Sacvan

జాతి వివక్షకు బలైపోయిన శాక్కొ – వాంజెట్టి

Download PDF ePub MOBI

ఇది 1920 లలో అతి సామాన్యమైన ఇద్దరిని అసామాన్యులుగా మలచిన ఒక ఘట్టం. 1920 Apr 15 సౌత్ బ్రెయిన్ ట్రీలో జరిగిన దోపిడీ, బ్రిడ్జివాటర్ దగ్గర జరిగిన హత్యానేరం, చేయని వారిని నేరస్థులుగా భావించి అరెస్టు చేయడమే కాకుండా, వారు ఆ నేరంలో భాగస్తులు కాదని నిరూపించడానికి లభించిన సాక్ష్యాలను కుడా మరుగుపరచి / నాశనంచేసి వారిద్దరిని ఉరికంభం (అమెరికాలో ఎలక్ట్రిక్ చైర్) పాలుచేసిన అమానవీయ చర్య. వారిద్దరే అమెరికాలో బతుకుతెరువును వెతుక్కుంటూ వచ్చి బలైపోయిన నికోలా శాక్కో (చెప్పులుకుట్టేవాడు), బార్టలోమియో వాంజెట్టి (చేపలమ్ముకునేవాడు). ఇటలీ నుండి ఇక్కడికి వచ్చిన విదేశీయులు, విజాతీయులైన వీరి గురించి తెలుసుకోబోయే మునుపు అమెరికాలోని ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి కొంత తెలుసుకోవడం అవసరం.

పైన పేర్కొనబడిన వారిద్దరూ అరాచకవాదులు (Anarchists). నిఘంటువు ప్రకారం అరాచకవాదులు అంటే “మనిషి స్వతహాగా మంచివాడని, మనుషులకు దిశానిర్దేశం చేయడానికి / వారిని అదుపులో పెట్టడానికి పాలకులు / ప్రభుత్వం అవసరం లేదని, వారినివారే పాలించుకోగలరని నమ్మకం గలిగిన వారు.” ఎటువంటి పాలక వ్యవస్థను సమర్దించనివారు, అప్పటికే ఉన్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకం వారు. ఇలాంటి వారిని అమెరికాలో రెడ్స్/రాడికల్స్ అని పిలుస్తారు. దీనికి తగ్గట్లుగానే అప్పటి ప్రపంచంలో పెట్టుబడిదారి వ్యవస్థను ఆధారం చేసుకుని ఉన్న రాజ్యాలు / ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు బోల్షేవిజంపట్ల, బోల్షేవిక్కులపట్ల తీవ్రమైన వ్యతిరేకతతో, భయంతో ఉన్నారు. బోల్షేవిజం, అరాచకవాదం వేరువేరైనా కూడా ఒక అభియోగం మోపబడినప్పుడు, విదేశీయులూ, అక్కడి ప్రభుత్వంపై గౌరవం లేనివారూ కాబడటంవలన, వాళ్ళిద్దరూ ఆ నేరం చేయకపోయినా, అతి సునాయాసంగా న్యాయవ్యవస్థ (న్యాయాధిపతి, ప్రాసిక్యూషన్), వారిపై జూరీకి (అమెరికాలో సామాన్య ప్రజలు జూరీ సభ్యులుగా నియమించబడతారు), తప్పుడు అభిప్రాయం కలిగే విధంగా సాక్ష్యాలను వినియోగించుకుని, జాతి వివక్షతో వారిని దాదాపుగా ఏడున్నర సంవత్సరాలు జైలుపాలుచేసి, ఆ తరువాత ఉరికి బలిచేశారు.

రాజ్యం యొక్క రాజకీయ అవసరాలకు అనుగుణంగా “కొంతమంది” మేధావులు, అధికారులు మానవీయతను కుడా మరచి ఎలా తొత్తులుగా వ్యవహరించగలరో, జాతి విద్వేషం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ కేసుకు న్యాయాధిపతిగా వ్యవహరించిన “ధేయర్” కు మించిన ఉదాహరణ ఉండబోదని చెప్పవచ్చు. బాధ్యతాయుతమైన న్యాయమూర్తి స్థానంలో ఉండి కూడా ప్రతిసారి కేసు నడిచే సమయంలో అనేక విధాలుగా ప్రాసిక్యూషన్ (ముద్దాయులకు వ్యతిరేకంగా వాదించేవారు) కు సహకరించిన తీరు, ఆయనకు రాడికల్స్ పట్ల ఉన్న వ్యతిరేకతను, విదేశీయులపట్ల కల జాతివివక్షతను తెలియచేస్తుంది.

