Tarala Meghachaya Cover

తరళ మేఘచ్ఛాయ, తర్వాతి ఎడారి

Download PDF ePub MOBI

ఇప్పుడిలా రాత్రి నీరవంలో, అల్ప్రజోలం 1mg కూడా నిద్ర పుచ్చలేని బరువు కళ్లతో, వెనక మంచం మీద ఇప్పుడు నా వంతు భాగాన్ని కూడా వెల్లకిలా ఆక్రమించి రాఘవ పెడ్తోన్న గురక నేపథ్యంలో… ఒకసారి మాధవ్‌ని గుర్తు తెచ్చుకుంటే, జీవితంలో ఏదీ నా చేతుల్లో లేకపోవటమనే నిస్సహాయ భావనని మళ్లీ తల మీంచి గుమ్మరించుకున్నట్టూ ఉంటుంది. ఇవాళ్టికి ఏడేళ్ల క్రితం మేం విడిపోయాం. నిజానికి, విడిచి వచ్చేశాను. నేనే నెట్టేశాను. తల్లి తన రొమ్ము నుంచి బిడ్డని దూరం నెట్టినట్టు.

ఎంత విలువైనదైనా చవకగా వస్తే తలకెక్కేస్తుంది. మా మధ్య ఏడాది అనుబంధం అప్పటికే నాలో చాలా సత్తువ లాగేసింది. వాడేంటి అప్పుడే పాతిక దాటిన కుర్రాడు, వాడికి అంతా బాగానే ఉండేదనుకుంటా. అలాగే ప్రవర్తించేవాడు. నలభైయేళ్ల నన్ను తన ప్రియాతి ప్రియమైన కన్నె కలల సఖిలాగా చూసేవాడు. ఆ కొన్నాళ్లూ నన్ను నేనూ అలాగే చూసుకున్నాను. చూసుకునేలా చేశాడు నన్ను. కానీ నిజానికి అప్పటికే వాస్తవం నలిపేయగా వడలి సడలి రాలిన కలల పుష్పం తాలూకు మిగిలిన వృంతాన్ని నేను. ఎప్పుడో కప్పుడు ఆ నిజం కట్టెదుట నిలిచి నిలదీయకపోతుందా.

ఆ రోజు చాలా గుర్తు నాకు. ఈ ఏడేళ్లలోనూ పదే పదే వాడగా వాడగా అరిగిపోయిన స్మృతి అది. క్లాసుల మధ్య విరామంలో తోటి లెక్చరర్లతో ఏదో కబుర్లలో ఉంటే వాడి నుంచి ఫోన్. అప్పటికే ఎక్కడ ఉన్నా పక్కకు వచ్చి ఫోన్ ఎత్తే దశ దాటి, ఇబ్బందిగా ఉంటే కట్ చేసే స్థితికి వచ్చేశాను. అలాగే కట్ చేశాను. రెండు సార్లు, మూడుసార్లు… చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తలుచుకుంటే కళ్లమ్మటా నీళ్లు కారుతున్నాయి. కానీ అప్పుడు కట్ చేస్తూనే ఉన్నాను. చివరికి మెసేజ్ పెట్టాడు. “బయట ఉన్నాను” అని.

ప్రేమలో ఉన్న మనిషిది కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి వాటం. చుట్టూ జనానికి తెలియదా. బోటనీ ఆవిడా, లెక్కలావిడా గూడుపుఠాణీ మౌనంలో ఓరగా చూస్తున్నారని తెలుస్తోంది. “వస్తానుండండీ…” అంటూ – వాళ్ల వైపు చూస్తే నా నుంచి ఏదో కన్ఫెషన్ ఆశించే చూపుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో చూడకుండానే – కుర్చీ లోంచి లేచి బయటకు బయల్దేరాను. గది నుంచి బయటకు వచ్చానే గానీ, కుతూహలం కాళ్లకు బంధం వేసింది. కుచ్చిళ్ల మడత సర్దుకుంటున్న నెపంతో కిటికీ పక్కన వంగాను.

“Seems her dildo again…” లెక్కలావిడ గొంతు.

తర్వాత ఇద్దరి నవ్వులూ.

వాస్తవం కొట్టిన చెంపదెబ్బ! కానీ వాళ్లకేం తెలుసనీ! ఆ ప్రపంచంలో మసులుతున్న నాకు తెలుసు మా బంధపు సౌందర్యం. “సాము సడలిన పతి పరిష్వంగమునందు.. సుఖము దుఃఖము లేని సుషుప్తి లోన” ఉన్న నాకు ఎక్కణ్ణించి తేలుతూ వచ్చి తాకిందో తన వేణు గానం తాకింది. ఇక అన్నీ మరిచి ఆ స్వప్నరాగలీనురాలినై తెలియని లీల వైపు అలా సాగిపోయాను. ఇప్పుడు అది మొహం మొత్తింది.

కాలేజ్ బయట పార్కింగ్ దగ్గర నా కారు దరిదాపుల్లో అసహనంగా తచ్చాడుతున్నాడు మాధవ్. నన్ను దూరం నుంచి చూడగానే ముఖమంతా వెలిగించుకుని అదే మతాబా రవ్వల నవ్వు, కనీసం గత వారంగా కలవకుండా, ఫోన్ లో దొరక్కుండా ఇబ్బంది పెట్టానన్న కోపం కూడా మర్చిపోయి. ఆ నవ్వులో తన ప్రేమ మీద వాడు పెట్టుకున్న నమ్మకం కనపడి, వాడికా రోజు నేను ఏం చేయబోతున్నానో గుర్తొచ్చి, గుండెల్లో పెద్ద ముడేదో మెలిపడుతున్నట్టుగా అనిపించింది. లెక్కలావిడ కామెంట్‌తో ఇరిటేట్ ఐ ఉన్నానేమో, వాడి నవ్వుకి బదులివ్వలేదు.

“ఎందుకు అదే పనిగా రింగ్ చేస్తావ్. కట్ చేశానంటే ఏదో కారణంతోనే కట్ చేసుంటా అనుకోవా?”

“వారం అయింది నీతో కుదురుగా మాట్లాడి. నాతో మాట్లాడటనికి సందు దొరకనంత బిజీనా? ఏంట్రా ఇది?”

నేను మౌనం వహించబోయాను. కానీ మామూలుగా నా మౌనాన్ని వాడేది ఊరకనే వాడిలో దోషభావం రేగ్గొట్టటానికి. ఇప్పుడా అవసరం లేదు. ఇది దోషభావాన్ని కన్వీనియెంట్‌గా మీదేసుకుని వాణ్ణి తూట్లు పొడవబోయే సందర్భం. “పద కారెక్కు. మాట్లాడాలి.”

ఆ రోజు కారు ప్రయాణం ఒక్కోసారి అలా అనంతంగా సాగిపోతే బాగుండేదని అనిపిస్తుంది. ఇప్పుడీ కథలో కూడా. ఆ ప్రయాణాన్ని వెంటనే ముగించి నా జీవితంలో బాల్యం తర్వాత తారసిల్లిన ఏకైక ఆనందపు అధ్యాయానికి నేనే ఇచ్చుకున్న మాసకిస్టిక్ ముగింపు జోలికి వెళ్లాలనిపించటం లేదు. కాసేపు నన్నూ, మాధవ్‌నీ అలా కారులోనే వెళ్లనిస్తూ, ఈ రాసే నేను మళ్లీ మొదటికి వస్తాను. మాధవ్‌ని తొలిసారి చూసిన సందర్భానికి.

