abburi cover

సాహితీ ముచ్చట్లు

Download PDF  ePub  MOBI

కొన్ని కథల్లో ఎప్పుడూ తెర మరుగై ఉంటూ కూడా తెర ముందు జరిగే ప్రతీ విషయంపైనా ప్రభావం చూపెట్టే పాత్రలుంటాయి చూడండి, తెలుగు సాహిత్యంలో అబ్బూరి వరదరాజేశ్వరరావు గారిది అలాంటి పాత్ర అనిపిస్తుంది.  భావ కవిత్వ ప్రయోక్తలలో ఒకరైన అబ్బూరి రామకృష్ణారావు కుమారుడీయన. స్త్రీ వాద రచయిత్రి అబ్బూరి ఛాయా దేవి భర్త. నిన్నటి తరం ప్రముఖ రచయితల్లో చాలామంది తమ స్మృతులు నెమరువేసుకునే సందర్భాల్లో ఎక్కడో వో చోట అబ్బూరి వరద రాజేశ్వర రావు (మరీ సన్నిహితులకైతే ‘వరద’) ప్రస్తావన రాక మానదు. అలాంటాయన స్వయంగా ఆ ప్రముఖ రచయితలతో తన స్మృతులు నెమరువేసుకునే సందర్భాల్ని చదవాలంటే మాత్రం “కవన కుతూహలం” దాకా రావాల్సిందే. ఇది ఆయన ఆంధ్రప్రభలో రాసిన వ్యాసపరంపరను ఒక చోట సంకలించిన పుస్తకం. తెలుగు సాహిత్యపు దీగూళ్లలో మనం పటాలు పెట్టి గౌరవిస్తున్న రచయితల్లో చాలామందితో అబ్బూరి వరద రాజేశ్వర రావుకు వ్యక్తిగత పరిచయం ఉంది. ఆ పరిచయాల క్లుప్త సమీక్షణం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. సినిమాకి సంబంధించినవైతే తెర వెనుక సంగతులు అంటారు, అలాగే సాహిత్యానికి సంబంధించి కాగితం వెనుక కబుర్లు అనొచ్చా. ఇవి అలాంటి కబుర్లు. ఆ తరంలో కవిత్వం పట్ల సాహిత్యం పట్ల ఉన్న గాఢానురక్తిని ఇందులో ప్రతీ వ్యాసమూ ప్రతిఫలిస్తుంది. బహుశా చెప్పే మనిషి మసలుకున్న ప్రపంచం అది కావటం వల్ల కూడా కావొచ్చు. ఈ వ్యక్తుల గురించి వరదరాజేశ్వరరావు చెప్తోంటే ఒక రాగద్వేషాలు గల మనిషి మాట వినడంలా ఉండదు, కాలమే స్వయంగా నోరు విప్పి మాట్లాడుతుంటే వినడంలా ఉంటుంది. ఈ నెల “సాహితీ ముచ్చట్ల”న్నీ ఆయన “కవన కుతూహలం” నుంచి తీసుకున్నవే.

శ్రీశ్రీ – చెళ్ళపిళ్ళ

(చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి అంటే శ్రీశ్రీకి చాలా గౌరవం. ఆయన దగ్గరకు తీసుకువెళ్లమని అబ్బూరిని అడుగుతాడు. ఒకసారి సందర్భం కుదిరి శ్రీశ్రీని వెంటబెట్టుకు వెంకటశాస్త్రి దగ్గరకు తీసుకువెళ్తారు అబ్బూరి.)

chellapillaశాస్త్రిగారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేవి”టన్నాడు. అప్పటికే వయోవృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రి గారు మందహాసం చేసి “నేను కవినేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరపాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రి గారు నవ్వారు. “కవిత్వం అంటే ఏది కాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం. మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను.” శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తల పెట్టారు. అకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపల నుంచి పిలిచారు. మేము లేచాం. శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు – “నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏవిటో… అంత సులభమటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో – నీకు నేనూ నాకు నువ్వూ తప్ప… అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు. ఆనాటి శాస్త్రి గారి నిర్వచనాన్ని శ్రీశ్రీ నాతో జీవితాంతం దాకా ప్రస్తావించేవాడు.

