప్తే తప్ప, మనకు కాఫ్కా ఏం రాశాడో పూర్తిగా ఎప్పటికీ అర్థం కాదు.

Milan Kundera: He is ala Kafka & Very bold. చాలామంది కాగితం పై పెట్టడానికి జంకే విషయాలను కూడా ఎంతో ఫ్రీగా రాసేయగల్గిన అద్భుతమైన ఊహాకారుడు.

Khalil Gibran: ఆయన్ను అందరూ గొప్ప తత్త్వవేత్త అంటారు. కానీ నా వరకూ ఆయన గొప్ప చిత్రకారుడు. గొప్ప ప్రేమికుడు. చూడనిదాన్నీ, తెలియనిదాన్నీ ఎలా ప్రేమించగలవు. ఆయన జియాదాకు రాసిన ప్రేమలేఖల్లో అది వ్యక్తమవుతుంది. చాలా త్వరగా చనిపోయాడు, కానీ సంపూర్ణంగా జీవించాడు.

Philip Roth: Again, he is the boldest. I wish I could write like him.

Vladimir Nabokov: Victorian Russian American writer. హాలీవుడ్ హీరో అంత అందంగా ఉంటాడు. నికొలస్ కేజ్ ముఖం చూసినపుడు నబొకొవ్ ముఖం గుర్తొస్తుంది. మొదట్లో ఆయన భాషతో నాకు ఇబ్బంది ఉండేది. Highly victorian english. పదే పదే నిఘంటువు దగ్గరకు పరిగెత్తేవాణ్ణి. తర్వాత్తర్వాత నా భాషా జ్ఞానం పెరిగే కొద్దీ అలవాటయ్యాడు. “లొలీటా” చదివినప్పుడు ఒక ఫిడోఫీల్ ని ఇంత రొమాంటిసైజ్ చేయొచ్చా అనిపించింది. అలాగే ఆయన రచనల్లో ఆ థీం చాలాసార్లు రిపీట్ అవుతుంది కూడా.

వీళ్ల ప్రస్తావన వచ్చింది గనుక నేనొకటి గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. నబొకొవ్ లాగా, కాఫ్కాలాగా, కుందేరా లాగా తెలుగులో ఎవరన్నా రాయగలిగిన వాళ్లు వచ్చిన రోజున తెలుగు సాహిత్యానికి సంకెళ్లు తీరిపోతాయని నిర్ద్వంద్వంగా చెప్తాను.

కొంతమంది తెలుగు రచయితల పేర్లు…

శ్రీశ్రీ: He is a man who capitalized communism all through his life. నేనాయన్న ‘చీనిగాడు’ అన్నా ఏదో నవల్లో. మరి ఆయన విశ్వనాథను పట్టుకొని ‘విస్సిగాడు’ అన్లా! కానీ ఆయన మంచి కథకుడు.

చలం: In the name of feminism he wrote sexual liberalism. మగవాడి విశృంఖల కామనకు స్త్రీ ఎలా ఉంటే బాగుంటుందో అలా చూపించాడు ఆమెను.

శేషేంద్ర: అందమైన కవి. కానీ ఎక్కడో దారి తప్పాడు. నిజమైన గుర్తింపు రాలేదని చనిపోయే వరకూ బాధపడ్డాడు. ఆయన చేసిన బ్లండర్ ఏమిటంటే, తాను రాసిన కవిత్వమంతా ఒక సంకలనంగా తీసుకొస్తూ ‘ఆధునిక మహాభారతం’ అని పేరు పెట్టడం, ‘కవి సేన మానిఫెస్టో’ రాయటం ఒకటి. ఇవన్నీ తప్పిస్తే ఆయన మంచి కవి. భాష మీదా, హిందూ సంస్కృతి మీదా మంచి కమాండ్ ఉన్న వ్యక్తి. రామాయణం మీదా, వాల్మీకి మీదా ఆయన పరిశోధనలు చాలా గొప్పవి. ఆయన మంచి అకడమిషియన్ కూడా. కవిత్వంలో ఇమేజరీ బాగుంటుంది. రోమ్ లో ‘వీనస్ డి మెల్లొ’ విగ్రహాన్ని చుస్తూ (ఆ పాలరాతి శిల్పంలో కళ్లు రెండూ సరిగా ఉండవు), “కన్నులా కావవి మిన్నులు విరిగిన రెండు నీలి శకలాలు ఏ దిక్కులకో” అంటాడు. మంచి కవి, మంచి గీత రచయిత కూడా. “అటు చూడ వనమ్మంతా, ఇటు చూడు జగమ్మంతా, ఎటు చూడు రంగేళీ పూల సంత” ఇలా మంచి gallop ఉన్న గీతాలు కూడా రాశాడు.

