BackCover

మహా వాగ్గేయకారుడి ఆత్మకథ: పింజారి

Download PDF ePub MOBI

సమాజంలోని అసమానతలు, వైషమ్యాలు, పేదరికం, అవిద్య, సాంఘిక దురాచారాలు వంటి అంశాలలో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉపయోగపడిన ప్రజాకళ బుర్రకథ. “వినరా భారత వీరకుమారా విజయం మనదేరా” అంటూ సాగే బుర్రకథల గురించి ఇప్పటి తరానికి తెలిసినది తక్కువే అనుకోవాలి. పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపం బుర్రకథ. వినోదాన్ని అందిస్తూనే, సుజ్ఞానం పంచే కళారూపం బుర్రకథ.

కళ అంటే కేవలం సినిమానటులు, కొండొకచో శాస్త్రీయ సంగీతకారులదే అనే అపప్రథ ప్రబలి జానపద కళారూపాలు కనుమరుగువుతున్నాయి. అసలైన కళ అంటే తాము పొందిన ఆనందాన్ని ఇతరులలోను కలిగించడమే. వెలిగిపోతున్న కళలకి వాటి పోషకులు, పాలకులు, ప్రేక్షకులు ఉన్నా, మిగతా వాటి ఒరవడికి క్రమంగా నిరాదరణకి గురవుతున్న అనేక ఇతర కళల్లో బుర్రకథ కూడా ఒకటి. అయినా తమ కళని అంతరించిపోకుండా కాపాడుకుంటున్న కళాకారులెందరో ఉన్నారు.

ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథను తనదైన శైలిలో ఉన్నతస్థాయికి చేర్చిన మహా వాగ్గేయకారుడు షేక్ నాజర్. బుర్రకథ పితామహుడు అని ప్రఖ్యాతిగాంచిన కవి, రచయిత, నటుడు, గాయకుడైన నాజర్ గారి ఆత్మకథని “పింజారి” పేరుతో గ్రంథస్థం చేసారు డా. అంగడాల వెంకట రమణమూర్తి. షేక్ నాజర్ గారి గురించి వారి భార్య అందించిన మరింత సమాచారం కూడా ఈ పుస్తకంలో జోడించారు.

FrontCover - Copy1920, ఫిబ్రవరి 5 న గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ నిరుపేద దూదేకుల ముస్లిం కుటుంబంలో పుట్టారు నాజర్. అమ్మనాన్న ఆరుగాలం ఎండనకా, వాననక అలుపూ సొలుపూ లేకుండా అరవచాకిరి చేసినా ఆకళ్ళు తీరని అగచాట్లమారి కుటుంబం తమది అని చెబుతారు నాజర్. తండ్రి షేక్ మస్తాన్ చెక్కభజనలో నేర్పరి, నౌబత్ మేళగాడు. పెదనాన్న షేక్ నాజర్ గొప్ప షహనాయి విద్వాంసుడు. కళాకారుల కుటుంబం నాజరుగారిది. అసలు వారి వీధిలోని పందిరిగుంజ కూడా పాటలు పాడుతుందని ప్రతీతి. అటువంటి వంశంలో పుట్టిన నాజర్ గారికి బాల్యం నుంచే రాగాలాపన, పద్యాలు పాడడం అబ్బడంలో అసహజత్వం ఏమీ లేదు. రెండో తరగతి చదువుతున్నప్పుడు బజార్లో పాటలు పద్యాలూ కూనిరాగాలు తీయడం విన్న పంతులుగారు పలక మీద సాయంత్రం ఎక్కాలతో పాటుగా సుమతీ, దాశరథీ, భాస్కర శతకాల పద్యాలు రాసి ఇస్తే, మర్నాడు ఉదయం వాటిని అప్పజెప్పేవారట. రాగాలు, పద్యాలు బాగా పాడుతుండంతో, తండ్రితో పాటు నాజర్ గారు కూడా వీధి భాగవతాలలో పాల్గొని కుటుంబ సంపాదనలో తానూ ఒక చెయ్యి వేసారు. పాటలన్నా, రాగసాయలన్నా ఒక్క సారి వింటే చాలు గుర్తుండేవనీ, ఎక్కాలు, లెక్కలు మాత్రం ఎంత చదివినా చచ్చినా గుర్తుండేవి కావని; వాటి గురించి గురువుల చేత రూళ్ళకర్ర దెబ్బలు, వేళ్ళు, మణికట్టు విరిగేట్టు తినేవాణ్ణని అంటారు నాజర్.

