Empty glass wine bottles, washed and ready for recycling.; Shutterstock ID 148576436; PO: aol; Job: production; Client: drone

చెప్పుకోండి చూద్దాం – ఫిబ్రవరి 2014

ఈ శీర్షికన ఏదైనా ఒక తెలుగు రచనలోంచి కొంత భాగాన్ని ఉదహరిస్తాం. దాని ఆధారంగా కింద అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. మీ సమాధానాన్ని ఇక్కడ కామెంటుగా గానీ (దాన్ని పెండింగ్ లో ఉంచుతాం), లేదా editor@kinige.com కు మెయిలుగా గానీ పంపవచ్చు.

1.

రమించేసుకున్నాం కదా

ప్రపంచం కావాలిప్పుడు –

.

వూరికినే గది చుట్టూ చూస్తా –

నా బూతులు మా మూలుగులు

అర్థం పర్థం లేని మా మాటలు

గోడ మీద ఆ రెండు బల్లుల్లా

అంటుకుపోయి అలా అలా కదుల్తున్నట్టు.

— నవ్వొస్తుంది.

సీలింగ్ ఫ్యాన్ స్టీల్ కంట్లో

నా అర్ధనగ్న శరీరం మసగ్గా గిరగిరా –

.

ఆవిడ గోడ వైపుకు తిరిగి చీరకట్టుకుంటూ –

ఛాతికే తప్ప

వీపుకేం సిగ్గుండదేమో వీళ్లకి

— నవ్వొస్తుంది.

.

ప్రేమించేసుకున్నాం కదా

ప్రపంచం కావాలిప్పుడు.

ప్రశ్న: ఒక ప్రసిద్ధ కథతో కథకుల జాబితాలో చేరిపోయినా, మంచి కవితలు కూడా రాశారు. పైన ఇచ్చినవి ఈయన కవితలోని కొన్ని పంక్తులు. ఎవరీయన? క్లూ మీకు దరిదాపుల్లోనే కనపడుతుంది.

2.

ఒహ బ్రాహ్మడు చేత్తో సాంబారు బక్కెట్టు, మరో బ్రాహ్మడు చేత్తో నేతిగిన్నే పట్టుకొని నిలబడ్డారు. నేతి బ్రాహ్మడు ఫిడేలు తీగ మోగించినట్లు చటుక్కున మెరుపులా వడ్డించేసి పోతున్నాడు. విస్తరికో చుక్కన్నా పడి వుంటుంది. “***” గారు నేతి వాసన చూసి, బ్రాహ్మణ్ణి వెనక్కి పిలిచి కాస్త మరింత నెయ్యి వడ్డించమన్నారు. ఆ బ్రాహ్మడు “***” గారిని క్రీగంట చూస్తూ ‘ఎస్ట్రాసార్’ అన్నాడు. “***” గారికి ఉక్రోషం వచ్చింది. “భోజనంలో నెయ్యికి తప్ప మరేదానికీ ఎస్ట్రా లేదా?” అని అడిగారు. బ్రాహ్మడు లేదన్నాడు. “***” గారు తల వంచుకొని సరే సాంబారు పొయ్యి అన్నారు. ఆ బ్రాహ్మడు పోస్తున్నాడు. ఈయన విస్తట్లో అన్నాన్ని కుదురు చేసుకొని సాంబారును తాగేస్తున్నారు. పంక్తిలో ఉన్న వాళ్ళంతా ఆయన వంకా, ఆయన పక్క కూచున్న మా వంకా విస్తుపోయి చూస్తున్నారు. బక్కెటు ఖాళీ అయిపోయింది. ఆయన సాంబారు బ్రాహ్మడి కేసి చూసి, “అలా చూస్తావేం పట్రా – ఎస్ట్రా లేదుగా?” అన్నారు. అంతలో మరో అరవ ఆసామీ వచ్చి “***” గారికి దండం పెట్టి “ఇంతటితో ఆపేసి మమ్మల్ని క్షమించండి. కావాలంటే నెయ్యి వడ్డించమంటాను” అన్నాడు.

ప్రశ్న: పైన మూడు చుక్కలు పెట్టిన చోట ఒక రచయిత పేరుంది. ఆయన గురించి బాగా ప్రాచుర్యం పొందిన వృత్తాంతమిది. ఇంతకీ ఎవరాయన? అది మరీ సులభంగా తెలిసిపోతే, ఈ వృత్తాంతం మొదట ఎవరి ద్వారా ప్రపంచానికి తెలిసిందో కూడా చెప్పండి వీలైతే.

3.

“నీ దుర్గతికి కారణం ఇదే బాబూ! నీకు జ్ఞానం వుంది. ఇటీవల ప్రచారంలోకి వొచ్చిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నావు. కాని ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఆ సిద్ధాంతం ప్రచారంలోకి వొచ్చిన తర్వాత అనేక కొత్త విషయాలు అనుభవంలోకి వొస్తున్నాయి. అప్పుడు నీకున్న జ్ఞానం నూతన సమస్యల్ని పరిష్కరించడానికి సహాయపడటం లేదు. నీలో నిజమైన మానవత్వం, సక్రమమైన సంస్కారం వుంటే, నువ్వేమి చేసి వుండేవాడివో తెలుసా? నీ జ్ఞాన భండారాన్ని క్రొత్త విషయాలతో నింపేవాడివి. ఇప్పటికున్న జ్ఞానంతో, సమస్యల వొత్తిడితో, కొత్త మార్గాన్ని అన్వేషించేవాడివి. సలక్షణంగా అభివృద్ధి చెంది లోక కళ్యాణార్థం పాటుపడేవాడివి.”

ప్రశ్న: తెలుగు క్లాసిక్స్ జాబితాలోని నవల ఇది. ఇందులోని ఏంటీ హీరోకి ఇలా ఉద్భోద చేస్తున్న పాత్ర పేరేమిటో చెప్పండి.

*

గత సంచిక జవాబులు:

గత సంచికలో అడిగిన ప్రశ్నలకు చాలా జవాబులే వచ్చాయి. అందరూ సరైన జవాబులే ఇచ్చారు.

అందరికన్నా ముందు జవాబు ఇచ్చిన వారు అరుణ పప్పు.

himajwala

 మొదటిది: ఆ సంభాషణ వడ్డెర చండీదాస్ నవల “హిమజ్వాల”లోది.

padava prayanam

రెండవది: ఈ భాగం పాలగుమ్మి పద్మరాజు ప్రసిద్ధ కథ “గాలివాన”లోది.

Posted in 2014, చెప్పుకోండి చూద్దాం, ఫిబ్రవరి and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.