free_Mahaabharatam

ప్రాచీన వాఙ్మయం ఆధునిక తరం కోసం

Download PDF ePub MOBI

పంచతంత్రం

ప్రాచీన భారత నీతి శాస్త్రాల్లో పంచతంత్రం ఒకటి. జంతువుల ఆధారంగా మానవ ప్రపంచమనే అడవిలో ప్రశాంతంగా జీవించటానికి అవసరమైన సర్వ విచక్షణను, విజ్ఞానాన్ని అత్యంత సరళంగా, మనస్సుకు హత్తుకునేట్టు బోధిస్తుంది పంచతంత్రం. సంస్కృతంలో విష్ణుశర్మ రచించిన పంచతంత్రం భారత దేశంలోని అన్ని భాషలలోనే కాదు ప్రపంచం నలుమూలలా విస్తరించింది. విభిన్న సంస్కృతి సంప్రదాయాలలో వారి కనుగుణంగా పంచతంత్రాన్ని అనువదించి అనుసృజించుకున్నారు. ఏ తరానికి ఆ తరం తమ నిత్యజీవితంలోని సంఘర్షణలను, సంధిగ్ధాలను తొలగించుకోవడానికి పంచతంత్రాన్ని తమ సమకాలీన పరిస్థితులకనుగుణంగా రచించడమే కాదు భావితరాలకు అర్థమయ్యే రీతిలో అనుసృజనకావిస్తూ అందించడం కూడా తప్పని సరిగా జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం సమకాలీన సమాజానికి తగ్గట్టు పంచతంత్ర కథలను అనుసృజించారు జగన్నాథశర్మ.

పంచతంత్రంలో మొత్తం అయిదు తంత్రాలున్నాయి. మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి, అపరీక్షితకారకం అనే ఈ ఐదు విభిన్న అధ్యాయాలను పంచతంత్రం అంటారు. మిత్రభేదంలో మిత్రుల నడుమ భేదాలు సృష్టించి వారిని బలహీనులను చేయడం ఉంటుంది. ఈ కథల ద్వారా కలసి ఉండటంలోని శక్తి తెలుస్తుంది. కలిసి ఉన్నవారిని జయించలేనివారు వారి నడుమ భేదాలను సృష్టించి ఎలా బలహీన పరుస్తారో తెలుస్తుంది. మిత్రలాభంలో ఐకమత్యంలోని లాభం తెలుస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలాంటి వారిని దూరంగా ఉంచాలి వంటి విచక్షణనిస్తుందీ పుస్తకం. విగ్రహంలో యుద్ధం, శాంతి సాధనల తంత్రాలుంటాయి. సంధిలో లాభనష్టాలను బేరీజు వేసుకోవడం ఉంటుంది. అపరీక్షితకారకంలో తొందరపాటు చర్యలను పరిహరిచటం తెలుస్తుంది. సింహం, ఎద్దు, పక్షులు, ఎలకలు, తోడేళ్ళు, జింకలు, కోతులు, మొసళ్ళు, వంటి పలురకాల జీవులను ఆయా మనస్తత్వాలకు, గుణాలకు ప్రతీకలుగా తీసుకుని వ్యక్తుల స్వభావాలను వాటివల్ల ఒనగూడే లాభాలను మరచిపోలేని రీతిలో బోధిస్తుంది పంచతంత్రం.