విశ్వనాథ: పండితుడు. అతను గ్రాంథికంలో రాసినవి చాలామందే చదివారు గానీ, శుద్ధ వ్యావహారికంలో రాసినవి చాలావరకు బయటకు రాలేదు.

ఛందోబద్ధమైన కవిత్వం అతని నాభి నుంచి వస్తుంది. నేను విన్న దాని ప్రకారం ఆయన పద్యాలు చాలా వరకూ ఆశువుగా చెప్తుంటే వేరే వాళ్లు రాసినవి. అంటే ఆయన పేర్చుకుంటూ రాసే కవి కాదన్నమాట. ఆయనలో కవిత్వం సహజంగా ఉండి ఉండాలి. దాన్ని ఛందోబద్ధంగా కూడా చెప్పగలుగుతున్నాడంటే, పాండిత్యం కూడా కలిసి ఉండాలి. ఫలానా పదం ఫలానా దగ్గరే పడుతుందంటే అతను నిఘంటువులు నిఘంటువుల్నే మింగేసి ఉండాలి.

త్రిపుర: ఆయనతో నేను ఆయన ఇంట్లో గంట గడిపాను. కాఫ్కా పట్ల ఆయనకున్న అబ్సెషన్ నాకు చాలా కుతూహలంగా అనిపించింది. నేను ఆయన్ని కలవటానికి వెళ్లినపుడు ఒకే ప్రశ్న వెంట తీసుకెళ్లాను. కాఫ్కా పట్ల మీకంత అబ్సెషన్ ఎందుకు? ఎందుకు అన్నీ కాఫ్కాకి అట్రిబ్యూట్ చేస్తారు? అని. ఆ అరవై చిల్లర నిముషాలూ ఆయన్నుంచి జవాబు రాబట్టడానికే ప్రయత్నించాను. కానీ ఆయన ఏ జవాబూ చెప్పలేదు. నాకు చాలా డిసప్పాయింటింగా అనిపించింది. ఆయన “జర్కన్” కథ నాకిష్టం. “పాము” కూడా. He is a good writer, recognized by writers again. అతనికి సామాన్య పాఠకులు ఉండరనుకుంటాను.

మీ రచనల్లో చావు చుట్టూ చాలా సంరంభం ఉంటుంది.

చావు జీవితంలో భాగమే. చీకటి లేకపొతే వెలుగు లేదు. రాహిత్యం ద్వారానే అస్తిత్వానికి ఉనికి. చావు ద్వారానే జీవితానికి అసలైన ఉనికి. “అస్పష్ట చిత్రం” అనే కథలో రాశాన్నేను. ఒక బల్లి మిడతను పట్టుకున్న దృశ్యాన్ని ఒకడు చూస్తూంటాడు. ఏం చూస్తున్నావూ అంటే వాడంటాడు, “మరణపు అస్తిత్వాన్ని” అని. మిడతను తినటం బల్లికి కావాలి. బల్లినుండి తప్పించుకోవటం మిడతకు కావాలి. దానికి జీవం దీనికి మరణం. కాబట్టి జీవితానికీ మరణానికి చాలా దగ్గరి లింకు వుంది.

నా రచనల్లో దాన్ని ఒక catharsis గా వాడుకుంటాను. “నేను చీకటి” లో భగవాన్లను చంపాను. “దిగంతం”లో నాగరత్నను, అమ్మను చంపాను. “రంగులగది”, “మంచుపూవు”ల్లోనూ చావులున్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చి నా రచనల్లో చేరుతున్నాయీ ప్రశ్నకు నేనూ ఖచ్చితంగా జవాబివ్వలేను. తెలీకుండానే అలా జరుగుతోందేమో అనిపిస్తుంది.

