anadam oka pravrutti

ఆనందమనేది ఒక ప్రవృత్తి

Download PDF

“జీవితం బోర్ దొబ్బేస్తుందిరా అబ్బాయ్” మరలా అనేసాడు సాగర్. ఈ నెలలో రెండువేల పదమూడోసారి ఇదే ముక్క వాడనటం. నిజానికి వాడికే కాదు నాకు కూడా రోజుకోసారన్న ఈ ముక్క అనుకోవటం పరిపాటి. అనుకోవటానికి మాకు పెద్ద కారణాలు కూడా అవసరం లేదు. ఉదయాన్నే ఆఫీసులో బండెడు వర్కున్న, అస్సలు వర్కులేక ఊసుపోకపోయినా,  జీతం పెరిగినా పెరగకపోయినా,  ప్రమోషన్ వచ్చినా రాకపోయినా,  వర్షం పడకపోయినా, సమయానికి రావాల్సిన ట్రైన్ రాకపోయినా,  ట్రాఫిక్ సిగ్నల్లో ఇరుక్కుపోయినా చిరాగ్గా టీకొట్టుకి వెళ్ళి ఒక చాయ్ చెప్పి “చీ దీనెమ్మ జీవితం బోర్ దొబ్బేస్తుంది బాబాయ్” అనుకోవటం ఒక అలవాటు. కాదు కాదు ఒక వ్యసనం.  మందు తాగటం, సిగరెట్ కాల్చటంలానే ఇది మా వ్యసనం. మేనేజ్‌మెంట్ పాఠాల్లో చెప్పినట్టు మనకున్న కసిని, కోపాన్ని ఇలా బయట పెట్టేస్తే, మనసంతా హిమాలయాల్లో తపస్సు చేస్తే వచ్చేంత ప్రశాంతతతో నిండిపోతుంది.

ఈ రోజు రాహువు, కేతువులు నా రాశిచక్రమనే రిసార్ట్‌లో ఏ ఏ గదుల్లో మకాం పెట్టారో తెలియదు కానీ, వాడన్న ఆ ముక్క నాకు నచ్చలేదు. నచ్చకపోవటానికి ఒక కారణముంది. పనిలేక అదే పనిగా ఫేసుబుక్కులో తిరుగుతూ ఉంటే జనాలు వ్రాసే టెక్నో ఫాస్ట్‌ఫుడ్ హితభోధలన్నీ బాగా వంటబట్టేసి, సొంత రెసిపీతో ఒక థియరీ తయారు చేసుకున్నాను. దాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యటానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తుండగా ఈ ముక్క అనేసాడు సాగర్ గాడు. ఆపిల్ ఐఫోన్ 5ఎస్/ఎన్ (*ఎన్ అంటే నో చేంజ్) అనే 2014 లో రాబోయే సరికొత్త మోడల్ రిలీజ్ ఫంక్షన్ రేంజులో, నా థియరీని విశ్వవ్యాప్తంగా జనాలు వెర్రెక్కి చూస్తుండగా,  టిఆర్పిల గ్రాఫులు చూసి సకల చానెళ్ళ యజమానులు అపోలో హాస్పిటల్‌కి పరుగులు తీస్తుండగా డయాస్ మీదకి టూపీస్ లుంగీలో వచ్చి ప్రకటిద్దాం అనుకున్నా. కానీ ఇలా టీకొట్టులో చెప్పేయాల్సొస్తుందని కలలో కూడా అనుకోలేదు.

కించిత్తు నిరాశ కలిగినా, కనబడనివ్వక దాచేస్తూ సాగర్‌కి సమాధానం చెప్పాను. “ఆనందమనేది ఒక ప్రవృత్తిరా. సంతృప్తి అనేది ఒక మానసికస్థితి, జీవనవిధానం”. నోటిలో ఒంపుకున్న టీని మింగలేక కక్కలేక నిలబడిపోయాడు సాగర్. మరో క్షణంలో నోరుకాలి, మ్రింగాక గొంతుకాలి నానా ఆపసోపాలు పడ్డాడు. తర్వాత చిర్రెత్తుకొచ్చి ఏవో చిట్టాలు ఏకరువు పెట్టాడులెండి. చిరాకులో ఉన్నోడికి చిదంబర రహస్యాలు అర్ధం కావని గ్రహించే స్థాయికి నేనెప్పుడో మెచ్యూర్ అయిపోయాను. అందులోనూ పేదరికం ఒక మానసిక స్థితి అన్న పెద్దాయన్ని అందరూ మీదపడి ఈకలు పీకి ఏకిపారేసిన సంగతి కూడా నాకు గుర్తుంది. జనాలకు నచ్చినా నచ్చకపోయినా నా స్వీయ జ్ఞానంతో, స్వంత అనుభవంతో తయారు చేసుకున్న థియరీ వృధాపోనిస్తానా? జీవితమంతా యధాశక్తి పుస్తకాలు వ్రాసో, ఉపన్యాసాలిచ్చో దీనికి ప్రచారం కల్పిస్తాను మరి. పనిలో పని మీరూ వినాలి మరి.

