stephen king

నో స్మోకింగ్

Download PDF  ePub  MOBI

.

cinema venuka kathaluప్రముఖ రచయిత స్టీఫెన్ కింగ్ రాసిన కథ “Quitters, Inc.” ఇలాంటి కథ తో మొదట “టేల్స్ ఫ్రం ది డార్క్ సైడ్” అనే టివి సీరీస్ లో “బిగోలోస్ లాస్ట్ స్మోక్” అనే ఒక ఎపిసోడ్ వచ్చింది. ఆ తర్వాత ఈ కథ ఆధారంగా రెండు చలనచిత్రాలు రూపొందించబడ్డాయి; ఒకటి హాలీవుడ్ లో, మరొకటి బాలీవుడ్ లో. హాలీవుడ్ లో “నైట్ షిఫ్ట్” అని మూడు లఘు చిత్రాలతో కూడిన సంకలనంలో ఒక భాగంగా “క్యాట్స్ ఐ” పేరుతో ఈ కథ చలనచిత్రంగా రూపుదిద్దుకొంది (ఒక సన్నివేశం). తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం, హిందీలో “నో స్మోకింగ్” పేరుతో అనురాగ్ కశ్యప్ ఈ కథ అధారంగా ఒక సినిమా రూపొందించారు. “క్యాట్స్ ఐ” లో అసలు కథను యధాతథంగా నే ఉంచారు. “నో స్మోకింగ్” లో మాత్రం ఎత్తుగడ మాత్రమే తీసుకున్నారు. సిగెరెట్ తాగని వాళ్లకు సిగెరెట్ తాగే వాళ్లను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందులో ఏముందనో పొద్దస్తమానం కాలుస్తూనే ఉంటరని వీళ్ల అభిప్రాయం. సిగెరెట్ తాగే వాళ్లకి సిగెరెట్ తాగని వాళ్లంటే కొంచెం చిన్నచూపు కూడా ఉంటుంది. తామనుభవిస్తున్న మజా వాళ్ళకి తెలియదని వీళ్ల అభిప్రాయం. ఎలా చూసినా ఈ సిగెరెట్ తాగడం అనేది ఒక గమ్మత్తైన విషయం. తాగేవాళ్లకే ఆ విషయం తెలుస్తుంది. సిగెరెట్ తాగేవాళ్లల్లో చాలామంది రోజూ సిగెరెట్ మానెయ్యాలనే అనుకుంటుంటారు. కానీ కుదరదు. సిగెరెట్ తాగడమనే వ్యసనం ముఖ్య అంశంగా నడిచే కథే, ఈ నెల సినిమా వెనుక కథ . – వెంకట్ సిద్ధారెడ్డి

నో స్మోకింగ్

- స్టీఫెన్ కింగ్

మౌళికి పరమ చిరాగ్గా ఉంది. కొద్ది సేపటి క్రితమే, ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లవలసిన ఫ్లైట్ నెంబర్ AI24706 మరో గంట ఆలస్యంగా రాబోతుందని డిస్ప్లే చేశారు. క్లయింటుతో మీటింగ్ ముగించుకుని హడావుడిగా ఎయిర్‌పోర్ట్ చేరుకుని మూడు గంటలయింది. లౌంజ్ లో కూర్చుని ఐపాడ్ లో ఆఫీస్ మైల్ మరోసారి చెక్ చేసుకున్నాడు; కొత్త మైల్స్ ఏవీ రాలేదు. చిరాగ్గా ఐపాడ్ బ్యాగ్ లో పెట్టుకుని స్మోకింగ్ లౌంజ్ వైపు నడిచాడు.

ఎయిర్‌పోర్ట్ లో స్మోకింగ్ చెయ్యడమంత నరకం ఇంకోటి లేదు. సరిగ్గా నలుగురు కూడా నిలబడి లేని చిన్న గదిలో ఒక యాభై అరవై మంది సీరియస్ గా సిగెరెట్ తాగుతుంటారు. అయినా తప్పదు; సిగెరెట్ కాల్చకుండా కాసేపైనా కుదురుగా ఉండలేడతను.