రాయకుండా మిగిలిపోయిన పెద్ద ఇతివృత్తం లాంటిదేమైనా మిగిలిపోయిందా?

చెప్పలేనండి. బహుశా ఇదే నా ఆఖరు ఇంటర్వ్యూ కూడా కావొచ్చేమో. నేను చూసింది, రాయకుండా మిగిలిపోయిందీ ఇంకా చాలా ఉంది. కానీ అందులో చెప్పదగినవీ, నేను అక్షరాల్లోకి ఒదిగించగలిగినవీ చాలా తక్కువ. సగటు మనిషిని నేను. గొప్ప గొప్ప ఘటనలేవీ నా జీవితంలో ఘటించలేదు. మామూలు సాదా సీదా third rate drunkard నేను. నేను చూసిన జీవితాన్ని కొద్దిగా పాలిష్ చేసి, అందంగా చూపియ్యటానికి ప్రయత్నిస్తాను. ఏదో ఉద్గ్రంథం రాసేయ్యాలని ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ లేవు. మీరు గమనిస్తే, నా పుస్తకాలేవీ వందపేజీలు దాటవు. నేను చెప్పదల్చుకున్నది అంతా కండెన్స్‌డ్ గా ఉంటుంది. I hurry towards the end. చివరి వాక్యం కోసం పరిగెడుతుంటాను. అక్కడికి వచ్చాకా ‘ఆహ్’ అన్న రిలీఫ్.

నేను ఏదీ సాఫు చేసి తిరిగి రాయను కూడా. ఒక్క “రాళ్లెత్తిన కూలీ” అన్న కథ తప్ప, నేను ఏదీ మళ్లీ తిరిగి రాయలేదు. నాకు దొరికిన ఎడిటర్స్ పుణ్యమాని రాసింది రాసినట్టుగా, ఒక్క అక్షరం కూడా ఎడిట్ కాకుండా బయటకు వచ్చాయి.

ఫిక్షనల్ ఆబ్లిగేషన్స్ లేని ఆత్మకథ ఏమైనా రాయాలని లేదా?

లేదు. ఎందుకంటే ఆత్మ కథలన్నీ దొంగ కథలే అనిపిస్తాయి నాకు. శ్రీశ్రీ ‘నేను అనంతం పచ్చిగా రాసేశాను’ అనుకునుండొచ్చు. ఆయన తన లైంగిక సంబంధాల గురించి రాయటం ద్వారా తన ట్రాన్స్‌పరెన్సీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు. కాని అతను నిజంగా ట్రాన్స్‌పరెంట్ గానే ఉన్నాడా? కమ్యూనిజం గురించి ట్రాన్స్‌పరెంట్ గా లేడు. శ్రీశ్రీ కమ్యూనిస్టని నాకెప్పుడూ అనిపించదు. అతని రచనల్లో కమ్యూనిజం ఉండొచ్చు. కానీ శ్రీశ్రీ ప్రవర్తనలో ఎప్పుడూ కమ్యూనిస్టు కాదు. అది చాలామంది ఎత్తి పొడిచారు కూడా.

నా వరకూ నేను ఆత్మకథ రాసేంత పెద్దవాణ్ణి కాదు.

మిమ్మల్ని చదవటం కష్టమని పక్కనపెట్టేసే వాళ్లు ఎక్కువే గానీ, కష్టపడైనా చదివిన వాళ్లలో మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలన్నంత గాఢాభిమానం పెంచుకునేవాళ్లూ ఎక్కువే. వాళ్లని ఏది మీ వైపు లాక్కొస్తుందని మీ కనిపించింది?

