Kafka Sketch

తీర్పు

Download PDF  ePub  MOBI

(ఫ్రాంజ్ కాఫ్కా “ది జడ్జిమెంట్” కథకు ఇది మెహెర్ అనువాదం. కాఫ్కా ఈ కథను 1912 లో 29 యేళ్ల వయస్సులో రాశాడు. ఈ కథను రచనా వ్యాసంగంలోకి తన బ్రేక్ త్రూ కథగా కాఫ్కా భావించాడు.) 

వసంతకాలంలో ఒక ఆదివారం ఉదయం. జార్జి బెండెమన్ అనే యువ వ్యాపారి పైఅంతస్తులో ఉన్న తన గదిలో కూర్చుని ఉన్నాడు. ఆ ఇల్లు నది ఒడ్డున వరుసగా బారు తీరిన ఇళ్ళలో ఒకటి. అవన్నీ పొట్టిగా నాసిరకమైన కట్టుబడితో ఉన్నాయి. చూట్టానికి ఎత్తులోనూ రంగులోనూ ఒకేలా కనిపిస్తున్నాయి. అతను ఇప్పుడే విదేశాల్లో ఉంటున్న స్నేహితునికి ఉత్తరం రాయటం పూర్తి చేశాడు, పరధ్యాసగా దాన్ని మడిచి కవర్లో పెట్టాడు, మోచేతుల్ని రాతబల్ల మీద ఆనించి కిటికీ లోంచి బయట నది వైపూ, వంతెన వైపూ, దూరంగా ఆవలి ఒడ్డున నున్నని పచ్చదనంతో కనిపిస్తున్న కొండల వైపూ చూస్తూ కూచున్నాడు.

అతను స్నేహితుని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ స్నేహితుడు స్వదేశంలో తనకు సరైన అవకాశాల్లేవన్న అసంతృప్తితో, కొన్నేళ్ళ క్రితం రష్యాకి వలసపోయి, అక్కడ సెయింట్ పీటర్సుబర్గులో వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం మొదట్లో మంచి జోరుగానే సాగింది కానీ ఈమధ్య కొన్నాళ్ళుగా అంతకంతకూ నష్టాల్లో కూరుకుపోతోంది, ఈ మధ్య స్వదేశానికి వచ్చినపుడల్లా అతను ఈ విషయమై చాలా వాపోతున్నాడు (అసలు అతను రావటం కూడా రాన్రానూ అరుదైపోతోంది). పరాయి దేశంలో తన్ను తాను నిష్పలంగా అలవగొట్టుకుంటున్నాడు. గెడ్డం మాసిపోయింది, చర్మం ఎంత పసుపుగా పాలిపోయిందంటే అది నిద్రాణంగా ఉన్న ఏదో వ్యాధి లక్షణమేమో అనిపిస్తోంది. తనలాగే ఈ దేశం నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడిన తోటి ప్రవాసులతో అతనికి పెద్దగా పరిచయాల్లేవు, స్థానిక రష్యన్ కుటుంబాలతో సంబంధాలూ అంతంత మాత్రమే, ఇక బ్రహ్మచారిగా మిగిలిపోక తప్పని ఖర్మకు తల వంచుతున్నాడు.

