Author Philip Roth

రచన కళ – ఫిలిప్ రాత్

Download PDF   ePub   MOBI

వాస్తవాన్ని కల్పనతో అతి దగ్గరగా ముడేసి కథ నడిపే రచయిత ఫిలిప్ రాత్. మొదటి నవలలు “గుడ్ బై కొలంబస్”, “పోర్ట్నీస్ కంప్లెయింట్”లు అమెరికన్ నవలా సాహిత్యాన్ని ఉలిక్కిపడి లేచేలా చేశాయి. మొదటి నవల యాభై ఏళ్ల క్రితమే పబ్లిష్ అయినా ఇప్పటికీ పిలిఫ్ రాత్ నవల విడుదలవటం అంటే ఒక ఈవెంటే. ఆయన ‘పారిస్ రివ్యూ ఇంటర్వ్యూ’లోని కొంత భాగాన్ని ఇక్కడ అనువదించి ఇస్తున్నాం:
కొత్త రచన ప్రారంభించటం ఎలా ఉంటుంది?

ఇబ్బందికరంగానే ఉంటుంది. నాకు ఇంకా పాత్ర ఏమిటన్నది తెలియదు, దానికున్న సమస్య ఏమిటన్నది తెలియదు. నేనెప్పుడూ సమస్యలో ఉన్న పాత్రతోనే రచన మొదలుపెడతాను. ఇతివృత్తం ఏమిటో తెలియకపోవటం కన్నా కనాకష్టం ఏమిటంటే, ఆ ఇతివృత్తాన్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియకపోవటం. ఎందుకంటే అదే రచనకు ఆయువుపట్టు. టైప్ చేయటం మొదలుపెట్టినపుడు నా రచనల ప్రారంభాలు చాలా చెత్తగా ఉంటాయి. అంతక్రితం రాసిన రచనకు పారడీల్లా ఉంటాయి. నిజానికి నాక్కావల్సింది క్రితం రచన నుంచి తెగతెంపులు చేసుకుని కొత్తగా మొదలుపెట్టడం. రచన అంతట్నీ తన వైపు లాక్కునే దాని కేంద్రమేదో, ఆ అయస్కాంత క్షేత్రమేదో నాకు కావాలి – ఏదైనా కొత్త రచన మొదలుపెట్టిన కొన్ని నెలల వరకూ నా వెతుకులాట దాని కోసమే. ఒక్కోసారి వందల కొద్దీ పేజీలు అలా రాసుకుంటూ పోయాకనే, ఒక ప్రాణమున్న పేరా మనకు తారసపడుతుంది. అప్పుడు నిశ్చింతగా ఉంటుంది, నాకు నా ప్రారంభం దొరికింది, ఇక అక్కణ్ణించి మొదలుపెట్టొచ్చు. అదే నా పుస్తకానికి మొదటి పేరా అవుతుంది. మొదటి ఆరు నెలలూ అలా రాసుకుంటూ పోతాను. అందులో కాస్త ప్రాణంతో ఉన్న ఒక్కో పేరా గానీ, వాక్యం గానీ, ఒక్కోసారి కేవలం ఒక మాట గానీ ఎరుపు ఇంకుతో అండర్లయిన్ చేసుకుంటూ పోతాను. వీటన్నింటినీ మళ్లీ కొత్త పేజీ మీదకు టైప్ చేస్తాను. మామూలుగా ఇదంతా కలిపి ఒక పేజీ కన్నా ఎక్కువ అవదు. అదృష్టం నా పక్షాన ఉంటే అదే నా పుస్తకానికి మొదటి పేజీ అవుతుంది. రాసేటపుడు నేను వెతికేది అందులో జీవం కోసం, అదే రచన గొంతు ఎలా ఉంటుందన్నది నిర్దేశిస్తుంది. ఇలాంటి గడ్డు ప్రారంభం దాటిన తర్వాత నెలల తరబడి రచన సునాయాసంగా సాగిపోతుంది, ఆ తర్వాత మళ్లీ పెద్ద సంకటపరిస్థితి ఎదురవుతుంది, మీ రచనపై మీకే వ్యతిరేకత మొదలవుతుంది, మీ పుస్తకాన్ని మీరే అసహ్యించుకుంటారు.

ప్రారంభానికి ముందు రచనలో ఎంత భాగం మీ మనసులో ఉంటుంది?

ఏది ముఖ్యమో అది అసలు అక్కడ ఉండనే ఉండదు. అంటే ప్రశ్నలనే కాదు, వాటి పరిష్కారాలు కూడా. రాయటం మొదలుపెట్టినపుడు, ఏది నన్ను అడ్డగించబోతోందో దానికై ఎదురుచూస్తాను. ఆటంకం కోసం ఎదురుచూస్తాను. ప్రారంభించాకా ఒక్కోసారి రాయటం ప్రయాసగా సాగటం వల్ల కన్నా, ఏ ప్రయాసా లేకుండా సాగిపోతోందంటేనే అనుమానం కలుగుతుంది. సునాయాసంగా సాగటం అనేది సవ్యమైనదేదీ జరగటం లేదనటానికి సూచన కావచ్చు; అది నిజానికి అక్కడితో ఆపేయటం మంచిదనటానికి గుర్తేమో కూడా, వాక్యం తర్వాత వాక్యం చీకట్లో తడుములాటలా ఉండే పరిస్థితే నాకు ముందుకు సాగే ఉత్తేజాన్ని కలగజేస్తుంది.