అది వాళ్లనే అడగాలి. మీరన్నది నిజమే. అది సంతోషమే. ఉన్న కొద్దిమంది పాఠకులూ ఈ సంబంధాన్ని పర్సనలైజ్ చేస్తుంటారు. కొందరు నన్ను ఓన్ చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. అది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. “మీరు ఇది రాయండీ అది రాయండీ” అని, “మీరు అట్లా తాగొద్దూ” అని పెర్సనల్ జీవితంలోకి తొంగి చూసినపుడు మాత్రం ఇరిటబుల్ గా అనిపిస్తుంది.

What does writing mean to you? ఇంత జీవితాన్ని అక్షరానికే అంకితం చేసుకోవటం… is it worth it అని ఎప్పుడైనా అనిపించిందా?

నా ఇంటికి ‘అక్షరం’ అని పేరు పెట్టుకున్నాను నేను. అందులోనే నాకు రచన పట్ల ఉన్న కన్విక్షన్ తెలియాలి.

Worth it అన్న ప్రశ్న ఎప్పుడూ రాలేదు. నేను డబ్బులు సంపాదించుకోలేకపోయాను, వివాహ బంధాన్ని వద్దనుకున్నాను. అది నాకు చాలా సాయం చేసింది కూడా. అలాగని నేను వివాహ వ్యవస్థని తిరస్కరిస్తున్నా అని కాదు. అదంటే నాకు చాలా గౌరవం. అందుకే ‘తపన’ రాయగలిగాను. ‘మంచుపూవు’ రాయగలిగాను.

రచనకీ వివాహానికీ క్లాష్ వస్తుందనుకున్నారా?

తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎవరికైనా సరే అది తాడు మీద నడక లాంటిదే. నాకు ఆ బాలెన్స్ లేదని బాగా తెలుసు. అదేగాక, నా తాగుడు, నా భ్రమణ కాంక్ష, ఆ కాంక్ష కారణంగా నేను ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కొన్ని బట్టలు సంచీలో వేసుకుని భుజాన తగిలించుకుని వెళిపోవటం… ఇవన్నీ ఒక పెళ్లయిన మనిషికి వీలయ్యేవి కావు. ఒక కళాకారునికి పెళ్లి వల్ల వచ్చి తగిలే అదనపు బరువులన్నీ చాలా కఠినమైనవీ, అడుగడుగునా అడ్డు తగిలేవీను.

వారసత్వ ఇచ్ఛ, మన రక్తాన్ని భూమ్మీద వదిలిపోతున్నాం అనే భావన… ఆ లోటేమీ స్ఫురించదా?

ఆలోచన అన్నది తనత్నాను బలపరుచుకుని పునాదులు వేసుకుని మేడలు కట్టుకున్న తర్వాత ఆ అవసరం సెకండరీ అయిపోయింది. దాన్ని ప్రయారటైజ్ చేయాల్సిన అవసరం లేకపోయింది.

నేను చనిపోయాకా నా బిడ్డలుంటారు అనే భావనను, నేను చనిపోయాకా అక్షరాలో పుస్తకాలో ఉంటాయి అనే భావన substitute చేయగలదా?

నేను చనిపోయిన తర్వాత నా వరకూ ప్రపంచపు ఉనికి కూడా నశించిపోయినట్టే. తర్వాత ఇక నా బిడ్డలా, నా పుస్తకాలా, నా… “నా” అన్న ఇది లేకుండా పోతుంది. నేను అన్న భావన నశించాకా దాని తర్వాత ఏం జరుగుతుందనేది అనవసరం. నాకట్లా ఏం లేదు. నా పుస్తకాలు ఉన్నా పోయినా నాకేం లేదు.

ఒకాయన అన్నారు, “ఏం సార్ మీరు కూడా అందర్లాగే నేనుండంగానే పబ్లిష్ కావాల అంటారూ” అని. అవును మరి, నేనున్నంతవరకే నా లోకం, నేను చూసుకోవాలి నా పుస్తకాన్ని.

