2

బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ: పూడూరి రాజిరెడ్డి తో

Download PDF ePub MOBI

సాక్షి ఫన్‌డే లో వారం వారం “రియాలిటీ చెక్” పేరన పూడూరి రాజిరెడ్డి రాసిన ఫీచర్‌ ఇప్పుడు పుస్తక రూపంలో విడుదలైంది. ఇది తెలుగులో కొత్త ప్రయోగం. రచయిత ఒక ఆవరణకి వెళ్తాడు, అక్కడి గుణాల్నీ వ్యక్తుల స్వభావాల్నీ క్లుప్తంగా రెండు పేజీల్లో చెప్తాడు. అక్కడి వాస్తవికతను వాక్యంలో పట్టుకుని అది మన అభిప్రాయ చిత్రాలతో సరిపోతోందో లేదో చూసుకొమ్మని మన ముందుంచుతాడు. మొద్దుబారని రాజిరెడ్డి చూపు, అతని సెల్ఫ్ కాన్షస్ నిజాయితీ, ప్రపంచం పట్ల కొత్త పెళ్ళికొడుకు ప్రేమ ఈ ఫీచర్ని వట్టి ఫీచర్‌గా మిగిలిపోనీయలేదు. “రాజిరెడ్డి వాక్యం” అనగానే ఏదో మనకు స్ఫురించేట్టుగా స్థిరపడిన అతని శైలి కూడా తోడైంది. ఉబుసుపోని వేళల్లో ఉన్నచోట నుంచే “కొన్ని కిటికీ ప్రయాణాలు” చేసి రాటానికి ఈ పుస్తకం బాగుంటుంది. “తెనాలి ప్రచురణలు” అందంగా ముద్రించిన ఈ పుస్తకం గత నెల (జనవరి) ఐదో తారీకున తెనాలిలో విడుదలైంది. ఈ సందర్భంగా రాజిరెడ్డితో బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ. – మెహెర్
ఈ ఫీచర్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది?

RealityCheckCoverరాయకముందు ఇదో ఫీచర్ అవుతుందనీ, దీని ద్వారా హైదరాబాద్ జీవితాలు చూస్తామనీ ఏ ఆలోచనా లేదు. ‘ఫన్ డే’లో కవర్ స్టోరీతో పాటూ ఏదైనా సెకండ్ ఫీచర్ ఉంటే బాగుండునని అప్పుడు మాకు కన్సల్టంటుగా ఉన్న ఇప్పటి మా ఫీచర్స్ ఎడిటర్ అనుకున్నారు. ఏం ఉండాలీ అన్న ఆలోచనలో మాత్రం స్పష్టత లేదు. చాలా అనుకున్నాం “రాజకీయ పాఠశాల” అనీ, “సెలెబ్రిటీ వెడ్డింగ్స్” అనీ, తల్లిదండ్రులకు విడాకులిచ్చే అవకాశాలు పిల్లలకు విదేశాల్లో ఉంటాయనీ. ఊరికే అలా మాట్లాడుతుండగానే ఒక ఇరానీ హోటల్ కి పోయి అక్కడ కూర్చుని జరిగేది రాస్తే ఎలా ఉంటుందీ అన్నారామె. ఆ “రాజకీయ పాఠశాల” ఐడియా కంటే… అంటే ఎవర్నయినా కూర్చుని ఇంటర్వ్యూ చేయటం కంటే… ఒక ఇరానీ హోటల్లో కూర్చుని అక్కడి జీవితాన్ని గమనించటం అనేది నాకు చాలా కంఫర్ట్. అందుకని దాన్ని ఎంచుకున్నాను. ఇరానీ హోటల్‌కి వెళ్లొచ్చి ఆ అనుభవం రాశాను. అప్పుడు కూడా దీన్ని ఇలా కంటిన్యూ చేయొచ్చు అన్న ఆలోచన రాలేదు. కానీ ఇరాన్ హోటల్కు వెళ్లొచ్చాం కాబట్టి తర్వాత ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్లొచ్చు కదా అనుకున్నాం. అది రాశాను. తర్వాత ఇందిరాపార్కు. ఆ తర్వాత పంజాగుట్ట శ్మశానం. తర్వాత అర్బన్ స్ట్రక్చర్‌ని రిప్రజెంట్ చేయటం మర్చిపోవద్దు అని ఎఫ్.ఎం స్టేషన్‌కి వెళ్లాను. ఇలా రాస్తూపోగా దానికి ఒక స్ట్రక్చర్ రావటం మొదలైంది.