విశ్వనాథ సత్యనారాయణ

(ఒకసారి అబ్బూరి, జలసూత్రం, విశ్వనాథ ఒకే రైల్లో ప్రయాణిస్తున్నారు. విశ్వనాథ కాసేపు విశ్రాంతి తీసుకుంటానని పై బెర్తు మీదకెక్కారు. కాసేపటికి అదే పెట్టె ఎక్కి కూర్చున్న ప్రయాణికులిద్దరు పిచ్చాపాటీ మాట్లాడటం ప్రారంభించి సంభాషణను సాహిత్యం వైపు మళ్లించారు. యాధృచ్ఛికంగా, పైబెర్తు మీద ఉన్నది విశ్వనాథ అన్నది వాళ్ళకి తెలియకనే, ఆ సంభాషణ విశ్వనాథ సాహిత్యం వైపు మళ్లుతుంది)

పెద్దాయన (ఒక ప్రయాణికుడు) అన్నాడు, “ఏమన్నా అనువోయి, విశ్వనాథ ఉన్నాడే – మహా ఘటికుడు, వాడి తస్సాదియ్యా, ఏం రాస్తాడయ్యా – కొన్ని పద్యాలు అమోఘం… ఈ పద్యం విను…

ఒక యెన్నొ పుట్టుకలకు ముందరైన మViswanatha

త్ర్పారబ్ధ మీరీతి బరిణమించె

నానా విచిత్ర జన్మకృతాస్మదఘరాశి

అయి అయి నేటి కిట్లయ్యె దుదకు

పితృదత్తమగు నాస్తి హతమయ్యె నా యందు

ఆయనిచ్చిన భార్య యట్లె పోయె

నా తండ్రి చేసిన నానా మహాపుణ్య

కర్మ లీగతి గంగ గలసిపోయె

మిగిలినది యొక్కడే నాకు మేరువంత

బరువు నా గుండెలో మధ్య భాగమందు

అంతె పేరున కంతె భార్యాస్థిగాని

నా శరీరాస్థి నిజము కృష్ణార్పణమ్ము…”

[జలసూత్రం రుక్మిణీనాథ] శాస్త్రి వాళ్ళిద్దరి వంకా, ముఖ్యంగా పద్యం చదివినాయన వంకా కనురెప్ప వాల్చకుండా చూస్తున్నాడు ఆశ్చర్య సంభ్రమాలతో. నేనూ చకితుణ్ణయినాను. ఎంచాతనంటే ఆ పద్యం నాకూ ఎంతో నచ్చిన పద్యం. నేను పైకి చూశాను. సత్యనారాయణ గారు మేల్కొని ఉన్నారు. కింద మాకెదురుగా కూచున్న వాళ్ళ వంక చూస్తున్నారు. … ఇంతలో ఏదో స్టేషను వచ్చి రైలాగింది. వాళ్ళిద్దరూ దిగిపోయారు. …

“వాళ్ళెవరో కనుక్కుంటే బాగుండేది” అన్నాడు శాస్త్రి.

“అనవసరం” అన్నాను. …

సత్యనారాయణ గారు కిందికొచ్చారు.

కింద జరుగుతున్నదంతా వింటున్నారా అని అడిగాను. ఆయన నవ్వుతూ, “వినకేం – నాకు దుఃఖం కూడా వొచ్చింది. నన్ను మెచ్చుకునే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు – ఒక్క తిట్టేవాళ్ళే కాక – అని తెలిసింది” అన్నారు.

“మీరు మరీని – మిమ్మల్ని తిట్టే అధికారం యెవరికుందండీ? ఆ రోజులు మరిచిపొండి” అన్నాడు శాస్త్రి.