మీకు ప్రారంభం సిద్ధంగా ఉండి తీరాలా? ఎప్పుడన్నా ముగింపు దగ్గర మొదలుపెట్టడం జరుగుతుందా?

నేను మొదలుపెట్టింది చివరకు ముగింపే అవుతుందేమో. ఒక ఏడాది తర్వాత చూసుకుంటే మొదటి పేజీ అనుకుని రాసింది రెండొందలో పేజీగా మారొచ్చు, అసలంటు అప్పటిదాకా అది మిగిలితే.

మరి వదిలేసిన ఆ రెండొందల పేజీల సంగతి ఏమవుతుంది? వాటిని దాచిపెడతారా?

సాధ్యమైనంత వరకూ మళ్లీ వాటి వంక చూడకుండా ఉంటానికే ప్రయత్నిస్తాను.

రాసుకోవటానికి రోజులో ఏదన్నా ప్రత్యేక సమయం కేటాయిస్తారా?

నేను రోజంతా పని చేస్తాను, ఉదయమూ మధ్యాహ్నమూ, దాదాపు ప్రతీ రోజు. అలా ఓ రెండు మూడేళ్లు క్రమం తప్పకుండా కూర్చోగలిగితే, చివరకు ఓ పుస్తకం పుడుతుంది.

మీ తోటి రచయితలూ ఇంత సమయం పనిచేస్తారంటారా?

వేరే రచయితల్ని వాళ్ల వ్యాసంగపు అలవాట్లేమిటో ఎప్పుడూ అడగను. అవి నాకు అనవసరం. Joyce Carol Oates ఒక చోట అంటారు: రచయితలు ఒకర్నొకరు “రాయటం ఎప్పుడు మొదలుపెడతారు”, “ఎప్పుడు ముగిస్తారు”, “భోజనానికి ఎంత సమయం కేటాయిస్తారూ” ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే దాని అర్థం “వీడు నా అంత పిచ్చివాడేనా, కాదా?” అన్నది తెలుసుకోవటానికని. నా వరకూ ఆ ప్రశ్నకు జవాబు అక్కర్లేదు.

మీరు పఠనం మీ రాతల్ని ప్రభావితం చేస్తుందా?

రచన చేస్తున్న రోజుల్లో కూడా నేను చదువుతూనే ఉంటాను, రాత్రి సమయాల్ని దానికి కేటాయిస్తాను. ఒకరకంగా అది ఉత్సాహం నీరుగారకుండా నిలిపి ఉంచుతుంది. నా పని నుంచి విరామం తీసుకుని కూడా నా పనికి సంబంధించిన ఆలోచనల్లో గడపటానికి ఇది పనికొస్తుంది. రచనోత్సాహానికి ఒక ఇంధనంలా పని చేస్తుంది.

రచన ఇంకా పూర్తికాకముందు దాన్ని ఎవరికైనా చూపిస్తారా?

నా పొరబాట్లు వాటంతటవి పెరిగి బద్దలవటమే మంచిది. రాస్తున్నప్పుడు నన్ను నేనే చాలినంత ఆక్షేపించుకుంటాను, ఇక ప్రశంసల విషయానికొస్తే, సగం కూడా పూర్తి కాలేదని నాకే తెలిసిన రచనకు ప్రశంసలు అందినా అవి ఎందుకూ పనికి రావు. ఇక ఏ మాత్రం ముందుకు సాగలేను అనిపించేదాకా, చేయదల్చుకుందంతా చేసేశాను అనిపించేదాకా నా రచన ఎవరి కంటా పడనీయను.

మీరు రాస్తున్నప్పుడు ఫిలిఫ్ రాత్ పాఠకుడంటూ ప్రత్యేకించి ఎవరైనా మీ దృష్టిలో ఉంటారా?

లేదు. అప్పుడప్పుడూ ఫిలిఫ్ రాత్‌కు బద్ధవిరోధి ఐన పాఠకుడు నా దృష్టిలో ఉంటాడు. “వాడు దీన్ని ఎలా అసహ్యించుకుంటాడో కదా!” అని ఆలోచిస్తూంటాను. అదే నాకు పెద్ద ప్రోత్సాహం.

ఇందాక మీరు రచన ఆఖరు దశలో ఉన్నప్పుడు ఎదురయ్యే ఒక సంకట స్థితి గురించి మాట్లాడారు. ఆ దశలో మీ రచనకు మీరే వ్యతిరేకులై దాన్ని అసహ్యించుకుంటారన్నారు. ఇది ప్రతీ పుస్తకం విషయంలోనూ ప్రతీసారీ ఇలా జరుగుతుందా?

