ms naidu

అస్పర్శ

Download PDF ePub MOBI

దీని ముందు భాగం

3

చాలా ఏళ్ళ కిందట ఒకరోజు నాకు పొష్ట్‌లో ఒక పుస్తకం వచ్చింది. అది చదువుకుని నేను మురిసిపోతుంటే నా చుట్టూ ఉన్న స్నేహితులు ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళలో ఫణీంద్ర అని ఒకతను “ఏది బే? ఆ బుక్కిలా ఇయ్యిరా?” అని నా చేతిలోంచి లాక్కుని చూసేడు. అది బాధలూ సందర్భాలూ అని త్రిపుర కవితల పుస్తకం. దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, ఇక్కడొకటీ అక్కడొకటీ కొసరుగా కొన్ని కవితల్లోంచి చదివి “ఏంట్రా ఇది? ఇది కవిత్వమా?? చీకట్లోకి వేళ్ళని పంపించేడా? అవి గుర్రు గుర్రుమన్నాయా? ఛస్ తియ్!” అని పక్కన పడీసి, నేను ఎందుకలా పొంగిపోతున్నానని నన్నూ ఎగతాళి చెయ్యడం మొదలుపెట్టేడు. ఫణీంద్ర స్పందించిన తీరు సబబైనదే. స్నేహితుల మధ్యన కాబట్టి అలాగ మొహమాటం లేకుండా తన నైసర్గికమైన స్పందన – first reactionను ఉన్నదున్నట్టుగా చెప్పగలిగేడు. ఇలా ఒక పాఠకుడు కాల్పనిక సృజనను తన శక్తి కొద్దీ ఏ కొంతైనా పట్టి చూసి తనకు తోచింది చెప్పుకోడాన్ని Reader’s Talk అని అన్నారు – అంటే పాఠకుడి మాట.

ఇది కాక Writers’ Talk, Academic Talk అని ఇంకొక రెండు రకాల స్పందనలున్నాయి. మా నాన్న నాకు చెప్పులు తెగిపోయినప్పుడల్లా ఒక చమారి దగ్గరకి తీసుకెళ్ళి అతను కుట్టిన కొత్త చెప్పులు కొనిచ్చేవాళ్ళు. ఆ చమారి అప్పటికే ముసిలాయన. రోడ్డు పక్కన ఒక కఱ్ఱ బడ్డీలోన చెప్పులన్నీ గోడలకి పేర్చుకుని అమ్మేవాడు. పొద్దస్తమానం చెప్పులు కుడూతూనే ఉండేవాడు. మా నాన్న నాతో రహస్యం చెప్తున్నట్టు లోగొంతుకలోన “అతను చూడూ! చెప్పులు కుడుతూనే ఓ కన్ను అందరి చెప్పుల మీదా పడెస్తాడు!!” అని మెచ్చికోలుగా చెప్పేవారు. అప్పట్నుంచీ నేను ఆ రోడ్డుమీద ఎప్పుడు వెళ్తున్నా ఆ చమారి దేనికేసి చూస్తున్నాడో అక్కడే కొంచెం సేపు తచ్చాడి చూసేవాణ్ణి. అతను వచ్చే పోయే మనుషులందరి చెప్పుల్నీ ఓ కంట పరీక్షగా చూస్తూనే, మళ్ళీ తల తిప్పుకుని తన చెప్పులు తను కుట్టుకునేవాడు. ఒక చమారికి సాటి చమారి చెప్పుల్ని ఎలా కుట్టేడా అని అంత ఆసక్తి అన్నమాట! వినియోగదారులం నేనూ మా నాన్నా – మాకు చెప్పుల్ని చూడగానే తలెత్తే ప్రశ్నలు: ఇవి తొడుక్కుంటే హాయిగా ఉంటుందా? ఎంత కాలం మన్నుతాయో? చూడ్డానికి షోగ్గా ఉన్నాయా? ఇవి తొడుక్కుని ఊళ్ళోకెళితే నలుగురూ ఏమనుకుంటారు? వీటి ఖరీదెంతా? అని ఇలాగ. చెప్పులు ఎలా కుడితే మాకేంటి? చమార్ల ప్రశ్నలు చాలా వేరై ఉంటాయి. కవులు సాటి కవుల అల్లికల్ని ఇలా చమారీ చమారీ చెప్పుల్ని కలబోసి చూసుకున్నట్టు చూస్తారు. ఈ ఆసక్తి, పద్ధతీ అటు పాఠకులకీ, ఇటు పండితులకీ సాంతం అవగాహనకు రావు, ఆసక్తికరంగానూ ఉండవు. Writers’ Talk అంటే కవులు ఒక సృజనను పరికించి చూసి పరస్పరం చెప్పుకునే మాటలు. Academic Talk అంటే పండితులు, పరిశోధకులు, విమర్శకులూ యూనివర్శిటీల్లాంటి చోట్ల చర్చించుకునే సంగతులు.