నిజం చెప్పాలంటే, మా నాన్న నన్ను వారసత్వంగా వదుల్తున్నాన్న తృప్తితో పోయాడా? ఆయన నా ఉనికినే అసహ్యించుకున్నాడు. ఆయన బ్రాహ్మణత్వాన్నీ, పౌరోహిత్యాన్నీ నేను కొనసాగించలేదని చనిపోయేంతవరకూ తీవ్రమైన నిర్వేదానికి గురయ్యాడు. అందరూ అనుకుంటారు తప్పించి, ఎవడూ తల్లిదండ్రుల లక్షణాల్ని తీసుకుని రాడండి. ఎవడి బతుకు వాడు బతుకుతాడు. ఎవడి ప్రపంచం వాడిది.

పుస్తకాలు వదిలిపోవడం, విగ్రహాలు వదిలిపోవడం ఇదంతా నాన్సెన్స్. శ్రీశ్రీ విగ్రహం పెడితే ఆయనకేమన్నా తెలుస్తుందా. దాని మీద పావురాలు రెట్టేయచ్చు, కాకులు రెట్టేయచ్చు. లేకపోతే ఎవడో వచ్చి మెళ్ళో చెప్పుల దండలో, టైర్ ట్యూబులో వేయచ్చు. మొత్తానికి విరగ్గొట్టినా విరగ్గొట్టచ్చు. అవన్నీ వాళ్లకు అంటుతాయాండి? వాళ్లతోనే వాళ్ల ప్రపంచం తుడిచిపెట్టుకుపోయింది.

ఉన్నంతవరకైనా…

ఉన్నంతవరకూ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇది నా రచన అనే భావన. మొన్నే ఎవరో ఈ రాతల వల్ల డబ్బులొస్తాయా అనేదో అంటే అన్నాను. “డబ్బులేముందండీ! నా జేబులో వెయ్యి రూపాయలు మీ జేబులోకొస్తే మీదవుతుంది. కానీ నా పుస్తకం మీ దగ్గరకు వచ్చినా అది కాశీభట్ల వేణుగోపాల్ పుస్తకమే అవుతుంది.” అని గర్వంగా చెప్పాను. నా రచనలు పరమ చెత్త రచనలే అయి ఉండొచ్చు గాక, వాటిని తీసుకెళ్లి మీ జాబితాల్లో అట్టడుగున పెడితే పెట్టొచ్చు గాక… కానీ అవి నావి. నేను గర్వంగానే ఫీలవుతాను.

*

Download PDF   ePub   MOBI

Posted in 2014, ఇంటర్వ్యూ, జనవరి and tagged , , , , , , , , .

18 Comments

 1. ఎంతో గొప్ప ఇంటర్వ్యూ కామెంట్ చేసే అర్హత కూడా నాకు ఉండి ఉండదు . కానీ ఒక గొప్ప కవితో కథో చదివినప్పుడు కలిగే భావోద్వేగం ఈ మాటల ద్వారా కూడా కలిగింది . నిజమే , తమలోని చీకటి కోణాల్నిచూపించుకునే దైర్యం అందరికీ ఉండదు . ఆ ధైర్యంతో పాటుగా మంచి పాండిత్యం కూడా ఆయన సొంతమని అర్థమవుతోంది . ఎప్పటికైనా చదవాలి ఆయన రచనలు .

 2. మెహెర్ గారూ- నేను కాశీభట్లవేణుని గత 5 ఏళ్ళు గా ఎరుగుదును. ఆయనతో చాలసార్లు ఫోనులో మాట్లాడాను. మీ ఇంటెర్వ్యూ చదివాక, మీరు ఆయన నుంచి చాలా అతి సున్నితమైన విషయాలని గాలం వేసి వెలికి తీసుకునే ప్రయత్నం నాకు స్పష్టం గా కనిపిస్తూంది. ఆయన సమాధానాలు ఎప్పటిలానే సూటిగా, స్పష్టంగా, నిర్భయంగానే ఉన్నాయి. మొత్తానికి చాల మంచి ఇంటెర్వ్యూ. ధన్యవాదములు.

