ప్రింటు పుస్తకాలు
గుంటూరు కథలు
ఈ పుస్తకంలోని విషయ సూచిక చూడగానే గుంటూరు జిల్లా ఇంతమంది పేరుమోసిన కథకులకు జన్మస్థానమా అని ఆశ్చర్యం కలుగుతుంది. గుంటూరు జిల్లాలో కథకు ఆద్యుడు కూడా మహ గట్టివాడైన అక్కిరాజు ఉమాకాన్తమ్. ఆయన తొలి కథలు 1913 – 1914 సంవత్సరాల్లో రాశారట. దాన్ని బట్టి గుంటూరు కథకు ఇది శయజయంతి సంవత్సరం. అదే ఈ పుస్తకం విడుదలకు సందర్భం. చలం, మల్లాది రామకృష్ణశాస్త్రి, కొ.కు., గోపీచంద్, మునిమాణిక్యం, రావూరి భరద్వాజ, మునిపల్లె రాజు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, సత్యం శంకరమంచి, మో, శ్రీరమణ, వాసిరెడ్డి సీతాదేవి, ఓల్గా… ఇలాంటి హేమాహేమీల రచనలుండటంతో అసలు ఈ కథా సంకలనానికి ఒక ప్రాంతీయ పరిమితి ఉందన్న సంగతే గుర్తు రాదు. పుస్తకం ముద్రణ బాగుంది. పెనుగొండ లక్ష్మీనారాయణ సంపాదకత్వం వహించిన ఈ సంకలనం కథాభిమానులకు నచ్చుతుంది.
~ లభ్యం
13 భారతీయ భాషల తొలి కతలు
తిరుపతి కేంద్రంగా గత కొన్నేళ్లుగా విడుదలవుతున్న పుస్తకాల వరుస చూస్తోంటే ఆ పట్టణం మన రాష్ట్రానికి సరికొత్త సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందా అనిపిస్తోంది. ఇక్కణ్ణించి వస్తున్న పుస్తకాలు విషయ పరంగానే కాదు, ముస్తాబు పరంగా కూడా చాలా చక్కగా ఉంటున్నాయి. వచ్చిన ప్రతీ పుస్తకమూ కలెక్టర్స్ ఎడిషన్ లాగే ఉంటోంది. ఈ పుస్తకం కూడా అంతే. చూడగానే చేతుల్లోకి తీసుకోవాలనిపించేంత ముచ్చటగా ముద్రించారు. “13 భారతీయ భాషల తొలి కతలు” అన్న ఈ పుస్తకంలో నిజానికి 14 కథలున్నాయి. ఎందుకంటే తెలుగు విషయంలో గురజాడ, బండారు అచ్చమాంబల కథలు రెండూ ప్రచురించారు.
~ లభ్యం
దేవీప్రియ రన్నింగ్ కామెంటరీ
పొలిటికల్ కార్టూన్లవేవి ఇక్కడా ఎక్కడా ఉన్నవే. అలాక్కాక, పొలిటికల్ కార్టూన్ కవితలనేవి మొదలైంది దేవీప్రియ “రన్నింగ్ కామెంటరీ” తోనే. ఇది వేరెక్కడా ఎప్పుడూ లేని ప్రక్రియ. నాలుగు (దరిమిలా రెండు) స్టాంజాల కవితల్లో వర్తమాన రాజకీయ చిత్రాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపించటం సులువు కాదు. దేవీప్రియ దీన్ని 1982లో మొదలుపెట్టి ఒక ఏడాదీ, తర్వాత 1999లో మొదలుపెట్టి ఇంకో ఏడాదీ నిర్వహించారు. అందులో మొదటి విడత వెలువడిన వాటిని కలిపి ఈ సంపుటం వేశారు.
