punnami rat copy

పున్నమిరాత్రి

ఒకప్పుడు అత్యంత ప్రాభవంతో వెలుగొందిన కాకతీయ రాజుల సంస్కృతికి చిహ్నంగా కేవలం శిథిల కుడ్యాలు, ముఖద్వారాలు, ఆర్చ్‌లూ స్వాగతం పలికాయి. కాలక్రమంలో జీర్ణించుకుపోయిన రామప్ప దేవాలయం దర్శన మిచ్చింది. శివలింగం, మంటప ప్రాంగణం, వేయి స్థంభాల మంటపం వగైరాలు అలనాటి ప్రాశస్థ్యాన్ని చాటుతుంటే… వెన్నెలలో తడిసి ముద్దవుతూన్న ఆ కట్టడాల రమణీయత, నాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యం చూపరులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఆ యువతీ యువకులు ఆ కుడ్యాల మధ్య తిరుగాడుతూంటే, “ఆలకించే ఆసక్తి ఉండాలే కాని, ఈ శిథిలాలు కథలు చెబుతాయి. శిల్పాలు చతుర్లు పలుకుతాయి,” అంటూ ఒక్కో కట్టడం గురించీ వివరిస్తూ, వాటి వెనుకనున్న చరిత్రను చెప్పసాగాడు రాజా.

గుడి శిథిలాల లోపల, ఇతర హర్మ్యాల నడుమ త్రవ్వబడ్డ గోతులను చూపిస్తూ, “ఇవి ప్రజల అత్యాశకు, ప్రభుత్వం యొక్క అలక్ష్యానికీ ప్రత్యక్ష చిహ్నాలు. కాకతీయ ప్రభువులు తమ నిధి నిక్షేపాలను భూమిలో దాచిపెట్టియుంటారన్న అపోహతో ఈ శిథిలాలను శకలాలు చేయడానికి పూనుకున్నారు కొందరు దుండగులు” అన్నాడు.

punnami rat copyడ్రైవర్ వేయి స్థంభాల మంటపం మీద కూర్చుని మౌనంగా ఎటో చూస్తున్నాడు.

కాసేపటి తరువాత మళ్ళీ కారులో కూర్చున్నారంతా.

“వెనక్కి పోనీ” అన్నాడు రాజా.

“మరి జమీందారు గారి భవంతో?” అన్నాడు డ్రైవర్ అదోలా నవ్వుతూ.

“పాడుబడ్డ భవనం. అక్కడ చూడ్డానికేముంది?’ అన్నాడు రాజా అయిష్టంగా.

“చాలా ఉంది. పూర్వం మహారాజు తన రాణులలో ఒకరి కోసం కట్టించిన భవంతి అది. తరువాత అది జమీందారుల నివాస మయింది. చూసితీరవలసిందే” అన్నాడు డ్రైవర్.

రాజా ఏదో అనబోతే, “అక్కడికే పోనియ్” అన్నాడు వెనుక సీటు లోని యువకుడు.

కారు స్టార్ట్ చేస్తూ, “ఆ భవంతికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది,” అన్నాడు డ్రైవర్.

“ఇప్పుడదంతా వీళ్ళకు చెప్పడం అవసరమా?” అన్నాడు రాజు షార్ప్ గా.

“పరవాలేదు, చెప్పనీ” అని వెనుక నుంచి ఆ యువకుడు మెల్లగా అనడంతో, చెప్పుకుపోయాడు డ్రైవర్ -

కాకతీయ రాజ వంశీయుల అనంతరం ఎవరెవరికో ఆ భవంతి ఆవాసమయింది. చివరగా రవీంద్ర రెడ్డి అనే ఓ జమీందారు నివసించేవాడు అందులో. కొడుకు, కోడలు, మనవరాలితో ఉండేవాడు అతను. ఎప్పుడూ పలువురు నౌఖర్లు చాకర్లతో కళకళలాడుతూండేది ఆ భవంతి… రవీంద్ర రెడ్డి మనవరాలు జగదకు పద్డెనిమిదేళ్ళు. విశ్వం అనే ఓ సామాన్య టూరిస్ట్ గైడ్ ను ప్రేమించింది ఆమె…’

చురుగ్గా చూసాడు రాజు, డ్రైవర్ వంక.