ఫణీంద్రకే కనక త్రిపుర కవితలే ఆసక్తికరంగా ఉండి, ‘అర్థం’ అవుతూ వస్తే తను బహుశ ఇంకొంత కుదురుగా వాటిని పట్టి పట్టి చదువుతూ తనకి తోచిన మంచీ చెడ్డా చెప్పగలిగి ఉండేవాడు. అలా కథనో, కవితనో చదివటం పూర్తిచేసేక కూడా పాఠకులకి సర్వ సాధారణంగా వచ్చే ఇబ్బంది తన స్పందనను మాటల్లో ఎలా చెప్పటమా? అని. రెండు ముక్కల్లోన ‘బావుంది’, ‘పర్లేదు…’, ‘సూపర్’, అనో, లేకుంటే ‘ఇదొక కథా?!’ అనో, “ఛస్ తియ్!” అనో ముక్తసరిగా చెప్పి ఊరుకోగలిగితే పరవాలేదు. కాని దీంతో ఇబ్బందులున్నాయి. ఆ స్పందన చదివినవాళ్ళకి పెద్దగా ఉపయోగం లేదు. పాఠకుల్లో బాగా ఆసక్తి – అంటే జిజ్ఞాస లాగ ఉన్నవాళ్ళూ ఉంటారు. వీళ్ళలో కొందరు కాల్పనిక సృజన విద్యార్థులుంటారు. సృజనను అభ్యాసం చేసే కవులు ఎటూ ఉండనే ఉన్నారు. ఇలాంటివాళ్ళకి ఇలా చౌ చౌగా చెప్పి ఊరుకుంటే సంతృప్తి లేదు. ఇంకా తరచి చూసి చెప్పవలసింది ఏదో మిగిలే ఉందన్న భావన వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటివాళ్ళ కోసం ఇంగ్లిష్ సాహిత్యంలోన ఒక సృజనను ఎలా పరికించి చూడాలి? అని కొన్ని రకాల పద్ధతులు ప్రతిపాదించేరు. వీటిలోన Close Reading అంటే పరికింత అని ఒక పద్ధతి ఇక్కడ ఉపయోగ పడుతుంది. ఈ పరికింతను వరుస ప్రశ్నలుగా అంటే ఒక questionnaire లాగ నిర్మిస్తారు. ఒక్కొక్క ప్రశ్న ఒక ద్వారం లాగ. ఒక ద్వారాన్ని దాటితే తప్ప రెండో ద్వారం లోకి ప్రవేశం లేదు. ఈ పద్ధతి పాఠకులు, కవులూ, పండితులకి కూడా పాఠ్యాలను (Texts) పరిశీలించి చూసి ఆకళింపు చేసుకోడానికి కొంత దూరం ఉపయోగపడుతుంది. అటు పిమ్మట వాళ్ళ ఆసక్తి, ధ్యాసా వేరు వేరై వాళ్ళ ప్రశ్నలు, దృష్టీ వేరు వేరు తోవలుగా విడిపోతాయి.