అన్నీ మీరు ఎంపిక చేసుకున్న చోట్లేనా? కొన్ని మీకు కంఫర్ట్ లేని చోట్లకు కూడా వెళ్లినట్టు అనిపించింది.

కొన్ని కొందరి సూచనల మీద ఎంచుకున్నాను. మెన్స్ బ్యూటీపార్లరూ, పబ్బూ ఇలాంటి చోట్లకి మామూలుగా ఐతే ఏ కోశానా వెళ్లేవాణ్ణి కాదు. బయటివాళ్ల సూచనల మూలంగా కొన్ని నాకు తెలియని మూలలకి వెళ్లి చూడగలిగాను. ఆ సిరీస్ రాస్తున్నప్పుడుల్లా ఒక్కో పలకరింపు వచ్చేసేది నాకు. “ఈ వారం ఎటుపోయిన్రు? ఈ వారం ఎటుపోతున్నారు? అని. కల్లుపాకకు పోవచ్చు కదబ్బా, కోర్టుకు పోరాదబ్బా, రేసులు జరిగే చోటికి వెళ్లి రాస్తే బాగుంటదబ్బా… ఇలా చెప్పేవారు. ఆ సూచనలు కూడా నేను వెళ్లగలిగేవి, ఏ కొంచెమైనా రిలేట్ చేసుకోగలిగేవీ అయితే వెళ్లేవాణ్ణి.

ఎక్కడికైనా వెళ్లాకా అక్కడే కాసేపు గడపాలనిపించిన ప్లేసేదైనా ఉందా? అంటే I am in my element అనిపించిన చోటు.

కొంచెం బీదరికం ఉండి, నలుగురూ కలిసిపోగలిగే ప్లేసు ఏదైనా నేను హాయిగా అందులో కలిసిపోతాను. పోలీస్‌స్టేషనూ, కోర్టూ ఇలాంటివి నా ఏరియాలు కాదు. మార్చురీ మనం రిలేట్ చేసుకోగలిగే చోటే గాని, అక్కడ ఎక్కువసేపు ఉండలేం. ఎవరితో మాట్లాడే పని లేకుండా, నేనుగా చూసి, నేనుగా దాన్ని అర్థం చేసుకుని, నాలోకి తెచ్చుకుని అక్షరాల్లో పెట్టగలిగే ప్రతీ చోటూ నాకు చాలా కంఫర్ట్. మాట్లాడే పనుండకూడదు. అంటే మళ్లీ పక్కన కూచుంటే “ఎవరబ్బా నువ్వు ఏం కత” అని బానే మాట్లాడతా నేను, సాటి మనిషిగా. కానీ మైకు పెట్టి మాట్లాడటం అనేది నాకు చేత కాదు. అసలు ఈ “రియాలిటీ చెక్” ఫీచర్ కోసం వందలమందితో మాట్లాడినా. కానీ ఆ మాట్లాడటం అంతా కూడా ఒక ఇద్దరం కలిసినట్టు, నువ్వొక దరి నుంచి వస్తూంటే “ఆ ఏ ఊరే కాకా” అంటరు కదా ఊళ్లల్లో, అట్ల మాట్లాడిందే గానీ, ఓ ఇంటర్వ్యూ లాగ మాట్లాడింది లేదు.

మరి ఒక్కో చోట వాళ్ల యాస, మాట తీరు అదీ అచ్చంగా పట్టుకున్నట్టు అనిపించింది?

ఆ వాళ్లకి తెలియకుండా రహస్యంగా రాశా నేను. నా దగ్గర జేబు సరిపడేట్టు మడతపెట్టిన ఒక స్లిప్పు నోటుబుక్కు ఉంటుంది ఎప్పుడూ. దాని మీద రాస్తా.

ఏ చోటులో ఐనా ఒక్క రసవంతమైన వాక్యం కూడా రాక, బలవంతాన ఎమోషన్ మీదేసుకుని రాయాల్సి వచ్చినవి ఉన్నాయా?