ప్రాపంచిక చదువు కన్నా, పొట్ట నింపే విద్యే సులువుగా వంటబట్టింది ఆయనకి. నాజర్ గారి గాననైపుణ్యం చూసిన హార్మోనిస్టు ఖాదర్ గారు, తెనాలి సమీపంలోని పెద్దరావూరులో టి.ఆర్.దాసు గారు స్థాపించిన “బాలరత్నసభ” అనే నాటక కంపెనీలో చేర్చారు. అక్కడ మిగతా పిల్లలతో పాటు నాజర్ గారికి కూడా చదువడం, వ్రాయడం, సంగీతం నేర్పారు దాసుగారి అబ్బాయి రామకృష్ణ శాస్త్రి. ఏడ్వడం, నవ్వడం, కోపంగా చూడడం, కులకటం, మూతి ముడవడం, త్రిప్పటం, కళ్ళురమటం లాంటివి నేర్పించారు. ఇంకా ఏడుపు డైలాగులు చెప్పడం, పాటలు, పద్యాలు ఏడుస్తూ పాడడం, కోపంగా పాడడం వంటివి నేర్పారు. దాసుగారు నాజరుకి బాలకృష్ణ తరంగాలు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు నేర్పితే, ఓ కళావంతుల వేళగత్తె నృత్యం నేర్పింది. ఎన్నో ప్రదర్శనలిచ్చి, ప్రేక్షకులని రంజింపజేసారు నాజర్. బంగారు పతకాలను సాధించారు.

బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టిన నాజర్ గారి శిక్షణ, పరిస్థితుల ప్రభావం వల్ల నరసరావుపేటకి మారింది. అక్కడ శ్రీ మురుగుళ్ళ సీతారామయ్యగారనే గొప్ప గాయకులు, సన్నాయి విద్వాంసుల వద్ద చేరారు నాజర్. అయితే తల్లిదండ్రులు డబ్బు పంపలేకపోవడం వల్ల, భోగం వారి వద్ద వారాలు చేసుకుని విద్య నేర్చుకోవలసి వచ్చింది. అక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న నాజర్ గారు చుట్టుపక్కల ఊళ్ళలో నాటకాలు వేస్తూ భుక్తి కోసం కుట్టుపనికి కుదురుకున్నారు. చెల్లెలి పెళ్ళి కోసం తన బంగారు పతకాలను అమ్ముకోవలసివచ్చింది నాజర్‌కి. సంగీతం సగంలో ఆగింది, దున్నలబండి వ్యవసాయంతో ఇల్లు గడవదు. దినపస్తులుంటున్న తాము ఎక్కడికి వెళ్ళినా సంగీతం నేర్చుకునే శక్తి లేదని, తల్లిదండ్రులతో పాటు కూలికి వెళ్ళారు నాజర్.

తండ్రి మరణాంతరం గుడిమేళం కోసం సన్నాయి వాయించడం మొదలుపెట్టారు. పేదరికం కారణంగా రకరకాల పనులు చేస్తూ, మధ్య మధ్యలో సాధన చేస్తూనే, ఇంటిని నడిపారాయన. ఆ కాలంలోనే త్రిపురనేని సాహిత్యం, కమ్యూనిస్టు రహస్య పత్రికలు, గోర్కీ అమ్మ తదితర సాహిత్యం చదవడం ప్రారంభించారు. కొద్దిగా స్థిరపడ్డాక, వివాహం చేసుకున్నారు. అత్తగారి ఊరిలో కనకతార, కృష్ణలీల నాటకాలని రచించి ప్రదర్శించారు నాజర్. అవి బాగా విజయవంతమవడం, కమ్యూనిస్టు నేతల దృష్టిని ఆకర్షించడంతో వారు నాజర్ గారిని పిలిపించి మరో ఇద్దరితో ఓ బృందంగా ఏర్పాటు చేసి బుర్రకథ చెప్పడానికి వినియోగించారు. అక్కడ్నించి ప్రారంభమైన బుర్రకథ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. సభ్యులతో డప్పుల డాన్సు, కూచిపూడి, భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. ఎందరెందరో గురువులు… పలురకాల పద్ధతులు, వాటిలోని సుగుణాలను ఒంటబట్టించుకుని తనదైన రీతిలో మెరుగుపరుస్తూ ఎన్నెన్నో ప్రదర్శనలిచ్చారు నాజర్. భార్య అనారోగ్యం కారణంగా సంసారసుఖం లేకపోవడంతో, వైద్యుల సలహాపై మరో వివాహం చేసుకున్నారు నాజర్. మహానుభావుల సహచర్యంలో పాటలు, పద్యాలు రాయడం కూడా అలవర్చుకున్నారు.

నిరుపేదల జీవితాలను ఉల్లేఖిస్తూ…

“పచ్చి పులుసు కారప్పచ్చళ్ళు పుల్నీళ్ళు

కూరలేని కూళ్ళు కుక్క తిళ్ళు

గోచిలేని వాళ్ళు గొడ్డు చాకిరిగాళ్ళు

పల్లెపల్లె లందు పేదవాళ్ళు”

అని ఆటవెలదిలో రాసుకున్నారు.

