ms naidu

అస్పర్శ

Download PDF ePub MOBI

దీని ముందు భాగం

అధివాస్తవికతకి మూలం కళ్ళెదుట ఉన్న వాస్తవంతో కవి పెట్టుకునే పేచీ. వాస్తవంతో పేచీ ఎందుకు? పిల్లలు పెరుగుతూ తమ చుట్టూ ఉన్న భౌతిక వాస్తవాలనీ, పెద్దవాళ్ళు బోధించే ఆచార వ్యవహారాలనూ, జాతీయ సంస్కృతినీ తమ సాటివాళ్ళ ప్రవర్తనతో, సంస్కృతితో బేరీజు వేసుకుంటూ తమదైన వాస్తవాన్ని నిర్మించుకుంటారు. చుట్టూ ఉన్న భౌతిక వాస్తవం, ఆంతరంగికమైన వ్యక్తిగత అనుభవం ఈ రెండూ కలసి మన ఒక్కొక్కరి ‘వాస్తవాన్నీ’ ప్రభావితం చేస్తాయి, ప్రత్యేకంగా నిర్మిస్తాయి. ఈ ‘వాస్తవం’ అన్ని దేశాలు, జాతులకీ ఒక్కలాగే ఉండదు, ఒకే జాతీ సంఘంలోనూ కూడా మనుషులందరికీ ఒక్కలాగే ఉండదు. పాశ్చాత్య సంస్కృతుల్లోన వ్యక్తి తనకు తాను స్వతంత్రుణ్ణనీ, తన వ్యక్తిత్వం ప్రగాఢమైన వాస్తవమనీ స్పృహ ప్రబలంగా ఉంటుంది. ప్రతి మనిషీ తనను తానూ ఇతరులకంటే భిన్నమైన, స్వతంత్రమైన వ్యక్తిగా నిర్వచించుకుని, నిరూపించుకోవడం పాశ్చాత్య సాంస్కృతుల్లోన చాల ముఖ్యం. చుట్టూ ఉన్న మనుషులు, బంధు మిత్రులు, ఉపాధ్యాయులు ఇలాంటివాళ్ళ అభిప్రాయాలకీ, విలువలకీ పాశ్చాత్య వ్యక్తిత్వం మీద కొంతవరకే ప్రభావం ఉంటుంది. ఇలాంటి మనస్తత్వాన్ని Independent construal of self అని అన్నారు. ప్రాచ్య సంస్కృతుల్లోన ఇందుకు భిన్నంగా, చుట్టూ ఉండే సంఘం ప్రభావం వ్యక్తిత్వం మీదా, వ్యక్తి అనుభవించే వాస్తవం మీదా చాల ఎక్కువగా ఉంటుంది. దీన్ని interdependent construal of self అన్నారు. ఇలా చుట్టూ ఉన్నవాళ్ళతో ఇచ్చి పుచ్చుకుంటూ నిర్మించుకునే ప్రాపంచిక దృక్పధం స్థిరంగా ‘ఇదే నా వాస్తవం’ అని స్థిరపడే అవకాశం ప్రాచ్య సంస్కృతుల్లో తక్కువ. జపాన్లో, చైనాలో, మన దేశంలో కూడా జన సామాన్యం పైన సంఘం, కుటుంబంలో పారంపర్యంగా వచ్చే సంస్కృతి ప్రభావం ప్రబలంగా ఉంటాయి.

మనం భౌతికం, ప్రాపంచికమైన వాస్తవం అని వ్యవహరించేది కూడా చివరికి ఒకే కుటుంబంలోని మనుషులకి సైతం ఒక్కటిగానే ఉండదు. మనుషుల వ్యక్తిగతమైన అనుభవాలు – చూసిందీ, విన్నదీ, తిరిగిందీ, కట్టిందీ, తిన్నదీ వీటిలోని వ్యత్యాసాలని బట్టి ఒకే తల్లి పిల్లలు సైతం చాల భిన్నమైన భౌతిక వాస్తవాలను అనుభవించడం, ఆకళింపు చేసుకోవడం కద్దు. అన్ని సంస్కృతుల్లోనూ ఈ బహిరంగ వాస్తవమూ, వ్యక్తి ఆంతరంగికమైన జీవన దృక్పధమూ ఈ రెండూ కలిసి అతను దర్శించే ‘వాస్తవాన్ని ‘ నిర్మిస్తున్నాయి.

