softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [7]

Download PDF ePub MOBI

దీని ముందు భాగం

సోమవారం ఉదయం , ఏ ఒక్కళ్ళకి నచ్చని సమయం. రవి వారం తరువాత రోజు, బహుశా ఆ రవికి కూడా సోమవారం ఉదయం అంటే చికాకు కాబోలు. ఆ సంగతి అవునో కాదో తెలియదు కానీ సాఫ్టోళ్ళకి మాత్రం అది ముమ్మాటికి నచ్చని సమయం. ఉదయాన్నే ఊరి నుంచి బస్సు దిగిన అజయ్, కార్యాలయానికి చేరుకున్నాడు. కొండంత పనిని, కొండమీద కోతి లాంటి మేనేజర్ ని తలచుకొని మొదటిసారి బాధపడ్డాడు(ఆ రోజుకి). పలహారం తినటానికి సమాయత్తం అయ్యాడు.

“వీకెండ్ ఎలా జరిగింది అజయ్ ?” అని అడిగాడు డాలర్ బాబు. “ఊరికి వెళ్లి ఇందాకే వచ్చాను. నీ వీకెండ్ ఎలా జరిగింది ఆ నాలుగు ఇంగులు కాకుండా?” అని అజయ్ అడగటంతో డాలర్ బాబు నవ్వాడు. సాధారణంగా పెళ్లి కాని టెక్కీలు వీకెండులో నాలుగు ఇంగులు చేస్తుంటారు. మొదటిది అన్నింటికంటే సుఖమైనది స్లీపింగ్. వారం రోజులు, రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తే వారాంతాలు పద్దెనిమిది గంటలు నిద్ర పోతుంటారు.

ఇక రెండోది చాటింగ్. ముఖ పుస్తకం వచ్చి జనాలు ముఖాలు చూసుకోవటం మర్చిపోయాక, వారాంతాలు ఎక్కువగా చేసేపని స్నేహితులతో కలిసి చాటింగ్ చేయటం సాధారణమైన విషయం. ఇక మూడో ‘ఇంగు’ షాపింగ్. జీవితంలో వాకింగ్ చేయకపోతే ఆరోగ్యం పాడవుతుందో లేదో తెలియదు కానీ ,వీళ్ళు నెలలో ఒక్కసారైనా షాపింగ్ చేయకపోతే, కార్డు గీకకపోతే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యం దెబ్బతింటుందనటంలో సందేహం లేదు. శాస్త్రం లో ఏమి చెప్పారంటే జాగృతి ,స్వప్న ,సుసుప్తి అనే మూడింటిని దాటితే తురీయం లోకి వెళ్తారట ! అలానే పైన చెప్పిన మూడు ఇంగులు అయిపోతే ,ఇక తురీయం అనే నాలుగో ఇంగ్ లోకి వెళ్తారు. అదే నత్తింగ్. స్లీపింగ్ ,చాటింగ్ ,షాపింగ్ మూడు కుదరకపోతే ,ఖాళీ గా కూర్చొని చేసేదేమీ లేక మిగిలేది నత్తింగ్.

అజయ్,డాలర్ బాబు కలిసి తినటానికి ఆఫీసులోకి మరో అంతస్తు లో ఉన్న క్యాపెటేరియాకు వెళ్లారు. ఇడ్లీ కి డబ్బులు కట్టి ,అవి తెసుకోవటానికి వెళ్లారు. “గుంటూరు ఇడ్లీ” అని రాసి ఉండటం చూసి ఇద్దరూ ఆనందించారు. మంచి టిఫిన్ దొరుకుతుందని. తీరా ఇడ్లీలు గట్టిగా, గడ్డల్లా ఉండటం చూసి డాలర్ బాబుకి మండి పోయింది. అక్కడి పని చేసే అతన్ని పిలిచి “ఏంటివి?” అని అడిగాడు. “గుంటూరు ఇడ్లీ సార్!” అన్నాడు నవ్వుతూ. “నేను పాతికేళ్ళు గుంటూరులో ఉన్నాను. ఇవి గుంటూరు ఇడ్లీ కాదు.అస్సలు వీటిని గుంటూరులోనే కాదు, అమెరికాలో కూడా ఇడ్లీలు అనరు. ఇడ్లీలైనా మార్చు, పేరైనా మార్చు” అని వెళ్లి, తిట్టుకుంటూ తిన్నారు. “మానేజర్ రాజా ఏమన్నాడు. నేను లేని రెండు రోజులు కొత్తగా ఏమైనా జరిగాయా?” అడిగాడు అజయ్ డాలర్ బాబుని. “బాబుకు పాపల్ని పట్టించుకోవటానికే సమయము సరిపోవటం లేదు. ఇంకా మిగతావేమి పట్టించుకుంటాడు? అందునా గీత రెండు వారాలు రాదనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు” అన్నాడు డాలర్ బాబు. “బాగా అల్లపు పచ్చడి తినమను, అదే జీర్ణం అవుతుంది” అన్నాడు అజయ్.