పంచతంత్ర కథలను అత్యంత సరళంగా, సుందరంగా, చదివిన వెంటనే ఎలాంటి ప్రయాస లేకుండా సులభంగా హృదయానికి హత్తుకునే రీతిలో రచించారు జగన్నాథశర్మ. పెద్దలీ కథలు చదువుతూ తమ అనుభవాలని కథల్లో చూసుకుని అర్థం చేసుకుని ఆనందిస్తే, పిల్లలు ఈ కథలు విని ఆనందిస్తూ, తమకు తెలియని పలు విషయాలను గ్రహిస్తారు. విజ్ఞానవంతులవుతారు. తెలుగులో నాణ్యమైన బాలసాహిత్యం అరుదైపోతున్న తరుణంలో ప్రాచీన వాఙ్మయాన్ని ఆధునిక తరానికి తగ్గట్టు సరళీకరించి అందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ పుస్తకం ఆ అవసరాన్ని తీరుస్తుంది. పెద్దలు, పిల్లలు పదే పదే చదువుతూ ఆనందంతో పాటూ విజ్ఞానాన్ని, విచక్షణను గ్రహించవచ్చు. ప్రతీ ఇంట్లో తప్పని సరిగా ఉండవలసిన పుస్తకం ఇది.

free_PanchatantramKathaluపంచతంత్రం

అనుసృజన: ఎ.ఎన్. జగన్నాథశర్మ

ప్రచురణ: అమరావతి పబ్లికేషన్స్

వెల: రూ. 160/-

ప్రతులకు: www.kinige.com

మహాభారతం

భారతీయ ప్రాచీన వాఙ్మయంలో మహాభారతం ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది. సర్వవేద విజ్ఞానాన్ని తనలో ఇముడ్చుకుని సామాన్య ప్రజానీకానికా వేద విజ్ఞానాన్ని అత్యంత సులభంగా, సరళంగా అందిస్తుంది భారతం. అందుకే సంస్కృతంలో ఉన్న భారతాన్ని, దేశంలో ధార్మిక భావనలు అభివృద్ధి చేసి, ప్రజలకు ధర్మం పట్ల విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నప్పుడు, దేశంలో నలుమూలలా స్వచ్ఛందంగా ప్రాంతీయ భాషలలోకి అనువదించారు. ఫలితంగా సాంస్కృతిక, ధార్మిక పునరుజ్జీవనం సాధ్యమయింది. అందుకే ఏ తరానికాతరం భారత రామాయణాలను అనువదిస్తూ, తమ తర్వాతి తరానికి తగ్గట్టు రచిస్తూ భారతీయ సంస్కృతి ఒక జీవనదిలా ప్రవహించటంలో తమ వంతు తోడ్పడుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ప్రతీ తరానికీ కొత్తగా వినిపించాల్సిన మహాభారత గాథను ఆధునిక సాంకేతిక యుగంలోని తరానికి తగ్గట్టు అతి సరళంగా, సులభ గ్రాహ్యంగా అందించాల్సిన ఆవశ్యకతను ఈ పుస్తకం పూర్తి చేస్తుంది. 18 పర్వాల భారతంలో ఆది, సభా, అరణ్య పర్వాలు కలిసి ఉన్న పుస్తకం ఇది. జగన్నాథశర్మ గారిది ఆసక్తికరంగా కథను చెప్పటంలో అందెవేసిన చెయ్యి. దాంతో తెలిసిన భారత కథే అయినా అత్యంత ఆసక్తిగా సాగుతుంది. పైగా, ఎలాంటి వర్ణనలు, ఉపోద్ఘాతాలు లేకుండా సూటిగా కథలోకి దిగటంతో మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం వరకూ అతి వేగంగా చదువుతాడు పాఠకుడు. పుస్తకం పూర్తయ్యేవరకూ ఏకబిగిన చదవటమే కాదు, మిగతా భాగాలనూ వెంటనే చదవాలనిపిస్తుంది. భాష వీలయినంత సరళంగా ఉండటంతో అన్ని వయసుల వారికీ సులభంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కొని ఇంట్లో ఉంచుకోవాల్సిన సులభ రిఫరెన్స్ పుస్తకం లాంటిదీ పుస్తకం.

మహాభారతంfree_Mahaabharatam

రచన: ఎ.ఎన్. జగన్నాథశర్మ

ప్రచురణ: పాలపిట్ట బుక్స్

వెల: రూ. 100/-

ప్రతులకు: www.kinige.com

Download PDF ePub MOBI

Posted in 2014, పుస్తక సమీక్ష, ఫిబ్రవరి and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.