అప్పటికే రాఘవని భర్తగా చూడకపోవటం మాట అటుంచి శత్రువుగా చూడటం కూడా మానేశాను. నా అరుపులూ, గొడవలూ, హిస్టీరియా, సైకియాట్రిక్ కన్సల్టేషన్లూ అన్నీ పోయి, ఒక ప్రశాంతమైన ఏమీలేనితనం. We were just co-existing, and it’s still the status. మా మధ్య స్వప్న రూపేణా పేగుబంధం లేకపోయుంటే తెగతెంపులు చేసుకునేదాన్నేమో. అది కూడా ఏమోనే. తెగించి ఏదోటి చేయలేని తనానికి అదో సాకేమో కూడా. ఇలాంటి మృత వాతావరణంలో పెరిగేకంటే, ఆమె నా దగ్గరో తన దగ్గరో పెరిగుంటేనే బాగుండేది. మా ఇద్దరి మధ్యా సయోధ్య ఆశలేమన్నా ఇంకా ఇలా కలిపి ఉంచాయా. కానీ అతని వ్యక్తిత్వం ఎక్కడో ఒన్స్ అండ్ ఫరాల్ ఇలా ఏర్పడిపోయింది. ఇక మారడు. జీవితం నాశనం చేసినవాడి పక్కలోనే ఇలా నేను ముసల్దాన్నయిపోవాల్సిందే.

ఒక రోజు రాత్రి ఏదో పార్టీకని తీసుకెళ్లాడు. మార్బల్ కాంట్రాక్టర్లందరూ కలిసి ఎందుకో పార్టీ ఇచ్చుకుంటున్నారు. అది సంకుటుంబ సపరివార సమేతమైన వేడుక కాబట్టి, ఎవరెవరి భార్యలు వారి వారి మొగుళ్ల పక్కన ఉంటారు కాబట్టి, ఒక ట్రోఫీ వైఫ్‌గా నేనూ వెళ్లక తప్పలేదు. బేగంపేట దగ్గర ఏదో ఫంక్షన్ పేలేసు. బయట ట్రాఫిక్ ప్రవాహం ఒకటి వెళ్తోందని తెలియనివ్వకుండా నిలువునా పైకి లేచిన ఫైబర్ గోడలు. లోపల కృత్రిమ గడ్డి పరిచిన విశాలమైన ప్రదేశం. మధ్య మధ్యలో దీపస్తంభాలు. ఓ మూలన పెద్ద వేదిక. అప్పటికే అతిథుల ఉపన్యాసాలు ఐపోయాయి. అందరూ బఫే దగ్గరకు వెళ్లి ప్లేట్లలో వడ్డన చేయించుకుని వేదిక ముందు ఉన్న నీల్‌కమల్ కుర్చీల్లో కూర్చుని తింటున్నారు. ఆ కుర్చీలన్నీ ఏ గుంపుకి ఆ గుంపుగా వరసలు తప్పి చిందరవందర వలయాలైపోయాయి. నేను మాత్రం ఏ వలయంలోనూ కుదురుకోలేను. అక్కడ ఆడవాళ్లయినా మగవాళ్లయినా మాట్లాడుకునే విషయాలేవీ నాకు ఆసక్తిని కలిగించేవి కావు. ఇంకా మగవాళ్లే నయం. కాసేపటికి అక్కడ ఏ గుంపులోనూ చేరక ఒక్కదాన్నీ ఉన్నది నేనేనని గుర్తొచ్చి అలా పోతున్న ఓ బుడ్డాణ్ణి దగ్గరకు పిలిచి ఏదో కబుర్లు చెప్తున్నాను.

అప్పుడు వచ్చింది వేదిక మీదకి ఆర్కెస్ట్రా. నాకు ఈ ప్రోగ్రాం ఉందని తెలియదు. ఆ వచ్చిన ఐదారుగురిలో ఉన్నాడు మాధవ్. నెమ్మదిగా వాద్య పరికరాలు సర్దటం అయ్యాకా పాటల ప్రోగ్రాం మొదలైంది. మొదటి పాట మాధవ్ దే అని గుర్తు. ఏదో హిందీ పాట. నాకు పాట తెలియదు, కానీ వాడు పాడిన విధానం మాత్రం మంత్రముగ్ధంగా ఉంది. మాధవ్ గొంతు ఇప్పుడు సినిమాల్లో వినిపించే చాలా గొంతుల కన్నా భిన్నమైందేమీ కాదు. కానీ వాడు పాడుతున్నానొహో అన్నట్టు పాడడు, ప్రాణం పెట్టి లీనమై పాడతాడు. అదే వాడి గొంతులో అందం. పాడుతున్నప్పుడు వేదిక కింద ఏం జరుగుతుందో కూడా చూడటం లేదు. కళ్లు మూసుకుని, పాట సాహిత్యంలోని భావమేంటన్నది పట్టించుకోకుండా, పాట రాగంలోని అనుభూతిని మాత్రం పట్టుకుని, అది ఏ మాత్రం దాచే ప్రయత్నం చేయకుండా తన్మయిస్తూ, అసలు ప్రదర్శిస్తున్నానన్న స్పృహ లేకుండా, ఒక చేత్తో మైకుని బిగించి పట్టుకుని రెండో చేత్తో గాలిని నిమురుతూ పాడుతున్నాడు. ఆ చేతులు… ఆ చేతులకీ, వాటి పొడవాటి వేళ్లకీ ఒక విశిష్టత ఉంది. వాటి మధ్య ఏమొచ్చి చేరినా చిత్రమైన అందాన్నీ ప్రాముఖ్యతనీ సంతరించుకుంటాయి: సిగరెట్టయినా, టీకప్పయినా, నా రొమ్మయినా.

నిజానికి అలాంటి పార్టీ వాతావరణాలు నాకు పెద్ద నచ్చవు. కానీ మాధవ్‌ని మొదటి సారి చూసిన క్షణాలకు నేపథ్యమైన కారణంగానేమో, అదంతా ఒక వాంగో స్టారీ నైట్స్ లాంటి బ్రైట్‌నెస్‌తో జ్ఞాపకంలో ముద్రపడిపోయింది. వాడు పాటలు పాడుతున్నాడు, వాడి పాట అయ్యాకా మధ్యలో ఇంకెవరో అందుకుని ఇంకో పాట పాడుతున్నారు, నా దృష్టి మాత్రం వాడు పాడుతున్నప్పుడూ, పాడకుండా పక్కన కూర్చుని వేరే వాళ్ల పాటలకి కాలి తాళం వేస్తున్నప్పుడూ కూడా వాడి పైనే లగ్నమై ఉంది. మిరుమిట్లు గొలిపే అందగాడని కాదు. చామనఛాయ, పెద్ద ముఖం, భృకుటి దగ్గర దట్టంగా మొదలై ముఖం చివర్ల కెళ్లే కొద్దీ డ్రైబ్రష్‌తో పల్చగా హాచింగ్ చేసినట్టు ముగిసిపోయే కనుబొమ్మలు… నుదురూ, కళ్లూ, చెంపలూ అన్నీ ఏదీ మరుగు చేయలేనట్టు తలుపులన్నీ తెరిచిపెట్టుక్కూచున్నట్టు ఉంటాయి.

ఓ రెండు గంటల తర్వాత పాట కచేరీ ముగిసింది. వాడు కాగితాలు పుస్తకంలో సర్దుకుని వెళిపోతున్నాడు. వేదిక మెట్లు దిగి, వెనక చీకట్లలోకి, నాకు దూరంగా, మళ్లీ ఇక కనపడే వీల్లేకుండా. మళ్లీ ఎప్పుడో అప్పుడప్పుడూ ఒక ఆనందం నాకు వీపు చూపిస్తూ వేసుకున్న తలుపు చప్పుడులాగా మాత్రమే గుర్తొస్తాడు. వయసు గడిచేకొద్దీ, లేదా వయసుతో పాటూ డెస్పరేషన్ పెరిగే కొద్దీ, ఇలాంటి చిరు సంకేతాల్ని పట్టించుకోవటం ఎక్కువవుతుందేమో. వయసులోలా అవి పదే పదే తారసపడతాయన్న నమ్మకం ఉండదు కదా. అందుకే, కుర్చీలోంచి లేచాను. అస్తమానం మెదడు తర్కమేనా. మెదణ్ణి మనం నడిపించగలం, తర్కపు చెర్నాకోలతో. మనసు మాత్రం ఏ జాడలకు వశీకృతమై మనల్ని అటు లాక్కుపోతుందో దాని అభీష్టం. అప్పుడప్పుడూ అన్నీ మరిచి అది ఎటు పట్టి ఈడిస్తే అటు డేక్కుంటూ పోవాలి.