కేసు నడుస్తున్న కొలది వారు నిర్దోషులని నిరూపించే బలమైన ఆధారాలు లభించగా, నానాటికి ప్రజలు, దినపత్రికలు ఈ కేసుపై ఆసక్తి కనపరిచారు. అలాంటి సందర్భంలోనే “బోస్టన్ హెరాల్డ్” దినపత్రికకు “26th Oct 1926″ న లారిస్టన్ బుల్లర్డ్ వ్రాసిన “వి సబ్మిట్” అనే సంపాదకీయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఆ తరువాత 1927వ సంవత్సరానికిగాను అది “పుల్టిజర్ బహుమతి” ని గెలుచుకుంది. ఆ తరువాతి కాలంలో శాక్కో- వాంజెట్టిల కొరకై ప్రపంచమంతటా చాలా దేశాలలో ఒక ఉద్యమమే జరిగింది. ఆ తరుణంలో కుడా “ధేయర్” ఆలోచనలలో ఎటువంటి మార్పు రాలేదు. అది అతని ఆలోచనలలోని దివాళాకోరుతనాన్ని తెలియజేస్తుంది. ఆ సమయంలో దేశం మొత్తం, ముఖ్యంగా బోస్టన్ వాసులు, వారిరువురిని సమర్ధించేవారు, సమర్ధించనివారు అని రెండు గుంపులుగా విడిపోయిందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తికాదు.

అతి సామాన్యులను మేధావులుగా మలచిన కేసు అని దీనిని చెప్పవచ్చు. ఇహః శాక్కో-వాంజెట్టిల ఉన్నతత్వం గురించి యెంత చెప్పినా తక్కువే అవుతుంది, మరి ముఖ్యంగా వాంజెట్టి గురించి! ఈ కేసు సంభవించనట్లయితే వారిద్దరూ బహుశా సామాన్యులుగా ఎవరికి తెలియకుండా చనిపోయేవారని ఒక సంధర్భంలో వాంజెట్టి అంటాడు. కోర్టులో మరణశిక్ష విధించడానికి కొన్ని నిమిషాల ముందు వాంజెట్టి కేసు విషయమై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సుదీర్ఘంగా మాట్లాడిన తీరు ఎవరినైనా విస్మయపరచక / ఆలోచింపచేయక మానదు. నిజానికి నేరం ఆరోపించబడిన పరిస్థితిలో ఉండి కూడా ఆ కాలపు ఎంతోమంది మేధావులను, పండితులను వాంజెట్టి తన మాటలు, ఆలోచనలు, ప్రవర్తన ద్వారా ప్రభావితం చేయగలిగాడు. ఆయన జైలులో ఉన్నప్పుడు సమయమంతా వివిధ రకాలైన పుస్తకాలు చదవడానికి, తన కుటుంబానికి, ఇతరులకు ఉత్తరాలు రాయటానికే కేటాయించేవాడు.

ఇక శాక్కో విషయానికి వస్తే మేధోపరంగా అంత ఆలోచనాపరుడు కాకపోయినా, శ్రమను, ప్రకృతిని ప్రేమించినవాడు, తను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడినవాడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా జీవించిన నిబద్ధత కలిగినవాడు. పై కోర్టులకు అర్జీ పెడుతున్న సమయంలో, రాష్ట్ర గవర్నరుకు అప్పీలు చేస్తున్న సమయంలో వారివురి సంతకం కోసం లాయర్లు జైలుకు వచ్చినప్పుడు శాక్కో ససేమిరా చేయనని చెప్పేవాడు, మొదటినుండి చనిపోయేవరకు పలుసార్లు అవసరమైనా కుడా ఒక్కసారీ తను సంతకం చేయలేదు, వాంజెట్టి ఒక్కడే చేసేవాడు. శాక్కో ఇలా చెప్పేవాడు, “నేను ఏ నేరం చేయలేదు, నేరస్థుడిని కాదు! ఎవరి దయతోను, క్షమతోను నాకు అవసరం లేదు. మీరు మమ్మల్ని నిర్దోషులని నిరూపించగలిగితే చేయండి, లేకపోతే నేను చావడానికి సదా సిద్ధం”.

వీరికోసం జరిగిన ఉద్యమం గురించి చెప్పాలంటే ప్రపంచంలోని ప్రతి ఖండంలో ఎన్నో కొన్ని దేశాలలో ప్రజలు వీధులలో ప్లే-కార్డులు పట్టుకుని శాక్కో- వాంజేట్టిలకు బోస్టన్ న్యాయస్థానంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పారు, మద్దతుగా నిలిచారు. కార్మికులు ఫ్యాక్టరీలలో సమ్మె చేశారు, ఎన్నో అల్లర్లూ అరెస్టులు కూడా జరిగాయి. చివరికి ముంబాయిలో కుడా బట్టల ఫ్యాక్టరీ కార్మికులు వారిరువురికి మద్దతుగా సమ్మె చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు అప్పటి బోస్టన్ రాష్ట్ర గవర్నర్ “పుల్లర్” కు లేఖల ద్వారా ఎన్నో అభ్యర్ధనలు పంపించారు. వారిలో ఆల్బర్ట్ ఐన్ స్టైన్ కుడా ఒకరు. కొందరు శిక్షను యావజ్జీవగా మార్చమని, మరికొందరు శిక్షను రద్దు చేయవలసిందిగా, ఇంకొందరు అమెరికా సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వవలసిందిగా ఈ లేఖలలో పేర్కొన్నారు. కాని వీటిలో ఏవి చివరిదాకా జరగలేదు.