ప్రతిసారీ. నెలల తరబడి చిత్తుప్రతి వైపు చూడటం, “ఇందులో ఏదో తేడా ఉంది — కానీ ఏమిటది?” అని నన్ను నేనే ప్రశ్నించుకోవటం జరుగుతుంది. “ఈ పుస్తకం ఒక కల ఐతే, అది దేన్ని గురించిన కల?” అని ప్రశ్నించుకుంటాను. కానీ ఇలా ప్రశ్నించుకుంటున్నానంటే నేను రాసిందాన్ని విశ్వసించే ప్రయత్నం కూడా చేస్తున్నానని అర్థం, అది ఒక రచన అన్న సంగతి మర్చిపోయి “ఇది నిజంగా జరిగింది” (జరగకపోయినా) అన్న దృష్టితో చూసే ప్రయత్నం చేస్తున్నానని అర్థం.

మిమ్మల్ని పోలిన పాత్ర Nathen Zuckerman అవతారం దాల్చినపుడు ఏం జరుగుతుంది?

నా జీవితపు అసలైన డ్రామా నుంచి ఒక నకిలీ ఆత్మకథని, బూటకపు చరిత్రని, అర్ధ-కల్పిత అస్తిత్వాన్నీ పుట్టించటమే నా జీవితం. నా వరకూ నా వ్యాసంగంలో కాస్త సరదా ఉండి తీరాలి, అంతే. ముసుగు వేసుకుని తిరగటం. ఒక పాత్రగా వేషం వేయటం. నేను కానిదాన్ని అవునని నమ్మించటం. నటించటం. మోసపుచ్చే దొంగ ముఖాలు తొడుక్కుని ఆట. ఒక వెంట్రిలాక్విస్టుని ఊహించుకోండి. మాట్లాడేది తానే అయినా తనకు దూరంగా ఉన్న మరొకడి నుంచి తన గొంతు వస్తున్నట్టు నమ్మించటానికి ప్రయత్నిస్తాడు. కానీ మీ కళ్లముందు అతను లేకపోతే మీరు అతని కళని ఆస్వాదించలేరు. అతని కళకు ఆయువుపట్టు కనిపిస్తూనే అదృశ్యం కాగలగటంలో ఉంది; అతను ఇంకొకనిలా నటించటం ద్వారా తనను వ్యక్తీకరించుకుంటున్నాడు, కానీ ఒకసారి తెర దింపేశాకా అతను ఇద్దరిలో ఎవరూ కాదు. ఒక రచయితగా ఇలా మీరు మారువేషం ధరించినపుడు మీ ఆత్మకథని పూర్తిగా విడిచిపెట్టాల్సిన అవసరమేం లేదు. అలా విడిచి పెట్టకపోవటమే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. దాన్ని మీరు వక్రీకరిస్తారు, వేళాకోళం చేస్తారు, పారడీ చేస్తారు, దాన్ని తూట్లు పొడిచి కల్తీ చేస్తారు, మీకు నచ్చినట్టు వాడుకుంటారు – ఇదంతా ఎందుకంటే, మీ ఆత్మకథ ఎలా ఉంటే మీ అక్షరాల్ని కదిలిస్తుందో అలా దాన్ని మలిచేందుకు. కోట్లాదిమంది అనునిత్యం ఇలా చేస్తూనే ఉంటారు, కానీ సాహిత్య సృష్టి అనే సాకు ఉండదు వాళ్లకు. ఒక్కోసారి జనం తమ సొంత ముఖాల ముసుగుల వెనుక ఎట్లాంటి అబద్ధాల్ని మోయగలరో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తిలోని కళనే గమనిద్దాం: రంగస్థలం అనగానే బెదిరిపోయే మామూలు భార్యలూ భర్తలూ, తమ ఇల్లు అనే రంగస్థలంలో మాత్రం, తమ చేత మోసానికి గురవుతున్న జీవితభాగస్వాములనే ప్రేక్షకుల ముందు, ఎంతో ఒత్తిడిని తట్టుకుంటూ, ఎన్నో గడ్డుపరిస్థితుల్ని దాటేస్తూ, అమాయకత్వం విధేయతలు కలబోసిన తమ పాత్రల్ని అద్భుతమైన నటనాప్రతిభతో పోషిస్తారు. ఎంతో చాతుర్యంతో చిన్న చిన్న అంశాల పట్ల శ్రద్ధ తీసుకుంటూ వంకపెట్టలేనంత సహజమైన నటనతో అలరారే గొప్ప గొప్ప ప్రదర్శనలవి. పైగా వాళ్లంతా ఏ మాత్రం నేర్పు లేని అమెచ్యూర్స్, “తమలా” తాము ఎంతో చక్కగా నటించగలరు. కాబట్టి నమ్మించటమనేది ఇన్ని కోవల్లో ఇన్ని రూపాలు ధరించవచ్చు. అలాంటిది నమ్మించటమే వృత్తి ఐన నవలా రచయిత, భార్యను వంచించే మొద్దు గుమాస్తా ముందు ఎందుకు తీసికట్టు కావాలి?

(Image Courtesy: http://www.flickr.com/photos/81669195@N00/8186363622/)

Download PDF   ePub   MOBI

Posted in 2014, జనవరి, రచన కళ and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.