రాఘవ సఫారీ సూట్లో, ఒక చేయి వీపు వెనక మడుచుకుని, ఒక చేత్తో పెగ్గు పట్టుకుని, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేను తన వైపు రావటం గమనించి వీపు వెనక నుంచి చేయి తీసి వాచీ చూసుకున్నాడు. వాళ్ళ సంభాషణో కొలిక్కి వచ్చి తను నా వైపు వచ్చేదాకా వేచి చూసేంత సమయం సహనం లేవు. తిన్నగా వాళ్ళ మధ్యకి వెళ్లాను. కారు తాళాలు ఇమ్మన్నాను. ఒక అరగంట ఆగితే తనూ వచ్చేస్తా అన్నాడు. అర్జంటన్నాను. పక్కన ఎవరూ లేకపోతే ఏంటంత అర్జంటని అడిగేవాడే. ఇప్పుడు తప్పక కనుబొమలు పైకి లేపి తాళం చేతుల్లో పెట్టాడు.

వేదిక పక్కనుంచి బయట పార్కింగ్‌కి దారి ఉంది. అక్కడ కాస్త చీకటి. ఆ చీకటిలోకి చేరేదాకా నిమ్మళంగా నడిచాను. ఏం చేద్దామని బయటకు వెళ్తున్నా అనేది పూర్తిగా నాకే తెలీదు. వాణ్ణి ఒంటరిగా కలవాలి, వీలైతే కారు ఎక్కించుకోవాలి, వాడి పాట చాలా బాగుందని చెప్పాలి… ఏదో ఒకలా మాట్లాడాలి. ద్వారం దాటేసరికి బయట వాళ్ల గ్రూపు వీడ్కోలు తీసుకుంటోంది. అప్పటిదాకా నాకు అనిపించలేదు, వాళ్లంతా బైక్స్ మీద వచ్చి ఉండొచ్చని. ఒక చిన్న ట్రాలీ ఆటోలో వాద్యపరికరాలు ఎక్కించి బైక్స్ స్టార్ట్ చేసి కోలాహలంగా వెళ్లిపోయారు. దారపు ఉండ నుంచి జారుతున్న దారంలా అలవోకగా భవిష్యత్తులోకి జారుకోబోయిన కాలం పుటుక్కున తెగిపోయినట్టనిపించింది. ఎలాగూ తాళాలు తీసుకున్నాను కాబట్టి ఇంటికి వెళిపోయాను.

మనసు ఎన్నో ఎటూ పర్యవసించని సంకేతాలు కూడా ఇస్తుంది లెమ్మని ఊరుకున్నాను. కానీ నెల తర్వాత మరలా కనిపించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ – విక్టోరియా ఒకాంపోల మధ్య అనుబంధం గురించి ఏదో పుస్తకం వచ్చిందంటే కొనుక్కుందామని వాల్డెన్‌కి వెళ్లాను. పుస్తకం దొరికేసినా ఊరికే అరల మధ్య తిరుగుతున్నాను. పుస్తకాల షాపుల్లో ఎవరూ ముఖముఖాలు చూసుకోరు ఎందుకో. నేనూ చూడలేదు వాణ్ణి. కానీ సిక్స్‌త్ సెన్స్ అంటారె, అలా వాడు నన్ను దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా చూడకుండానే వాణ్ణి గుర్తు పట్టాను. అది అతని పరిమళమా, ఆంగికమా, నా కళ్ల కొలుకుల్లోంచి కనపడిన రూపపు మసక అంచా, లేక కేవలం జననాంతర సౌహృదమా… తెలీదు. వాణ్ణప్పుడు చూడగానే ఏదో కలలో కనిపించిన మనిషిని బయట గుర్తుపట్టినట్టు, అంత ఆత్మీయత లోపల్నించి పొంగటానికి కారణం ఆ మనిషి ఇంతకుముందు కలలో కనిపించటమే అన్న సంగతి గుర్తురాక అయోమయపడ్డట్టు… అలా అనిపించింది. వాడు పుస్తకాల రాక్స్ మధ్య తిరుగుతున్నాడు. నేను వాణ్ణి కేంద్రంగా పెట్టుకుని పుస్తకమేం అక్కర్లేకపోయినా పచార్లు చేస్తున్నాను. ఎలా పలకరించాలో తెలీలేదు. ఎలా వెళ్లాలి వీడి జీవితంలోకి, వీడి జీవితపు లోపల్లోపలి విషయాలతో నిమిత్తం ఉన్న మనిషిగా ఎలా మారాలి? వాణ్ణి ఇదివరకూ చూశానని చెప్పదల్చుకోలేదు. ఒకణ్ణి నెల క్రితం చూసి గుర్తుపెట్టుకున్న ఆడదాన్ని కాదల్చుకోలేదు. (తర్వాతెపుడో చెప్తే ‘దొంగనాయాలా’ అన్నాడు.)

చివరకు కొన్ని పుస్తకాలు తీసుకుని కౌంటర్ వైపు వెళ్లాడు. డబ్బులు కట్టి బయటకు వెళిపోతున్నాడు. అంత పిచ్చి ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. బహుశా అసలు వాడు రెండోసారి కనపడటమే మా ఇద్దరి మధ్యా ఏదో రాసి పెట్టుందన్నదానికి నిదర్శనంగా భావించిన నా మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కితగ్గ దల్చుకోలేదనుకుంటాను. వాడి వెనకే గేటు దాకా వెళ్లాను.

“ఎక్స్‌క్యూజ్ మీ”.

వాడు అప్పటికే మెట్లు దిగుతున్నాడు. కింద మెట్టు మీద వెనక్కి తిరిగాడు. వాడి కళ్లు, ఉన్నట్టుండి పిలిస్తే హడలిపోయిన కళ్లతో తిరుగుతాడు ఎప్పుడూ. ఆ ఎక్స్‌ప్రెషన్ చూట్టానికే ఒక్కోసారి ఉన్నట్టుండి ఊరికే పనేం లేకపోయినా పిలిచే దాన్ని. నా సొంత మిర్త్‌‌తో నేను నవ్వుతుంటే వాడి ఉడుకుమోతు ముద్దు ముఖం!

“నేను ఆ పుస్తకం కోసమే వెతుకుతున్నానండీ”

వాడు చేతుల్లో ఉన్న మూడో నాల్గో పుస్తకాలు చూపించి, “ఏది?” అని అడిగాడు.

ఆ పుస్తకాల్లో రెండో కాపీ ఉండదనుకున్న పుస్తకాన్ని చూపించాను.

ఏమనాలో తెలీక “అవునా” అన్నాడు. “ఇంకో కాపీ ఉందేమో చూడండి” అన్నాడు.

“అడిగానండీ, లేదన్నాడు. మీరేం అనుకోకపోతే, మీ నంబర్ ఇస్తారా. మీరు చదివాకా తీసుకుంటాను.”

“ఆన్‌లైన్లో దొరకచ్చేమోనండీ” అన్నాడు మొహమాటంగా.

“నాకవన్నీ అలవాటు లేవు, ప్లీజ్”

అయోమయంగా చూశాడు.