అలా రాసినవి ఏం లేవు. పని నడుపుకోవటానికి చేసినవైతే కొన్ని ఉన్నాయి అందులో. కానీ అక్కడ లేని విషయాన్ని డ్రమటైజ్ చేసి చెప్పటం ఎక్కడా లేదు. అది నా స్వభావం కాదు. ఒక చోటకి వెళ్లినపుడు అక్కడ నీవన్న ఇబ్బంది లాంటిదేమైనా ఎదురైతే దాన్ని కూడా నా నేరేటివ్‌లో పెట్టడానికి ట్రై చేశాను.

ఇక్కడ మీర్రాసిన వాటిలో ఎక్కువ చోట్లు హైదరాబాదులోనివే కదా. అంతకుముందు హైదరాబాదు పట్ల మీకు ఉన్న అభిప్రాయాలేమైనా ఈ వాస్తవ చిత్రాల తర్వాత మారాయా?

హైదరాబాదు అనేది ఎప్పటికీ అర్థం కాదు నాకు నిజానికి. నా తొలి పదేళ్లూ వదిలేస్తే దాదాపు ఈ ఇరవై ఐదేళ్లూ కూడా నేను హైదరాబాదుతో ఏదో విధంగా టచ్‌లో ఉన్నట్టే. దీన్ని గాఢంగా ప్రేమించిందీ లేదు, తీవ్రంగా ద్వేషించిందీ లేదు. ఇవన్నీ రాయబట్టి కాలం గడిచే కొద్దీ ఏమన్నా ప్రేమ పెరుగుతుందేమో చూడాలి. ఈ రియాలిటీ చెక్ వల్ల హైదరాబాద్ మీద కొత్త అవగాహనేమన్నా వచ్చిందో లేదో తెలియదు గానీ, ఇది రాయకపోతే నేను చాలా చూడగలిగేవాణ్ణి కాదు. మామూలుగా నేనైతే ఒక సెక్సు వర్కర్తో ఎందుకు మాట్లాడతాను; మహబూబ్‌నగర్ నుంచో శ్రీకాకుళం నుంచో వచ్చిన అడ్డాకూలీతో వెళ్లి ఎందుకు మాట్లాడతాను; పల్లీల బుట్టో అల్లం మురబ్బాల సంచో తీసుకుని మనకు ఎదురొస్తాడే అతణ్ణి, “ఏవూరు తాతా?” అని ఎందుకు అడుగుతాం; మన జీవిత పరిధిలో లేని ఒక మనిషితో మాట్లాడటమనేది ఎందుకు జరుగుతుంది? ఈ ఫీచర్ అలా ఎందరితోనో మాట్లాడగలిగేందుకు అద్భుతమైన సాకుని ఇచ్చింది. “ఎక్కడి వాడు ఈ మనిషి, ఎంత సంపాయిస్తుంటాడు, అసలు పిల్లలేమున్నారు” అనేది తెలుసుకోవటానికి నాకు ఇదో ఊతం. మామూలుగా నేను దాటిపోయే చాలా దృశ్యాల్ని దాటిపోకుండా చేసింది.

వీళ్లు మాట కలపగానే వెంటనే ఓపెన్ అయ్యేవారా?

మనం సమాచారం లాగుతున్నట్టు అడగం కాబట్టి, ఒక సంభాషణగా ప్రారంభిస్తాం కాబట్టి, అన్నీ చెప్పేస్తారు. అంటే ఒక ఇద్దరు పక్కన కూచుంటే ఆటోమేటిక్‌గా మొదలవగల సంభాషణ ఏదో ఉంటుంది కదా. నేను చాలావరకూ దాన్నే రికార్డ్ చేశాను. అడిగి ఏదో రాబడదాం అన్న ఆలోచన లేదు. ఒక చోటుకి వెళ్లటం అన్నదొకటే ముందు అనుకునేది. చోటుకి వెళ్లిన తరవాత, అక్కడ ఏ దృశ్యం ఎదురవుతుందో, ఏ మనుషులు ఎదురవుతారో అదే తీసుకున్నాను తప్ప నేను ముందుగా ఏదీ ప్లాన్ చేయలేదు.

ఈ ప్రదేశాలకు వెళ్లి తిరిగి ఆఫీసు దగ్గరకొచ్చి డెస్కు దగ్గర కూర్చున్నాక పని ఎలా ఉండేది?

