ms naidu

అస్పర్శ

Download PDF  ePub  MOBI

ఒక లోనికి

వెళ్ళే తిరుగుతున్న

అస్పర్శ

.

ఇంకెంతసేపు

ఈ గదిలో

బాల్యం

.

స్పర్శ అని చదివో, వినో కళ్ళు మూసుకుంటే చేత్తో, పెదవులతో, కళ్ళతో, కనీసం మనసుతో తాకగలిగిన ప్రపంచాన్నంతట్నీ జ్ఞప్తికి తెచ్చుకోవచ్చును. అస్పర్శ ఏమిటి? చల్లగా చెంపల్ని కోసే గాలికీ, నొక్కి OkaVellipothanu_cover_brdrపట్టి చేసే కరచాలనాలకీ, కావాలని ఒళ్ళో దాచుకున్న మొహమ్మీద కాలే శ్వాసకీ – ఇలాంటి అనుభవాలన్నిటికీ వ్యతిరేక పదమా అదీ? అసలు అది ఒక అనుభవమేనా? పరిచితమైన ‘వాస్తవం’ సమస్తం మీదికీ ఇలాంటి అననుభవాల్ని చిన్న చిన్న చలి చీమల్లాంటి మాటలుగా రువ్వుతూ ఆ బలవంతమైన సర్పాన్ని చరక్! ఫఱఖ్! షటప్మని గుచ్చి గుచ్చి సర్వ దుంబాలా చేస్తారు ఈ నాయుడుగారు. స్వయంగా తను మాత్రం చా… లా… నెమ్మది నెమ్మదిగా ఉంటారు. ఒకరోజు అదాట్న వచ్చి కూర్చున్నారు. ఏం మాట్లాడరు! వెఱ్ఱినవ్వు మొహాన్ని ధరించి వేడి వేడి టీ మీంచి పరీక్షగా ఈ ప్రపంచం మీదనే అంతా సాఫీగా, ఒప్పుకోలుగా ఉన్నట్టుగానే ఉన్నట్టు కూర్చుని మిడుకూ మిడుకూ చూస్తూను. నాయుడిగారి కవితలు లేని పదాల మధ్య నడిచెళిపోతూ ఈ ప్రపంచం కంటే లోతైన ప్రపంచాల్లోంచీ తిక్క తిక్కగానూ, ఒద్దికగా సర్దిపెట్టుకున్న గోడలనీ కుర్చీలనీ వెక్కిరిస్తున్నట్టుగా, ఏసీలకి ఉక్కపోయిస్తున్నట్టూ ఉంటాయి. ఓమాటెప్పుడో ఒక వెళ్ళిపోతాను బుర్రకి తగులుకుని ఆ కవితల పుస్తకం కోసం ఏళ్ళూ పూళ్ళుగా ఇప్పటికీ వెతుక్కుంటున్నాను. పుస్తకం చెలామణీలో లేదు, అవుటాఫ్ ప్రింట్ అయిపోయింది. నాయుడు గారేమో ఒక్క కవిగా తప్ప ఇంకే వేషంలోనూ ఎలా చెలామణీ కావాలో అంతుబట్టనట్టు బిత్తర చూపులతో ఈ వీధినీ ఆ వీధినీ దాటుదునా మానుదునా? అన్నట్టు ఈ జనాల మధ్యనే ఇంక ఎక్కడికీ ఒక వెళ్ళిపోలేకా తచ్చాడుతున్నారు. ‘రామ్ ఒద్దు నాకు నామ్ చాలూ’ అనుకుంటుంటే పుస్తకం కాయితం ఏమీ లేని ఖాళీ చేతుల్తోన స్వయంగా అదాట్న వచ్చి కూచున్నారు. డాలీ భిక్షువు వేషంలో ఒచ్చిన్లాంటి గుండ్రం మొహం వేసుకుని బెంగగా, సంశయంగా ‘అయితే నువ్వూ … ?’ అనైనా అనలేని గోమాత కళ్ళతోని. “నాయుడు గారు! మీకు ఏదైనా గౌరవం చెయ్యాలి!” అని ఒక తెల్ల కాయితాల పుస్తకం ఆయన చేతిలో పెట్టేను. నాయుడు గారి ఆవు కన్ను నా ఫౌంటెన్ పెన్ను మీద పడింది. “పుస్తకఁవేనా? పెన్ను కూడా ఇవ్వండి!” అని పెన్నూ అడిగి తీసుకున్నారు. ఆయన కూడా నాలాగే ఫౌంటెన్ పెన్నుల పిచ్చోడు. ఉలక్కుండా పలక్కుండా నా వాగుడంతా వింటూ కూచున్నారు. ‘కవిని నిజంగా కలుసుకునేది ఏకాంతపు లోతుల్లోన, అతను కట్టినవి ఒక్కోటీ తడిమి చూసుకుంటూను, ఇలా బల్ల మీద ఎదురెదురుగా కూచుని నవ్వు మొహాలు వేసుకుని కాదు …’ అంటే ఇంక లేచెళిపోయేరు.