“మళ్లీ ఇచ్చేస్తాను చదవగానే.”

“అది కాదండీ, మనకేం పరిచయం లేదు కదా, పుస్తకం కోసం మళ్లీ కలుస్తారా అని.”

“పరిచయందేముందండీ, చేసుకుంటే అదే అవుతుంది. ఒకే పుస్తకం కోసం ఇంత కొట్టుకుంటున్నామంటే అభిరుచులూ ఓ మాదిరిగా కలవచ్చేమో కూడా.”

వాడు ఎక్కడ ఉంటాడో అడిగాను. ఇందిరానగర్ అన్నపూర్ణ గుట్ట దగ్గర ఉంటాడట. ఇంటి దగ్గర దింపేస్తా రమ్మని కారు ఎక్కించుకున్నాను. కార్లో మాట్లాడుకున్నాం. వాడు ఎమ్మెస్సీ అవగానే తాడేపల్లిగూడెంలో రైలెక్కి సినిమాలకు పాటలు పాడదామని హైదరాబాదు వచ్చాడు. మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అట్టడుగున స్ట్రగుల్ అవుతున్నాడు. గెటాన్ కావటనికి అడపాదడపా ఆర్కెస్ట్రాలో పాడతాడు, కేటరింగ్ కి వెళ్తాడు, ఫ్రెండ్స్ యూసఫ్‌గుడాలో పెట్టిన ఫాస్ట్‌పుడ్ సెంటర్లో కౌంటర్ దగ్గర కూర్చుంటాడు. పాటలు పాడే అవకాశం ఐతే రాలేదు గానీ, రెండు మూడు అడ్రసు లేని సినిమాలకు పాటలు రాశాడు. So, he is an artist!

ఆ రోజు ఇందిరానగర్లో ఒక నాపరాళ్లు పరిచిన కారు దూరని ఇరుకు సందు ముందు వాణ్ణి దింపాను. వాడూ నాలాగే పుస్తకాల్లో మాత్రమే తారసపడే ఎన్నో అరుదైన సన్నివేశాల్నీ సినారియోల్నీ జీవితం నుంచీ ఆశించే హోప్‌లెస్ రొమాంటిక్కే గనుక, ఎవరో తెలియనావిడ ఇలా కారులో వాణ్ణి ఇంటి దగ్గర డ్రాప్ చేయటమనే అనుభవంలోని అరుదైనతనాన్ని పైకి కనపడనివ్వకుండా మామూలుగా ప్రవర్తించటానికే ప్రయత్నించాడు. దిగేటప్పుడు కిటికీ లోంచి వంగి “థాంక్స్” చెప్పి, వెను దిరిగి తన నీరెండ లోకంలోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

Tarala Meghachaya అలా మొదలైంది. వెళ్లిన రెండో రోజే కాల్ చేశాను. వారం ఓపిక పట్టి కలిశాను. చాలా మాట్లాడుకునేవాళ్లం. రాత్రుళ్లు నా గది బాల్కనీలోనూ అర్థ రాత్రుళ్లు నా రగ్గు కింద సాగే ఫోన్లలో కాలం కరిగిపోయేది. సాయంత్రాలు పార్కుల్లోనూ ఎవరూ పట్టించుకోని దేవాలయాల్లోనూ కలుసుకునేవాళ్లం. రోజులన్నీ సూర్యుడి పసుపు కాంతుల్లో ఆకులతో ఆడుకునే గాలి కెరటాలలో గడిచిపోయేవి. నాన్న చనిపోయాకా హఠాత్తుగా తెగిపోయిన బాల్యం, మళ్లీ మాధవ్ రాకతో, ఈ మధ్య నిడివిలో అసలేమీ జీవితం గడవనట్టుగానే, తిరిగి కొనసాగినట్టనిపించేది. కొన్ని విషయాల్లో అతను అచ్చంగా నాన్నకు ప్రతిబింబం. ఒక మృదు గంభీర వ్యక్తిత్వంగా, ఆడదాని మనసుని అబ్బరంగా కాచుకోగల మగాడిగా మున్ముందు ఎదగబోయే అతనిలోని ఆ అంశల్ని నేను బీజరూపంలోనే గుర్తించాను. అవి నా వయస్సుని మర్చిపోయేలా చేశేవి. నేను నలభై దాటిందాన్నని అప్పుడప్పుడూ గుర్తొచ్చి సిగ్గేసేది. కానీ అది నాకు మాత్రమే గుర్తొచ్చేది. వాడెప్పుడూ అది ఎత్తి చూపించేలా ప్రవర్తించలేదు. వాడు వయసుకి మాత్రమే ఇరవైల్లో ఉండేవాడు, మనసుకి నాకు సరిజోడు.

కలిసిన నెల రోజులకనుకుంటా, ఒక రోజు శ్రీశైలం ప్రయాణం పెట్టుకున్నాం. వంతులుగా డ్రైవ్ చేసుకుంటూ, ఆగాలనిపించిన చోట ఆగి ఏదోటి తింటూ, ఒక్కోసారి ఊరికే దారిలో తారసపడ్డ ఏదో ఒక ఊరి వైనం నచ్చి చాలాసేపు అక్కడ అలా కారు ఆపేసి ఆ స్థలంలో మాకూ తట్టీ తట్టకుండా తాకిన ప్రణయ స్వభావమేదో పూర్తిగా ఆకళింపు చేసుకోవటనికి ప్రయత్నిస్తూ, నిద్ర గన్నేరు నీడలు మా కారు మీంచి వెనక్కి జరిగిపోతుంటే కబుర్లలో కాలం తెలియకుండా, కాలం తెలియకుండా ఇట్టే జారిపోతుందే అన్న గుబులుతో కారు వేగం నలభై దాటనీయకుండా… అలా సాగిపోయాం. ఘాట్ రోడ్డు ఇంకా ఎక్కక ముందు, దూరంగా రంగులేని కొండలు ఆహ్వానిస్తూ కనిపిస్తున్న చోట, సూర్యుడు కుంగి చల్లని నీడలు భూమంతా పాకే వేళ కారు విశ్రాంతికి ఆపాం. సంభాషణ ఏంటో గుర్తు లేదు గానీ, అది వాడు నన్ను ముద్దు పెట్టుకునే దాకా తెచ్చింది. అతి సహజంగా జరిగిపోయిందది. మేమిద్దరం అనే ద్వంద్వం ఇంకా మిగిలి ఉండటానికి మా మధ్య నడుస్తున్న ఆ సెక్సువల్ టెన్షనే కారణం అని ఇద్దరికీ అనిపించింది. దాన్ని తొలగించుకోవటానికే అన్నట్టు దాన్ని దాటేశాం.

రాఘవ నాలో మార్పును గమనించాడు. కనీసం ఒక చూరు కింద కలిసి ఉన్న పుణ్యానికైనా మోయాల్సిన మొహమాటపు బంధాన్ని కూడా నేను పట్టించుకోకపోవటం అతని గమనింపుకు వచ్చింది. పైగా అతనూ నేనూ ఇంకా ఇలా ఒకే ఇంటిలో కలిసి ఉండటం మాధవ్‌‌లో ఎలాంటి ఇన్సెక్యూరిటీల్ని తెస్తుందో అని భయపడి కాబోలు నేను రాఘవకి మరింత దూరంగా మసలుకునేదాన్ని. ఆ దూరాన్ని అక్కడ లేని మాధవ్‌కి నిరూపించటానికి నా మాటల్లో రాఘవ మీద మరింత ద్వేషం చూపించేదాన్ని. ఆ ద్వేషం ఎప్పుడో ఎలాగో నిజంగా నాలో ఇంకిపోయి నిజంగానే ద్వేషించటం మొదలుపెట్టాను. బాగా చీకిపోయిన బట్ట ఎండలో ఎండితే ఎలా పేలికలుగా ఊడొచ్చేస్తుందో అలాంటి పేలికల బంధం మిగిలింది చివరికి. కానీ నేను లెఖ్ఖ చేయటం మానేశాను. ఊడితే ఊడింది అన్నట్టు, కొన్ని సార్లు అతని ముందే మాధవ్ ఫోన్ ఎత్తేదాన్ని.