OkaVellipothanu_cover_brdrవాస్తవంతో పేచీ రావడానికి స్థూలంగా రెండు కారణాలున్నాయి. ఒకటి చుట్టూ ఉన్న వాస్తవం ఏదో ఒక కారణం వలన సంతృప్తికరంగా లేకపోవడం. రెండోది, తీవ్రమైన జిజ్ఞాస వలన తక్షణము, ప్రత్యక్షమైనదే మొత్తం వాస్తవమని అంత సులభంగా ఒప్పుకోలేకపోవడం. శాస్త్రజ్ఞులు ఇంద్రియ గోచరమైన వాస్తవం కంటే అతీతమైన వాస్తవ ప్రపంచాల్ని నిరంతరం శోధిస్తూనే ఉంటారు – జిజ్ఞాస వలన. సంస్కర్తలు, నాయకులూ ఉన్న వాస్తవాన్ని, అది మిగిల్చే దుఃఖాన్నీ అంగీకరించలేక దాన్ని మార్చడానికి ఉద్యమిస్తారు. మనస్తత్వవేత్తలు వ్యక్తి దర్శించే వాస్తవం మీద అతని దృక్పధానికీ, అనుభవానికీ ఉన్న ప్రబలమైన పట్టుని గుర్తెరిగి Perception is reality అని హెచ్చరిస్తారు. శాస్త్రజ్ఞులు ఐన్‌స్టెయిన్ వంటివాళ్ళు స్థూలమైన వాస్తవాన్ని తరచి తర్చి “Reality is merely an illusion, albeit a very persistent one” అని చెప్పుకున్నారు. బుద్ధిజీవులు వాస్తవాన్ని రకరకాలుగా అన్వేషించీ, అర్థం చేసుకునీ నిర్వచిస్తారు. దాని మూలాల్ని, స్వరూప స్వభావాల్ని ఆకళింపు చేసుకుని, వాస్తవంతో రాజీ చేసుకుని నిలదొక్కుకుని, దాన్ని మెరుగు పరచుకునే పద్ధతుల్ని గురించీ సిద్ధాంతం చేస్తారు. కవులూ, కళాకారులు, తాత్వికులూ, దార్శనికులూ వాస్తవాన్ని తట్టుకోలేనప్పుడల్లా అనివార్యంగా దాని మీద అక్కసు పడతారు, ఖండిస్తారు, అంతకంటె ఉదాత్తమైన వాస్తవం కోసం వెతుక్కుంటూ పోతారు. వాస్తవంతో ఇలాంటి పేచీలు పెట్టుకోడానికి సాధారణ జీవన దృశ్యమైనా చాలు, ఏపాటి పట్టి చూసినా అది ఒకవైపు కపటంగా, అధర్మంగా, కఠోరంగా, దుర్భరంగానూ ఉంటుంది. ఇంకోవైపు ప్రాకృతికము, భౌతికమైన వాస్తవం సైతం తరచి చూసే కొద్దీ వింత వింతలుగా మారిపోతూ తన లోతు కనుక్కోమంటుంది. అందుకే ఉత్తప్పుడే వాస్తవంతో వీళ్ళందరికీ ఇంత పేచీ! ఇంక యుద్ధాలూ ఉత్పాతాలూ వచ్చి పడితే వేరే చెప్పాలా? అలాంటి విపత్తులు అనివార్యంగా సర్రియలిజం వంటి తాత్విక విప్లవాలకి దారితీస్తాయి.

పాశ్చాత్య నాగరికత ప్రధానంగా తార్కికమైన ఆలోచన పునాదిగా నిర్మించుకున్నది. ఈ నాగరికత లోన వ్యక్తి తనను తాను, తన జీవితాన్ని ప్రభావితం చేసే ఇతరులను – అంటే సంఘాన్నీ, తన చుట్టూ ఉన్న వస్తు ప్రపంచాన్నీ ఈ మూడింటినీ కూడా తార్కికమైన ఆలోచనను ఆలంబనగా చేసుకునే కట్టుకుంటున్నాడు. ఈ మూడూ కలిసిందే ఆధునికుల వాస్తవం – అంటే perception of reality, self and the other. పారిశ్రామిక విప్లవం నుండి పాదు పోసుకుని క్రమంగా పాశ్చాత్య నాగరికత ప్రపంచమంతటా విస్తరిస్తూ వచ్చి, ఇవాళ ప్రపంచపు జీవన సంస్కృతిని సమస్తాన్నీ నిర్దేశించే స్థాయికి చేరుకుంటోంది. రెండు వందలేళ్ళ కిందట మొదలై పారిశ్రామిక విప్లవం అందించిన ఫలితాలు, సౌకర్యాలూ ముందుగా పాశ్చాత్య ప్రపంచపు ఆర్ధిక రంగాన్నీ, రాజకీయాలను, కళలను, చదువుల్నీ – పాశ్చాత్యుల వాస్తవాన్ని అంతట్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తూ, మిగతా ప్రపంచ సంస్కృతుల్లో కూడా విశేషమైన మార్పులకి దారితీసేయి. ఇది మొదలైన వందేళ్ళకి, అంటే సరిగ్గా ఇవాళ్టికి వందేళ్ళ కిందట మొదటి ప్రపంచ యుద్ధం దాపురించింది. యూరప్, మధ్య ప్రాచ్య దేశాల్లో రాజుకున్న ఈ యుద్ధంలో తొలి విడత పోరాడిన సైనికులు భారతీయులు. లక్ష మంది చైనీయుల్నీ ఈ యుద్ధంలో వినియోగించుకున్నారు. మానవాళి చరిత్రలో అది వరకు కనీవినీ ఎరుగని స్థాయిలోన రక్తపాతాన్నీ, నష్టాన్నీ చూసి చలించిపోయింది. అనేక దేశాల మౌలిక వ్యవస్థల మీదా, రాజకీయాల మీద, కళల మీదా తీవ్రమైన ప్రభావం చూపించింది ఈ యుద్ధం.