 3. నేను చనిపోయాకా నా బిడ్డలుంటారు అనే భావనను, నేను చనిపోయాకా అక్షరాలో పుస్తకాలో ఉంటాయి అనే భావన substitute చేయగలదా?…lovely lines

 4. ఎవరిని ఎటువంటి ప్రశ్నలు అడగాలో తెలిసిన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే , ఇదుగో ఇలా ఉంటుంది.
  ఇంటర్వ్యూ చాలా నచ్చింది. హిపోక్రసీ లేని, నిజాయితీతో కూడిన జవాబులు. చీకటీ, చెత్తా, అసంబద్హం , సమాజద్రోహం అంటూ జనాలని ఎంతైనా గొంతు చించుకోనివ్వండి , కానీ నా మట్టుకు నాకు కాశీభట్ల గారు మనిషి లోపలి చీకటి కోణాలని ధైర్యంగా బయటకు చెప్పగలిగిన ఒక సాహసి. అది జనాలు బరితెగింపు అన్నా, తెంపరితనం అన్నా సరే. ఒకరికి నష్టం చెయ్యకుండా తన బ్రతుకు తనకి నచ్చినట్టు బ్రతకడానికి ఎంతో ధైర్యం, తనదైన జీవితం మీద ఎంతో అవగాహనా ప్రేమా కావాలి. అవన్నీ కావలిసినదానికన్నా మించి ఉన్న వ్యక్తి ఈయన. ఆయన మీద నాకు అభిమానం, గౌరవం ఇంకా పెరిగింది ఈ ఇంటర్యూ చదివాక.

  మంచి పరిచయాన్ని అందించిన మెహర్ గారికి కృతజ్ఞతలు.

  • చాలా కరెక్టుగా చెప్పారు, పద్మవల్లి గారు! ఇంటర్‌వ్యూ చేసే వారి ప్రమాణాలు, స్థాయి బట్టే, ఇంటర్‌వ్యూ విలువ కూడా పెరుగుతుంది.

   శ్రీ శ్రీ మీద, చలం మీద కాశీభట్ల గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకిభవిస్తాను.

   – మురళి

 5. కాశిభట్ల గారిని కలవగలనో లేదో తెలియదుగాని మెహర్ గారు ! ,నేనుఉన్నంతవరకైనా,నేను చనిపోయాకా అన్నమీ ప్రశ్నల కి వారు ఇచ్చిన సమధానం, ,జీవితం గురుంచి వారు చెప్పిన మాటలు వెరసి ఆత్మశోధన అనేది తప్పకుండా కలుగుతుంది. అది నాకు పర్సనల్ గా కలిగిన అనుభూతి

 6. నేను చనిపోయిన తర్వాత నా వరకూ ప్రపంచపు ఉనికి కూడా నశించిపోయినట్టే. తర్వాత ఇక నా బిడ్డలా, నా పుస్తకాలా, నా… “నా” అన్న ఇది లేకుండా పోతుంది. నేను అన్న భావన నశించాకా దాని తర్వాత ఏం జరుగుతుందనేది అనవసరం. నాకట్లా ఏం లేదు. నా పుస్తకాలు ఉన్నా పోయినా నాకేం లేదు.__________________ Excellent!! చాలా బాగుంది ఇంటర్వ్యూ!

 7. First time I saw him on ’10tv Aksharam’ program; where he talks on Chalam’s literature. Now reading this interview makes my hour this day.
  I have to say about questions also. The asker cannot ask this type of great questions unless he is a serious and special person

 8. కాశీభట్ల గారి ఇంటర్వ్యూ నిజంగా చదవడం ఒక అద్బుతం… ఇది కూడా కాశీభట్ల కొత్త నవలనే… ఒకరికి చెప్పేది కాదు .. ఎవరికీ వారు చదివి, అందులోని భావాన్ని అనుభవించాలి..

 9. //నేనాయన్న ‘చీనిగాడు’ అన్నా ఏదో నవల్లో. మరి ఆయన విశ్వనాథను పట్టుకొని ‘విస్సిగాడు’ అన్లా! కానీ ఆయన మంచి కథకుడు.// నేను వెదుకుతున్న దానికి నాకు సమాధానం దొరికింది. ఇది తపన నవల్లోది. అలాగే చాలా మంచి ఇంటర్వ్యూ. మంచి ప్రశ్నలు అడిగినందుకు అభినందనలు మెహర్ గారూ. బోలెడన్ని థాంక్స్.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.