జంటగా మా భవిష్యత్తు అసలు ఏమిటన్నది మాధవ్ నేనూ ఆలోచించేలోపలే నెలలు గడిచిపోయాయి. అసలు ముందు ఆ అవసరమే కనిపించలేదు. నెలలు గడిచేకొద్దీ అవినాభావం అంతకంతకూ గాఢమైపోవటం వల్లనే మా ఇద్దరికీ జంటగా ఒక భవిష్యత్తు ఉండి తీరాలన్న అవసరం కనిపించిందేమో. వాడి వైపు నుంచి వాడికి ఏమీ అడ్డుల్లేవు. కానీ నేను మొదట్లో డెఫినిటివ్ గా ఏదీ చెప్పేదాన్ని కాదు. రాఘవ నాకు ఒక లెక్క కాదు. విడాకులు ఇచ్చేయచ్చు. కానీ స్వప్న. దానికో భవిష్యత్తు ఉంటుందా అమ్మ తనకన్నా పదిహేనేళ్ల వయసు తక్కువ వాడితో ఉంటుందంటే? అదంతా పక్కన పెట్టినా, ఏమని నేను వీడి మీద ఆధారపడగలను? ఇంకా తన లక్ష్యపు నిచ్చెన మొదటి మెట్ల మీదే ఉన్నాడు. మా ఖర్చులన్నీ నేనే పెట్టుకునేదాన్ని. ఈ శంకలన్నీ తలెత్తటం మొదలుపెట్టాకా, వాడితో ఉన్న సమయమంతా వాడి మాయలో బాగానే గడిచేది, కానీ వాడితో లేనప్పుడు మాత్రం తలనొప్పి పుట్టించే ఆలోచనలు చుట్టుముట్టేవి. ఒక్కోసారి అనిపించేది… వాడు మా బంధాన్ని కేవలం ఒక ‘ఆంటీ’తో కాసేపు సరదాగా కొన్నాళ్లు గడపడంగా స్వీకరించినా బాగుండేదేమో అని. కానీ వాడు అలా కాదు. వాడు అలా కాదు కాబట్టే దీని గురించి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను.

కానీ రాన్రానూ వాడిలో ఒక భావి పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండాల్సిన అవసరం కనిపించసాగింది. మొదట్లో దాన్ని నేను నిరాకరించలేదు. క్రమేణా అవ్యక్తమైన సమ్మతి కూడా చూపించాను. చివరకు మా ప్రణాళికలు సదూరంగా మెటీరియల్ రూపంలో మినుకు మినుకుమనడం కూడా మొదలైంది. స్వప్న ఇంకొన్నేళ్లలో ఎలాగో ఇల్లు వదిలి బయటి లోకంలో తన జీవితం తాను చూసుకుంటుంది. తర్వాత రాఘవ నేనూ కలిసి ఉండటం అనేది అర్థరాహిత్యానికి సజీవ నిర్వచనంగా మిగలటమే. రాఘవకి పెద్ద తేడా ఏం ఉండదు. తన పేర్న ఆస్తులున్నాయి. విడిపోయుంటే తర్వాత పెళ్లి కూడా చేసుకునేవాడనుకోను. నా పేర్న పెళ్లప్పుడు ఇచ్చిన ఆస్తులు కొన్ని ఉన్నాయి, ఊళ్లో తమ్ముడు వాటిని చూసుకుంటున్నాదు. అవి సరిపోతాయి నాకూ మాధవ్‌కీ. ఇలా ఆలోచించేదాన్ని. అదంతా ఎలా సాధ్యమని ఆలోచించానో ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆ ప్రపంచం చాలా దూరం జరిగిపోయాకా. దూరం జరిగిపోయే రోజు త్వరలోనే ఎదురైంది.

ఒకరోజు పొద్దున్నే ఏదో పనిలో ఉండగా రాఘవ బిగ్గరగా పిలిచాడు. వెతుక్కుంటూ వెళ్ళే సరికి అతను స్వప్న గదిలో ఉన్నాడు. స్వప్న కాలేజీకి వెళ్లింది. మామూలుగా మేం ఎవరం తన గదిలోకి వెళ్లం.

“ఏం ఇక్కడ ఉన్నావ్?” అడిగాను. అతను స్వప్న మంచం మీద కూర్చున్నాడు. ఏదో దాచుకున్న ముఖం పెట్టుకుని.

నా ప్రశ్నకి బదులుగా అన్నట్టు లేచి వెళ్లి గోడకున్న అల్మరా తెరిచాడు. అందులో స్వప్న బట్టల కింద ఉన్న ఒక నల్లని వస్త్రం బయటకు లాగాడు. అదేమిటో వెంటనే అర్థం కాలేదు.

“ఏంటది?”

బట్టలషాపు సేల్స్‌మెన్లా దాన్ని నా ముందు విప్పి పరిచాడు. అదో బురఖా.

“ఐతే?”

“నీకు అర్థం కావటం లేదా? దానికి బురఖా తొడుక్కునే అవసరం ఏమై ఉండొచ్చో?”

“ఛా, ఫ్రెండుదై ఉంటుంది.”