ఇరవయ్యో శతాబ్దం మొదట్నుండీ పాశ్చాత్య దేశాల్లోని బుద్ధిజీవులు, కళాకారుల్లోన జిజ్ఞాసువుల్లో పారిశ్రామిక విప్లవం, దాన్ని ఆలంబనగా పాదుకున్న రెండు తాత్విక, రాజకీయ సిద్ధాంతాలు – కేపిటలిజం, కమ్యూనిజం పట్ల అసంతృప్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. అలా రాజుకుంటూ వస్తున్న అసంతృప్తిని ఈ యుద్ధం తెచ్చిపెట్టిన భీభత్సం ఎగసనదోసి అగ్గికి ఆజ్యం పోసినట్లయ్యింది. అటు బహిరంగిక వాస్తవమూ, ఇటు ఆంతరంగిక వాస్తవమూ దుర్భరమైన ఈ విషాదం నేపధ్యంలోన అధివాస్తవికతకు బీజాలు పడ్డాయి. రష్యన్ విప్లవపు నేతల్లో ఒకడైన లియొన్ ట్రాట్స్కీ, సర్రియలిజం నిర్మాతగా, సిద్ధాంత కర్తగా పరిగణించే ఆంద్రె బ్రెటొన్, మెక్సికన్ విప్లవ కవి డియెగో రివెరా ఈ ముగ్గురూ 1938లో కలుసుకుని The Manifesto: Towards a Free Revolutionary Art అని ఒక తీర్మానాన్ని ప్రకటించేరు. ఇలా అధివాస్తవికత (Surreality) పైన చెప్పిన వాస్తవం పునాదుల్నీ, ప్రాతిపదికలనూ, విలువలనీ ప్రశ్నిస్తూ, అధిక్షేపిస్తూ ప్రారంభమై, క్రమంగా వాస్తవికత మీద ఒక తిరుగుబాటు భావనగాను, అనతికాలం లోనే ఒక తాత్విక దృక్పధంగా నిలదొక్కుకున్నాది. ఈ కళా విప్లవానికి కేంద్రం పారిస్. ఆంద్రె బ్రెటొన్ 1924 లోన తర్క ప్రధానమైన ప్రాపంచిక దృక్పధం పట్ల తన నిరసనను ప్రకటిస్తూ మొదటి సర్రియలిష్ట్ మేనిఫెష్టోని ప్రకటించుకున్నాడు:

“We are still living under the reign of logic, that, ofcourse, is what I am getting at. But logical procedures, nowadays, no longer apply to anything but the resolution of problems of secondary interest.” జీవితపు, సమాజపు మౌలికమైన, ప్రాధమికమైన ప్రశ్నలకి తర్కం సమాధానం చెప్పలేదని బ్రెటొన్ ఆరోపణ. ఆయన సర్రియలిజం ఉద్దేశాన్నీ, అవసరాన్నీ రెండు దశాబ్దాల వ్యవధిలో మూడు మేనిఫెష్టోలుగా ప్రకటించేడు. అధివాస్తవికతను ఆయన ఇలా నిర్వచించేడు: ఆలోచన యదార్ధంగా పనిచేసే ప్రక్రియను అప్రయత్నంగా, స్వతఃచాలితంగా మాటలుగానో, మరేదైనా మాధ్యమం ద్వారానో వ్యక్తీకరించడమే అధివాస్తవికత ముఖ్య లక్షణం. దాన్ని psychic automatism అని అన్నారు. స్వయంప్రవర్తకమైన ఈ అభివ్యక్తి తర్కం, సంఘం, శాస్త్రం, కళ వంటి ఏ వ్యవస్థల వలన చెలామణీలో ఉన్న నిబంధనల వల్లనూ నియంత్రితం కాదు. వాస్తవం అని సకృత్తుగా వ్యవహరించేదాని కంటె ఉన్నతం, సత్యవంతము, సహాయకరమైన వాస్తవాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో అది ఒక disinterested play of thought. కలలు మనందిరికీ పరిచితమైన ఇలాంటి అనుభవాలు. వాస్తవానికి భిన్నంగా కలల్లో మనకి అభూత కల్పనలు నిజంగా గోచరిస్తాయి. మేక మొహం మనిషీ, కుర్చీకి జంతువు కాళ్ళూ ఇలాగ. కలలకి దేశ కాల పరిమితులుండవు. అంచేత స్వప్నావస్థ, దాన్ని విశేషంగా ప్రతిపాదించిన ఫ్రాయిడ్ మనోధర్మ సిద్ధాంతమూ సర్రియలిష్టులకి తాము సాధించదలచుకున్న భావ స్వాతంత్ర్యానికి ప్రాపులుగా పనికొచ్చేయి.

