punnami rat copy

పున్నమిరాత్రి

Download PDF ePub MOBI

రాత్రి పది గంట లవుతుంది.

వెన్నెల మడుగులో నిశ్శబ్దంగా జలకాలాడుతోంది.

పాడుబడ్డ ఓరుగల్లు కోటకు వెళ్ళే మార్గంలో… పచ్చిక బయలు పైన పడుకుని ఆకాశంలోకి వీక్షిస్తూ… ఫక్కుమంటూన్న పూర్ణ చంద్రుని నవ్వుల జిలుగులలో తడసి ముద్దవుతోంది ఓ యువ జంట.

వారు అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు, చేరువలో ఎవరివో అడుగుల చప్పుడు వినిపించడంతో లేవబోయాడు ఆ యువకుడు.

అప్పుడేనా, రాజా!” అంటూ అతని ఛాతీ పైన తల పెట్టుకుని పడుకున్న యువతి అతన్ని లేవనీయకుండా ఆపబోయింది.

“ఎవరో వస్తున్నట్లున్నారు, రాణీ! చూద్దాం పద” అంటూ పైకి లేచి, ఆమెకు చేయి అందించి పైకి లేపా డతను.

చేతులు పెనవేసుకుని రోడ్ వైపు నడచారు ఇద్దరూ.

చెట్టాపట్టాలు వేసుకుని అటే వస్తూన్న మరో యువ జంట వారి కంటపడింది.

వారికి ఎదురు వెళ్ళా డతను. ఆమె అనుసరించింది.

“హాయ్!” అంటూ ఆగంతకులను పలుకరించాడు. “మీరు టూరిస్టులా?” అనడిగాడు.

ఔనన్నట్లు తల ఊపారు వాళ్ళు… ఆ యువకుడికి ఇరవయ్యేళ్ళుంటాయి. మీడియం హైటూ, చామనచాయ రంగూను… తెల్లగా, పొడవుగా, స్లిమ్‌గా ఉన్న ఆ యువతి వయసు పద్డెనిమిదికి మించదు… వారి రూపాలు, వస్త్రధారణ – సంపన్నుల్లా ఉన్నారు.

“మై నేమ్ ఈజ్ రాజా. టూరిస్ట్ గైడ్ ని,” తనను తాను పరిచయం చేసుకున్నాడు రాజా. “షి – మై గర్ల్ ఫ్రెండ్. ఝాన్సీరాణి”.

వెన్నెలలో వాహ్యాళికి బయలుదేరినట్లు చెప్పారు వారు. రాజా అడిగిన ప్రశ్నకు, తామింకా ఓరుగల్లు ఫోర్ట్ ను చూళ్ళేదని చెప్పారు.

“తాజ్ మహల్ ను అందరూ చూస్తారు. కాని, దాని అందాలను వెన్నెలలో చూసినప్పుడే జన్మ తరిస్తుంది. అలాగే ఓరుగల్లు కోట, రామప్ప దేవాలయం, శివలింగం, వేయి స్థంభాల మంటపం…ఇవన్నీ పగటి పూట కంటె, పున్నమి రాత్రి చూస్తే పరవశులమైపోతాం” అన్నాడు రాజా.

ఆ జంట ముఖాలు చూసుకుంది.

“మీరు వస్తానంటే, ఇప్పుడే మిమ్మల్ని అక్కడకు తీసుకువెళ్ళగలను నేను. వెన్నెల్లో కనువిందు చేసే ఆ శిల్పకుడ్యాలన్నిటినీ చూపించి వాటి చరిత్రను వివరిస్తాను… నా ఫీజు ఎక్కువేమీ కాదు. జస్ట్ థౌజండ్ రుపీస్. వేయి రూపాయలే” అన్నాడు రాజా, వారి ముఖ కవళికలను గమనిస్తూ.

మళ్ళీ ముఖాలు చూసుకుంది ఆ జంట.

అది గమనించి, “ఐ నో. ఇప్పుడు మనీ మీ దగ్గర లేదనేగా మీ సంశయం?” నవ్వాడు రాజా. “డోంట్ వర్రీ. తిరిగి వచ్చాక మీ హోటల్ రూమ్‌‍కి వచ్చి తీసుకుంటాను”.