పాఠ్యాల లోన కాల్పనిక సృజన (Creative Fiction) ఒక పాయ మాత్రమే – కథ, కవిత, పాట, నవల, నాటకం ఇలాంటివి. వ్యాసం వీటికి భిన్నమైనది. ఒక పాఠ్యాన్ని ఎలా చదివి ఆకళింపు చేసుకోవాలి అని వివరించే పరికింత (Close Reading) స్థూలంగా వ్యాసం కోసమైతే ఒకలాగ, మిగత కాల్పనిక సృజన కోసం అయితే ఒక్కో ప్రక్రియకీ ప్రత్యేకించి ఒక్కోలాగా ఉంటాయి. ఉదాహరణకు కవితను పరికించే పద్ధతినే పాటను పరిశీలించడానికి సాంతం అన్వయించకూడదు. పాటని సంగీతం, సాహిత్యం రెండు కలిసి నిర్వహిస్తున్నాయి. వ్యాసాల్లో పరిశోధక వ్యాసాలు (Research Papers) అయితే ఒక పట్టాన కొరుకుడు పడవు. అలాంటి పాఠ్యాలను ఒక్కొక్కదాన్నీ తదేకంగా రోజుల తరబడి ప్రతి మాటా, వాక్యం, అవి నిర్మించే ఆలోచనా ఇలా చదివి, మననం చేసుకోవలసి ఉంటుంది. కాల్పనిక సృజన విద్యార్ధులు కధ, కవిత్వం, నవల వంటి సృజన రూపాలను కూడా ఇలాంటి శ్రద్ధతోను, జిజ్ఞాసతోను పరికించి చూడవలసి ఉంటుంది. దీనివలన ప్రయోజనం మాట ఎలాఉన్నా, అలా చదువుకుంటే తప్ప సంతృప్తి లేదు. వ్యాసాన్నైనా, కల్పననైన పరికించి చదవటానికి నేను ప్రతిపాదించేవి రెండు ప్రశ్నలు – ఒకటి మొట్టమొదటిది, రెండోది చిట్ట చివరిదీ. మిగత పరికింత అంతా ఈ రెండు ప్రశ్నల మధ్యనా ఇమిడేది. ఇవి:

1. ఈ పాఠ్యం అంటే నాకు నిజంగా ఆసక్తి ఉందా? (Am I genuinely interested in this text?)

2. దీన్ని పట్టి పట్టి చదివితే మరి నాకు సంతృప్తిగా ఉందా? (Is this reading satisfying?)

కొంచెం కొసరి చూసి, ముందుగా ఈ మొదటి ప్రశ్నకు ‘అవును’ అని సమాధానం తోస్తేనే ఆ సృజన లోనికి, వ్యాసం లోకీ ప్రవేశించేది. లేకుంటే దాన్ని విడిచిపెట్టడం. తీరా మొదలుపెట్టిన తరువాత రక రకాలుగా, ఒకటికి రెండు సార్లు పట్టి చదవటం – అంటే పరికింత ఎంత వరకూ అంటే రెండో ప్రశ్నకి ‘అవును! సంతృప్తిగా ఉంది!!’ అని సమాధానం వచ్చేవరకూను. ఈ రెండు ప్రశ్నల మధ్యనా వీటికి ఉప ప్రశ్నల్లాగా నిర్మించుకునేదే ఇందాక చెప్పిన ప్రశ్నావళి. అర్థం అంటే (Meaning) అనేది సంతృప్తికరమైన పఠనానికి చాల ఆవశ్యకమైనది. అందుకే అర్థం కాని సృజనల మీద చాల కంటగింపుగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ అర్థం అనేది పాఠ్యం, పాఠకుడూ జట్టు కలిసి నిర్మించుకోవలసిన వస్తువు.

కవిత్వం క్లిష్టమైనది. పైపెచ్చు కాల్పనిక సృజన రూపాలన్నింటిలోకీ అధివాస్తవిక కవిత అత్యంత జటిలమైన వాటి కోవలోకి వస్తుంది. అది పైపైకి చూస్తే పిచ్చి కూతలు అంటే Nonsense లాగ నిరర్థకంగా అవుపిస్తుంది. అధివాస్తవిక కవితను పరికించటం ఎలాగో చెప్పేముందు, ఒక పాఠ్యాన్ని ఎలా పరికించి చూస్తాము? వాటిలోనూ ఒక కాల్పనిక సృజనను ఎలా పరికించి చూస్తాము అని కనీసం రేఖా మాత్రంగానైనా చెప్పవలిసే ఉంది. ఎందుకంటే వచనం, వ్యాసం, కథ, కవిత వంటి సారస్వత రూపాలని మనం పరిశీలించే పద్ధతులు చిన్నప్పట్నించీ వచ్చిన అలవాట్ల వలన ప్రభావితమై ఉంటాయి. ఈ cognitive habits అధివాస్తవిక కవితనే కాకుండా దానికి సమీప వస్తువులైన మార్మిక కవిత, సంక్లిష్ట కవిత – అంటే నారికేళ పాకం అనేదాన్నీ కూడా అందుకొనే ప్రయత్నం చెయ్యగలిగినా, చేస్తున్నా అందనివ్వకుండా అడ్డం పడతాయి. మార్మికత, సంక్లిష్టత, అధివాస్తవికత ఇవి మూడూ దగ్గర దగ్గరగా ఉంటాయి కాని మూడూ ఒకటే కాదు, వేరు వేరు. అధివాస్తవిక సృజన చదువరికి అలవాటై వస్తున్న వాస్తవిక దృష్టిని, ఆపేక్ష (Expectation)ను భంగపరిచి, తికమక పెడుతుంది.