బ్రెటొన్ శక్తిమంతుడైన సిద్ధాంతి. ‘కల, వాస్తవం ఇవి రెండూ భిన్న ధృవాలు కాదు. కలను వాస్తవంతో సమన్వయం చేసుకోగలిగితే ఆవిర్భవించే అధివాస్తవికత సాధారణమైన వాస్తవం కంటె ఉన్నతమైన వాస్తవం – అధివాస్తవం (surreality).’ అని ఆయన ప్రతిపాదించి సుమారు ముప్ఫయ్యేళ్ళకు పైగా అధివాస్తవికతకు సిద్ధాంతిక భూమికని నిర్మించడంలోను, కళలు, కవిత్వం, తత్వ శాస్త్రం, రాజకీయ శాస్త్ర రంగాల్లోన దానికి స్థానాన్ని సాధించుకోవడం కోసమూ పనిచేసేడు. అధివాస్తవికత విషయంలో చాల కటువుగా, నిరంకుశంగా ఉండేవాడని ఆయన మీద ఒక ఆరోపణ ఉండేది. ఆయన మార్క్సిజం పట్ల ఆసక్తిని, నిబద్ధతనూ యావజ్జీవితమూ ప్రకటించుకున్నాడు, కాని స్టాలిన్ నిరంకుశ వైఖరి వంటి కారణాల వలన ఫ్రెంచి కమ్యునిష్ట్ పార్టీకి దూరమయ్యేడు. మార్క్సిజం, సోషలిజం పట్ల నిర్ద్వంద్వంగా సానుభూతిని, నిబద్ధతనూ ప్రకటించుకున్న దార్శనికులు, కళాకారుల అన్వేషణ నుండే సర్రియలిజం ఆవిర్భవించింది.

సహజమైన ఆలోచన, కల్పనా శక్తీ తర్కం వలన, తన్మూలంగా ప్రాచుర్యం లోకి వచ్చిన ఆనవాయితీలు, నీతి నియమాలు, కళా దృక్పధాలు వంటి సాంప్రదాయికమైన నిబంధనల వలన వాస్తవ వ్యవహారాల్లోన అణిగి మణిగి ఉంటాయి. వ్యావహారికమైన భాష ఆలోచనకీ, తర్కానికీ బంటు; వాటివలన నిర్మితమయ్యి, అవి చెప్పినట్టు మాత్రం పనిచేసే పనిముట్టు భాష. భాష, తర్కం చెలాయించే పెత్తనానికి ఒగ్గి ఉండే సృజన, కల్పన, కవిత్వమూ తమ నిజమైన వైభవాన్ని అందిపుచ్చుకోలేవని బ్రెటొన్ నొక్కిచెప్పేడు. ఆలోచన మీద, కల్పన మీదా తర్కం చలాయించే ఈ నియంత్రణను బ్రెటొన్ “The great enigma” అన్నాడు. ఇది వ్యక్తికీ, అతను అనుభవిస్తున్న వాస్తవానికీ మధ్య సంఘర్షణకు దారితీస్తుంది. తర్కం బహిశ్చేతన నెరపే పనులకు మాత్రం అనువైనది; అది కట్టిన భాష అనివార్యంగా వ్యక్తినీ అతని వాస్తవాన్నీ తనూ – వస్తువూ, తనూ – ఇతరులూ, తక్కువ – ఎక్కువ వంటి ద్వంద్వాలుగా వేరుచేసి ఉంచుతుంది. ఇలా ద్వంద్వాలను విడదీస్తూ, వాటికి పేర్లు పెడుతూ, వర్గీకరిస్తూ విలువల్ని నిర్ధారిస్తూ వచ్చే భాష, తర్కం అంతరంగానికి ‘ఇదంతా ఇలాగ, ఇది పరిచితమైన వాస్తవం’ అన్న ఒక రకమైన భరోసాని ఇస్తాయి. ఈ పూచీతో సర్రియలిష్ట్ లకు పేచీ ఏమిటంటే తర్కం, ఆలోచనా, భాషా దర్శించి నిర్ధారించ గలిగిందే మొత్తం వాస్తవం కాదు. అది ఉన్న వాస్తవానికి ఒక పార్శ్వం మాత్రమే. బ్రెటొన్ మాటల్లోన ఆలోచన, తర్కం, భాషతో వచ్చిన చిక్కు “It is an extravagant overestimation of the known compared with what remains to be known.” ఈ తలపు చెఱశాల నుండి బయటపడటానికి సర్రియలిష్ట్ లు ప్రతిపాదించే తోవ “the free, unlimited play of analogies”, ఇంకా “words making love.” మాటలనీ, ఉపమలనీ, ఊహా చిత్రాలనీ యదేఛ్ఛగా, అనియంత్రితంగా కలిసి మెలిసి ఆడుకోనిచ్చి, మాటల్ని మాటలతో భాషని అడ్డురానీకుండా రమించనిమ్మని పిలుపు. నాయుడు గారి పుస్తకంలో ఏ ఒక్క కవితను, చిన్న పాటి శకలాన్ని తీసుకొని పరికించి చూసినా వాటిలోన ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా, పరిపూర్ణంగా కనిపిస్తాయి. ఎలాగో ముందుకి వివరించి చెప్తాను.

