softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [6]

Download PDF ePub MOBI

వేణు పూర్తి పేరు వేణుగోపాలరావు. ఇబ్బంది పడుతూ ఇంజనీరింగ్ ఇదేళ్ళల్లో పాస్ అయ్యాడు. చదువు లేదు కానీ తెలివితేటలు మాత్రం అమోఘం.అన్నింటిని మించి తనమీద తనకి నమ్మకం ఉంది.చదువొక్కటే జీవితం కాదని చిన్నతనంలోనే తెలుసుకున్నాడు. జీవితంలో సరైన మలుపు ఎక్కడ దొరుకుతుందో అని వెతుకుతున్నాడు. కొన్ని విషయాల్లో ఆ వేణుగోపాలస్వామికి ఏ మాత్రం తీసిపోడు. ముఖ్యంగా అందమైన కన్నె పిల్లల మనస్సు దోచే విషయంలో. ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ ఎక్కువ, పేస్ లో మాత్రం కళ తక్కువ. ముఖ పుస్తకంలో తెలిసిన అమ్మాయి, తెలియని అమ్మాయి అన్న తేడా, మొహమాటం లేకుండా కూడిక అభ్యర్ధనను పంపిస్తుంటాడు. వారితో ఎలాగోలా మాటలు కలపటం, వారి ఫోటోలు సంపాదించటం, అందంగా ఉంటే పరిచయం పెంచుకుని ఫోను నెంబర్ తీసుకోవటం, అందంగా లేకపోతే, అంతే అందంగా తప్పుకోవటం వీడికి నెట్ తో పెట్టిన విద్య. అలా వాళ్లతో గంటలు గంటలు సోది చెప్తూ ఉంటాడు. “అదొక కళరా! అందరికీ రమ్మన్నా రాదు” అని పైపెచ్చు గర్వంగా చెప్తుంటాడు. “మనకు ఒక్క అమ్మాయితో మాట్లాడటానికే లేదనుకుంటే, వీడికి వారానికో అమ్మాయి దొరుకుతున్నది” అని స్నేహితులంతా వేణు మీద పడి ఏడుస్తుంటారు.

“ఏరా వీడింక మారడా?” అడిగాడు గుప్తా, అజయ్ ని. “ఎందుకు మారడు? ఇలా ఇంజనీరింగ్ అయిపోయి మూడేళ్ళు అయినా గాలికి తిరుగుతుంటే, ఇంట్లో వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు చూస్తారు? ఎప్పుడో వాళ్లకి సహనం పోతుంది, వీడికి జ్ఞానం వస్తుంది, అప్పటిదాకా ఈ గోపాలుడి లీలలు భరించక తప్పదు” అని నిట్టూర్చాడు అజయ్. “ప్రతోడి చేతికి సెల్లు ఆరో వేలు లాగా తయారయ్యింది. నాకు తెలిసి సెల్లు, గోళ్ళు ఒకే లాంటివి. గోళ్ళు బాగా పెంచటం అమ్మాయిలకు అందం, అడ్డమైన చర్మ వ్యాదులు ఉన్న వాళ్లకు, సిటీ బస్సు కండెక్టరుకు అవసరం (సిటీలో టికెట్టును చేతి గోరుతో చించి ఇస్తుంటారు గనుక), మనకు ఆ గోళ్ళు అనవసరం. అలానే సెల్లు కూడాను, బాగా డబ్బు ఉన్న వాడికి అందం, అజయ్ లా ఉద్యోగం చేసే వాడికి అవసరం, వేణు లాంటి వాళ్లకి అనవసరం”, అన్నాడు గుప్తా.

“వీడికి కస్టమర్ కేర్ లో ఉద్యోగం అయితే సరిగ్గా సరిపోతుంది” అని రాజుగారు అనటంతో అంతా నవ్వారు,అజయ్ తప్ప. “ఏమి ఉద్యోగాలో, వచ్చేదాకా రాలేదని, వచ్చాక చేయలేమని, చస్తున్నాము” అన్నాడు కాస్త అసహనం ప్రదర్శిస్తూ అజయ్. “ఏమైంది అజయ్, ఒక్కసారిగా చావు దాకా వెళ్ళావు?” అడిగాడు పంతులుగారు. “ఏముంది పంతులుగారు, ఏమని చెప్పమంటారు? ఆఫీసులో అసలు మనశ్శాంతి లేదు. ఒకవైపు పనివల్ల మానసిక ఒత్తిడి, వ్యాయామం లేక శారీరక ఒత్తిడి, ఇవన్నీ చాలక విసిగించే మేనేజరు, వెరసి అన్నీ సమస్యలే” అంటూ చేతిలో ఉన్న పేక ముక్కలను క్రిందకు జార్చాడు. “అంతలా ఏమి చేస్తున్నాడేంటి మీ మేనేజరు?” అడిగాడు గుప్తా. “ఒకటేమిటి, వాడి ఆకృత్యాలకి అంతే లేదు. పని ఎంత చేసినా, ఏదో ఒక నస పెట్టి చంపుతుంటాడు. పని నాకు, పొగడ్తలు తనకు. ఏడ్పు నాకు, ఎదుగుదల తనకు. రోజూ ఏదో ఒక గొడవ, ఈ సాఫ్ట్ వేర్ లో పని చేయటమే నరకము. జీతం కనిపిస్తుంది తప్పించి, ఈ జాడ్యాలు ఎవ్వరికీ కనపడవు. ప్రతి అడ్డమైన వాడికీ భయపడుతూ పని చేయటం నా వల్ల కాదు. బడిలో పంతుళ్ళకు భయపడి, ఇంట్లో నాన్నకు భయపడి, బజార్లో సమాజానికి భయపడి, ఆఫీసులో మానేజరుకి భయపడి,ఇలా ఎన్ని రోజులు?” అని భావోద్వేగానికి లోనయ్యాడు అజయ్.