ఏ పాఠ్యాన్నైనా చదువుకుంటున్నప్పుడు పాఠకుడు తనకు అనుభవం వలన, శిక్షణ వలనా అందుబాటులోకి వచ్చిన అవగాహన వనరులతో దాన్ని మళ్ళీ తన అంతరంగంలో నిర్మించుకుంటున్నాడు, జీర్ణం చేసుకుంటున్నాడు. ఇలా చదువుకునేటప్పుడు సంక్లిష్టత, మార్మికత, తెలియనితనం – అంటే పాఠ్యం ప్రతిపాదిస్తున్న విషయం, వస్తువు, భాషలతో ఏ కొంతైనా పరిచయం లేకపోవడం (lack of prior knowledge) అవగాహనకు అడ్డం వస్తాయి. ఈ ఇబ్బందిలేని పాఠ్యానికి ప్రసాద గుణం ఎక్కువగా ఉంది అని అంటారు. పాఠ్యం ఆవిష్కరిస్తున్న ప్రపంచం, దాన్ని నిర్మిస్తున్న ఆలోచనలు, అనుభవాలూ, భాషా ఎంత పరిచితమైతే పాఠ్యం అంత సులభ గ్రాహ్యం అవుతుంది. అందుకే వార్తా పత్రికలు, వ్యాసాలు, పరిశోధనా వ్యాసాలు, నిపుణుల గ్రంధాలు – వ్యాసాల్లోని సంక్లిష్టత అనుక్రమం ఇలా ఉంటుంది. అలాగే సాధారణంగా కథానిక, కథ, నవల, నాటకం ఇలాంటి కాల్పనిక వచన రూపాలు కవిత, పద్యం, పాట వంటి కవిత్వ రూపాల కంటె సులభంగా అందుతాయి. అంచేత వాస్తవిక దృష్టి ఏమిటో, దాని అలవాట్లు, ఆపేక్షలూ ఏమిటో అవి కొంత సులభంగా పట్టుపడేవైన సాధారణమైన కథ, కవిత ఇలాంటి సృజన రూపాలనుండి అలవాటుగా ఏం ఆశిస్తున్నాయో ముందుగా పరిశీలించిన తరవాత అధివాస్తవిక కవితను, మార్మిక కవితనూ పరిశీలిస్తే వాటి సంక్లిష్టతకు, జటిలతకు కారణాలు అవగతం అవుతాయి.

ఆలోచించి చూస్తే ఒక వ్యాసాన్ని, దాంట్లో ఒక్క పేరాగ్రాఫుని చదివి ఆకళింపు చేసుకోవడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదని బోధపడుతుంది. ఉదాహరణకు Foundation for Critical Thinking అని ఒక సంస్థ పాఠ్యాలని ఎలా చదివి ఆకళింపు చేసుకోవాలి? అన్న విషయం మీద How to Read a Paragraph: The Art of Close Reading అని ఒక పుస్తకం వేసేరు. దీనికి తోడు వ్యాసం రాసేవాళ్ళ కోసం The Thinker’s Guide to How to Write a Paragraph అని ఇంకొకటి. లిండా ఎల్డర్, రిచర్డ్ పాల్ (Dr. Linda Elder; Dr. Richard Paul) అని ఇద్దరు మనస్తత్వవేత్తలు చేస్తూ వస్తున్న పని ఇది. స్థూలంగా వాళ్ళు చెప్పేది ఏమంటే వ్యాస రచయిత తన ఆలోచనలను, విశ్లేషణనూ వాక్యాలుగా, పేరాలుగా పొట్లం కట్టి అందిస్తున్నాడు. పాఠకుడు దాన్ని శ్రద్ధగా విప్పి, మళ్ళీ ఆ ఆలోచనను తనంత తానుగా పునరాలోచించాలి, తనకు తానూ విశ్లేషించుకోవాలి. ఇది అక్షర జ్ఞానం ఉన్నంత మాత్రాన అందరికీ అంత సుళువుగా పట్టుబడే శక్తి కాదు. చదవటంలో నైపుణ్యాన్ని విడిగా శ్రమించి సాధించుకోవలసి ఉంటుంది.