“ఇది నేను రెండ్రోజుల క్రితమే చూశాను. దాన్ని ఫాలో అయ్యాను” అతను చెప్తున్నకొద్దీ నా కాళ్లు చల్లబడ్డాయి. పక్కన కుర్చీలో కూలబడిపోయాను. స్కూలయ్యాకా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఆలస్యంగా వస్తోంది. కానీ నిజానికి ఎవడో టీవీ ఛానెల్లో కెమెరా అసిస్టెంటుగా పని చేస్తాడట, వాడి బండెక్కి దుర్గం చెరువు వైపు వెళ్తోందట. రాఘవ స్వప్నని ఆ రోజు మామూలుగా ఇంటికి రానిచ్చి, తర్వాతి రోజు పొద్దున్నే ముందే కనుక్కున్న ఆ కుర్రాడి ఇంటికి వెళ్లి అక్కడ వాణ్ణి కారెక్కించుకుని మార్బల్ ఫాక్టరీకి తీసికెళ్లి కొట్టాడట. బెదిరించి పంపించాడట. ఇప్పుడే అక్కణ్ణించి తిరిగి వచ్చాడు. ఈ విషయం చెప్పి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. ‘అసలు నువ్వు పదహారేళ్ళ ఆడపిల్లకి తల్లివేనా… నీ ఫోన్లు, నీ షికార్లు, నీ వెధవ్వేషాలూ…’ అంటూ. నాకు కోపం రాలేదు. ఇక్కడ అతను నన్ను బోనులో నిలబెట్టింది భార్యగా ఐతే నేను లెక్క చేసేదాన్ని కాదు, సంజాయిషీ ఇవ్వాల్సిన బరువు కూడా ఫీలవ్వను, కానీ నన్ను నేను ఎప్పుడూ ఒక మంచి అమ్మగానే చూసుకుంటూ వచ్చాను. అతను అంత తిడుతున్నప్పుడు కూడా నాకు అవేమీ వినిపించలేదు. నా స్వప్న… అన్నీ నాకు చెప్పుకుంటూ, నన్ను ఒక అందమైన అమ్మగా ఐడియల్గా ఊహించుకునే స్వప్న… నా నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇంత దూరమైపోయిందో కూడా తెలియని స్థితిలో హఠాత్తుగా నన్ను నేను చూసుకోవాల్సి రావటం…. రాఘవ తన అక్కసంతా తీర్చుకున్నాడు. అతని భార్యనన్న స్పృహ ఎప్పుడూ మాధవ్‌తో నా అనుబంధాన్ని దోషభావం వైపు నెట్టలేకపోయింది. కానీ స్వప్న తల్లినన్న స్పృహ ముందు (ముఖ్యంగా తల్లిగా నా అసమర్థత ఇలా బయటపడ్డాకా) ఆ బంధాన్ని నేను ఏ రకంగానూ సమర్థించుకోలేకపోయాను, నన్ను నాకే సమర్థించుకోలేకపోయాను. ఆ నిశ్శబ్ధాన్ని ఆసరా తీసుకుని రాఘవ చాలా రెచ్చిపోయాడు. ఏమన్నా పడ్డాను. కానీ, స్వప్న ఇంటికి రాగానే మీదపడి కొట్టాడు. స్వప్న తప్పు దొరికిపోయిందానిలా ఏం నిలబడలేదు. ముందు నా అల్మరాలో చేయి పెట్టడానికి నువ్వెవడివని దెబ్బలాడింది. వాణ్ణి ప్రేమిస్తున్నానంది. రాఘవ మరింత రెచ్చిపోయాడు. ఇంక నేను నిశ్శబ్దంగా ఉండలేదు. అతణ్ణి నిలువరించటానికి నా దగ్గరా ఆయుధాలున్నాయి. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేట్టు మాట్లాడాను. అరుచుకుంటూ బయటికి వెళిపోయాడు. ఆ రాత్రంతా స్వప్నని దగ్గర కూచోబెట్టుకుని మాట్లాడాను. తను ఆ కుర్రాడి గురించి చాలా చెప్పింది. అవి నా వయసు మైలురాయి దగ్గర నిలబడి చూస్తే చాలా సిల్లీ రీజన్స్ ప్రేమించటానికి. ఎలా ఏం చేశానన్నది అంతా ఇక్కడ అనవసరం. కానీ వాడు నిజంగా ఏంటో నిరూపించి (నిరూపించాననుకొని) స్వప్నను మళ్లీ నాకు దక్కించుకోవటనికి నెల పట్టింది.

స్వప్న ఒక ఆరేడేళ్లలో తన జీవితం తను చూసుకోగల స్థితికి వస్తుంది అనుకున్నానే గానీ, ఆ ఆరేడేళ్ల జీవితం తనకి ఎంత ముఖ్యమో గుర్తించలేకపోయాను. కాని ఆ గుర్తించే స్థితి ఎప్పుడైతే వచ్చిందో, మాధవ్‌తో నా అనుబంధం ఎప్పటికైనా చేరగల పర్యవసానాల్ని నిజాయితీగా వాస్తవికపు ప్రమాణాలతో తూచలగల స్థితి కూడా వచ్చింది. ఎప్పటికైనా స్వప్న దీన్ని ఒప్పుకోగలుగుతుందా, స్వప్న సంగతి వదిలేస్తే, చుట్టూ సమాజం, ఎక్కడికో పోయి అడవిలో ఐతే బతకలేంగా, చివరికి నా కుటుంబం, వాళ్లేమనుకుంటారు, ఇలా వాస్తవం ఒక వెనక్కి పోని కెరటంలా నన్ను కమ్మేసింది. నెమ్మది నెమ్మదిగా మాధవ్‌‌తో మాట్లాడే వీలు చాలా తగ్గిపోయింది. ఫోన్లు కట్ చేయటం మొదలుపెట్టాను. చివరికి ఇదిగో… ఒక రోజు తిన్నగా నా కాలేజీకి వచ్చేస్తే ఇక తప్పలేదు. ఇందాక మేం కారులో వెళ్లే సన్నివేశాన్ని అలా ఫ్రీజ్ చేసి ఉంచాను కదా. అక్కణ్ణించి మళ్లీ మొదలుపెడతాను.

కాలేజీ పక్కన కాలనీలో ఈట్ స్ట్రీట్ లాంటిది ఉంది. ఒక చిన్న డెడ్ ఎండ్ సందు. దాన్ని మొత్తం ఒక రెస్టారెంటు వాళ్లు అద్దెకు తీసుకున్నారు. సందు మొత్తం ఆస్ఫాల్టు పరిచి, పెద్ద రంగుల గొడుగుల కింద నాలుగేసి కుర్చీలతో టేబిళ్లు దూరం దూరంగా ఏర్పాటు చేశారు. రాత్రిళ్లయితే ఆ చోటు చాలా సందడిగా ఉంటుంది. మేం వెళ్లింది మధ్యాహ్నం కాబట్టి చాలా తక్కువమంది ఉన్నారు. కారు పార్క్ చేసి ఇద్దరం ఓ గొడుగు కిందకి చేరి కూర్చున్నాం.

“ఏమన్నా తింటావా” అడిగాను.

తల నిశ్శబ్దంగా అడ్డంగా ఊపాడు.

నాకు ఊరికే ఎదుట కూర్చుని జడ్జి చేయబడాలని అనిపించలేదు. “నాకు ఆకలి వేస్తుంది.” మెనూ తిరగేసి వెయిటర్ని పిలిచి ఏదో ఆర్డరిచ్చాను. అప్పుడు కళ్లల్లోకి చూశాను. “ఏంటి?” డెకారించాను.

ఏమీ లేదన్నట్టు కళ్లెగరేసి, “నువ్వే చెప్పు” అన్నాడు.

నేను డిఫెన్సివ్‌ క్షణాల్లో మరీ అఫెన్సివ్‌గా స్పందిస్తాను. “ఏమీ లేకపోతే ఎందుకు నా పని చెడగొట్టడానికి ఆఫీస్ దాకా వచ్చావ్?”

“ఏమీ లేనిది నా దగ్గర. నీ దగ్గర కాదు. నీలోపల ఏదన్నా నా పట్ల ఉంటే కక్కేయి. దాచుకుని ఇలా చేయకు నాకు బాధగా ఉంటుంది.”

“ఎలా చేస్తున్నా?”

ఫోన్స్ ఎందుకు అటెండ్ కావటం లేదని అడిగాడు.

నేను చెప్పటం మొదలుపెట్టాను. స్వప్న గురించి, జరిగిన విషయం అంతా చెప్పాను. అతను ఊరికే కూర్చుని విన్నాడు, నా కళ్లల్లోకి చూస్తూ. చివరికి అన్నాడు. విడిపోవాల్సిన అవసరం ఏముందని. స్వప్న జీవితంలో సెటిలయ్యేదాకా తాను ఎదురుచూస్తానని.

అతను దీనికి కూడా సిద్ధపడ్డాకనే, నాకు అర్థమైంది. నా అడ్డం స్వప్న కూడా కాదు, నా అడ్డం సమాజం. ఇది ఎటూ చేరలేని బంధం. ఈ బంధాన్ని నిలుపుకోవాలంటే ఎన్నో ఎదుర్కోవాలి. మగవాడిగా అతనికి ఫర్లేదు. ఆడదానిగా నన్ను నేను ఆ స్థానంలో ఊహించుకోలేకపోతున్నాను. కానీ ఈ వేరే అభ్యంతరాలేవీ అతనికి చెప్పలేదు. అతణ్ణి దూరం చేసుకోవటానికి నా అమ్మతనమే ఒక ఆదర్శవంతమైన కారణం అనిపించింది. మిగతావన్నీ భయాలు. అతణ్ణి నెట్టేయటంలో నేను ఆదర్శవంతంగా మాత్రమే కనపడదల్చుకున్నాను. భయస్థురాలిలా కాదు.

