softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [5]

Download PDF  ePub  MOBI

అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “రామ్॒@శృతి.కామ్” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. దీన్ని వారం వారం సీరియలైజ్ చేస్తున్నాం. ఇది ఐదవ భాగం.

దీని ముందు భాగం

అజయ్, గుప్తా, వేణు, వెంకటరావు, రాజుగారు అంతా గుప్తా షాపు లోపలికి చేరారు. అప్పటికే సమయం తొమ్మిది కావస్తున్నది. “అన్నీ సర్ది షాపు మూసేయరా” అన్నాడు గుప్తా, పని చేసే కుర్రాడితో. అతను అలాగే చేసి వెళ్ళిపోయాడు. “ఇంక సభ మొదలు పెడదామా?” అన్నాడు వేణు. కొత్త పేకలని బయటకు తీస్తూ. “మనమేనా? ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?” అన్నాడు రాజుగారు. “పంతులు గారు వస్తానన్నారు, ఒకసారి ఫోను కలిపి చూడు” అని గుప్తా అనటంతో, రాజు గారు ప్రయత్నించి చూశాడు. కాని అవతలివైపు నుండి సమాధానం లేదు. “మనం మొదలు పెడదాం, పంతులు గారు మధ్యలో వచ్చి కలుస్తారు” అని వేణు అనటంతో అంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించటానికి సిద్ధపడ్డారు.

పట్టణాలలో అయితే పెద్ద పెద్ద భవంతులలో, పెద్ద నిలువుటద్దాలతో, ప్రయత్నపు గదులతో, పలు రకాల బ్రాండులతో అట్టహాసంగా ఉంటాయి. కానీ ఊర్లల్లో ఉండే బట్టల షాపులకు అన్ని ప్రత్యేకతలు ఉండవు. మెత్తని, తెల్లని వెడల్పాటి పరుపులను పరిచి ఉంచుతారు. బహుశా చీరలు కొనే ఆడవాళ్ళకి సౌకర్యం కోసం కాబోలు. కొనటానికి వచ్చిన వాళ్ళని మెత్తగా పరుపులమీద కూర్చోబెట్టి, అంతకంటే మెత్తగా డబ్బులు గుంజుతారనేది ఒక వాదన. ఈ పరుపులే వీరికిప్పుడు క్రీడా మైదానాలు. ఆ పరుపుల మీద అంతా వృత్తాకారంలో కూర్చున్నారు. తలుపులన్నీ మూసేసి, ఫ్యాన్లు, లైట్లు వేసి ఆట మొదలు పెట్టారు. వేణు ముక్కలన్నింటిని కలుపుతూ ఉన్నాడు.

“నేను ప్రధానమంత్రి అయితే, పేకని ప్రపంచ క్రీడ చేస్తాను” అన్నాడు రాజుగారు. “పుట్టే పిల్లాడు పి.టి ఉషలా పరిగెత్తాలని, పురిటి నొప్పులు పడుతూ టెంపుల్ రన్ ఆడిందని, అస్సలు ఒక్క ఎన్నికల్లో కూడా నిలబడకుండానే ప్రధాని పదవి దాకా వెళ్ళావే” అన్నాడు వేణు నవ్వుతూ. దీనితో అందరూ ఒక్కసారిగా నవ్వారు. “ఇంతింత ఖర్చుపెట్టి కొట్టు కట్టారు, క్రీడాకారులకోసం కనీసం ఏ.సి అయినా పెట్టించరెందుకో?” అన్నాడు వేణు. “ఏ.సి ఎంతసేపురా? నీ లాంటోళ్ళంతా, తీసుకున్న డబ్బులు సమయానికి, సరిగ్గా ఇస్తే ఈ పాటికి నాలుగు ఏ.సి లు పెట్టించచ్చు” అని అంటూ గుప్తా తన ముందు వేణు వేస్తున్న ముక్కలు ఒక్కోటి తీసుకుంటూ అన్నాడు.

“ప్రతి ఆటకి, ప్రతి వాడికి పదమూడేసి ముక్కలు పంచాలంటే చికాకుగా ఉంది. అదేదో మూడుముక్కలాటట, అది నేర్చుకుని, ఆడటం మొదలు పెడదాము” అన్నాడు వేణు. “ఇంకా నయం కొట్లో పని చేసే కుర్రాడినొకడిని ముక్కలు వేయటానికి పెట్టుకుందామనలేదు” అన్నాడు అజయ్. “ఎంతైనా చదువుకున్నోడు చదువుకున్నోడే, ఈ ఆలోచన ఏదో చాలా బాగున్నదే” అన్నాడు రాజుగారు. “ఊరుకోండి రా! మనం ఇక్కడ పేకాటాడుతున్నందువల్లనే, వ్యాపారం సరిగ్గా సాగటంలేదని మా నాన్న తిడుతున్నాడు. మీరు మళ్లీ ఇలాంటి క్రొత్త క్రొత్త పత్తి వ్యాపారాలు పెట్టకండి” అనటంతో అంతా నవ్వారు, ఒక అజయ్ తప్ప. “అంటే మనం ఇక్కడ పేక ఆడుతున్నామని మీ నాన్నకి తెలుసన్నమాట” అన్నాడు అజయ్ అమాయకత్వంగా కూడిన ఆశ్చర్యంతో. “నువ్వు సిగిరెట్లు తాగుతావని మీ నాన్నకు తెలియదనుకున్నావా?” అన్నాడు రాజుగారు. “తెలిసే నమస్యే లేదు” అన్నాడు అజయ్. “తెలిసినా సమస్య లేదా, మరి బ్యాంకుకు వెళ్ళిన ప్రతిసారి “మా వాడి చేత సిగిరెట్టు మాన్పించండయ్యా” అని మీ నాన్న నాతో ఎందుకంటాడు ?” అని గుప్తా అనటంతో అజయ్ ఖంగుతిన్నాడు.

“రాజకీయాల్లోనే కాదు ,ఆటలో కూడా నేనే రాజుని. ఇస్పేట్ రాజు వచ్చాడు, ఆట తెచ్చాడు, షో” అంటూ తన ముక్కలను అందరి ముందు పరిచాడు రాజుగారు.అందరూ తమ తమ కౌంటు ఎంత వేయాలో చెప్తుంటే ,గుప్తా ఒక చిన్న కాగితం లో అవన్నీ రాస్తున్నాడు. “ఇక్కడ కూడా వడ్డీ వేస్తావా రా” అన్నాడు వేణు, గుప్తాని ఉద్దేశించి. “ఏంటి క్షణం ఆలస్యం అయ్యానో లేదో, అప్పుడే మొదలు పెట్టేశారా?” అంటూ లోపలికి వస్తూ అన్నాడు పంతులు గారు. పైన ఒక తెల్లని జుబ్బా, దానిమీద ఒక ఉత్తరీయం, క్రింద పంచ, నెత్తిన పిలక, నుదుటన అడ్డంగా విభూతి రేఖలు, పావలా బిళ్ళంత బొట్టు, మొత్తానికి బ్యాటు పట్టుకున్న సచిన్లా నిండుగా ఉన్నాడు. చూడగానే చెప్పేయచ్చు, ఇతను గుడిలో పూజారని, లేదా పురోహితుడని (రెండిటికీ తేడా ఏంటని అడక్కండి).

Posted in 2014, ఫిబ్రవరి, సాఫ్ట్‌వేర్ ఇతిహాస్యం and tagged , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.