స్మోకింగ్ లౌంజ్ లోపలకి వెళ్లి సిగెరెట్ ప్యాకెట్ బయటకు తీశాడు. ఖాళీ పెట్టె! తెచ్చుకున్న హాఫ్ ప్యాకెట్ ఫుల్గా తాగేశాడని అర్థమైంది. ఎయిర్‌పోర్ట్ లో సిగెరెట్స్ దొరికి చావవు. పోనీ అక్కడ సిగెరెట్ తాగుతున్న ఎవర్నైనా అడుగుదామనుకున్నాడు, కానీ ఒక్క మొహం కూడా అప్రోచబుల్ గా అనిపించలేదు. “ఛ. ఇంకోగంట,” అనుకుంటూ విసుగ్గా బయటకు వచ్చాడు. చకచకా కింద ఫ్లోర్ లో ఉన్న బార్ లోకి నడిచాడు.

“చెప్పండి సార్?”

“ఒక లార్జ్ యాంటిక్విటీ బ్లూ. ఒక ప్యాకెట్ లైట్స్”.

“ఇంకేమైనా కావాలా సర్?”

“అంతే”

“ఎనిమిది వందల డెబ్బై మూడు అయింది సార్. క్యాషా? కార్డా?”

క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు మౌళి. గతంలో ఒకసారి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది కానీ, మరీ ఇంత ఖర్చవుతుందని మాత్రం అనుకోలేదు మౌళి. అయినా అవన్నీ ఆలోచించే పరిస్థితిలో లేడతను. ఒకసారి సిగెరెట్ తాగాలనిపించాక తాగాల్సిందే!

అరనిమిషంలో హడావుడిగా సిగెరెట్ కాల్చేసాక కానీ అతని మనసు స్థిమితపడలేదు. బ్యాగ్ లోనుంచి ఐప్యాడ్ తీసి మరోసారి మైల్ చెక్ చేసుకున్నాడు. మైల్స్ ఏమీ లేవు. ఇంతలో విస్కీ పట్టుకొని వచ్చాడు వెయిటర్. నెమ్మదిగా విస్కీ తాగుతూ మరో సిగెరెట్ వెలిగించి చుట్టూ చూశాడు. బార్ లో జనాలు పెద్దగా లేరు. అతను కూర్చున్న రెండు టేబుళ్ళకవతల ఒక వ్యక్తి ల్యాప్ టాప్ లో ఏదో టైప్ చేస్తున్నాడు. తనలాగే సేల్స్ వాడెవదో అయ్యుంటాడని అనుకున్నాడు. విస్కీ మరో సిప్ చేసి సిగెరెట్ తాగుతుండగా ఆ వ్యక్తి తలెత్తి మౌళి వైపు చూశాడు. ఇద్దరి చూపులూ కలిశాయి. “వీడెవడ్రా బాబూ నన్నే చూస్తున్నాడు,” అనుకుంటూ ఐప్యాడ్ లో తలదూర్చే ప్రయత్నం చేస్తుండగా, “అరే వీడు శ్రీకాంత్ గాడు కదా!” అనుకుంటూ అతని వైపు చూశాడు. ఈ లోపలే ఆ వ్యక్తి తన టేబుల్ దగ్గర్నుంచి లేచి, “అరే మౌళీ!” అంటూ దగ్గరకు వచ్చాడు.

అవును అతను శ్రీకాంతే. “ఏంట్రా ఇలా మారిపోయావు? నువ్వే అనుకున్నాను. కానీ…” అంటూ శ్రీకాంత్ని కిందనుంచి పైకి ఒకసారి చూశాడు. ఎప్పుడూ చేతిలో సిగెరెట్, సోడాబుడ్డి కళ్లద్దాలు, గాలొస్తే ఎగిరిపోయేలాంటి ఆకారం. ఏడేళ్ల క్రితం తనకు తెలిసిన శ్రీకాంత్ కీ ఇప్పుడు తన కళ్లముందున్న శ్రీకాంత్ కీ అసలు పోలికే లేదు.

“మౌళీ! ఎన్నిరోజులైందిబే. నువ్వేంటిక్కడ?”

“క్లయింట్ తో మీటింగ్ రా! కానీ నువ్వేంట్రా ఇలా అయిపోయావ్? బక్కగా ఉండేవాడివి. కొంపతీసి సిక్స్ ప్యాకా ఏంటి?”

“అంతలేదురా! నువ్వు మాత్రం ఇంకా అప్పట్లానే మంచి ఫిట్ గా ఉన్నావే?”