“నేను నీకు ఏదీ ప్రామిస్ చేయలేను మాధవ్. స్వప్న నాకు ముఖ్యం. ఇది దాని లైఫ్‌లో చాలా ముఖ్యమైన సమయం. నేను దాన్తో ఉండాలి. దాన్ని పెంచాలి. చదివించాలి. మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చేయాలి. దానికి ఒక పెళ్లి చేయాలి. దాని కన్నా మహ ఐతే పదేళ్లు పెద్దవాడివి, నిన్ను పక్కన పెట్టుకుని కన్యాదానం చేయలేను. అది చాలా నీచం. నీకెందుకు అర్థం కావటం లేదో నాకర్థం కావటం లేదు.”

ఈ వాదన తిరుగులేనిది. అని నాకు తెలుసు. కానీ వాడికి నా మనసు నా కన్నా బాగా తెలుసు. నా భయాలూ, నా పిరికితనాలూ అన్నీ తెలుసు. తిరుగులేనిది కనుకనే ఈ వాదన ఎన్నుకున్నానని కూడా బహుశా తెలుసు.

కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇక నేను జవాబు చెప్పలేని ప్రశ్న తీసుకొచ్చాడు. “మరెందుకు దీన్ని ఇక్కడిదాకా తీసుకొచ్చావ్?”

“ఇక్కడిదాకా నిన్నూ నన్నూ ఎవరూ తీసుకురాలేదు. మనం వచ్చాం. కలిసి వచ్చాం. అంతే!”

“అవును, కానీ ఊరికే ఎవరి దారిన వాళ్లం నడుస్తూ రాలేదు కదా. ఈ ప్రయాణంలో కొన్ని ప్రామిసెస్ ఒకరికొకరం చేసుకున్నాం. అన్నీ మాటల ద్వారా జరిగేవే కాదు. మన ప్రతీ చర్యా ఒక వాగ్దానమే.”

“అలా నేనేదో నిన్ను నట్టేట ముంచినట్టు మాట్లాడొద్దు. నన్ను నేను ముంచుకుంటున్నాను. నీకేంరా. నీకు ముందు జీవితం ఉంది. నువ్వు బాగుంటావు. మున్ముందు ఇది ఒక ముల్లు దిగిన చిన్న సలుపు, అంతే.”

“దయచేసి అలా సముదాయిస్తున్నట్టు మాట్లాడకు. బిట్టర్నెస్ ఈస్ బెటర్. విడిపోతున్నప్పుడైనా నా వంతు డిగ్నిటీ నాకు మిగుల్చు.”

ఇంకేం అనగలను. వాడికి సముదాయింపైనా అందుతోంది. మరి నాకు అదీ లేదు. ఇంకా అంటున్నాడు:

“ఎన్ని ఊహించుకున్నాంరా. అప్పుడంతా నాతోనే ఉన్నావు కదా. ఇద్దరం కలిసే కన్నాం కదా కలలు.”

మరో జవాబు లేని ప్రశ్న ఇది. కానీ ఎంతసేపని బోనులో నిలబడను. అసహనం పెట్రేగింది:

“అవన్నీ కలలేరా. నీకు అవి సరిపోతాయి. నీకు ఇంకా బాధ్యత అంటే ఏంటో తెలీదు. ఊరికే రూపం పాడూ లేని ఆశల్ని జేబులో పెట్టుకుని రోడ్ల మీద తిరిగేస్తూ జీవితం గడిపేయొచ్చు అనుకుంటున్నావు. జీవితం అలా ఉండదు నాన్నా. ఇద్దరు కలిసి బతకటం అంటే ఏమిటనుకుంటున్నావు, ఎన్ని లెక్కలోకి వస్తాయనుకుంటున్నావు. ఇప్పుడు ఇక్కణ్ణించి బయటకి వెళ్ళేటప్పుడు బిల్లు కట్టాలన్నా నేనే కట్టాలి. నీకు డబ్బులు బాధ్యతగా దాచుకోవటం అనే కాన్సెప్టే తెలీదు. ఎలా పోషిస్తావు నన్ను. పైగా మనం కలిసిబతుకుతాం అని ఊహలో ఏవో ఊహించుకోగానే సరిపోదు, అది ఒక వాస్తవంగా ఈ కాలంలో ఈ సమాజంలో ఈ మనుషుల మధ్య రియలైజ్ కాగలదా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడ బతుకుతాం మనం. ఇప్పుడంటే ఫర్లేదు. ఇంకో ఐదారేళ్లు పోతే నిజంగానే నీకు అమ్మలా కనపడతా నేను. ఇరుగుపొరుగు దృష్టిలో అభాసుపాలు కాకుండా ఉండాలన్నా మన బంధానికి ఏదో ఒక అబద్ధపు ముసుగు వేయాలి. నీక్కూడా ఇప్పుడు కనపడినంత అందంగా నేను ఎప్పటికీ కనపడకపోవచ్చు. నా శరీరం నీకు ఇప్పుడు పనికి వచ్చినట్టుగా ఎప్పటికీ పనికి రాకపోవచ్చు. చివరికి ఒక రోజున ఇంట్లో నేనుండగానే ఎవర్నో నిన్ను తృప్తిపరచగలదాన్ని తెచ్చుకుంటావు. జీవితంలో ఒంటరిగా నడవలేని, నడిచి గెలవలేని నీ అసమర్థతని ఇలాగే ఎన్నాళ్లకీ ఓ స్ట్రగులింగ్ ఆర్టిస్టు ఫోజుతో కప్పిపుచ్చుకుంటావు. నేను మాత్రం నువ్వు బయటకు వెళ్లేటప్పుడల్లా నీ జుట్టు పాపిడి తీసి, నీ జేబుని బరువైన పర్సుతో నింపి పంపిస్తుంటాను. అదేనా నీ ఊహ? బహుశా అందుకేనా నన్ను కావాలనుకుంటున్నావు?” మా వీడ్కోలు నాక్కూడా బాధాకరమైనదే అని అతను ఒప్పుకోవాలనుకున్నాను. కానీ ఈ బంధాన్ని హతం చేస్తున్న హంతక స్థానంలో నన్ను పెట్టి మాట్లాడుతుంటే, ఎందుకో ఇలా ఉప్పెనలా నాలో ఇంసెక్యూరిటీస్ అన్నీ బద్దలై బయటకు వచ్చేశాయి. వాటితో ఎన్నో చీకటి మూలల్లో నేను ఒంటరిగా పోరాడాను. ఇప్పుడిక నాకు వాడూ అక్కర్లేదు, వాడితో పాటూ అవీ అక్కర్లేదు. అన్నీ బయటకు పారేశాను, వాడి మీదకు విసిరేశాను.

వాడు నిశ్శబ్దమైపోయాడు. కాసేపు ఏం మాట్లాడలేదు. చివరికి జేబులోంచి రెండొందలు తీసి బల్ల మీద కొట్టినట్టు పెట్టాడు. “ఈ ఆఖరుసారైనా బిల్లు నేను పే చేస్తాన్లే.” కుర్చీ వెనక్కు నెడుతూ లేచి నిలబడి, “థాంక్యూ, ఇప్పుడంత బాధగా కూడా ఏం ఉండదు,” అని నడుచుకుంటూ వెళిపోయాడు. ఆ క్షణంలో అది చివరి కలయిక అని వెంటనే గుర్తు రాలేదు. ఒక ఆడదాన్ని టేబిల్ ముందు ఒంటరిగా వదిలేశాడన్న చిరాకే ఉండింది. కాసేపు కాన్షస్‌గా ఎవరైనా చూస్తున్నారా అని అటూ ఇటూ చూశాను. బిల్ పే చేశాను. బయటకు వచ్చి కారు తలుపు తీస్తూ వాడు వెళ్లిన వైపు చూశాను.