చదువరుల్లో నిపుణులైన పాఠకులని ఉంటారు. వాళ్ళు చదవాలని తలకెత్తుకున్నది దేన్నయినా ఆషామాషీగా కాకుండా ఒక స్పష్టమైన ధ్యేయం కోసం చదువుకుంటారు. అటు పైన వాళ్ళు తమ ధ్యేయమే కాకుండా రచయిత ధ్యేయం ఏమిటి? ఎందుకోసం ఈ పాఠ్యాన్ని రాస్తున్నాడు? అని చూస్తారు. ఆ తరవాత పాఠ్యం ప్రతిపాదిస్తున్న మౌలికమైన అంశాలేమిటి, తరువాయి అంశాలేమిటి అని ఒక పటం లాగ మనసులోనే నిర్మించుకుంటారు. ముందుగా ఆసక్తి ఉన్న పాఠ్యాన్ని మాత్రమే పరికించటానికి స్వీకరించి, తరవాత చదువుతున్నదాన్ని గురించి జాగర్తగా ఆలోచిస్తూ, మననం చేసుకుంటూ పోతే చదివే నైపుణ్యం పట్టుబడుతుందని వాళ్ళ ప్రతిపాదన. ఇలా పరికించి చదవలేక పోవడాన్ని వాళ్ళు Impressionistic Reading అని నిరసిస్తున్నారు. దీన్ని మనం పై పై చదువు అని అనుకోవచ్చును. దీని మీద Elder & Paul ఆరోపణ:

“The impressionistic mind follows associations, wandering from paragraph to paragraph, drawing no clear distinction between its own thinking and the author’s thinking. Being fragmented, it fragments what it reads. Being uncritical, it judges an author’s view to be correct only if that view concurs with its own beliefs. Being self-deceived, it fails to see itself as undisciplined. Being rigid, it does not learn from what it reads. Whatever knowledge the impressionistic mind absorbs is uncritically intermixed with prejudices, biases, myths, and stereotypes. It lacks insight into how minds create meaning and how reflective minds monitor and evaluate as they read.

పై పై చదువుకి అలవాటు పడిన బుద్ధి పాఠ్యంలో ఒక చోట్నుండి ఇంకో చోటికి అగమ్యంగా లంఘిస్తూ తన ఆలోచనలకీ రచయిత ఆలోచనలకీ మధ్యా సామ్యాల్నీ, బేధాల్నీ స్పష్టంగా గుర్తించ లేక పోతుంది. విక్షేపమైన మనఃస్థితితో, అంటే పరాగ్గా పాఠ్యంలోనికి ప్రవేశించి పఠనానుభవాన్నీ విక్షేపం చేసుకుంటుంది. రచయిత ఆలోచనలు తన ఆలోచనలతో, నమ్మకాలతో ఒప్పుకోకపోతే అవి తప్పని నిర్ధారిస్తుంది. మంకుతనం వలన తన లోపాల్ని గ్రహించుకోలేదు, చదువుతున్న విషయం నుండి నేర్చుకోలేదు. పై పై చదువుకు అలవాటు పడిన బుద్ధి ఆ పాటి మిడి మిడి పఠనం నుండి ఏరుకున్న సంగతుల్ని తనకు ఇదివరకే ఏర్పడిపోయిన నమ్మకాలు, పక్షపాతాలు, అపోహలు, దురభిమానాలతో కలిపి తన జ్ఞానంగా స్థిరం చేసుకుంటుంది. పాఠ్యాల్లో అర్థం అనేది ఎలా నిర్మితమౌతుందన్న ఇంగితాన్ని, బుద్ధిమంతులు చదువుతున్న అంశాల్లో స్థూలార్థం కోసం, పరమార్థం కోసం ఎలా వెతుక్కుని మననం చేసుకోవాలోనన్న ప్రావీణ్యాన్ని సాధించుకోలేక పోతుంది.