“ఆరోజు విక్రమార్కుడి సినిమాకెళ్తే, నీకు ఫోను వచ్చి బయటకు వెళ్ళినప్పుడు, ప్రకాష్ రాజ్, రవి తేజతో చెప్పాడు, మనిషికి భయం మీద గౌరవం ఉండాలి అని, నువ్వు వినలేదు, ఆ సినిమా మళ్ళీ ఒక సారి చూడు” అన్నాడు గుప్తా. అజయ్ రెండు క్షణాలు ఆగి “ఏమో ! ఈ సాఫ్ట్ వేర్ నా వల్ల కావటం లేదు” అన్నాడు. “ముక్కలు సరిగా పడకపోతే మిడిల్ డ్రాప్ చేస్తాం కానీ, ఆటే మానేస్తామా? ఈ కంపెనీ కాకపోతే ఇంకోటి, ఈ మేనేజర్ కాకపోతే ఇంకొకడు” అన్నాడు వెంకటరావు, తన ముక్కలని కూడా కింద పడేస్తూ. పేక ఆడేటప్పుడు మాట్లాడితే ముక్కలు మంచిగా రావని వెంకటరావుకో పిచ్చి నమ్మకం. అందుకే ఆట ఆడినంత సేపు మాట్లాడడు.

“అవును అజయ్, వెంకటరావు చెప్పింది నిజం. సమస్య ఎదురైనప్పుడు, దాని నుండి దూరంగా పోవాలి అనుకోవటం, పిరికి లక్షణం. దానిని ఎదురించి గెలవాలి” అన్నాడు పంతులు గారు. “వేరే కంపెనీ లో మేనేజరు కుడా ఇలా ఉండడని గ్యారెంటీ ఏది?” అన్నాడు అజయ్. “ఉంటాడని గ్యారెంటీ ఏది?” అన్నాడు గుప్తా. “ గ్యారెంటీలు గురించి మీరు మాట్లాడకండి ! గ్యారెంటీ అంటే మాది, గ్యారంటీ ఇవ్వాలన్నా మేమే, దానిని గ్యారెంటీగా ఎగ్గొట్టాలన్నా మేమే” అన్నాడు రాజుగారు నవ్వుతూ. “అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు, అందరూ మంచివాళ్లుండరు” అన్నారు పంతులుగారు.

“మీరేమైనా చెప్పండి, ఈ సాఫ్ట్ వేర్ జాబులో శాటిశ్ఫాక్షన్ లేదు” అన్నాడు అజయ్. “చూశారా పంతులుగారు, మనం వీడికి మంచి చెబుతుంటే, వీడేమో మనల్ని ఇంగ్లీష్ లో శాటిస్ఫై అనేదో తిడుతున్నాడు” అని వెంకటరావు పంతులుగారి వైపు చూశాడు. “అయినా శాటిశ్ఫాక్షన్ ఏమైనా సాక్షి పేపరా? నాలుగు రూపాయలు పెట్టి కొనుక్కోవటానికి ,రోజంతా చదువుకోవటానికి” అని గుప్తా అన్నాడు. “రాజకీయాలకే అనుకున్నా, ఈ అసంతృప్తి అనేది ఈ సాఫ్టోళ్ళకు కూడా ఉందనమాట!” అన్నాడు రాజుగారు. “చేసే పని ఇష్టంగా చేస్తే, అదే మనల్ని శాటిస్ఫై చేస్తుంది. మనకు మనం సర్దుకుపోతే అదే సంతృప్తి” అన్నారు పంతులుగారు. “నా బాధ మీకు అర్థం కాదు” అన్నాడు అజయ్ దీనమైన ముఖంతో. “ ఏంటిరా నీ బాధ? చక్కగా ఏ.సిలో ఏళ్ళ తరబడి వ్రేళ్ళు ఆడిస్తూ, ఎండ ఎరగకుండా, ఎడా పెడా సంపాదించుకోక, అసమ్మతి, అసంతృప్తి అంటావే” అన్నాడు గుప్తా. కాసేపు అంతా నిశబ్ధం.

“సరేరా ఉద్యోగం మానేసి ఏమి చేస్తావు అది చెప్పు?” అన్నాడు గుప్తా. “ఏ వ్యాపారమో, వ్యవసాయమో, మీరందరూ బతకటం లేదా? అలానే” అన్నాడు అజయ్. “మా బాబే ఎంత తేలికగా అనేశావు. నీకంటికి వ్యాపారం, వ్యవసాయం అంత తేలికగా కనిపిస్తున్నాయే, ఒకసారి దిగితే లోతెంతుందో, మొసళ్ళెన్నున్నాయో తెలిసేది. పేకాడినంత సులభం కాదు పొలం దున్నటం” అన్నాడు వెంకటరావు. “మీరు కూడా సాఫ్ట్ వేర్ తప్ప ఇంకొకటి లేదన్నట్టు మాట్లాడాతారేంటి? ఆకలి,అరుగుదల,నిద్ర సరిగ్గా ఉంటే అమెరికా అయినా అద్దంకి అయినా పెద్ద తేడా ఉండదు” అన్నాడు అజయ్. “సరేరా! ఆ తేడాలేంటో ఇప్పుడే తేల్చేద్దాము” అన్నాడు వెంకటరావు. అంతా ముక్త కంఠంతో సరే అన్నారు.

Posted in 2014, ఫిబ్రవరి, సీరియల్ and tagged , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.