~ లభ్యం
అమ్మ కథలు
“కథలు అందరూ రాస్తారు. కాని మంచి కథలు కొందరే రాస్తారు. మంచి కథలు రాసే ఆ కొందరిలో సమ్మెట ఉమాదేవి ఒకరు. వారి కథలు బాగుంటాయి. బాగుండడమే కాదు, బాధపెడతాయి. బాధపెట్టి కన్నీళ్ళు రప్పిస్తాయి. ఈ కథా ప్రారంభాలు ఎంత బాగున్నాయో, కథాంతాలు అంతకు రెట్టింపు బాగున్నాయి. కథను కథగా చెప్పడం ఉమాదేవిగారికి బాగా తెలుసు. తెలిసినదంతా కథలో చెప్పాలనే తాపత్రయం ఆమెకు లేకపోవడమే ఈ కథలు ఇంతగా బాగుండడానికి కారణం అని నేను భావిస్తున్నాను. ఏది కథగా చెప్పాలో, చెప్పాల్సింది ఏ మేరకు చెప్పాలో చక్కగా తెలిసిన రచయిత్రి సమ్మెట ఉమాదేవి. అందుకు వారిని అభినందించక తప్పదు.” అంటున్నారు జగన్నాథశర్మ
~ లభ్యం
ఈబుక్స్
శ్రీఛానెల్
పదిహేనేళ్ల క్రితం “ఆంధ్రప్రభ” వారపత్రికలో రెండు పేజీలు శ్రీఛానెల్ ప్లే అయ్యేది. చాలామంది పత్రిక రాగానే ఆ రెండు పేజీలూ తిరగేసిన తర్వాతే మిగతావి చూసేవారు. శ్రీరమణ కొంటెతనానికి బాపు బొమ్మల తోడు. మనకున్న హాస్య రచయితలందరూ ఎక్కువ మధ్యతరగతి మీదే తమ కొంటెతనాన్ని చూపించారు. శ్రీరమణా ఇందుకు మినహాయింపు కాదు. ఈ పుస్తకం విషయ సూచిక దాటింది మొదలు… చివరి పేజీ దాకా (నిజానికి వెనక అట్ట దాకా కూడా) మనల్ని నవ్విస్తుంది.
~ లభ్యం
ఋతుఘోష
పాశ్చాత్య రచనల్లో పదే పదే ఋతువుల గురించీ వాటి మార్పుల గురించీ ప్రస్తావనలు కనపడతాయి. అక్కడ ఋతువుల మార్పులు అంత స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి. మన దేశంలో ఋతువులు ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి తెలీకుండా మారిపోతూ ఉంటాయి. మనం గమనించేసరికే ఇంకో ఋతువులో ఉంటాం. బహుశా అందుకే ఋతువుల గురించి వర్ణనలు మన రచనల్లో తక్కువ. ఎండ, చలి, వాన ఇవే కనపడతాయి. ఇలాంటి చోట కేవలం ఋతువుల్నే ఇతివృత్తంగా తీసుకుని కావ్యం రాయాలంటే ఆ కవికి ఎంతో పరిశీలన ఉండాలి. అతను ప్రకృతితో అంతగా మమేకమైపోయి ఉండాలి. శేషేంద్ర ఈ గుణాల మూర్తీభవం. ఈ కావ్యంలో భావాలే కాదు, వాటి వ్యక్తీకరణకు ఎన్నుకున్న శబ్దాలు కూడా ఋతు లక్షణాల్ని ప్రతిఫలిస్తాయి.
~ లభ్యం
సాయంకాలమైంది
పన్నెండేళ్ళ క్రితం ఆంధ్రప్రభలో ధారావాహికంగా వచ్చిన నవల ఇది. ఒక వైష్ణవ కుటుంబం నాలుగు తరాల క్రమంలో ఎలాంటి మార్పులకు లోనయిందో చిత్రిస్తుంది. ఒక తరం వైష్ణవ సంప్రదాయం నుంచి పక్కకు వచ్చి ఆయుర్వేద వైద్యం చేపడుతుంది, తర్వాతి తరం ఉద్యోగం కోసం విదేశీ వలసలు, కులాంతర వివాహాలు ఇలా మారుతుంది. చదివించే గొల్లపూడి శైలి ఈ నవలకు ఆయువుపట్టు. ఇప్పుడిది ఈబుక్ రూపంలో లభ్యమవుతోంది.
~ లభ్యం
వల్లంపాటి నవలలు
వల్లంపాటి మనకున్న చాలామంది pragmatic critics (ఫలితవాద విమర్శకుల)లో ఒకరు. ఈ వ్యక్తిత్వం వెనుక ఆయన మార్స్కిస్టు నిబద్ధత ఉంది. ఈ నవలలు ఆయన ఇంకా విమర్శక అవతారం ఎత్తక ముందు రాసినవి. ఈ పుస్తకంలో “ఇంద్రధనుస్సు”, “దూరతీరాలు”, “మమతలు మంచుతెరలు” అనే మూడు నవలలు ఉన్నాయి. ఇప్పుడు మూడు నవలల సంపుటం ఈబుక్గా లభమవుతోంది.
~ లభ్యం