ఇలా స్వయంవర్తితమైన అభివ్యక్తి అప్రయత్నమైనది, అంటే ‘ఏదీ అధివాస్తవికంగా రాసి చూదాం!’ అని ప్రయత్న పూర్వకంగా చేస్తున్నది కాదు. సుప్తచేతన అని వ్యవహరించే అంతరంగపు లోతుల్లోంచి సద్యోజనితంగా వెలువడే ఈ అభివ్యక్తి ఆలోచన మీద నియంత్రణనూ, ఆలోచనల్ని సవరించి చూసుకోకుండా ప్రకటిస్తే ఎట్నుంచి ఏం ప్రమాదమోనన్న భీతినీ వదులుకుంటే తప్ప సాధ్యమయ్యేది కాదు. అందుకే నైసర్గికమైన కవి సృజనాంతరంగం ఇలాంటి కవిత్వానికి ప్రవాహ మూలం. కల్తీ లేని అధివాస్తవిక కవితకు అది మూలం అవుతుంది, అదే కవితల నిండా కాంతులీనుతూ ప్రతిఫలిస్తుంది. ఈ మన:స్థితి అభావం అంటే గైర్హాజరైనప్పుడు వచ్చే కవిత్వం కేవలం నిర్మితీయమైన మార్మికతగా మాత్రం తేలిపోయి కవిత నడకలోని ‘జూటా’ను కూడా తనే (by its absence) పట్టిస్తుంది. జూటా కవితలలో కేవలం భాషా, తర్కమూ మాత్రం పైపైని వాస్తవాన్ని మాత్రమే అనుభవ విహీనంగా ప్రదర్శనకు తెస్తాయి. అధివాస్తవిక కవితలలో అబద్ధాన్ని పోల్చుకోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే స్థూల దృష్టికి మొత్తం అధివాస్తవిక సృజన యావత్తూ అర్ధరహితం (nonsensical)గానే అవుపిస్తుంది. చైతన్య స్రవంతి, మేజిక్ రియలిజం, కటప్ టెక్నిక్, స్పాంటేనియస్ ఫిక్షన్ – ఇలాంటి మార్మికతల వెనక దాక్కుని అబద్ధాలాడ్డం సుళువు. దీన్ని పోల్చుకోవాలీ అంటే అనివార్యంగా కవి అంతరంగాన్ని, ఆయన సారస్వత మూర్తిమత్వాన్నీ రకరకాలుగా చంక్రమణం చేస్తూ పరికించి చూడాలి. నాయుడు గారి కవితలలోని అధివాస్తవిక ప్రవాహాన్ని కూడా ఈ నేపధ్యంలో పరికించి చూడవచ్చును. ఒక వెళ్ళిపోతాను గురించి ఇలాంటి పరికింతను వివరంగా ఎత్తుకునే ముందు, నాయుడు గారు భారతీయుడు కాబట్టి ఆయనదే ప్రత్యేకమైన అధివాస్తవిక దృక్పధానికి పునాదులు ఏమై ఉంటాయి అనే ప్రశ్నను పరామర్శిస్తే ముందుకి ఉపయోగపడుతుంది.

సర్రియలిష్టుల కళా సిద్ధాంతం అధివాస్తవికత మానవ సంఘపు చైతన్యంలో గుణాత్మకమైన విప్లవాన్ని సాధించుకునే తోవ అని ప్రతిపాదించింది. అంతే కాక తద్వారా ఆలోచనను అదిమిపట్టి ఉంచే నియంత్రణల నుండి సాధించుకునే స్వాతంత్ర్యం ఒక నవీనమైన, ఉదాత్తమైన చైతన్యాన్ని సాధించుకునే సాధనమనీ, అలాంటి చైతన్యపు అభివ్యక్తే అధివాస్తవిక సారస్వతమనీ, అది “విశ్వ పదం” (“Cosmic Word”) అనీ ప్రతిపాదించింది. బ్రెటొన్ గొప్ప కవిత్వం ఒక్క spontaneous writing ద్వారా మాత్రమే సాధ్యమని బలంగా నమ్మేడు. అధివాస్తవికతకు ఆధ్యాత్మిక పార్శ్వం అనదగిన ఇలాంటి అవగాహన నుండి అధివాస్తవికతను పరమ సత్యానికి దారిచూపే మార్గం అని (A road to the Absolute) ప్రతిపాదన వచ్చింది.