ఒక కవిని ఎలా గౌరవిస్తాము? కాళ్ళ కింద గచ్చులాగ అలవాటైపోయిన నలుపలకల భాషనీ, పరస్పరం భరోసాగా నిర్మించుకున్న వ్యాకరణ మంటపాల్నీ ధాఢ్!మని పగలగొట్టుకుని వచ్చి నిలబడితే అప్పుడెలా గౌరవిస్తాము? పుస్తకం కోసం వెదుక్కుంటుంటే అది దొరక్కుండా దాని కవే వచ్చి ఎదురుగా బెంగగా, సంశయంగా, చుట్టూ నడుస్తున్న గాలీ వానాలోనూ ఎగిరి కొట్టుకుపోకుండా తన సృజన అంచులకి అతి కష్టమ్మీద పళ్ళ బిగువున పట్టుకుని వేళ్ళాడుతూ విహ్వలుడైపోయి నిలబడితే? ఇలాంటి సున్నా కంటే సున్నితమైన కవిని? అలవాట్లని తోసిరాజంటే తప్ప ఒక్క వాక్య శకలం కూడా నిర్మించలేని, కవిత్వం తప్ప ఇంకేమీ చాతకాని నైసర్గికమైన, అపురూపమైన, అనిదంపూర్వమైన కవి అయితే అతన్ని ఏం చెప్పి, ఏమిచ్చి ఊరుకోబెడతాము?

ఎలాగంటే ఆయనకి పుస్తకాలిచ్చీ, శాలువా కప్పీ, ఏదైనా సభలో మర్యాద చేసీ, మీరు ఇలాగా అలాగా అని పొగిడీ – ఇలా చేసేది గౌరవమే కాదు. అర్థం చేసుకోకుండా కవిని పొగిడితే అది అవమానం అవుతుంది. నాయుడు గార్ని గౌరవించాలంటే మూడు పనులు చెయ్యాలి. ఆయన ‘ఒక వెళ్ళిపోతాను’ ఈకకి ఈకా తోకకి తోకా పరికించి అనుభవించి దాన్నంతా చెప్పుకోవాలి. రెండోది ఆయన సృజనాంతరంగం ఎలా పని చేస్తుందో, ఆయన ఈ ప్రపంచాన్నీ, జీవితాన్నీ ఎలా దర్శిస్తున్నారో అది ఇంటర్వ్యూ చేసి, ఆయన చుట్టూ చరిత్రంతా తవ్వీ రాబట్టాలి. మూడవది – ఆయన ‘ఒక వెళ్ళిపోతాను’ ప్రకటించిన తరువాత ఈ పదమూడేళ్ళలోనూ తనూ, తన సృజనా ఏ శ్రోతలూ కోరని కచేరీల్లోన, ఏ ఝామాయీ ఏ వినియోగదారుడూ అందుబాటులో లేని కాయితాల బజార్లోనా ఎంతలా పడి కొట్టుకుంటున్నారో, ఎందుకు అంతలా డస్సిపోయి ఉన్నారో అదీ పరికించి ఊరడింపుగా ఆయనకే తిరిగి ఎత్తి చెప్పాలి. వీటిలో ఏ ఒక్కదాన్నైనా తాకి చూసేముందు నాయుడు గారి ప్రపంచంలోకి కనీసం ముంగాళ్ళు ఎత్తైనా కళ్ళు చిట్లించి చూడగలగాలి. ఆయన్ని ‘అర్థం’ చేసుకోవాలంటే ప్రయాణం చేసొచ్చిన పడవనీ, ప్రయాణిస్తున్న గాలినీ ఒకచోట ఆగిపోనిచ్చి, వాక్యం చనిపోయే వరకు వేచి చూసి, అక్షరాల్లేని వెయ్యి స్పర్శల కన్నీళ్ళతో ఆయన ఎప్పణ్ణుంచో తవ్వి ఉంచిన గాలి బావిలోకి ఏ భరోసాలూ లేకుండా దూకాలి. ఈ చాంతాళ్ళు నడ్డిక్కట్టుకుని ఒక్కణ్ణే ప్రమిద వెలుగులో ఆ సామర్లకోట చీకటి బావుల్లోకి ఒక వెళ్ళిపోడానికి ఈయన నాకేమన్నా మేనత్త కొడుకా? మేనమాఁవ కొడుకా? అవతల్నాకు బోల్డు పన్లున్నాయి. ఒద్దు, ఇందులోకి దిగను. నాయుడు గారికి ఎలాగూ ఈ ఏడాదే కాదు, ఏటాటా అవమానం ఆరు, రాజపూజ్యం సున్నా. “యదార్థం కోసం వెతికితే మిగిలేది జబ్బు.” దానికి బదులు “ఇదుగో మీకు ఒక తెల్ల కాయితాల పుస్తకం ఇస్తున్నాను…” అని ఆయనతో సణిగేను. నా మనస్సులోన, రహస్యంగా ఆయన పాదాలు, పట్టబుర్ర, డాలీ మీసాల్నీ కల్పించుకొని, నరుడి కంట పడకుండా వాటికి పదే పదే శిరసా నమస్కారాలు పెట్టుకుంటాను. ‘ఈ చెయ్యగలిగిన గౌరవం ఇంతేను. ఇంక మీ గురించీ, మీ కవిత్వం గురించీ ఏమీ రాయను!’ అని ఆయనకే తెగేసి చెప్పేను. ఆయన ఆ మాటల్ని కూడా మిడుకూ మిడుకూమని వింటూ కూచున్నారు. బోద బలపం తిమ్మిరి తిమ్మిరిగా తన అవిటి కాలు ఈడ్చుకుంటూ తిరుగుతున్న నీడలలో కిటికీ ఎండకీ నాకూ అడ్డంగా బెల్లం కొట్టిన నీడ లాగ.