వారు మాటాడకపోయేసరికి, మౌనం అర్థాంగీకారంగా తీసుకుని హుషారుగా ఈల వేసాడు రాజా.

“ఎంత వెన్నెలైతే మాత్రం, వాహనమేదీ లేకుండా ఇప్పుడంత దూరం ఎలా వెళతాం, రాజా?” మెల్లగా అంది అతని గర్ల్ ఫ్రెండ్.

“అలా రోడ్ పైకి వెళ్తే టాక్సీ ఏదైనా కనిపిస్తుందేమో చూస్తాను,” అన్నాడు.

ఆ జంటతో, “జస్ట్ ఎ మినిట్ సార్! ఐల్ గెట్ టాక్సీ,” అంటూ, రాణిని అక్కడే ఉండమని చెప్పి వెళ్ళాడు.

నాలుగు అడుగులు వేసాడో లేదో, కారు ఒకటి ఎదురు వచ్చింది అతనికి. దానికి అడ్డుగా వెళ్ళి ఆపాడు.

లోపల డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. నల్లగా, ఎత్తుగా, దృఢంగా ఉన్నాడు. ముఖం వికృతంగా, చూపులు కోరగా ఉన్నాయి… కారు చూస్తే ఇక్ష్వాకుల కాలం నాటిదిలా ఉంది.

అతని రూపం చూసి కించిత్తు జడుసుకున్నా, అతనితో మాట్లాడి బేరం కుదుర్చుకున్నాడు రాజా. టూరిస్ట్ జంట వెనుక సీటులో కూర్చుంటే, రాజా రాణీలు ముందు సీట్లో డ్రైవర్ పక్కను కూర్చున్నారు.

ప్రస్తుత వరంగల్‌గా రూపొందిన ఓరుగల్లు యొక్క చారిత్రాత్మక ప్రాశస్త్యం… శతాబ్దాల వాతావరణ కాలుష్యానికీ, పాలకుల నిర్లక్ష్యానికీ గురైన ఆ బృహత్ కట్టడాలు పాడుబడడం… చెక్కుచెదరని రమణీయతతో విలసిల్లే ఆ శిల్పకళా చాతుర్యం.. వీటి గురించి దారి పొడవునా వివరిస్తూనే ఉన్నాడు రాజా.

“అసలు దానికి ఓరుగల్లు అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా? తమిళంలో ‘ఒరు కల్లు’ అంటే ‘ఒక రాయి’ అని అర్థం. ఒంటి రాతితో నిర్మింపబడిన కట్టడం కనుక ‘ఒరు కలు’ అని పిలిచేవారు దాన్ని. కాల క్రమాన అది ‘ఓరుగల్లు’గా పరిణామం చెందింది” చెప్పాడు.

తన ప్రియుడి వాగ్ధాటికి లోలోపలే మురిసిపోతోంది రాణి.

అంతవరకు మౌనంగా డ్రైవ్ చేస్తూన్న డ్రైవర్ హఠాత్తుగా అన్నాడు, “కోటకు ఐదు క్రోశుల దూరంలో పాడుబడ్డ జమీందారు భవంతి కూడా ఉంది”

రాజు, రాణి చిన్నగా ఉలికిపడ్డారు. డ్రైవర్ వంక అనుమానంగా చూసాడు రాజా.

“నిన్ను ఈ ప్రాంతాలలో ఎప్పుడూ చూసినట్టు లేదు. ఈ వేళప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుండి ఊడిపడ్డావ్?” అనడిగాడు.

డ్రైవర్ నవ్వే సమాధానం చేసాడు.

కారులో కాసేపు మౌనం ఆక్రమించుకుంది.

ఒకప్పటి ఓరుగల్లు కోట ప్రాంతానికి చేరుకునేంతవరకు ఎవరూ మాట్లాడ లేదు.

కారు దిగారు అంతా.

Posted in 2014, కథ, ఫిబ్రవరి and tagged , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.