డెస్కు దగ్గర కొత్తగా చేసే పని ఏదీ ఉండేది కాదు. నా జేబులో ఏది నోట్సుగా సమకూరిందో, దానికి ఒక రూపం తెస్తూ, దాన్ని జాయింట్లుగా కలుపుకుంటూ పోయేవాణ్ణి.

కొన్ని వాక్యాలు మిగతా ఆర్టికల్ అంతట్లోంచీ కొట్టొచ్చినట్టు బయటకు కనిపించాయి…

అవి కూడా నాకు అక్కడ ఉండగానే పడిపోతాయి. ధాన్యం అంతా అక్కణ్ణే పడిపోతుంది. నేను సిస్టమ్ దగ్గర కూచుని చేసేదేమంటే కుప్ప నూకడం.

వీటిల్లో రాయటం బాగా కుదిరిందనిపించిన ఆర్టికల్?

రాశాకా అబ్బా కరెక్టుగా సౌష్టవం కుదిరిందీ, అక్షరం మార్చటానికి లేదూ అనుకున్నవి ఒకట్రెండున్నాయి. గోల్కోండ కోటది ఒకటి, చేపల మార్కెట్టుది ఒకటి. చేపలమార్కెట్టుకి వెళ్లి ఏం రాయాలో కూడా తెలీదు. కానీ వెళ్లి అంతా రాసుకున్నాకా కరెక్టు సిమ్మెట్రీ పడిందే అనిపించింది. అలాగని వీటికి మిగతా ఆర్టికల్స్ కంటే ఎక్కువ పేరేం రాలేదు. కేవలం నాకు మాత్రమే అనిపించే సిమ్మెట్రీ అది.

ఎక్కువ కష్టపడి రాసిన ఆర్టికల్?

కష్టం అంటే మూడు రకాల కష్టాలు చెబుతాను. హిజ్డాల దగ్గరికి వెళ్లి, వాళ్లకు నా మీద నమ్మకం కలిగించి మాట్లాడించడం కష్టమైన పని. దానికన్నా లైంగిక అంశాలు మాట్లాడుతూ ఉండగా, వాళ్లందరూ నన్ను చుట్టుముట్టి కూర్చున్నారు అన్న స్పృహ కలగ్గానే ఒంట్టోకి ఒక్క క్షణం భయం ప్రవేశించింది. ఇక, చలి ఐటెమ్ ఎక్కువ పూటలు, రోజుల గమనింపు. అంటే నా గమనింపులోకి వచ్చినవల్లా నోట్ చేసకుంటూ పోయేవాణ్ని. పిల్లలు ఈ కాలంలో ఎక్కువగా బట్టలు తడుపుతారు… పాలల్లో తోడు ఎక్కువ వేయాల్సి వస్తుంది… బాత్రూమ్ డోర్ ఉబ్డిపోయి సరిగా పట్టదు… ఇలాంటివి. ఎండ ఆర్టికల్ శ్రమపడి రాసింది. అంటే అసెంబ్లీ దగ్గర మొదలుపెట్టి బషీర్ బాగ్- యాబిడ్స్-కోఠి-కాచిగూడ-నారాయణగూడ-హిమాయత్ నగర్-ట్యాంక్ బండ్… ఈ మొత్తాన్ని ఎండలో నడుచుకుంటూ చుట్టొచ్చాను.

‘మధుపం’, ‘పలక – పెన్సిల్’ పుస్తకాల తర్వాత ఈ పుస్తకంలో ఏదన్నా మార్పు కనిపించిందా?

‘మధుపం’ లో ఎలా రాశానో, ఇప్పుడూ అలాగే రాస్తున్నా అనుకుంటాను. ఆ కంటెంట్‌ని దాటి వచ్చి ఉండొచ్చు.

అంటే ఆ అభిప్రాయాలు ఇప్పుడు లేవనా?