ఆయన mind ఎలా పనిచేస్తుందని నాకు పట్టుకుంది! భుజమ్మీద ఒక వెళ్ళిపోతాను లాంటి అధివాస్తవిక కవిత్వాన్ని నిమిషం నిమిషం అనివార్యంగా తడుముకుంటూ, ‘ఇది మేక కాదు, కుక్కా? మేకలంటే అవా?’ అని మందల్లో చిక్కుకుని విహ్వలమైపోయిన వెర్రి గొల్లవాడివంటి ఈ మనిషి అంతరంగం? దానికి జవాబా అన్నట్టు ఆయన పేడ రంగు తెల్లకాయితాల నోట్సు, ఫౌంటేన్ పెన్నూ చేతిలోకి తీసుకుని ఇలాగని రాసి ఊరుకున్నారు:

.

ఈ కలం కాలం పేరేమిటో చెప్పారా?

కాస్త గరుకు రోడ్డులో నడుస్తుంది ఈ సిరా పాదం.

కాస్తంత మన్ను ఉండాలి కన్నులో.

.

అట్నుంచటే లేచెళిపోయి, వెళ్ళింది వెళ్ళినట్టు ఉండకుండా ఎవరో స్నేహితుడి దగ్గరున్న ఒకే ఒక్క కాపీ ఒక వెళ్ళిపోతాను ఊడబెరికి తెచ్చి నాకోసం ఇచ్చి వెళ్ళిపోయేరు. తన వీపు వెనక దాచిపెట్టుకుని తిరుగుతున్న కొరకంచి నా మీదికి విసిరీసి పోయినట్టయ్యింది. అది అందుకుంటే కాలుతుంది, కాని అందుకోకపోతే ఏకంగా మంటే పెడుతుంది. ఆయన ఒదిలి వెళ్ళిన పుస్తకాన్ని ముట్టుకోకుండా, పేజీ పేజీ తిప్పి తిప్పి చదవకుండా ఉగ్గబట్టుకోలేక. ఆయన్ని తలచుకునీ, ఈ మాపు రంగుకి తిరుగుతున్న తెల్లటి కవితల పుస్తకాన్ని నట్టింట్లో అలాగ మండనిస్తూ ఇంక ఆగలేకుండాను. నా విలువైన పనులన్నింటి లోనికీ ఒక వెళ్ళిపోనివ్వకుండా నాయుడు గారూ ఆయన పుస్తకం కళ్ళ మీసాలతో ఎముకల బట్టతలతో నక్షత్ర వృక్షాలతో గోళీకాయల రంగులతో దండయాత్రలు చేస్తున్నాయి. అందుకని మంత్ర నగరి సరిహద్దులు మూచూస్తునాను. అస్పర్శని ముట్టుకుంటునాను.