“ఇప్పుడు విన్నారుగా – ఇలా దేశంలో ఎంతమంది మీరెవరో తెలియకుండా మీ కవిత్వాన్ని మెచ్చుకునే వాళ్లున్నారో! నాకు మాత్రం నమ్మకం ఉంది. మీర్రాసిన పద్యాల్లో చాలావరకు నిలుస్తయని”

“అది కాదయ్యా! నేను చచ్చిపోయిం తరవాత ఎలా ఏడిస్తే నాకేం లాభం? ఆ దృష్టితో నేను రాయటం లేదు. నా ఆనందం కోసం నేను రాస్తున్నాను. నా అనుభూతి నాది. కవిత్వం చెప్పటం నా ధర్మం. అంతే కాదు, విద్యుక్త ధర్మం అని భావించేవాళ్ళల్లో నేను మొదటివాణ్ణి. ఎందుకంటే, నా సంస్కారం పూర్వజన్మ సుకృతం కనుక. నీకు నచ్చితే చదువు. లేకపోతే మానేయి. ఎవరి కవిత్వాన్ని అయినా ఆనందించాలంటే ఆ కవికున్న సంస్కారంలో కొంత పాలన్నా ఆ చదివేవాడికుండాలి. అది లేనప్పుడు ఆ కవిత్వం జోలికి పోకూడదు… ఆ నా పద్యం విన్నావు కదా! నా ట్రాజెడీ – నా గుండె పగిలి ధారాపాతమయిన నెత్తుటితో విరచితాలయిన పంక్తులవి – వింటున్నావా శాస్త్రీ! సహృదయతా, సానుభూతీ లేని వాడెలా గ్రహించగలడిలాంటి పద్యాన్ని?” అన్నారు సత్యనారాయణ గారు.

జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి

 (అబ్బూరి, జలసూత్రం చలం గారింట్లో కలుస్తారు. అక్కణ్ణించి సినిమాకి బయల్దేరతారు) 

jalasutram“ఏం సినిమా వేస్తున్నారో తెలియకుండా అతను టిక్కెట్లు కొన్నాడు. ఇదరం వెళ్ళి బెంచి తరగతిలో కూర్చున్నాము. అప్పటికే మేము ఆలస్యంగా వెళ్ళాము. ద్రౌపదీ మానసంరక్షణమో, వస్త్రాపహరణమో – కౌరవుల నిండు సభ, ద్రౌపది ప్రవేశిస్తుంది. ఆవిడ చేలాంచలాన్ని దుశ్శాసనుడు పట్టుకొని వుంటాడు. ద్రౌపది పాడటం ప్రారంభించింది, “సహింతురా, సహింతురా, రాజరాజాధిరాజుల్ సహింతురా” అంటూ. రుక్మిణీనాథశాస్త్రి నా ప్రక్కన కూర్చొని “రమింతురా, రమింతురా, రాజరాజాధిరాజుల్…” అని చిరునవ్వుతో పాడటం మొదలుపెట్టాడు. నేను గట్టిగా నవ్వేశాను. మా చుట్టుప్రక్కల వాళ్ళు విసుక్కుంటున్నారు. అప్పటికీ రుక్మిణీనాథశాస్త్రి వూరుకోలేదు. పాటనంతటినీ అలాగే మధ్య మధ్య విరిచి హాస్యాస్పదం చేస్తున్నాడు. నాకు తప్ప మరెవ్వరికీ వినిపించకూడదని అతని ఆశయం. అయితే మా పక్కనున్న ప్రేక్షకుల్లో పాండవ పక్షపాతం కలవాళ్ళు ఎక్కువగా వుండి ముందుగా రుక్మిణీనాథశాస్త్రిని మందలించారు. శాస్త్రి వూరుకోలేదు. కొంచెం విసుగ్గా “మీకేం బాధా?” అన్నాడు. పాండవ పక్షపాతి “నోర్ముయ్” అన్నాడు. నాకు కోపం వచ్చింది. “నువ్వే నోర్మూసుకో” అన్నాను. అప్పుడు వాళ్ళందరూ ఏకమై గోల చేశారు. శాస్త్రితో “పోదాం పద” అన్నాను. శాస్త్రి వూరుకోక “ద్రౌపది వీళ్ళ పెళ్ళాం కాబోలు!” అన్నాడు. అంతే అందరూ కలిసి మా ఇద్దర్నీ బలవంతాన గెంటేశారు బయటికి. నాకు ఉక్రోషం. శాస్త్రి నవ్వుతున్నాడు. “పద పోదాం” ఈ వెధవలకి సాహిత్యం మజా ఏం తెలుసు? అన్నాడు. ఇద్దరం ఇంటివేపు బయలుదేరాం. ఇంటికి రాగానే వెంకటచలం గారికి కథ అంతా చెప్పాను. ఆయన [చింతా] దీక్షితులు గారిని కేకేసి మా ఇద్దర్నీ చూపించాడు. ఆయన నవ్వుతూ, “ఈ దేశంలో పబ్లిగ్గా ఎగతాళి చెయ్యరాదని ఇప్పటికయినా తెలుసుకున్నావా?” అని శాస్త్రితో చెప్పి, అతన్ని కూడా అక్కణ్ణే భోం చెయ్యమని చెప్పారు. భోజనానంతరం తన విడిదికి వెళ్ళిపోయాడు శాస్త్రి.