కాదు. కొన్ని ఒక్కో సమయంలోనే చేయగలం. ఈ మధ్య మా పిల్లలు ఏం మాట్లాడుతున్నారో ఆ పిచ్చి మాటలూ, మంచి మాటలూ, నాకు ముద్దొచ్చే మాటలూ అన్నీ ఒక చోట రాస్తున్నా. మొన్న మా వాడు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తూ అన్నాడు, “పులి జింకని తింటే మరి జింకకి పులి లోపల అంతా ఎలా కనపడుతుందీ” అని. అలాంటివి నోట్ చేస్తున్నా. నాకు ఇప్పుడు ఈ పని చాలా ఇంపార్టెంటూ, చాలా ఎక్సయిటింగూ. ఒక ఇరవై ఏళ్ల తర్వాత ఈ ఎక్సయిట్మెంటు ఉండకపోవచ్చు కదా. అప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుందో, పిల్లలూ పెళ్లిళ్ల గురించి ఆలోచిస్తాం కావచ్చు. అప్పుడు చిన్నపిల్లల మాటల్ని అంతే క్యూరియస్‌గా వింటామా అని డౌటు నాకు. ఆ సెన్సులో అన్నా. ఆ అభిప్రాయాలు దాటుకుపోయానూ అని కాదు. ఆ దశలో చేయాల్సిన పనిని ఆ దశలో కరెక్టుగా చేశా అనుకుంటున్నా.

ఈ మధ్య మీ ఫీచర్డ్ ఆర్టికల్స్ చూస్తుంటే మీరు కథలకు పనికొచ్చే విలువైన సౌర్స్ మెటీరియల్‌ని ఇక్కడ వాడేసుకుంటున్నారనిపిస్తుంది.

నాకెలా అనిపిస్తుందంటే, చాలా ముక్కలు ముక్కలుగా ఉన్న ఆలోచనల్ని అలాగైతేనే వదిలించుకోగలం. ఖచ్చితంగా ఒక కథగా రాయాలీ, ఒక నవలగా రాయాలీ అనుకుంటే, ఆ ప్లాట్‌లోకి ఇవ్వన్నీ ఇమడకపోవచ్చుగా. వంద ఆలోచనల్ని చెప్పాలంటే, వాటన్నింటినీ ముక్కలు ముక్కలుగా చెప్పేస్తే అయిపోతుంది, వాటన్నింటినీ ఎప్పటికో కథల్లోకి మిగుల్చుకోవాలంటే సాధ్యం కాదేమో. ఇవ్వన్నీ వృథాగా కిల్ అయిపోయినయే అని నేనైతే అనుకోవట్లేదు. ముందు మన దగ్గరున్న ఆలోచనల్ని దులిపేసుకుని అబ్బ బరువు వదిలించుకున్నాంరా బాబూ అనుకోగలిగితే అదో తృప్తి.

మీరు సాక్షిలో జర్నలిస్టే కాదనుకోండి, అప్పుడు ఇవన్నీ రాసేవారా…

ఏమో… అప్పుడు కథలు మాత్రమే రాసేవాణ్ణి కావచ్చు.

ఇప్పుడు మీరు రాసిన వాటిలో “ఆజన్మం” మాత్రమే మీరీ ఉద్యోగంలో లేకపోయినా రాసేవారనిపిస్తుంది. మిగతా వాటిని మీ ఉద్యోగం కొంత నిర్దేశించిందనిపిస్తుంది.

అవును. అదే కాదు, “పలక పెన్సిల్”లో ‘పదాలు పెదాలు’ కూడా ఉద్యోగంలో లేకపోయినా రాశేవాణ్ణి. కానీ కొన్నిసార్లు మన రాతల్ని మన వేదిక నిర్దేశిస్తుంది. ఆ పరంగా ఈ రాతలన్నీ నా ఉద్యోగ బాధ్యత నాకిచ్చిన వరం అనిపిస్తుంది. “రియాలిటీ చెక్” పుస్తకంలో ఆ సంగతి చెప్పాను కూడా.

ఫిక్షన్ జోలికి ఎందుకు వెళ్లటం లేదు?

నేను కథలు కూడా రాశానుగా. కానీ కథలే రాయాలన్న పట్టింపు లేనివాణ్ని. రాసిన కథలు నా వరకూ ఫిక్షన్ కాదు. “ఇది రాజిరెడ్డి కథ” అన్నప్పుడు ఇది రాజిరెడ్డే కావాల్సిన అవసరం లేదూ అనే ఒక హింటు పాఠకుడు గ్రహిస్తాడు. ఆ మేరకు అవి సేఫ్ బెట్. కానీ నాకు సంబంధించి అది కూడా నాన్‌ఫిక్షన్ లాంటిదే.

