Fyodor Tyutchev final

కవితానువాదాల పోటీ ఫలితాలు

గత నెల కవితానువాదాల పోటీలో రష్యన్ కవి ఫ్యోదోర్ చూచెవ్ రాసిన “Silentium” కవితను ఇచ్చాం. ఈ కవితలో ఏముందో గానీ, ఈ సారి “కవితానువాదాల పోటీ”కి మునుపటి కంటే ఎక్కువ స్పందన లభించింది. ఇరవై రెండు మంది పోటీలో పాల్గొన్నారు. వాటిల్లోంచి రెండింటిని ఎంపిక చేశాం. ఒకటి మూలానికి చేరువగా ఉంది, ఒకటి మూలానికి చేరువ కాకపోయినా భావానికి మరింత చేరువగా ఉంది. ఈ రెంటినీ విజేతలుగానే ప్రకటిస్తున్నాం. మా నిర్ణయమే అంతిమం అనుకోనక్కర్లేదు. ఎంపికైన ఈ రెండింటిలోంచి చదువరులు తమ మనసుకు ఏది బాగా నచ్చిందో కూడా కింద వ్యాఖ్యల రూపంలో తెలియజేయవచ్చు.

నిశాపతి (ఎమ్.హెచ్.వి సుబ్బారావు) అనువాదం

పెదవి విప్పకు!

దాగనీ ఎదగదులలొ

పొదువుకొమ్ము లోలోపల ఒదుగనిమ్ము

స్వప్నతంత్రుల, అనుభూతి స్పందనలను

ఎగయనిమ్ము కవ్యావేశ హృదయకుహరి,

తారలావినిర్మల వియత్తలమునందు

పొటమరించినయట్టుల పొడమనిమ్ము,

మనసు నానందప్లావిత మర్మజగతి

తేలిపోనిమ్ము ఆహ్లాదహేల. . . కాని

పెదవివిప్పకు!

.

హృదయమెట్టుల మాటలో ఒదుగగలదు?

మనసు ఒకనిదెట్లెరుగును మరి యొకండు?

నీహృదయచాలనమ్మొరుండెట్టులెరుగు?

మనసులో గల్గు ఊహలు మాటలందు

డొల్లలౌ, భావసాంద్రత డుల్లిపోవు

బురదయౌగాదె సెలయేరు భూమిజేర?

జాలువారినచోటనే గ్రోలి

అద్వితీయ రససిద్ధి నందు – అంతియెగాని

పెదవివిప్పకు!

.

నీమనఃకులాయములోన నీరవముగ

కాపురముచేయుమోయి ఏకాంతమందు

బాహ్యలోకపు మిరిమిట్ల బయలువడక

మణగు ప్రచ్చన్నభావాల మంత్రనగరి

దినపు కలకలమందున వినగరాని

వింత అద్భుత జగతి

ఆవిష్కృతమగు

తనివితీరగ ఆ పాట వినుము. . . కాని

పెదవివిప్పకు!

.

పెదవివిప్పకు మాటల పేదరికము

భావసౌందర్యదీప్తికి భంజకమ్ము!

.

విజయాదిత్య అనువాదం

ఉష్ !

ఉష్ ! చెప్పొద్దు

వెచ్చని దుప్పటి మాటున నీకలని

అనుభవాల దొంతరని

ఎదగనిమ్ము

నీలోనే లోలోనే

.

తూరుపువెలుగంటని రాతిరిలో

స్ఫటికంలా మెరిసే నింగిలో

తళుకుమనే తారల్లా

వెలుగనిమ్ము

నీలోనే లోలోనే

.

ఎవరికైనా

ఎలా పంచగలవ్?

నీ మనసు

నీ అనుభూతుల పరంపర

ఉరకలెత్తే అంతరంగం

నోరంటితే భావం ఎంగిలౌతుంది.

హృదయకలశం నుండి ఒలికి

ప్రిదిలిపోయిన నీటిబిందువులు దాహాన్ని తీర్చలేవు

అవి నేలరాలకముందే. . .

నోరు జారకముందే. . .

నిశ్శబ్దంగా తాగేసేయ్

గుండె అంచుల దగ్గరే

నీలోనే లోలోనే

.

అనంతమై పెరుగుతున్న

నీ అంతరంగంలో

నీలో నీ ప్రపంచంలో

జీవించు

ఒక్కడివే

నీలోనే లోలోనే

.

హృదాంతరాళంలో

మూలమూలనా కదలాడే

అతీంద్రియస్ఫురిత భావ ప్రకంపనలను

బహిఃకాంతులు కనుగప్పక ముందే

పగటి రొదలు అణగించక ముందే

పాటలుగా పాడుకో

అనాహతంగా

నీలోనే లోలోనే

.

కొన్ని అనువాదాలు మొత్తంగా చూసినపుడు తూగకపోయినా, అందులో కొన్ని భాగాలు మాత్రం ఎంపికైన కవితల్లోని వ్యక్తీకరణల కన్నా కూడా బాగున్నాయి. ఉదాహరణకు విజయ జ్యోతి చేసిన అనువాదం ‘మౌనవ్రతం’లో “పెదవంచుల తొణికిసలాడిన మది తలపు వితథమే కాదా” అన్న వ్యక్తీకరణ బాగుంది. అలాగే వచ్చిన కవితలన్నింటిలోనూ శీర్షిక బాగా అమరింది స్వాతి శ్రీపాద అనువాదానికి. ఆవిడ పెట్టిన శీర్షిక ‘నిశ్శబ్దత’. అలాగే ఆవిడ కవితలో “ఊట ఉబికొచ్చే చోటే దాహం తీర్చుకో” అన్న వ్యక్తీకరణ కూడా చాలా బాగుంది. ఫణీంద్ర కె.ఎస్.ఎమ్ చేసిన అనువాదం ‘నిశ్శబ్ద వసంతం’లో “నిన్ను నువ్వు ‘మాట’గా పారేసుకున్న వేళ” అన్న వ్యక్తీకరణ కూడా మిగతా కవితలోంచి ముందుకు వచ్చి నిలబడింది.

Translation is a thankless job అంటారు. మరి ఎంతోమంది పంపినా అందులో ఇలా కొన్నింటినే ఎంపిక చేసి పాఠకుల ముందుకు తేవటం అనే పద్ధతి మరింత “థాంక్‌లెస్”గా తోచవచ్చు. కానీ మీ ప్రయత్నాల్లో మీరు చేసిన సాధన, మీరు పొందిన ఆనందం మీకు మంచి చేస్తాయనే మా నమ్మకం. ఇదే ఉత్సాహాన్ని మున్ముందు కూడా ఆశిస్తున్నాం.

*

(Image Courtesy: Wikipedia)

Posted in 2014, కవితానువాదాల పోటీ, ఫిబ్రవరి and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.