తిని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి పోయారు. వారాంతం వచ్చేదాక అలా మునిగే ఉన్నారు. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ ,అజయ్ నిషా వారాంతాలలో తిరిగే ప్రదేశాల్లో ముఖ్యమైనది. ప్రతిసారి సరదాగా సాగే వీళ్ళ వారాంతం, ఈ సారి మాత్రం ఒక సమస్యతో సాగింది. “నాన్న పెళ్లి సంబందాలు చూస్తున్నారురా” అన్నది నిషా నీరసంతో. “మన సంగతి చెప్పావా?” అడిగాడు అజయ్. “చెప్పాను” అని తల ఊపింది. ముందు అరిచారు, తరువాత విన్నారు, చివరగా నిన్ను రమ్మన్నారు” అన్నది. “అయితే ఎప్పుడు వెళ్ళమంటావు?” అని అడిగాడు అజయ్. తీవ్ర తర్జన భర్జనల తరువాత పంచాంగంతో పని లేకుండా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. “నేను వచ్చే వారం ఎలాగూ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు కూడా అప్పుడు వచ్చి మాట్లాడితే, నేను కూడా ఇంట్లో ఉంటా కదా!” అన్నది . సరే అనుకుని అక్కడనుంచి సర్దుకున్నారు.

అజయ్ ఆ వారమంతా నిషా వాళ్ళ నాన్న ఏమంటాడో, ఎలా ఒప్పించాలో అని తెగ ఆలోచించాడు. ఆరోజు రానే వచ్చింది. అజయ్ తన స్నేహితుడు డాలర్ బాబును వెంటబెట్టుకుని నిషా వాళ్ళ ఊరు బయలుదేరాడు. తను బయలుదేరిన సంగతి అప్పటికే, ఊరు చేరిన నిషాకి చెప్పాడు. అజయ్ లో ఉత్కంఠ ఎక్కువైపోయింది. బస్సు ఎక్కిన కాసేపటికి సెల్ ఫోనులో పాటలు పెట్టి, సీటులో వెనుకను వాలి కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. చెట్లతో ,పుట్లతో పాటు కాలం కూడా వెనక్కు వెళ్ళింది. అజయ్ తన ప్రేమ పుస్తకంలోని పేజీలన్నింటిని తిప్పుతూ కూర్చున్నాడు. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు.

నిద్రకు మూడు ఉపాయాలు, ఒకటి పాటలు వినటం, రెండు పుస్తకంలో పేజీలు తిప్పటం, మూడు పంతులుగారు పాఠం చెప్పటం. వారం రోజులనుండి సరిగ్గా నిద్రపోకపోవటంతో, గాడనిద్ర లోకి వెళ్ళిపోయాడు. మూడు గంటల తర్వాత బస్సు ఆపటంతో, మెళకువ తెచ్చుకున్నాడు. “భలే నిద్ర పట్టేసింది రా!” అని ఒళ్ళు విరిచాడు డాలర్ బాబు. “ఏంటి సార్ బస్సు ఇక్కడ ఆపారు?” అని అడిగాడు డాలర్ బాబు, డ్రైవరుని. “ఇంజిన్ బాగా వేడెక్కింది, నీళ్ళు పోయటానికి ఆపాము” అనటంతో డాలర్ బాబు అవాక్కయ్యాడు. “ఈ కాలంలో కూడా ఇలాంటి బస్సులు వాడుతున్నారు, అదే అమెరికాలో” అని అంటుండగా, అజయ్ అసహనంగా చూడటంతో అక్కడితో ఆ మాటను ఆపేశాడు. “మీ మామ దయవల్ల ఈ బస్సు లాగే నీ ప్రేమ కూడా మంచి వేడి మీద ఆగింది.నువ్వు నీళ్ళు చల్లగలిగితే మళ్ళీ ప్రయాణం సాగుతుంది” అన్నాడు డాలర్ బాబు. అవునన్నట్టు తల ఊపాడు అజయ్.

Posted in 2014, ఫిబ్రవరి, సాఫ్ట్‌వేర్ ఇతిహాస్యం, సీరియల్ and tagged , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.