సరే వ్యాసం చదవటానికే ఇంత తతంగం ఉంది. ప్రస్తుతం ‘ఆసక్తి’ ఉన్నదేమో మార్మిక కవితా, అధివాస్తవిక కవిత మీద! వీటి పరికింత జోలికి ఇప్పట్లో పోవద్దు గాని, ఊరికే విఘ్నేశ్వర ప్రార్ధన (పసుపు విఘ్నేసురుడు) లాగ ఒక మూడు కవితల్ని స్పృశిద్దాము. ఒకటి నాయుడుగారి పుస్తకం “ఒక వెళ్ళిపోతాను” నుండి అధివాస్తవిక కవిత ‘ఎండాకాలం కల మధ్యాహ్నం’, ఇస్మాయిల్ గారి కవిత ‘వేయి పిర్రల సముద్రం’, ఇంకా త్రిపురది ‘ఒక కాఫ్కా రాత్రి రహస్యం’ ఈ మూడూ. ఊరికే ముట్టుకుని చూడ్డానికి. వీటిలో ‘ఒక కాఫ్కా రాత్రి రహస్యం’ మార్మికమైన కవిత, ‘వేయి పిర్రల సముద్రం’ చాల వరకు అందుబాటులో ఉన్న కవిత, ‘ఎండాకాలం కల మధ్యాహ్నం’ ఏమో తిక్కలమారి కవిత. ఆసక్తి ఉందా? ఈ ప్రశ్న వేస్తుంటే అదేదో సినిమాలో ఒక ఆసామీ కోర్టుకెక్కే ముందు “నిలబడగలవా?!” అని నిలదీస్తుంటాడు. అది గుర్తొచ్చి నవ్వొస్తుంది.

పరికింత మన సంప్రదాయంలోనూ లేకపోలేదు. పధ్నాలుగవ శతాబ్దంలో కోలాచలం మల్లినాధ సూరి అని పండితుడు పఠాన్‌చెరు దగ్గర కొల్చారంలో ఉండేవారట. సంస్కృతంలోన పంచ మహాకావ్యాలకు ఆయన వ్యాఖ్యానాలు నిర్మించేరు. ఆయనను వ్యాఖ్యాన చక్రవర్తి అని భారతదేశం అంతటా గౌరవించి చెప్పుకునేవారు. మనలో తెలుగు చదువుకున్నవాళ్ళకి పద్యానికి అర్థం, తాత్పర్యం, ప్రతి పదార్థం రాయటం గుర్తుండి ఉంటుంది. ఇలా ప్రతి పదాన్నీ, వాక్య శకలాన్నీ ఈకకి ఈకా, తోకకి తోకా పరికించి చూసే పద్ధతి బహుశ మన తెలుగు పండితులతోనే అంతరించిపోతుంది. ఇటీవల ఇలాగ ఒక కావ్యాన్ని పరికించి చూసే వ్యాఖ్యానం ఒకటి నాకు చాల ఇష్టమైనది కాళిదాసు దేవీ అశ్వధాటి కి మేళ్ళచెర్వు భాను ప్రసాద రావు గారు రాసి, ప్రచురించేరు. అది Scribdలో దొరుకుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళకి ఆయన ప్రతి పదాన్నీ, ఖండాన్నీ తీసుకుని ముందుగా పదాల అర్ధాలనీ, తరువాత అవన్నీ కలిపి శ్లోకం అర్ధాన్నీ, తాత్పర్యాన్నీ ఎలా నిర్మిస్తున్నాయో విశదం చేసే పద్ధతి చాల మనోహరంగాను, సహాయకరం గానూ ఉంటాయి.

ఉపయోగించే పుస్తకాలు:

  • Elder, L. and Paul, R. (2008) How to Read a Paragraph: The Art of Close Reading; Foundation for Critical Thinking Press http://www.criticalthinking.org/files/How%20to%20Read%208.11.08.pdf
  • మేళ్ళచెర్వు భాను ప్రసాద రావు (1998) దేవీ అశ్వధాటి (కాళిదాస కృతి) వ్యాఖ్యానము. http://www.scribd.com/doc/79072515/Devi-Aswadhati-Stotram-Telugu

(తరువాయి భాగం వచ్చేవారం)

Download PDF ePub MOBI

Posted in 2014, ఫిబ్రవరి, వ్యాసం and tagged , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.