ఈ బలమైన థియరీకి భీజం పడటానికి మొదటి కారణం బస్సు డ్రైవరుగా పనిచేసే మా బాబాయ్ పైడిరాజు. పైడిరాజు చిన్నాన్న ఏ రాశిలో పుట్టాడో తెలియది కానీ, మనిషికి వొళ్ళంతా చమత్కారమే. నిండుగా నవ్వుతాడు, పక్కూరికి వినిపించేలా మాట్లాడతాడు. మా కుటుంబంలో చెవుడు ఉన్నవాళ్ళకి మిషన్ల అవసరం లేకుండా చేసాడు. చెవులు ఉన్నోళ్ళకి చెవుడొచ్చేలా చేసాడంటారు. మా పిన్ని పురటాలుగా ఉన్నప్పుడు బిడ్డ పాల ఖర్చు కన్నా, చెవులో పెట్టుకున్న దూది ఖర్చెక్కువయ్యింది అని చెబుతుంది. కాదనటానికి నా అనుభవమూ ఒప్పుకోలేదు.

ఓసారెప్పుడో మా పెద్దమ్మగారు కాలం చేసారు. పదకొండోరోజు పెద్దకార్యం జరుగుతుంటే చిన్నాన్న మా నాన్నగారి దగ్గరకొచ్చి “ఎప్పుడో కాని రావు. ఒకిసురు మా ఇంటిలో కూడా అడుగెట్టి వెళ్ళు. చంటిది హడావుడి చేసింది. రేపు ఇంటి దగ్గరే భోజనాలు పెడుతున్నా అన్నాడు”. “చావింటి నుండి వేరే ఇంటిలో అడుగు పెట్టకూడదురా. ఇప్పుడెలా?” అన్నారు నాన్న. “నన్ను నా కుటుంబాన్ని నిండు మనసుతో దీవించే బంధువులు మీరే. మీ ఆశీస్సులు లేకపోతే నా కూతురి విశేషం వెలితి అయిపోతుంది. ఏ అనుమానాలు పెట్టుకోకండి. మీరంతా చల్లాగా దీవిస్తే మా ఇంటికే కీడురాదు” అని పట్టుబట్టి అక్కడున్న బంధువులందరినీ ఇంటికి తీసుకునిపోయాడు. అక్కడే మొదటిసారి బాబాయ్ నా థియరీకి బలమైన పునాది వేసాడు.

ఆ రోజు ఆ మందితో పాటూ నేనూ చిన్నాన్న ఇంటిలో మొదటిసారి అడుగుపెట్టాను. ఇంటిలో ఉన్నది నలుగురు బాబాయ్,పిన్ని,చెల్లి,తమ్ముడు. మూసలో పోసి చేసినట్టుగా అందరూ ఒకే రీతిలో సన్నగా, పొడవుగా ఉన్నారు. ఇల్లు చూస్తే చిన్నది. బంధువులంతా వచ్చేసరికి అన్ని గదులు నిండిపోయాయి. జనాలకి పడుకోవటానికే తప్ప అటుఇటూ కదిలే అవకాశం లేనట్టుంది. అందరూ ఇబ్బంది పడుతుండగా బాబాయ్ బయట నుండి అప్పుడే ఇంటికొచ్చాడు. ఈ ఇబ్బంది చూసి బాబాయ్ నొచ్చుకుంటాడేమో అని అందరూ ఆయన మొహంలోకే చూస్తున్నారు. “హమ్మయ్య ఇన్నాళ్ళు ఈ ఇంటిలో అన్నీ నిండుకోవటం తప్ప ఇళ్ళు నిండటం ఇదే మొదటిసారి” అని గట్టిగా నవ్వాడు. ఆ నవ్వుల్లో పడి అందరూ నిద్ర మర్చిపోయి రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసారు.