ఏదో శ్రీకాంత్ మాటవరసకు అనుంటాడని మౌళికి తెలుసు. లేకపోతే షర్ట్ లోనుంచి తోసుకొస్తున్న పొట్ట, కళ్లకింద నలుపు, ఉబ్బిపోయిన మొహం చూస్తే ఎవరూ అతను ఫిట్ గా ఉన్నారని అనరు.

“నువ్వూ హైదరాబాదేనా?” అడిగాడు మౌళి.

“లేదు. ఢిల్లీ వెళ్తున్నాను. కొత్త క్లయింట్. రేప్పొద్దున మీటింగ్. తగిలిందంటే జాక్‍పాటే!” చెప్పాడు శ్రీకాంత్.

“ఇంకా అదే కంపేనీ లో ఉన్నావా?”

“యెస్. విపి,సేల్స్”

శ్రీకాంత్ చెప్పింది వినగానే మౌళికి కడుపులో మంటగా అనిపించింది.నిజానికి శ్రీకాంత్ని చూడగానే అతనికి కడుపులో మంట మొదలైంది. ఇద్దరూ కలిసి ఒకే రోజు ఉద్యోగం లో చేరారు. నాలుగేళ్లు పని చేశాక శ్రీకాంత్ వేరే కంపెనీ కి వెళ్లిపోయాడు. మౌళి మాత్రం పదేళ్లనుంచి అదే కంపెనీ! “వైస్ ప్రెసిడెంట్ సేల్స్. సీనియర్ సేల్స్ మేనేజర్.” మనసులో అనుకున్నాడు మౌళి. కొంచెం అసూయగా అనిపించింది. బహుశా తన కడుపులో మంటకు అదే కారణమేమో అనుకున్నాడు కానీ, ఇంతలోనే మధ్యాహ్నం హోటల్లో తిన్న భోజనం మీద నింద మోపేసాడు.

శ్రీకాంత్ తన బ్యాగ్ ప్యాక్ చేసుకుని వచ్చి మౌళి టేబుల్ దగ్గరే కూర్చున్నాడు.

“వి.పి సేల్స్! గ్రేట్ మ్యాన్. ప్రమోషన్ ఎప్పుడొచ్చింది. లాస్ట్ ఇయర్ కృష్ణ కలిశాడు. వాడు కూడా చెప్పలేదు,” అంటూ శ్రీకాంత్ హ్యాండ్ షేక్ చేశాడు మౌళి.

“అప్పటికి ఇంకా ప్రమోషన్ రాలేదు రా! అంతా సడెన్ గా జరిగిపోయింది. మూడు నెలల్లో నా జీవితమే మారిపోయింది,” అంటూ ఆగి విస్కీ తాగుతూ మౌళి వైపు అదోలా చూసి, “నీకు టైముందా?” అడిగాడు.

“ఫ్లైటు నాలుగు గంటలు లేటు”

“ఇంకో పెగ్ చెప్దామా?” అడిగాడు శ్రీకాంత్.

వెయిటర్ని పిలిచి రెండు డ్రింక్స్ ఆర్డర్ చేశాడు శ్రీకాంత్. మౌళి మరో సిగెరెట్ వెలిగించబోతూ శ్రీకాంత్ కి ఆఫర్ చేశాడు.

“నేను మానేశాను” అన్నాడు నవ్వుతూ.

“నిజంగానా? ఎప్పుడు?”

“పోయిన డిశెంబర్ లో. ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేను. ఆఫీస్ లో వర్క్ టెన్షన్స్. టార్గెట్స్ మీట్ అవటం లేదని బాస్ గోల. నేనసలు ఇంటికే రావటం లేదని లత అలిగి పిల్లలతో వాళ్లింటికి వెళ్లిపోయింది. టెన్షన్ తో సిగెరెట్లు ఎక్కువ కాల్చేశాను. హెల్త్ బాగా పాడయింది. కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అల్సర్ అని చెప్పాడు. సిగెరెట్ మానకపోతే డేంజర్ అన్నాడు. లత తిరిగి వచ్చింది. సిగెరెట్ తాగితే నా మీద ఓట్టే అని కూర్చుంది. అయినా నా వల్ల కాలేదు.”

శ్రీకాంత్ చెప్తున్నది వింటూ సిగెరెట్ని సగంలోనే యాష్ ట్రే లో పడేశాడు మౌళి.

“మరి ఎలా మానేశావ్?” అడిగాడు మౌళి.

Posted in 2014, అనువాదం, ఫిబ్రవరి, సినిమా వెనుక కథలు and tagged , , , , .

4 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.