జీవితంలో నేను ఎరిగిన ఏకైక ప్రేమానుభవం నన్ను విడిచి నడిచిపోతోంది, దూరంగా చుక్కలా.

అంతే, అంతా కలిపితే.

ఇంతా రాశాకా ఇందులో కథేముందీ అనిపిస్తోంది. నేను కొట్టిన దెబ్బకి తట్టుకోలేక వాడు తన ఒంటరి గదిలో ఉరేసుకున్నాడని చెప్తే కథకి సరైన ముంగిపు ఉండేదేమో. లేదా కనీసం నేనే ఉరేసుకున్నాననీ, ఈ కథ రాస్తోంది ఓ భూతమనీ చెప్తే అన్నా కథకి మంచి ట్విస్టుగా పనికొచ్చేదెమో. అయినా ఓ రకంగా ఈ రెండో మాట నిజమే. ఇప్పుడు కథ రాస్తోంది ఓ భూతమే. ఐయాం డెడ్, మోర్ ఆర్ లెస్!

( మరీ అంత పెద్ద ట్విస్టయితే కాదు గానీ, ఓ చిన్న ట్విస్టు మాత్రం ఉంది. ఇందాక చెప్పబోయిందే కథ చివరికైతే బాగుంటుందని దాచిపెట్టాను. ఎవణ్ణించైతే స్వప్నను రక్షించానని అనుకున్నానో, చివరికి వాణ్ణే స్వప్న రెణ్ణెల్ల క్రితం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాకా ఫోన్లో చెప్పింది. రాఘవ “అది నా వరకూ చచ్చిపోయిందానితో సమానం” అన్నాడు. నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్లాను. కుర్రాడు గౌరవంగానే మాట్లాడాడు గానీ, వాడి మాటల్లో గెలుపు స్పష్టంగా కనపడింది. స్వప్నని బాల్కనీలోకి తీసుకెళ్ళి ఏం కష్టమొచ్చినా అమ్మని నేనున్నానని మర్చిపోకని చెప్పాను. అది నవ్విందంతే!)

మాధవ్ ఇప్పటికీ అడపాదడపా ఏదో టీవీ ప్రోగ్రాంలలో పాడుతూ కనిపిస్తూంటాడు. వాడి గొంతులో ఇప్పటికీ అదే ప్రాణం పెట్టి పాడేతనం. కళ్లు మూసుకుని లీనమైపోయి రాగాన్ని తన నరాల మీదే పలికిస్తున్నట్టు పాడతాడు. ఏదో సీరియల్ అయిపోయాకా స్క్రోలింగ్‌ టైటిల్స్‌లో వాడి పేరు సంగీత దర్శకుడిగా కూడా కనపడింది. మొన్నా మధ్య ఎందుకో ఫేస్బుక్‌‌లో వెతికితే కనపడ్డాడు. వాడి రిలేషన్‌షిప్ స్టేటస్‌లో “ఇన్ రిలేషన్‌షిప్” అని ఉంది. ఆత్రంగా ఫోటోలు వెతికాను. ఏదో ట్రిప్పుకి వెళ్లినప్పుడు తీసుకున్నవనుకుంటా. వెనకాల ఏదో పెద్ద రిజర్వాయరు కనిపిస్తుంది ఆకాశపు అంచు దాకా పాకి. వాడు ఎవరో ఒకమ్మాయి భుజం చుట్టూ చేతులేసి నవ్వుతున్నాడు. కెమెరా లెన్స్ వైపు చూస్తూ, నా వైపు చూస్తూ.

*

Download PDF ePub MOBI

Posted in 2014, కథ, ఫిబ్రవరి and tagged , , , .

10 Comments

  1. Intrepid narration of inner conflicts trying to reconcile with the harsh realities of life is what makes this story so intense . The ending of the story though seemingly appears as having nothing to offer to the protagonist , it is exactly here when the reader starts contemplating !! I read a really engaging story after a very long time .

  2. చెయ్యి తిరిగిన కధా రచయిత గొరుసన్న వ్యాఖతో ఏకీభవిస్తున్నా, ఓ సాధారణ సగటు పాఠకుడిగా. ఈ కథ గురించి నాలుగు ముక్కల్లో బాగుందని బాగోలేదని చెప్పడం సుళువే … కానీ ఎలా చెప్పడం అన్న గొరుసన్నా! శ్రీ బి. అజయ్ ప్రసాద్ గారు అద్భుతంగా చెప్పగలరు; చెపుతారేమో ఎదురు చూద్దాం. సున్నితమైన మానవ సంబంధాలను ప్రస్థావించిన రవీంద్రనాథ్ ఠాగూరు Postmaster కధను గుర్తుకు తెచ్చుకుంటున్నాను యీ సందర్భంలో. Ruskin Bond రాసిన A Flight of Pigeons, శ్యాం బెనెగల్ తీసిన Junoon హిందీ చిత్రంను గుర్తుకు తెచ్చుకుంటున్నాను. అద్భుతమైన యీ కధపై రమణజీవి గారి స్పందన కై ఎదురుచూస్తూ

  3. visharadaku abhinandanalu. hipocracyni jayinchindi.katha bagundi. ekkadaite katha agipoyindo akkade gundelu pinde lava nundi maro kathaku ankurarpana jaragalse undi. ikathalanni asampurnanga migilipovalsindena! ala mugisipovu. tanatyagam tana kuthuri jeevithanni ematram influene cheyalekapoidanna twist kathalo chotu chesukunnapudu,aarani asantruptulanunchi…….

  4. కథని నడిపిన తీరు అద్భుతం. అభినందనలు విశారదగారు. కథలో సన్నివేసాల లోతైన విశ్లేషణ బాగుంది. ముగింపు సహజాతి సహజంగా, తరాల మధ్య అంతరాన్ని నేటి తరం ఆలోచనలనీ దర్పణం పట్టినట్టుగా చూపించింది. నవ్వొచ్చింది, కథ రాసిన ఆమె పాత్ర పట్ల సానుభూతి కూడా వచ్చింది. సంక్లిష్టత కథకి అందాన్నిచ్చింది

  5. ఎన్నాళ్ల కెన్నాళ్లకు! మంచి అర్బన్ కథ. అర్బన్‌ సంక్లిష్టతలతో ముడిపడిన కథ. కాలానికి తగిన కథ. నీతి వాక్యాలు లేని కథ. నిజాయితీ ఉన్న కథ. రోమాంటిసిజానికి వాస్తవానికి మధ్య ఉన్న వాటర్‌ మార్క్‌ చక్కగా చూపిన కథ.

  6. ఇది కథ అనేకంటే ఎగజిమ్మిన లావా అంటే బాగుంటుందేమో. కథా సాహిత్యం కొత్త పుంతలు తొక్కుతోంది అనడానికి ఇంత కంటే ఏం కావాలి? మొన్న వాంగ్మూలం , రీబూట్, నిన్న చౌరస్తా, ఇప్పుడు తరళ మేఘచ్చాయ … ఇన్నాళ్ళూ వీళ్ళంతా ఆల్చిప్పల్లో ముత్యాల్లా ఎక్కడ దాక్కున్నారు ? పత్రికల్లో వచ్చే కథలే కథలు అనుకునే బావిలో కప్పలాంటి నాబోటి పాఠకులకు కళ్ళు తెరిపించి లోకాన్ని సాక్షాత్కరిం
    పచేయడం అంటే ఇదే. ఇక ఈ కథ గురించి నాలుగు ముక్కల్లో బాగుందని బాగోలేదని చెప్పడం సుళువే … కానీ ఎలా చెప్పడం? మారుతున్న వాస్తవ పరిణామాల్ని ఉండ చుట్టి బాంబులా పాఠకుడి గుండెకు గురిచూసి విసిరితే … మాట పెగలాలి కదా!

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.