ఈరేయి గాలి సడిచేయకుండా నిదురించింది
మహాశూన్యంలో ఊదారంగు వలయాలమధ్య
నక్షత్రాలే లేని ఆకాశంలో ఏకాకిగా వెలిగాడు చంద్రుడు
కడలి అలలు కూడా కలల వొడిలో ఆదమరచి నిదురించాయి
అడవిలో వృక్షాలన్నీ నేలపై వాలి నిదురించాయి
నిదురరాని వెన్నెల ఒక్కటే నింగినీ నేలను గుండెలకు హత్తుకుంది
తూర్పుపవనపు చిటికిన వేలును పట్టుకుని
వెన్నెలకు తోడుగా నేనూ మేల్కొనేవున్నాను
కౌగలించుకొని నుదుటిపై ముద్దుపెట్టుకొనేందుకు
ఆకాశంకేసి చేతులు చాచి నా చందమామను ప్రేమగా పిలుస్తాను
దిగులు దిగులుగా మెల్లిగా వెన్నెల నన్ను కూడా కమ్ముకుంటుంది
నా చెక్కిలిపై జారిన కన్నీట మెరిసిన చందమామ
పెదవి చివర అట్లా నిలిచిపోయాడు
అందుకేనేమో ప్రేమగా ముద్దు పెట్టుకున్నప్పుడల్లా
ఉప్పనైన చల్లటి ముద్దు మాత్రమే పెదవులపై తొణుకుతుంది
తీరని తపన లోనుండి తొలుస్తుంది దివారాత్రులు
మనుష్యులకి ఎందుకింత వేదన
ఎందుకింత ఎడతెగని దుఃఖం
ఎందుకింత వీడని మోహం
లోకానికెందుకీ నిద్రపట్టని దిగులు చీకట్ల అశాంతి రాత్రి
ఉందింకా మనకో చందమామ
ఉందింకా మసక వెన్నెల కాంతి
నేలను ఆవరించే గాలి మేఘాల ఊరేగింపు
నెమ్మదిగా ఎలాగోలా బయలుదేరుతుంది
సముద్రమూ, వృక్షాలు దిగ్గున లేచే సుడిగాలి
ఎటునించో అటునుంచి తప్పక వీస్తుంది
అలలు కేరింతలు కొడుతూ తీరం వెంట పరుగిడతాయి
పరిగకూడా ఏరేసిన జొన్నచేను మంచెపై నిలబడి
ఆకాశంలోకి చూస్తే నా ఒంటరి చందమామ
మంచుపూల వెన్నెల వానలో తడుస్తూ
నాకేసి చూసి ముసిముసిగా నవ్వుతుంది
– విమల
(Image Courtesy: http://www.flickr.com/photos/darad/3887252196/)