త్రిపురనేని గోపీచంద్ – ఆలూరి బైరాగి

( “అసమర్థుని జీవయాత్ర”లో సీతారామారావు అనే పాత్ర పుట్టుకకు కారణం దాని రచయిత గోపీచంద్ కు కవి ఆలూరి బైరాగి మీద ఉన్న అక్కసా? ఆ రోజుల్లో తెనాలి రత్నాటాకీసు ముందున్న బల్లల దగ్గర అబ్బూరి వరదరాజేశ్వరరావు, గోపీచంద్, పి.వి సుబ్బారావు, సూరీ, బైరాగీ మొదలైన వాళ్లందరూ చేరి మాట్లాడుకునేవారట.)

aluri-bairagiగోపీచందు కూడా ఆ చర్చల్లో పాల్గొని తన కథల గురించీ, నవలల గురించీ విపులంగా చెబుతుండేవాడు. ఇవన్నీ వింటున్న బైరాగికి ఎవరి రాతల మీదా ప్రత్యేకాభిమానం లేదని మాకు తెలిసేది. మేమంతా మాట్లాడుకుంటే మధ్య కలుగజేసుకుని ఓ వితండవాదాన్ని లేవదీసేవాడు. దాంతో గోపీచందుకి విసుగొచ్చేది. కోపం కూడా తెచ్చుకునేవాడు. … ఓ రోజున బైరాగి రత్నాటాకీసు గోష్ఠిలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగార్ని విమర్శించాడు. బైరాగి అంటాడూ, మనమంతా వర్ణాశ్రమ ధర్మాన్ని విచ్ఛేదించాలని తీర్మానిస్తూంటే, కవి రాజుగారు ప్రతి కులంలోనూ మరో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని. దాంతో పి.వి. సుబ్బారావుకి కోపం వచ్చింది. ఇద్దరూ చెడామడా వాదించుకున్నారు. మేం వింటూ మాట్లాళ్ళేదు. తరవాత ఇంటికి పోతున్నప్పుడు “నాకు రాయాల్నుందిరా ఇప్పుడు” అన్నాడు. “రాయ్ ఆలస్యం చెయ్యక” అన్నాను నవ్వుతూ. “అదో కోరిక” అన్నాడు.