అదేమీ గమనించనట్టు చెప్పుకుపోయాడు అతను -

‘వారి ప్రేమ పెద్దలకు ఆమోదయోగ్యం కాలేదు. విశ్వాన్ని మరచిపొమ్మని జగదను హెచ్చరించారు. వినిపించుకోలే దామె. విశ్వంతో వివాహం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది… దాంతో స్ట్రాటెజీని మార్చిన రవీంద్ర రెడ్డి, వారి ప్రేమను అంగీకరిస్తున్నట్టు నటించాడు. త్వరలోనే వారి వివాహం జరిపిస్తానంటూ మనవరాలిని నమ్మించి, విశ్వాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు… నెల్లాళ్ళ తరువాత ఓ రోజున వారిని రామప్ప గుడికి వెళ్ళి రమ్మని చెప్పి కారులో పంపించాడు…

పెద్దాయన ఆదేశాల మేరకు త్రోవలో కారును కొండకు గ్రుద్దించి, తాను బయటకు ఉరికేసాడు డ్రైవర్. ఆ యువ జంట అక్కడి కక్కడే మరణించింది. ఐతే డ్రైవర్ కూడా బ్రతకలేదు. బైటకు ఉరికినప్పుడు తల ఓ బండరాతికి తగలడంతో అతనూ చనిపోయాడు… జమీందారు కుటుంబానికి చెందిన ఆడపిల్ల ఓ సామాన్యుడితో ప్రేమలో పడడం సహించలేక, పరువు కోసం వారిని చంపించాడు రవీంద్ర రెడ్డి…’

ఆగాడు డ్రైవర్. ఓ క్షణం వారి నడుమ నిశ్శబ్దం అలముకుంది.

మళ్ళీ చెప్పాడు అతను -

‘ఆ తరువాత ఆర్నెల్లు తిరగకుండానే రవీంద్ర రెడ్డి కొడుకు, కోడలు ఏదో వింత జబ్బుతో మరణించడం జరిగింది. అందుకు బలవంతపు చావుకు గురైన ఆ యువ జంట ఆత్మలే కారణమని జ్యోతిష్కుడు చెప్పడంతో, బ్రతికుండగా వారు కలసి తీయించుకున్న ఫోటోను పెద్దగా చేసి పటం కట్టించి హాల్లో ఆవిష్కరించాడు జమీందారు. ఆ విధంగా కొంతైనా ఉపశమనం కలుగుతుందన్న ఆలోచనతో. కాని మరో ఆర్నెల్లకు అదే వ్యాధితో అతనూ కాలం చేసాడు…అనంతరం ఆ భవంతిలో అడుగు పెట్టాడాని కెవరూ సాహసించలేదు. అప్పటి నుండీ అది అలాగే ఉండి పాడుబడిపోయింది… అదంతా జరిగి ముప్పయ్యేళ్ళయిపోయింది…’

ఎవరూ నోరు మెదపలేదు.

“అంతేకాదు, ఆ డ్రైవర్ దయ్యమై, అదే కారును నడుపుతూ అప్పుడప్పుడు ఈ ప్రాంతాలలో కనిపిస్తూంటాడని చెబుతూంటారు” అన్నాడు అతను. “లేత ఎరుపు రంగు అంబాసడర్ కారు అది”.

ఉలికిపాటును కప్పిపుచ్చుకున్నాడు రాజా. ప్రస్థుతం వారు ప్రయాణిస్తూన్నది లేత ఎరుపు రంగు అంబాసడర్!

డ్రైవర్ వంక కోపంగా చూసాడు. “ఇలాంటి కథలు చెప్పి వాళ్ళను బెదరగొట్టి, నా బేరం చెడగొట్టకురా మగడా! అసలే ఈ మధ్య తెలంగాణా సమస్య మూలంగా టూరిస్ట్ ట్రాఫిక్ పడిపోయింది,” అన్నాడు. “కారు వెనక్కి త్రిప్పు, వెళ్ళిపోదాం”.

అతని పలుకులు చెవిలో పడ్డట్టున్నాయి, “ముందుకే పోనీ” అన్నాడు వెనుక సీట్లోని యువకుడు.

చిన్నగా నుదురు బాదుకున్నాడు రాజా.

కొద్ది క్షణాలు ఆగి, మళ్ళీ అన్నాడు డ్రైవర్ – “ఇంకో విషయం తెలుసా? ప్రతి పున్నమి నాడూ విశ్వం, జగదల ఆత్మలు మానవ రూపాలు ధరించి పచ్చిక బయళ్ళ పైన దొర్లుతూ, వెన్నెలలో చెట్టాపట్టాలు వేసుకుని ఈ ప్రాంతాలలో తిరుగుతూంటాయట!”

అప్రయత్నంగా రాజా కళ్ళ లోకి చూసింది రాణి. విరిసీ విరియని చిరునవ్వు లీలగా వెలసింది అతని పెదవుల మీద.

వెనుక కూర్చున్న జంటలో కదలిక వచ్చింది. ఆ యువతి యువకుడి పైకి జరిగి అతని చేతిని గట్టిగా పట్టుకుంది, ఆమె భుజం చుట్టూ చేయి వేసాడు అతను.