అయితే పాశ్చాత్యమైన అధివాస్తవికతకు భారతీయ కళా సాంస్కృతిక రంగాల్లోనా ఒక సన్నని పాయగా మాత్రమే చోటు దక్కింది. భారతీయ చిత్రకళలో మాత్రమే దీని ఛాయలు కొంత ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాచ్య సంస్కృతుల మీద అధివాస్తవికత ప్రభావం అంత విరివిగా కనిపించదు. మన దేశంలో పరంపరగా వస్తున్న సంస్కృతి, భారతీయ చింతన పాశ్చాత్య నాగరికతకు భిన్నంగా ‘వాస్తవాన్నే’ పరమ సత్యమనీ, భౌతిక జగత్తూ దాన్ని నియంత్రించే తర్కమే బుద్ధి జీవులకూ, కళాకారులకూ పరమ సాధనాలనీ ఏనాడూ ప్రతిపాదించలేదు, ఒప్పుకోనూ లేదు. సర్రియలిజం కలనూ వాస్తవాన్నీ సమన్వయం చేసుకోవలసిన అవసరాన్నీ, అందుకు తోవల్నీ సూచించి అక్కడితో ఆగింది. మన సంస్కృతి స్వప్నం, జాగృదావస్థ, సుషుప్తి ఈ మూడింటినీ పరిశీలించి చూస్తూ ఈ మూడింటినీ అధిగమించే సమాధిని సాధించుకోవచ్చనీ, ఇలాంటి చింతన వల్లనే మనం అనుభవించే వాస్తవాల నడుమ వైరుధ్యాలను సమన్వయం చేసుకునే శక్తిని సాధించుకోగలుగుతామనీ, అలా చెయ్యడం వ్యక్తికీ, సంఘానికీ ఆవశ్యకమైన పనులనీ ఘోషిస్తూ వచ్చింది. దీన్ని ‘పరమ అధివాస్తవికత ‘ అని తలపోస్తే ఏమాత్రం అతిశయోక్తి కాదు.

మన దేవ దేవతలందరూ డాలీ చిత్రాలను తలదన్నే పరమ అధివాస్తవిక, అభూత కల్పనలు. వాళ్ళ ఇళ్ళూ వాకిళ్ళూ వాహనాలూ శరీరాలూ ప్రవర్తనలు యావత్తూ కొంత వాస్తవం, మరింత అభూత కల్పనా కలిసి మిక్కిలి అధివాస్తవికంగా ఉంటాయి. వాళ్ళు ఒకే దైవం ఒక్కోసారి ఆడ, ఇంకోసారి మగ, పైపెచ్చూ అర్ధనారీశ్వరుడైతే ఏక కాలం లోనే ఆడా మగా కూడాను. అంతే కాక వాళ్ళని గురించిన వర్ణనలు – లలిత, శివుడు, విష్ణువు మొదలైన దైవాల గుణ గణాలనీ, నామ రూపాలనీ స్తుతిస్తూ సాగేవి అన్నింటిలోనూ ఒక గుణాన్ని ప్రతిపాదించడం, ఆ వెంటనే దానికి విరుద్ధమైన గుణాన్ని కూడా ఆ దైవానికే ఆపాదించడం కూడా కనిపిస్తుంది. ఈ పరమ అధివాస్తవికతనే శృతి, స్మృతి, శ్రవణం, మననం వంటి రక రకాల సాధనల ద్వారా అంతరంగంలో పట్టి నిలుపుకునే శక్తిని మనిషి సాధించుకోవాలనీ, అలాంటి సాధన ఒక్కదాని వలన మాత్రమే మనిషి తన వ్యక్తిగతమైన దుఃఖాన్నీ, తనవంటి వాళ్ళందరూ కలిసి సంఘంలో సృష్టించే దుఃఖాన్నీ నివృత్తి చేసుకోగలడనీ స్థిరంగా, బలంగా, ముక్త కంఠంతో ఘోషించిన భారతీయ సంస్కృతి పునాదులే పరమ అధివాస్తవికమైనది. అది ఇంద్రియ గ్రాహ్యమైన తర్కం, భాష, ఆలోచనల పునాదుల మీద నిర్మితమయ్యే వాస్తవానికి విరామమెరుగని హెచ్చరిక – ఇంద్రియాలకు గ్రాహ్యమైనదే నిజం కాదూ, అది మొత్తం వాస్తవానికి ఒక పార్శ్వం మాత్రమే అని ఉద్ఘోష. అదే మన ఆచార వ్యవహారాలనూ, జీవన దృక్పధాన్నీ, కళలన్నింటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తూ వచ్చింది. మన పాత కాలపు కళలన్నిటికీ నిర్దేశించిన పరమ ప్రయోజనం ఈ పరమ అధివాస్తవికతను, అంటే దైవాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తూ, స్తుతిస్తూ రావడమే. అక్కడితో ఆగకుండా ఎంత మాత్రమూ నమ్మశక్యం కాని ఇలాంటి అధివాస్తవికతను కళ్ళెదుటి వాస్తవంతో ఎలా సమన్వయం చేసుకోవాలీ అనే మీమాంసను భారతీయ తత్వశాస్త్రం, కళలూ తరచి తరచి శోధిస్తాయి. ఈ పరిశోధన, అవగాహనా జన సామాన్యపు సంస్కృతినీ, విలువలనూ, కట్టు బొట్టు వ్యవహారాలనీ, జీవన దృక్పధాన్నీ బలంగా ప్రభావితం చేస్తూ వచ్చేయి. సారస్వత కళా ఇందుకు మినహాయింపు కాదు.