ఆయన చిన్న చిన్న పద్యాలు రాస్తున్న రోజులలో 1944లో బెంగాల్‍ని తీవ్రమైన వరదల వల్ల పెద్ద కరువు రావడం, కలకత్తా వీధులలో పులి విస్తరాకుల కోసం పందులు, కుక్కలు మనుషులు కొట్టుకుంటున్నారని; పండుటాకుల వలె ముసలివారు, పిల్లలు దారుల్లో డొంకల్లో రాలిపోతున్నారన్న వార్తలు విని, చలించిపోయారు నాజర్. వెంటనే ‘బెంగాల్ కరువు’ అనే బుర్రకథ వ్రాసి ప్రదర్శించారు. అఖండ విజయం సాధించిన ఈ బుర్రకథ నాజర్ గారి కీర్తిప్రతిష్ఠలని విఖ్యాతం చేసింది. నాజరు బుర్రకథ విని రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవాచార్యులు అమితానందంతో బళ్లారికి ఆహ్వానించగా, మద్రాసులో ప్రదర్శన చూచిన డా. గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించుకున్నారు. ప్రముఖ పాత్రికేయుడు కె.అబ్బాస్ నాజరును ‘ఆంధ్ర అమరషేక్’ అని అభివర్ణించగా, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నాజర్ ప్రజాభాషకు ముగ్ధుడై ‘నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో’ అని ఆలింగనం చేసుకోవడం వంటివి నాజర్ ప్రజ్ఞకి ఋజువులు. ఆ కాలంలోనే ‘మా భూమి’ నాటకంలో కమల పాత్రని జమునకి నేర్పారు. కమ్యూనిస్టుల సాహచర్యంలో ఉన్న కారణంగా, కమ్యూనిస్టు పార్టీతో పాటు దాని అనుబంధ సంస్థ అయిన ప్రజానాట్యమండలిపైనా కూడా అప్పటి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాంతో చాలాకాలంపాటు నాజర్ గారు రహస్య జీవనం గడపాల్సి వచ్చింది. ఈ క్రమంలో రెండో భార్య ప్రమాదంలో చనిపోవడం, మొదటి భార్య చెల్లెల్నే మూడో వివాహం చేసుకోడం జరిగింది. 1947-48 ప్రాంతాలలో ఎన్నో పాటలు రాసారు, కానీ ఆ పాటల పుస్తకాలన్నింటినీ పోలీసులు ఎత్తుకుపోయారు.

నాజర్‌ చాలాసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు. ఆ కాలంలో ఎన్నో కష్టాలను భరించారు. చివరికి పార్టీపై నిషేధం ఎత్తి వేసాక, పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా నాజర్ బృందంలోని వ్యక్తులకు వేర్వేరు బాధ్యతలు అప్పగించడంతో, అది నచ్చక పార్టీపనులకు దూరంగా ఉన్నారు. ‘కష్టజీవి’ కథలో, మధ్యతరగతి, ధనిక రైతుబిడ్డలైన నాగయ్య, భీమయ్య అనే వాళ్ళను కల్పించి కమ్యూనిస్టు నాయకులుగా, త్యాగమూర్తులుగా చిత్రించి ఆడి, పాడి తాము ఏడ్చి, జనాలను ఏడ్పించి, మధ్యతరగతి, ధనిక రైతు యువకులు కమ్యూనిస్టు పార్టీనాయకత్వాన్ని ఆక్రమించేట్లు చేశామని, కింది కులం కమ్యూనిస్టు కళాకారులుగా అది తాము చేసిన తప్పు అని భావించి ‘కష్టజీవి’ కథ చెప్పడం మానేసారు నాజర్.

దేశంలోని వివిధ ప్రాంతాలలో బుర్రకథలు చెప్పసాగారు. కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలినప్పుడు నాజర్ లెఫ్ట్ గ్రూప్ వేదికపై కథలు చెప్పారు. నక్సల్బరీ ఉద్యమాన్ని సమర్థిస్తూ వారు కథలు చెప్పడంతో, లెఫ్ట్ గ్రూప్ నాజర్ కథలు వద్దని ప్రకటింది. ఆ తర్వాత విరసంలో చేరి కొన్నాళ్లు పనిచేసారు. అక్కడి నాయకులతో బేధాభిప్రాయాలు వచ్చి దాంట్లోంచి బయటపడ్డారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలు తమ వేదికలకు నాజర్‍ని పిలవడం మానేసాయి. అయినా నాజర్ వెరవలేదు. కోరినవారి కోసం, పిలిచిన చోట ప్రదర్శనలిచ్చారు. వంతలు ఎంతమంది మారినా ప్రదర్శనలకు ఆటంకాలు రాకుండా చేసుకున్నారు. మూడో భార్యనే వంతగా పెట్టుకుని తనకు 63, ఆమెకు 49 ఏళ్ళు వచ్చేవరకు ప్రదర్శనలిచ్చారు.