అంతలోనే, “అదిగో, భవంతి!” అన్నాడు డ్రైవర్.

దూరంలో – వెన్నెల్లో ఒంటరి చెట్టులా నిలచియున్న పాడుబడ్డ భవంతి యొకటి దర్శనమిచ్చింది.

కారు భవనాన్ని సమీపించగానే, “చూసాంగా, ఇక వెనక్కి పోదాం” అన్నాడు రాజు, కారు లోంచి దిగకుండానే.

“లోపలికి వెళ్ళకుండానా?” అన్నాడు డ్రైవర్.

కారు లోంచి దిగింది వెనుక కూర్చున్న జంట.

“లోపల చీకటిగా ఉంటుంది” అన్నాడు రాజా.

“నా దగ్గర లాంప్ ఉంది” అంటూ, మూడు ట్యూబ్స్ తో కూడిన ఎమెర్జెన్సీ లాంప్ ను బైటకు తీసాడు డ్రైవర్.

అతను లైట్ చూపుతూంటే ముందుకు నడచారంతా.

భవంతికి పెద్ద తాళం కప్ప ఉంది.

“అటుపక్క కిటికీ ఉండాలి. చూద్దాం పదండి” అన్నాడు డ్రైవర్.

అటువైపు వెళ్ళారంతా.

పెద్ద కిటికీ అది. తలుపు దగ్గరకు మూసియుందే తప్ప లోపల గెడ పెట్టబడ లేదు. తెరుస్తూంటే వింత శబ్దం చేసింది.

ఆ కిటికీ గుండా జాగ్రత్తగా లోపల ప్రవేశించారు. వారి వెనుకే మళ్ళీ కిటికీ తలుపు మూసేసాడు డ్రైవర్.

లోపల అడుగు పెట్టగానే దుర్గంధం గుప్పుమంది… ఎమెర్జెన్సీ లాంప్ వెలుతురులో పరిశీలనగా చూసారంతా.

విశాలమైన హాలు, కొన్ని గదులూను… దుమ్ము కొట్టుకుపోయిన ఖరీదైన ఫర్నిచర్… గోడలకు బూజులతో కప్పబడియున్న తైల వర్ణ చిత్రాలు, ఫోటోలు… మేడ పైకి మెట్లున్నాయి… గబ్బిలాలు హఠాత్తుగా వెలుతురు కనిపించడంతో గడబిడగా ఎగురుతున్నాయి.

గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గదులు – కిచెన్, డైనింగ్, గెస్ట్ రూమ్స్ – దర్శించారు. అనంతరం మేడ పైకి వెళ్ళడానికని మెట్ల వైపు దారి తీసారు.

డ్రైవర్ నిల్చుండిపోయి, “ఆ ప్రేమ జంట ఫోటో ఇదే ననుకుంటాను. చూద్దాం ఉండండి”

అంటూ గోడ వద్దకు వెళ్ళాడు. గోడ పైన బూజులు అలముకున్న పెద్ద ఫోటోగ్రాఫ్ ఒకదానిని అందుకోబోయాడు. చేతికి అందలేదు అది. బరువుగా ఉన్న టీపాయ్ ఒకటి మోసుకువస్తూంటే, “అంత కష్టపడి దాన్ని చూడనవసరంలేదు కాని, వదిలెయ్” అన్నాడు రాజు.

డ్రైవర్ జవాబివ్వకుండా, గోడ దగ్గరగా టీపాయ్ వేసి, దాని పైకెక్కి, చేతులతో ఫోటో మీది బూజుల్ని తొలగించాడు.

ఈ సారి ఫోటో స్పష్టంగా కనిపిస్తోంది.

దాని వంక చూసిన రాజు, రాణి తృళ్ళిపడ్డారు.

అప్రయత్నంగా తమ పక్కకు చూసారు.

‘టూరిస్ట్’ జంట అక్కడ లేదు! అంతవరకు వారి పక్కనే నిల్చున్న ఆ యువ జంట అదృశ్యమైపోయింది…!

ఫోటో లోని వ్యక్తుల్ని చూసిన డ్రైవర్ కొయ్యబారిపోయాడు…

దబ్బుమన్న శబ్దానికి తేరుకుని తిరిగి చూసాడు.

రాజా, రాణీలు నేల పైన స్పృహ తప్పి పడున్నారు.

తమతో వచ్చిన యువ జంట జాడ లేదు…!

తాము ప్రవేశించిన కిటికీతో సహా మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి…!?

భయంతో ఉన్న చోటునే బిగుసుకుపొయా డతను…

— తిరుమలశ్రీ

93942 91998

Download PDF ePub MOBI

Posted in 2014, కథ, ఫిబ్రవరి and tagged , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.