పరమ అభౌతికము, అధివాస్తవికమని తోచే ఈ దృక్పధమే అనేక రకాలుగా మన కాల్పనిక సారస్వతాన్ని కూడా ప్రభావితం చేస్తూవచ్చింది. ఉదాహరణకు:

అలి నీలాలక పూర్ణ చంద్రముఖిఁ నేణాక్షిన్ ప్రవాళాధరన్

కలకంఠిన్ నవ పల్లవాంఘ్రి యుగళన్ గందేభ కుంభ స్థనిన్

పులిన శ్రోణిఁ నిభేంద్రయాన నరుణాంభోజాత హస్తన్ గని …

వంటి పద్యాల్లోని వర్ణణ ఆసాంతం అధివాస్తవికమైనది. ఆ పద చిత్రాల్లోని మూర్తిని ఏ చిత్రకారుడైనా యధాతధంగా చిత్రించి చూపితే అది సినిమాల్లో చూపించే రుక్మిణీ దేవిలా కాక, చందమామే మొహం, లేడి కళ్ళూ, పగడాల పెదాలూ, కోకిల స్వనం, చిగుళ్ళు పాదాలూ, ఏనుగు కుంభ స్థలం వంటి స్థనాలూ, ఇసుక తిన్నెల పిరుదులూ – ఇలాగ ఒక డాలీ పెయింటింగ్నే తలదన్నే అధివాస్తవిక చిత్రం అవుతుంది. విశ్వ పదం (Cosmic Word) అని సర్రియలిష్ట్ లు అన్వేషిస్తూ వచ్చిన పరమార్ధిక సత్యాన్ని మన సంస్కృతిలోన పరమ పదం అని ఏనాడో నిర్వచించేరు. పరమ పదం అంటే కట్టకడపటి మాట (The Ultimate Word) – భాషను, తర్కాన్నీ, ఆలోచననూ – Wordను సాధనంగా చేసుకొని సల్పే ప్రయత్నం అంతటికీ కట్టకడపటి మాట. ఇంత ప్రాచీనము, అతివేలము, సర్వ వ్యాప్తమైన పరమ అధివాస్తవిక చైతన్యం లోనికి మనం శిశువులమై వచ్చి పడుతున్నాం కాబట్టి మనకి వేరే ప్రత్యేకంగా అధివాస్తవికత అని ఒక కొత్త సిద్ధాంతం, దాని చుట్టూ సైద్ధాంతిక సమర్ధనా అక్కర్లేకుండా పోయేయి. ప్రాక్తన సాహిత్యం నిండా మతపరమైనవి కాని కధలూ కావ్యాల్లో కూడా అధివాస్తవికమైనవి, అభూత కల్పనలు కొల్లలుగా కనిపిస్తాయి. పాత కాలంలో ఒక కవికి అధివాస్తవిక్త పట్ల అనురక్తి ఉంటే, అంటే వాస్తవికత యెడల విముఖత కలిగితే ఆయన ఏ విప్లవాన్నీ ప్రతిపాదించక్కర్లేకుండా పారంపర్యంగా కళలో, తత్వంలో అందుబాటుగా వస్తున్న అధివాస్తవికతను ఆశ్రయించవచ్చును. దానికి కావ్య గౌరవమే ఉంది.

కాని ఎల్ల కాలం ఇలాగే కొనసాగలేదు. పాశ్చాత్యుల వలస పాలనతో మొదలై మన చదువులూ, విలువలూ, వస్తు ప్రపంచం, డబ్బు, రాజకీయం, విజ్ఞానం, కళలూ ఇలాగ ఆంతరంగికం, బహిరంగమైన వ్యవస్థలన్నీ పాశ్చాత్య సంస్కృతి వలన విశేషంగా ప్రభావితం అయ్యేయి. ఈ మార్పుల వలన ఈనాడు మనం అనుభవించే వాస్తవం సహజంగానే పాతకాలపు వాస్తవానికి చాల భిన్నంగా కొంత పాతా కొంత కొత్తా కలిసి నిర్మితమౌతోంది. ఆధునిక భారతీయుల వాస్తవం భౌతికమూ అంతరంగికం రెండు పార్శ్వాల్లోనూ లోతుల్లోన భారతీయము, బయటంతా ఇటీవలిది పాశ్చాత్యమూ అయిన నిర్మాణాలు, ఆలోచనలు, విలువలతో కలగలిసి ఉంటున్నాది. అక్కడితో ఆగకుండా ఈ ఆధునిక వాస్తవం కూడా ఇప్పుడు ముఖ్యంగా టెక్నాలజీలో మార్పుల వలన ప్రతి పదేళ్ళకీ విశేషంగా మారిపోతూ, ఒక ఊరూ ఒక పేరూ ఒక దేశం ఒక వృత్తీ ఒక నమ్మకం ఒక కుటుంబం ఒక స్నేహ బృందం ఒక దైవం ఒక మతం ఇదిగో ఇవన్నీ కలిసి ఇదీ నా ఉనికి అని ఇలాగ ఎలాంటి భరోసా, స్థైర్యం సాధించుకోనీయకుండా మనని పరుగులు పెట్టిస్తున్నాది.