తానేం చేసినా తన వాళ్ళెవరూ అడ్డుచెప్పలేదని, అందుకే కళనింతగా అభివృద్ధి చేసుకోగలిగానని అంటారు. “ప్రజల కోసం రాశాను, పాడాను, డబ్బు లెక్కచేయలేదు..” అన్న నాజర్ గారికి తర్వాతి కాలంలో ఎన్నో అవార్డులు రివార్డులు లభించాయి. ఎందరో ప్రముఖులు ఆయన అభిమానులుగా మారారు. 1986 లో కేంద్రప్రభుత్వం వారు పద్మశ్రీ అవార్డిచ్చారు. ఎన్నో సత్కారాలు, సన్మానాలు జరిగాయి. అయినా నాజర్ జీవితంలో పెనుమార్పులు ఏమీ సంభవించలేదు. పేద కళాకారుడిగానే ఉండిపోయారు.

తన కథని ముగిస్తూ… నాజర్ ఇలా చెప్పుకున్నారు.

“సోది యానాది, ఎరుకల, మాదిగ, చిందు, డక్కలి యిలాంటి ప్రాచీన జాతి కళావంశీయులారా! నాపైన మీరుంచిన అమూల్యమైన ప్రజల యొక్క కళల వేషభాషలు, రగడల పట్లు, శ్రుతిలయ సాయలు, గానాలు, నాట్యనడకలు, హావభావ నటనాలు, దరువులు, మున్నగు బుర్రకథ సంప్రదాయ వృద్ధ కృషిలో నా శక్తికి మించిన కృషి చేసినందుకు గుర్తులుగా ప్రజలూ ప్రభుత్వాలు ప్రసాదించిన బహుమతులు నా కృషికి, నా కష్టానికి ఫలితాలు. మీకు మారుగా నేను స్వీకరించానని సవినయంగా మనవి చేసుకుంటున్నానని విన్నవించుకుంటున్నాను. తెలుగు జానపద కళాత్మక హృదయులారా బుర్రకథ నా ఇంట పుట్టిన కళ కాదు.

“నా గురువులు షహనాయ్, నౌబత్ వాద్య కళారాధకులు. మీనుండి నేను స్వీకరించిన జాతి జ్ఞాన కళారూపాన్ని నా శక్తికి మించి సాకి పెద్ద చేసి ఉన్నత వేదిక లెక్కించి బంగారు సింహతలాటకాలు, గండపెండేరాలు, కేయూర రత్న మణిహారాలు ధరింప చేసాను. ఆంధ్రమంత్రుల చేత సన్మానాలు చేయించాను. కేంద్రప్రభుత్వం చేత ‘పద్మశ్రీ’ అవార్డులిప్పించాను.

“మీరు నాకందించిన కళకు న్యాయం చేకూర్చాననుకుంటున్నాను. నేను వచ్చిన పని అయినది. ఇంక నిశ్చింతగా నిద్ర పోతాను….

“ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు” అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు నాజర్ 1997 ఫిబ్రవరి 22న అంగలూరులో తనువు చాలించారు.

ఈ అసాధారణ కళాకారుడి (అ)సామాన్య, నిరాడంబర జీవితం గురించి తెలుసుకోవాలంటే, ఆయన ఆత్మకథ “పింజారి” చదవాల్సిందే. సౌదా అరుణ లిటరేచర్ వారు ప్రచురించిన ఈ 92 పేజీల పుస్తకం ధర 75 రూపాయలు. ప్రతులు ప్రచురణకర్తల వద్ద, నవోదయ బుక్ హౌస్, కాచీగుడా వారి వద్ద లభిస్తాయి.

- కొల్లూరి సోమ శంకర్.

పింజారి
మాట: షేక్ నాజర్, రాత: డా. అంగడాల వెంకట రమణమూర్తి
లభ్యత:
SaudaArunaLiterature,
B-74, Kendriya Vihar Phase-II, Indranagar, Gachibowli,
Hyderabad 500032. Ph: 040-23004674
saudaaruna@gmail.com

Download PDF ePub MOBI

Posted in 2014, పుస్తక సమీక్ష, ఫిబ్రవరి and tagged , , , , , , .

2 Comments

  1. Pingback: అసాధారణ కళాకారుడి (అ)సామాన్య, నిరాడంబర జీవితం

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.