ప్రపంచంలో ఒక కోర్టు కేసు గురించి ఎప్పుడు రానంతగా ఈ కేసు మీద ఎన్నో రకాలుగా సాహిత్యం సృష్టించబడింది. 10 కంటే ఎక్కువ నవలలు, 40 కవితలు, 5 ఇంగ్లిషు నాటకాలు, 1 ఫ్రెంచి నాటకము, 1 సినిమా వచ్చాయి. ఇవి కాక వేరే రూపాలలో లేఖలు, కరపత్రాలు, అనుభవాలు, పత్రికా రచనలు, సంపాదకీయాలు, డాక్యుమెంటరీలు, టి.వి సీరియల్స్, శిల్పాలు, పెయింటింగ్స్, కార్టూన్ల రూపంలో కేసు చాల దశాబ్దాల వరకు జీవించింది. వీటన్నిటిలో ఈ కేసుకి సంభందించి ఆప్టన్ సింక్లేర్ నవల “బోస్టన్”, లూయీ జౌగిన్, ఎడ్మండ్ మోర్గాన్ కలిసి 1948లో తీసుకొచ్చిన “ది లెగసి ఆఫ్ శాక్కో & వాంజెట్టి” అనే కోశ గ్రంధం (Reference Book) చెప్పుకోదగ్గవి, ఈ పుస్తకం రష్యన్ బాషలోకి కుడా అనువదించబడింది. ఇవి రెండు కేసుకి సంభందించిన పూర్తి వివరాలు కలిగి ఉన్నాయి.

ఇటివంటి అధ్బుతమైన పుస్తకాన్ని తెలుగులో చాల చక్కగా అనువదించిన కీ||శే||బి.చంద్రశేఖర్ గారు ఏంతో అభినందనీయులు. మొత్తం 21 పుస్తకాలనుండి సమాచారాన్ని సేకరించి, అవసరమైన మేరకు, అవసరమైన చోట వివరణ ఇస్తూ ఈ పుస్తకాన్ని అసాంతం చదువరులకు ఆసక్తిదాయకంగా ఉండే విధంగా మలిచారు. ఈ పుస్తకం చివరలో “రాజ్యహింస గురించి ఇంకొంచెం ఆలోచిద్దాం” శీర్షికన కీ||శే||కె.బాలగోపాల్ వ్రాసిన వ్యాసం తప్పనిసరిగా చదివి తీరాలి. చాలా గొప్ప వ్యాసంగా పరిగణించవచ్చు.

మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ మైఖేల్ డుకాకిస్ 1977 Aug 23 న నికోలా శాక్కో- బార్టలోమియో వాంజెట్టిల జ్ఞాపక దినంగా ప్రకటించాడు. 1927 లోనే ఇద్దరినీ ఉరితీసిన తరువాత కేసు ముగిసింది, కానీ ఇంచుమించు 1985 వరకు అమెరికాలో శాక్కో- వాంజేట్టిల కేసు ఏదో ఒక రూపంలో బతికే ఉంది. అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ సభల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బోస్టన్ రాష్ట్ర న్యాయశాస్త్రంలో, ఈ కేసులో ఉన్న కొన్ని లొసుగులను పూడుస్తూ, క్రింది కోర్టులో నమ్మకం లేనప్పుడు, ముద్దాయి అమెరికా సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకుని అక్కడ కేసు కొనసాగించే విధంగా, కొద్దిపాటి మార్పులు కూడా జరిగాయి.

ఏది ఏమైనప్పటికీ అమెరికా దేశ చరిత్రలో శాక్కో- వాంజెట్టిల కేసు ఒక మరిచిపోలేని, మరిచిపోకుడని (భవిష్యత్ తరాలకు అన్యాయం / నష్టం జరగకుండా) ఉదంతం. “జాతి వివక్షతను సమర్ధించేవారు, రాజ్యం భద్రతను, తమ భద్రతగా భావించే వారి వలన ఎలాంటి అన్యాయం చోటుచేసుకోగలదో తెలియజేయడానికి శాక్కో- వాంజెట్టిలపై మోపబడిన అభియోగం నిలువెత్తు నిదర్శనం, దాని మూల్యం ప్రపంచంలో మంచి మార్పు తేవడం కోసం / చూడడం కోసం బతికిన ఇద్దరు అమాయకుల ప్రాణం.”

 — రాజేష్ దేవభక్తుని

పుస్తక వివరాలు:

శాక్కో-వాంజెట్టి (వ్యదార్ధ జీవిత యదార్ధ దృశ్యం)Sacco-Vanzetti

Publisher : Perspectives, HYD, 1995.

Sole Distributors :- Navodaya Book House,

Opp. Arya Samaj, Kachiguda.

Hyderabad.

Download PDF ePub MOBI

(Image Courtesy: Wikipedia)

Posted in 2014, పుస్తక సమీక్ష, ఫిబ్రవరి and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.