నాన్‌ఫిక్షన్ ఎప్పుడూ రాసేవాణ్ణించి స్వతంత్రంగా ఉండలేదనిపిస్తుంది. రాజిరెడ్డి అన్న బైలైన్ లేకుండా మీ ఫీచర్స్ నిలబడవు. అదే ఫిక్షన్ అయితే పాఠకునికి రచనతో సంబంధం ఉంటుంది గానీ, రాజిరెడ్డితో ఉండదు కదా, అప్పుడా రచన మీ నుంచి స్వతంత్రమవుతుంది కదా?

1నువ్వు అభిమానించే కాఫ్కా రచనలే తీసుకుంటే… దీన్ని రాసింది ఎవరు? అతడి నేపథ్యం ఏమిటి? మానసిక పరిస్థితులు ఏమిటి? ఆయనకున్న ఉద్దేశాలు ఏమిటి? ఆయన చూసిన ప్రపంచమూ నేను చూస్తున్న ప్రపంచమూ ఒకటేనా? అన్న ప్రశ్నలు చదువరిని తొలవొచ్చు. అంటే మళ్లీ కాఫ్కా వచ్చి పాఠకుడి వెనక నిలబడుతున్నాడు. అలాంటప్పుడు, రచయిత నుంచి విడవిడి… పాఠకునికి రచనతో మాత్రమే సంబంధం ఉండే సందర్భం ఎక్కడ? బహుశా తొలి రీడింగులో అలా ఉంటుంది. కానీ వన్స్ ఆ రచన నీకు అభిమానపాత్రం అయిందంటే, మళ్లీ రచయిత నీ పుస్తకం వెనకే వచ్చి నిల్చుంటాడు; నీవే హత్తుకుని ఆయన్ని తెచ్చేసుకుంటావు. “కొంత సమయం”… నీ ఏకాంత సమయంగా ఉంటుందే తప్ప, పూర్తిగా విడిపడి ఉండదు. ‘స్వీయ’ అంశాలు రాసే రచయితలతో ఈ పేచీ ఎప్పుడూ ఉంటుందనుకుంటాను. Holden ముఖ్యమా? Salinger ముఖ్యమా?

ఫిక్షన్ ఏమిటంటే – కొన్నింటిని నిర్భీతిగా చెప్పుకోగలిగే వెసులుబాటు కలిగిస్తుంది. నా పక్కింటివాడి గురించి నేను అంత సులభంగా ప్రతికూలాంశం రాయలేను. దాన్ని మరుగుపరచాలంటే నేను అతణ్ని పక్క కాలనీలోనో, పక్కూర్లోనో ప్రతిష్టించి, అక్కణ్నుంచి కథ చెప్పకుంటూ రావాలి. ఫిక్షన్ (రాయడంలో) ఎక్కువ ఆదరణ పొందడానికి ఇదే కారణమనకుంటాను.

మీరు రాసే పద్ధతి ఎలా ఉంటుంది?

నేను ఎట్ట రాస్తాను అనేదానికి నా ఊహలో ఉండే ఒక పోలిక చెప్తా. నా దగ్గర కొన్ని కుండలు పెట్టుకుంటాను. అవెన్ని కుండలో… ఒక ఎనిమిదా పదా పదిహేనా అని లెక్క లేదు. ఒక్కో కుండలో కొన్ని నీళ్లు పోస్తుంటా. అంటే ఒక ఆలోచనో, ఒక వాక్యమో నీళ్లనుకో. ఎప్పుడు ఏ నీళ్లు ఎందులో పోయాలనేది మనకు ఆటోమెటిగ్గా తెలుస్తూంటది. ఇందులో కొన్ని పోస్త, అందులో కొన్ని పోస్త, ఒక్కోసారి అరె పోసిన నీళ్లు ఇందులోయి కాదని అందులోకి మారుస్త. అట్లా.. అట్లా.. ఒక కుండయితే ఓ ఇదిగో ఒక కుండ ఫినిష్ అని పక్కన పెడత. ఒక్కోసారి ఓ మూల కుండ ఎప్పటికీ నిండక అలాగే ఉండిపోతుంది. అంటే ఉట్టి చెమ్చాడు నీళ్లు అట్లా పడి… అలాగే ఉండిపోయిందన్నమాట. కొన్ని కుండల్లో ఒకేసారి పెద్దగ తెచ్చి పోసి ఫినిష్ చేసి పంపియొచ్చు. ఇదీ నా పద్ధతి.

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఇంటర్వ్యూ, ఫిబ్రవరి and tagged , , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.