అలాంటి మనిషికి ఉత్తరం ఏమని రాయాలి, అతను దారి తప్పాడని తెలుస్తూనే ఉంది, అతని గురించి బాధపడటం తప్ప చేయగలిగిన సాయమేదీ లేదు. సలహా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అతణ్ణి ఇంటికొచ్చేయమనీ, ఇక్కడే నిలదొక్కుకొమ్మనీ, పాత స్నేహితుల్ని కలేసుకొమ్మనీ, వాళ్ళ ఆసరా తీసుకొమ్మనీ చెప్పచ్చు. కానీ అతనికి వేరేలా అర్థం అవ్వొచ్చు. ఎంత మెత్తగా చెప్తే అంత లోతుగానూ గాయపడే అవకాశం ఉంది. ఇప్పటి దాకా అతని ప్రయత్నాలన్నీ వృథా అనీ, ఇక అతను ఓటమి ఒప్పుకుని ఇంటికి తిరిగి రావాలనీ, అందరి అంచనా కట్టే చూపులకూ గురిగా మిగలాలనీ, బతకనేర్చిన తోటి స్నేహితులందరితో పోలిస్తే అతనింకా ఏళ్ళొచ్చిన పసివాడేననీ, సొంత ఊళ్ళోనే నెగ్గుకురాగలిగిన స్నేహితుల్ని చూసి ఇకనైనా నేర్చుకోవాలనీ… ఇలాంటి అర్థాలేవో స్ఫురించే అవకాశం ఉంది. పోనీ అతణ్ణి ఇంత బాధపెట్టినందుకు జరిగే మంచేమన్నా ఉంటుందా అంటే అదీ ఖాయంగా చెప్పడానికి లేదు. అసలు అతణ్ణి ఇక్కడికి రప్పించటం సాధ్యమేనా అన్నది మొదటి అనుమానం – ఆ మధ్య ఎపుడో అతనే అన్నాడు, స్వదేశంలోని వ్యాపార లావాదేవీల్తో తనకు పూర్తిగా పరిచయం తప్పిపోయిందని – రప్పించలేకపోతే, అతను ఎప్పటిలాగే పరాయిదేశంలో ప్రవాసిగానే మిగిలిపోతాడు, అది చాలదన్నట్టు ఈ సలహాకి చిర్రెత్తి ఇక్కడి స్నేహితులకు కూడా దూరమైపోయే అవకాశం ఉంది. ఒకవేళ సలహా పాటించి వచ్చినా, తర్వాత ఇక్కడ కుదురుకోలేకపోతే, ఎవరితోనూ కలవలేక అలాగని ఒక్కడూ మనలేక, చివరికి తనదని చెప్పుకునే దేశం గానీ, తనవాళ్ళని చెప్పుకునే స్నేహితులు గానీ లేని వాడై పోతాడు, అంతకన్నా ఎలా ఉన్నవాడు అలా ఆ పరాయిదేశంలోనే ఉండిపోవటమే నయం. ఇదంతా లెక్కలోకి తీసుకుని ఆలోచిస్తే, ఒకవేళ అతను ఇక్కడకు వచ్చినా ఏ మాత్రం నెగ్గుకురాగలడూ అన్నదీ అనుమానమే.

ఇలాంటి కారణాల వల్ల, ఓమాదిరి పరిచయస్తుడితో కూడా అలవోకగా పంచుకోగలిగే ఇక్కడి ముఖ్యమైన విశేషాలన్నీ, అతనితో ఉత్తరాల్లో పంచుకోవటానికి మాత్రం కష్టమనిపించేది. అతను ఆఖరుసారి ఇక్కడకు వచ్చి మూడేళ్ళ పైనే అవుతోంది, రష్యాలోని రాజకీయ పరిస్థితి వల్ల రాలేకపోయానంటూ తలాతోకాలేని కారణమొకటి చెప్పాడు, ఓపక్క వేలాదిమంది రష్యన్లు పరాయి దేశాలు వలసపోవటానికి వీలు కల్పిస్తున్న అక్కడి రాజకీయపరిస్థితి, ఈ చిన్న వ్యాపారి కొన్నాళ్ళపాటు సొంతదేశం వెళ్ళిరావటానికి ఎందుకు అనుమతించదో అర్థం కాలేదు. ఈ మూడేళ్ళలో ఇటు జార్జి జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. రెండేళ్ళ క్రితం అతని తల్లి చనిపోయింది, అప్పట్నించీ ఇంట్లో అతనూ అతని తండ్రీ ఇద్దరే ఉంటున్నారు, ఈ విషయం స్నేహితునికి రాశాడు, బదులుగా అతని నుంచి వచ్చిన సానుభూతి ఉత్తరం ఎంత మొక్కుబడిగా ఉందంటే, ఇలాంటి సంఘటనల్లోని విషాదం దూర దేశాల్లో ఆకళింపుకు రాదేమో అనిపించింది. తల్లి మరణం తర్వాత జార్జి వ్యాపారం మీదా, మిగతా విషయాల మీదా, బాగా శ్రద్ధ పెట్టాడు.