2

నాయుడు గారి వంటి కవి మనకి ఒక్క నాయుడు గారే ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లోన ఏకంగా ఒక కళా సిద్ధాంతమే ఉంది. దాన్ని నాయుడు గారు ఎక్కువగా వెతికి, చదువుకోలేదు. పెద్దగా పటించుకోలేదు. నాయుడుగారు దేశవాళీ సర్రియలిష్టు. డాలీని చూసి చూసొచ్చీ, బ్రెటొన్ని చదివి చదివొచ్చీ కొత్త కొత్తగా తిక్కగా అనడం నేర్చుకున్న మనిషి కాదు. ఆయన అంతరంగం, ప్రపంచాన్ని అనుభవించే పద్ధతీ నిసర్గంగా, అప్రయత్నంగా, సునాయాసంగా అధివాస్తవికమైనవి. ఆయన తను రాసేదాన్ని అలా తప్ప ఇంకెలాగా అనలేరు, అలాగని రాయకుండా మానుకోలేరు, కక్కా లేరు మింగా లేరు. కాయితం కలం ఇచ్చి ఇంకా ఏం అనకుండానే ముప్ఫయి సెకెన్లలోన అలా రాసిచ్చేరు. పరిచితమైన భాషనీ, కళ్ళెదుటి వాస్తవాన్నీ అధిగమించి, అటు ఇటూ విరగ్గొట్టి తోవ చేసుకుంటూ ఉక్తి వైచిత్రిగా, నిర్మాణ వైచిత్రిగా పొడసూపే ఈయన సృజన ఆ తళత్తళలాడే కళ్ళ వెనక ఎన్నెన్ని సుళ్ళు ఎలా తిరుగుతున్నాది? అన్నేళ్ళ కిందటే ఈ పుస్తకాన్ని అన్ని రంగుల నుండీ తప్పించుకుని పాలైసు లాగా అంత స్వచ్చంగా ప్రకటించుకున్న ఈ నాయుడు గారు అలవాటు కుక్కలకి సెలవు దినాల్ని ప్రకటించుకుని, ఈ చీకట్లోంచి ఎప్పటికైనా తప్పిపోవాలని ఆ సామర్ల కోటలోన అంతంత చిన్నప్పుడే ఇంతింతలేసి తీరుమానాలు ఎలా చేసుకున్నారు? చలం గారి చక్రాల కుర్చీని తోసుకుంటూ తిరువణ్ణామలై వీధుల్లోన తిరిగీ తిరిగేనా ‘ఈ వాస్తవాన్ని అధిగమించాలీ’ అని?

(తరువాయి భాగం)

Download PDF  ePub  MOBI

Posted in 2014, ఫిబ్రవరి, వ్యాసం and tagged , , , , , , , .

4 Comments

  1. నాయుడి కవిత్వాన్ని వ్యక్తీకరించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం నాయుడి కవిత్వానికి న్యాయం చెస్తుందా ?

    The Tao which can be expressed in words is not the eternal Tao; the name which can be uttered is not its eternal name. Without a name, it is the Beginning of Heaven and Earth; with a name, it is the Mother of all things. – Laozi

  2. నమస్కారమండి పెసాదు బాబుగొరు. మా నాయుడోరి గురించి శానా బాగ రాసేరు. మీకు అంటుకున్న కొరకంచు మంట మాకు శాన్నాళ్ళ క్రితమే అంటుకుంది. ఇప్పటికీ ఇంట్లో కూర్చుని ఆ మంటలను ఆచ్చర్యపడుతూ సూస్తానే ఉంటాను. మా నాయుడోరి గురించి ఇట్టా రాయగలిగేది ఎవురా అని కనిపెట్టుకు కూర్చున్నా ఇన్నాళ్ళ బట్టి.. బాబ్బాబు మీక్కాస్త పుణ్యమొస్తాది కాస్తంత ఆయన బ్లాగులొ రాసుకున్న మంటలను మీ వంటికి కూడా అంటించుకోరూ. మాలాంటి పామర ముండాకొడుకులకి కాస్తంత ఇడమర్సి సెబుతారని మా ఆశ. ఎంచేతంటే సెప్పడానికి మాకు నోరూరాదూ రాయడానికి మా సేతులు సాలవు.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.