ఓ రోజున గోపీచందు కొత్త నవల రాయటానికి ప్రారంభించాడు. బైరాగి లాంటి అసమర్థుడు అందులో నాయకుడుగా ఉంటాడన్నాడు. నేనన్నానూ “అసమర్థుడి జీవయాత్ర అని నేనూ ఆత్మకథ రాద్దామనుకుంటున్నాను” అని. గోపీచందు ఆ శీర్షిక తను వాడుకుంటానన్నాడు. నవ్వుతూ నేను చెప్పాను, అందులో బైరాగి నాయకుడు కాకపోయిన పక్షంలో మీరీ శీర్షికను వాడుకోవచ్చునని. బైరాగికి ఇదంతా విని వుక్రోషం వచ్చింది. సమావేశం అయిపోగానే మామూలుగా మేమిద్దరమూ నడుస్తున్నాము మా ఇంటివేపు. నాకో నవల రాయాలనుంది, అందులో మన మేధావుల్నందర్నీ బట్టబయలు చెయ్యాల్నుంది అంటూ బైరాగి ఆవేశంతో మాటాడుతున్నాడు. బైరాగితో చెప్పాను: “అందరి మీదా నీది పైచేయి కావాలంటే కవిత్వం రాయి. అంతేకాని, అందరిలాగా నవల్లూ, కథలూ తలపెట్టక” అని.

మళ్ళీ బైరాగి రత్నాటాకీసు వేపు రాలేదు. మూడు, నాలుగు రోజులయింది. అతనికి ఒంట్లో బాగులేదేమోననుకున్నాము. ఓ రాత్రి మా ఇంటికొచ్చాడు. అప్పుడా ఇంట్లో విద్యుచ్ఛక్తి లేదు. కొత్తగా కట్టిన పూర్తికాని మేడ మెట్ల మీద ‘వరదా, వరదా’ అని అరుస్తున్నాడు. నేను కిందికొచ్చాను. … “నేను రాశాను. నువ్వు చదివి చెప్పు” అన్నాడు. చేతిలో రెండు కాగితాలు. మళ్ళీ లోపలికి పోయాము. లాంతరు పెట్టుకుని అతను చదవటం, నేను వినటం. విన్న తరవాత అద్భుతంగా వుందన్నాను. అందులో రెండే పంక్తులు నాకిప్పటికీ గుర్తు.

నగనగమ్మున పన్నగమ్ము

నదీ నదమ్ముల విపద్రవమ్ము…

చిరపరిచిత పాంథులారా! పతిత జీవ బంధులారా!

జాషువ

(విశాఖ పట్నంలో ఏదో స్నాతకోత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవంలో ఎంతోమంది దిగ్గజాలు పాల్గొంటున్నారు. పురిపండా అప్పలస్వామి, తురగా వెంకట రామయ్యగార్ల వెంట అబ్బూరి కూడా అక్కడికి వెళ్లారు. ఆయన అప్పటికి సెకండు ఫారం చదువుతున్నారు. మొదటి రోజు తాతా సుబ్బరాయశాస్త్రీ, ఆదిభట్ల నారాయణదాసూ, కాశీభట్ల సుబ్బయశాస్త్రీ, కావ్యకంఠ గణపతి మునీ ఇలా ఎందరో ప్రసిద్ధుల ఉపన్యాసాలు అయ్యాయి. మధ్యాహ్నమయ్యేసరికి అధ్యక్ష స్థానంలో విక్రమదేవ వర్మ అందర్నీ భోజనానికి ఆహ్వానించారు.)