బహుశా, తల్లి బతికున్నంతకాలం, తండ్రి వ్యాపారమంతా తన చెప్పుచేతల్లోనే నడవాలని పట్టుబట్టడం వల్లనో (దీని వల్ల జార్జి సొంతంగా ఏ నిర్ణయమూ తీసుకునే వీల్లేకపోయేది); లేక, తల్లి చనిపోయాకా, తండ్రి ఏదో నామమాత్రంగా తప్ప ఇదివరకట్లా కలగజేసుకోకపోవటం వల్లనో; లేదంటే మరి కేవలం అదృష్టం వల్లనో – ఈ చివరిదే అసలు కారణమై ఉంటుంది – ఏదేమైనా, ఈ రెండేళ్ళలోనూ వ్యాపారం అనుకోని రీతిలో వృద్ధి చెందింది, సిబ్బందిని రెట్టింపు చేయాల్సొచ్చింది, రాబడి ఐదు రెట్లు పైనే పెరిగింది; ఇంకా ముందుకు పోబోతోంది అనటంలో సందేహం లేదు.

స్నేహితునికి మాత్రం ఈ వృద్ధి గురించి ఏమీ తెలియదు. అందుకే అతను ఇదివరకూ చాలాసార్లు జార్జిని రష్యా వచ్చేయమని నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు (బహుశా ఆ సానుభూతి ఉత్తరంలో చివరిసారి కాబోలు), జార్జి నడిపే వ్యాపారాల్లాంటి వాటికి సెయింట్ పీటర్సుబర్గులో మంచి గిరాకీ ఉందని చెప్పుకొచ్చాడు. అది ఋజువు చేయటానికి పంపిన రాబడి లెక్కలు జార్జి ప్రస్తుత వ్యాపార రాబడితో పోలిస్తే పూచికపుల్లతో సమానం. అయినా అతను తన వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుందని స్నేహితునికి ఎందుకో అపుడు చెప్పలేకపోయాడు, ఇన్నాళ్ళ తర్వాత ఇపుడు చెప్తే వింతగా ఉండచ్చు.

అందుకే జార్జి తన స్నేహితునికి రాసే ఉత్తరాల్లో అప్రధానమైన సంగతుల గురించే రాస్తాడు, ఇలా స్తబ్ధుగా సాగే ఆదివారాల్లో తీరుబాటుగా ఆలోచిస్తున్నపుడు ఓ వరసావాయీ లేకుండా మనసులోంచి పైకి తేలే సంగతులవి. అక్కడ స్నేహితుడు తన ఆత్మసంతృప్తి కోసం సొంత ఊరి గురించి ఎలాంటి ఊహలు నిర్మించుకున్నాడో వాటిని భంగపరచని రీతిలో ఉత్తరాలు రాయాలి. అదీ జార్జి ఉద్దేశం. ఒకసారి అలాగే, ఏదో ఒకటి రాయాలి గనక, ఊళ్ళో ఎవరో కోన్‌కిస్కా అబ్బాయికీ అమ్మాయికీ జరిగిన ఎంగేజ్మెంటు గురించి రాస్తే, స్నేహితుడు ఆ విషయం గురించి అనుకోని ఆసక్తి చూపించడం కూడా మొదలుపెట్టాడు.