ఆ మాటల మధ్యలో “దొమలెక్కువగా ఉన్నాయేంటిరా పైడి” అని మా మేనత్త కంప్లైంట్ చేసింది. “కొంపదీసి కొట్టి చంపేసావా ఏంటే? అవి మా పెంపుడు దోమలు. మేము నీచు తిన్నా తినకపోయినా వాటికి మాత్రం రోజూ మా రక్తం పెట్టి పెంచుకుంటున్నాం” అన్నాడు బాబాయ్. ఆ మాటకి జనాలు నవ్వారో లేదో గుర్తులేదు కానీ, నా వరకూ ఆ మాటతో లైఫ్‌స్టైల్ అనే పుస్తకం పై సంతృప్తిని నిర్వచిస్తూ తనదైన సిగ్నేచర్ పెట్టేసాడు బాబాయ్.

నాలో నిద్రానమై పోయిన్న పైడిరాజు చిన్నాన్న తత్వాల్ని ఇప్పుడు బట్టబయలు చేసింది ఇంటర్‌నెట్టే. ఎలా అంటే అదీ చెబుతా. వర్షం కురిసి చికాకు పడిపోతుంటే “ఈరోజు వర్షంలో తడిసాను. చాలారోజుల తర్వాత నా ఫ్రెండ్ వర్షం నన్ను చూడటానికి వచ్చింది. వి హగ్ ఈచ్ అదర్” అని సాఫ్ట్‌వేర్ ఇంజనీరయిన ఒకమ్మాయి పోస్టేస్తుంది. జనమంతా పొలోమని లైకులు కొడతారు. ఒక్కసారిగా ఫేస్‌బుక్కంతా వర్షం కురుస్తుంది. ఎండమండిపోతున్న ఒక మధ్యాహ్నం “ఈ రోజంతా వేడిగా ఉంది. బయటకు వెళ్ళలేదు. కిటికీలో నుండి నా పూల మొక్కల్ని, నీటికై వెతుక్కుంటున్న పిచ్చుకల్ని చూస్తూ గడిపేసాను. BTW మీరు కూడా మీ మేడ మీద పిచ్చుకుల కోసం వేసవిలో ఒక గిన్నెతో నీళ్ళు పెట్టడం మరిచిపోకండి” అని ఒక గృహిణి కిటికీ గుండా తీసిన పిచ్చుకుల ఫోటోలతో సహా పోస్టు వేస్తుంది. తర్వాత ప్రహసనం మీకు తెలిసిందే.

మనలో నల్లబట్టలేసుకుని తిరిగే ఆ సైతాన్ గాడిని బయటకు నెట్టేసి, తెల్ల బట్టలేసుకున్నోడితో చర్చిస్తే మనకో విషయం అర్ధమవుతుంది. ఆ ఎండలో రిలీజ్ సినిమా టికెట్లకోసం పడిగాపులు కాసి, బ్లాకుటికెట్టు గాడితో బేరాలాడి చిరాకు పడిపోతున్నావు కానీ ఇంటిపట్టునే ఉండి, తలకి నవరత్న వ్రాసుకుంటే నీకు మాత్రం మెదడు కూలుగా ఉండదూ?

అంచేత నే చెప్పోచ్చేదేంటంటే “ఆనందమనేది ఒక ప్రవృత్తి. సంతృప్తి అనేది ఒక మానసికస్థితి, జీవనవిధానం”. అవి రైతుబజారులోనో, బిగ్‌బజారులోనో దొరకవు. ఎవరికి వారి స్వంత రెసిపీ ఉండాలి. మీరు తయారు చేసుకున్నాక పదిమందికీ పంచటం మరిచిపోకండి. అప్పుడే కదా ఆ పదిమంది వారి రెసిపీలు మీకూ పంచుతారు.

Download PDF

Posted in 2014, జనవరి, మ్యూజింగ్స్ and tagged , .

8 Comments

  1. బొబ్బిలి పులి…
    పైడిరాజు దోమ‌ల పెంప‌కం బాగుంది. అలాంటి కారెక్ట‌ర్ల‌తో *వీర‌బొబ్బ‌లి న‌వ్వులు* ఒక సిరీస్‌గా మ‌రిన్ని పంచ‌కూడ‌దా, ముర‌ళీధ‌రా?

  2. మురళీధర్ గారు చాలా చాలా బాగుంది అండి. తప్పకుందా ఈ రెసిపీ పదిమందికీ పంచుతాను. అమ్మో చాలు అన్నాకూడా కొసిరి కొసిరి పంచుతాను :) :)

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.