నాయుడు గారు ఇంతటి చలనశీలం, అయోమయమూ అయిన సంధి వాస్తవం పట్ల అసంతృప్తుడు, శంకితుడు, దాని ఆటుపోట్లకు విచలితుడు అయిన కవి. ఆయనలో ఉదయించిన అధివాస్తవికత అటు పాశ్చాత్యుల అధివాస్తవికతకీ, ఇటు భారతీయమే అయిన పరమ అధివాస్తవికతకీ రెండింటికీ భిన్నమైనది. అది ఈ రెండు రకాల అధివాస్తవికతలనుండీ పుణికి పుచ్చుకునీ తనదే అయిన దేశవాళీ అధివాస్తవికత.

పనికొచ్చే పుస్తకాల సూచిక:  

 • Matthews, J. H. (1991) The Surrealist Mind; Associated Universities Press, Cranbury, NJ.
 • Balakian, Anna (1986) Surrealism: The Road to the Absolute; University of Chicago Press.
 • Gullette, A. (1979) The Theory and Techniques of Surrealist Poetry; www.alangullette.com
 • Carrouges, M. (1974) André Breton and the Basic Concepts of Surrealism; University of Alabama Press.
 • Markus, H. R. and Kitayama, S. (1991) Culture and the Self: Implications for Cognition, Emotion and Motivation; Psychological Review (1991) Vol. 98, No. 2, 224-253.
(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, ఫిబ్రవరి, వ్యాసం and tagged , , , , , , , .

3 Comments

 1. “అలి నీలాలక పూర్ణ…
  వంటి పద్యాల్లోని వర్ణణ ఆసాంతం అధివాస్తవికమైనది. ఆ పద చిత్రాల్లోని మూర్తిని ఏ చిత్రకారుడైనా యధాతధంగా చిత్రించి చూపితే అది సినిమాల్లో చూపించే రుక్మిణీ దేవిలా కాక, చందమామే మొహం, లేడి కళ్ళూ, పగడాల పెదాలూ, కోకిల స్వనం, చిగుళ్ళు పాదాలూ, ఏనుగు కుంభ స్థలం వంటి స్థనాలూ, ఇసుక తిన్నెల పిరుదులూ – ఇలాగ ఒక డాలీ పెయింటింగ్నే తలదన్నే అధివాస్తవిక చిత్రం అవుతుంది.”

  ఇది చదివి కొంత ఆశ్చర్యమూ తికమకా కలిగాయి. ప్రాచీన కావ్యాలలో పోలిక (ఉపమ) తాలూకు ప్రాథమిక లక్షణం తెలిస్తే, అక్కడ వర్ణించిన రుక్మిణి స్వరూపాన్ని యథాతథంగా “చిత్రించడం” కవి ఉద్దేశం కాదనీ, దానికీ డాలీ పైంటింగుకీ ఎలాంటి సంబంధం లేదనీ స్పష్టంగా తెలుస్తుంది. రెండు వస్తువులను పోల్చినప్పుడు వాటి మధ్య ఒక “సమానధర్మం” అనేది ఉంటుంది. దీన్ని కవి కొన్ని సార్లు చెప్పవచ్చు, కొన్నిసార్లు చెప్పకపోవచ్చు. కొన్ని బాగా అలవాటైన ఉపమానాల విషయంలో అలా ప్రత్యేకించి చెప్పరు. ఉదాహరణకు ముఖాన్ని పున్నమి చందమామతో పోల్చడం, అది గుండ్రమైన మొహం అని చెప్పడానికి కాదు. గుండ్రమైన ముఖమని చెప్పడం ఒక్కటే కవి ధ్యేయమైతే దిబ్బరొట్టెతో కూడా పోల్చవచ్చు. పున్నమి చందమామలోని చల్లని వెలుగు, ప్రకాశం, చూసేవారి మనసులను ఆహ్లాదపరిచే గుణం, మొదలైన లక్షణాలు ఒక ముఖానికి కూడా ఉన్నాయని చెప్పడం కోసం ఆ పోలిక. ఇలాగే తక్కిన పోలికలు కూడా. వీటిని కేవలం వాటి ఆకారాన్ని బట్టి ఒక బొమ్మలో గీయడం అనేది, ఆయా పోలికలకు పూర్తిగా అన్యాయం చేయడమే. ఇక్కడ కవికి వాస్తవంతో పేచీ లేదు. వాస్తవాన్ని తిరస్కరించడమూ లేదు. వాస్తవాన్ని మరింత అందంగా చెప్పడమే కవి ఉద్దేశం. నాకు తెలిసి – కల్పన, ఊహ, పోలిక – ఇవన్నీ కవిత్వ లక్షణాలు. ఇవున్న చోటల్లా అధివాస్తవికతే అంటే కవిత్వమంతా అధివాస్తవికమే అవ్వాలి!

 2. అధివాస్తవికత గురించి ఉన్న ఎన్నో విషయాలు తెలియజేశారు. నాయుడు గారి కవిత్వాన్ని విడమరిచి చెప్పిన విధానం కూడా చాల బాగుంది .. ధన్యవాదాలు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.