అయినా గ్రెగర్ ఇలా అప్రధానమైన సంగతులే రాస్తూ వచ్చాడు గానీ, ఒక నెల క్రితం స్వయంగా తనకే ఫ్రీడా బ్రాండెన్‌ఫెల్డ్ అనే సంపన్న కుటుంబపు అమ్మాయితో ఎంగేజ్మెంటు అయిందన్న సంగతి మాత్రం రాయలేకపోయాడు. అతను అప్పుడప్పుడూ కాబోయే భార్యతో ఈ స్నేహితుని గురించీ, తామిద్దరి ఉత్తరప్రత్యుత్తరాల్లోనూ ఇటీవల నెలకొన్న చిత్రమైన పరిస్థితి గురించీ చెప్పేవాడు. “అయితే అతను మన పెళ్ళికి రాడన్నమాట, కానీ నాకు నీ స్నేహితులందర్నీ కలుసుకోవాలని ఉంది,” అందామె. “నాకు అతణ్ణి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అర్థం చేసుకో. అడిగే వస్తాడు. వస్తాడనే అనుకుంటున్నాను. కానీ మొహమాటం కొద్దీ రావచ్చు, ఇబ్బంది పడొచ్చు, ఇక్కడకు వచ్చాకా నన్ను చూసి ఈర్ష్య పడనూవచ్చు; ఏదేమైనా చివరకు అతనికి మిగిలేది అసంతృప్తే, ఆ బరువును మోసుకుంటూ, ఒక్కడూ ఒంటరిగా వెనక్కు వెళ్ళాలి. ఒంటరిగా – అదెంత బాధో నీకు తెలుసా,” అన్నాడు జార్జి. “కానీ నీకు పెళ్ళయిందని మరే రకంగానో అతనికి తెలియకుండా పోదు కదా?” “అలా తెలిస్తే నేనేం చేయలేననుకో. కానీ అతను ఉన్న స్థితిని బట్టి తెలియకపోయినా ఆశ్చర్యం లేదు.” “ఇలాంటి స్నేహితులున్న నువ్వు అసలు పెళ్ళే చేసుకోకూడదు జార్జ్.” “దానికి మనిద్దరమూ బాధ్యులమేగా, ఇప్పటికి ఇలా కానిచ్చేద్దాం.” కానీ ఆమె ఊరుకోక, అతని ముద్దుల జడి కింద వేగంగా ఊపిరి పీలుస్తూ, “నాకు మాత్రం ఇది నచ్చలేదు,” అంటూ గట్టిగా అనేసరికి, తన స్నేహితునికి ఎంగేజ్మెంటు సంగతి చెప్పేద్దామా అనుకున్నాడు జార్జి. “నా తత్త్వం ఇది, అతను నన్ను ఇలానే అంగీకరించక తప్పదు. అతనికి స్నేహితునిగా ఉండటం కోసం నన్ను నేను వేరే వ్యక్తిలా మార్చుకోలేను కదా,” అనుకున్నాడు.

Posted in 2014, అనువాదం, ఫిబ్రవరి and tagged , , , , , , .

2 Comments

  1. కాఫ్కా నాకు మీ ‘శిలువ మోసిన రచచయిత’ వ్యాసంతోనే పూర్తిస్థాయిలో పరిచయం. కాఫ్కా కు ఇష్టమైన ఈ తీర్పు కథ నేను చదివిన ఆయన తొలికథ. కాఫ్కా గురించి ఆసక్తికని పెంచి, ఆయన రచనలు చదివేలా చేస్తున్న మీ ప్రయత్నాలకు అభినందనలు.

  2. మెహెర్ దన్యవాదాలు. కాఫ్కాని వలిచి చేతిలో పెట్టావు. మీ అనువాద పరిమళం అమోఘం. అది నిరంతరం వెన్నాడుతూ ఉంటుంది నన్ను . ఒక మాట చెప్పనా అనువాదం ఎలా చేయాలో నిన్ను చూసి నేర్చుకోవాలంట – గొరుసు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.