Gurram_Jashuaఆ హాలు పక్కగా ఉన్న బాటనీ లేబొరేటరీ భవంతి పక్కన భోజనా లేర్పాటయినాయి. వెనక వేపు పండితులందరూ శాలువాలు తీసి భోజనానికి కూర్చున్నారు. … నాకెక్కడా చోటు దొరక లేదు. నేను ముందు వరండాలోకి వచ్చాను. అక్కడ సందడి లేదు. ఏం చేయాలో తోచక అలాగే నిలబడిపోయాను. మరో అయిదు నిమిషాలకు సమావేశ నిర్వాహకుల్లో ఒకరు ఒకాయన్ని వెంటబెట్టుకొని అక్కడ విడిగా కూచోబెట్టి లోపలికి పోయి ఓ విస్తరీ, చెంబూ తెచ్చిపెట్టారు. ఆయన నల్లగా పొడుగ్గా బొద్దు మీసాలతో నవ్వీనవ్వని మొహంతో అక్కడ చతికిల పడ్డారు. అక్కడ మరో పంక్తి ప్రారంభిస్తారనుకొని నేనలా చూస్తూ ఉండిపోయాను. మరెవ్వరా ప్రాంతాలకు వచ్చి ఆయన పక్కన కూచోలేదు. నేను చూసి చూసి ఆయన పక్కన చతికిలపడ్డాను. ఆయనకు చెంబులో నీళ్ళు పోసే ఆయన నన్ను చూసి నాకో విస్తరీ, గ్లాసూ తెచ్చి ఇచ్చారు. తరువాత మరెవ్వరో అన్నం, కూరలు వగైరా వడ్డించారు. … ఆ వరండా అంతటికీ మేమిద్దరమే ఉన్నాము భోజనానికి. ఓ రెండు నిమిషాలయిం తరువాత ఆయన నన్ను పలకరించాడు. “ఎవరబ్బాయివి నాయనా?” అని. నేను చెప్పాను. ఆయన ఆశ్చర్యపడ్డట్టు చూసి “ఇక్కడికి వచ్చి కూర్చున్నావేం?” అన్నాడు. “ఇంకెక్కడా చోటు లేదండీ!” అన్నాను. ఆయన నవ్వి ఊరుకున్నాడు.

మర్నాడు మధ్యాహ్నం ఆయనే – నాపక్కన కూచుని భోజనం చేసిన పెద్ద మనిషే – సభలో పద్యాలు చదువుతున్నాడు. అందరూ సావధానంగా వింటున్నారు. ఆయన పద్యాలు చదివే బాణీని అందరూ మెచ్చుకుంటున్నారు. కరతాళ ధ్వనుల మధ్య ఆయన పద్య పఠనం అయిపోయింది. ఆయనే జాషువా! … ఆ సాయంకాలం బిరుద ప్రదానం జరిగిన సమావేశానికి నేనూ పోయాను. జాషువా గారికి కవితా విశారద అనే బిరుదు భారతీ తీర్థ ప్రదానం చేసింది. సమావేశానంతరం జాషువా గారు నన్ను గుర్తించి పిలిచారు. నా తల నిమురుతూ “నిన్న నువ్వు నా పక్కన కూచున్నందు వల్ల నేను భోం చేయగలిగాను. నాలుక్కాలాలపాటు బతికి, నువ్వు కూడా కవిత్వం చెప్పు నాయనా!” అన్నారు.

తరువాత నాకర్థం అయింది. ఆయన హరిజనుడని వేరే భోజనానికి కూచోబెట్టారు. అది తెలీక నేను ఆయన పక్కన కూచుని భోం చేశాను. ఆ సంగతి తెలిసి నేను గర్వపడ్డాను. మా నాన్నగారు ఇది విని “భలే మంచిపని చేశావురా!” అన్నారు.

*

abburiఇటీవలే విజయవాడ నవోదయా పబ్లిషర్స్ వారు అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం”, “వరదకాలం” ఈ రెండు పుస్తకాల్ని కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. ప్రతీ తెలుగు సాహిత్యాభిమానీ దాచుకోదగ్గ పుస్తకం. ఈ పుస్తకంలోంచి ఈ కొన్ని వృత్తాంతాల్నీ ప్రచురించే అనుమతి ఇచ్చినందుకు నవోదయా వారికి కృతజ్ఞతలు.

Download PDF  ePub  MOBI

Posted in 2014, ఫిబ్రవరి, సాహితీ ముచ్చట్లు and tagged , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.