MaaNaayanaBalaiahCover

చెరిగిన చరిత్ర జాడలపై కలం దిద్దిన ఒరవడి: “మా నాయన బాలయ్య”

Download PDF ePub MOBI

నామిని చదవమని గట్టిగా చెప్పటంతో ఈ పుస్తకం నా దృష్టిలో పడింది. హైదరాబాద్ బుక్ ట్రస్టు వాళ్లు వేసిన ఈ నాన్‌ఫిక్షన్ పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు నేల మీద జరిగిన కథని రచయిత ఇంగ్లీషులో “మై ఫాదర్ బాలయ్య” పేరుతో రాస్తే, అది మరలా తెలుగులో “మా నాయన బాలయ్య“గా అనువాదమై మన ముందుకు రావటం. నిజానికి ఇది తెలుగులో తప్ప ఇంకే భాషలో చదివినా అంతగా సార్థకం కాని రచన. దీనికి ఆదర్శ పాఠకులం మనమే.

వై.బి. సత్యనారాయణ అనే రిటైరయిన కాలేజీ ప్రిన్సిపల్ తన దళిత కుటుంబ చరిత్రని తన ముత్తాత దగ్గర్నుంచీ మొదలుపెట్టి చెప్పుకుంటూ వస్తారు. ముత్తాత నర్సయ్య, తాతయ్య నర్సయ్య, తర్వాత తండ్రి బాలయ్య, తర్వాత రచయిత (సత్తయ్య/ సత్యనారాయణ) ఇలా నాలుగు తరాల చరిత్ర ఈ పుస్తకంలో నిక్షిప్తం చేయబడింది. ఈ పుస్తకానికి కథానాయకుడు పుస్తకం పేరు చెప్తున్నట్టూగానే రచయిత తండ్రి యెలుకటి బాలయ్య.

ఈ నూట ఎనభై పేజీల పుస్తకం యెలుకటి కుటుంబ చరిత్రతో పాటు ఎన్నో అంశాలను స్పృశిస్తుంది. ఆనాటి వాతావరణంలో అస్పృశ్యత దళితుల్ని ముందడుగు వేయనీయకుండా కాళ్లకి ముళ్ళకంచెలా ఎంత బలంగా పట్టి ఉంచిందీ, బ్రిటిష్ పాలన వల్ల నిమ్న కులాలకు ఎలాంటి మంచి జరిగిందన్నదీ, ఒక వ్యక్తి తన జీవితంలో తీసుకున్న చిన్న నిర్ణయం తర్వాతి తరాలపై ఎంత పెద్ద ప్రభావంగా మారుతుందన్నదీ, ఒక ఉమ్మడి కుటుంబం నడవాల్సిన పద్ధతిలో నడవగలిగినపుడు అది తన బలహీనతల్నీ కప్పుకుంటూ బలాల వైపు ఎలా నడుస్తుందన్నదీ… ఇవన్నీ తెలుస్తాయి.

రచయిత వై.బి. సత్యనారాయణ తనకు ప్రత్యక్షంగా తెలియని ముందు తరాల కథని ఆ కథలో పాత్రల నుంచే తెలుసుకున్నారు. తన తాతయ్య, నాన్న, మేనత్త, అక్కలతో జరిపిన సుదీర్ఘ సంభాషణలే ఈ పుస్తకానికి ముడిసరుకని ముందు మాటలో చెప్పుకున్నారు. అసలు పుస్తకం ఎందుకు మొదలుపెట్టారన్న దానికి ఆయన చెప్పిన కారణం నాకు గౌరవప్రదమైందిగా అనిపించింది:—

“నా కుటుంబపు మూలాలను శ్రద్ధగా అధ్యయనం చెయ్యాలనుకున్నాను. బాలయ్య మనుమల, మనుమరాళ్ల బిడ్డలకు వారి కుటుంబ చరిత్ర తెలియాలి. వారి ముందు తరాలు అనుభవించిన కష్టాలు తెలియాలి. కొన్ని తరాల పాటు తమ పూర్వీకుల జీవితం ఎంత అమానవీయంగా గడిచిందో వారికి తెలియాలి. … మెరుగైన జీవితం కోసం చేసే అన్వేషణలో తమ మూలాలను మర్చిపోతున్న వారి కోసం కూడా ఇది వ్రాయాలనుకున్నాను. 2005 లో అమెరికాలో పుట్టిన నా మనుమరాలిని చూసినప్పుడు ఈ కోరిక మరింత బలపడింది. గులాబీ బుగ్గలతో వంకీల జుట్టుతో, గుండ్రని పెద్ద పెద్ద కళ్ళతో సమ్మోహనంగా ఉన్న ఈ పిల్ల పెద్దదైన తరువాత, భారతదేశానికీ ముఖ్యంగా దళిత సమాజానికీ పరాయిదైపోతుంది. అక్కడ అమెరికా దేశచరిత్ర, అక్కడి జాతివివక్ష, అక్కడ బానిసత్వ చరిత్ర చదువుతుంది. బానిసత్వం కన్నా కూడా అమానుషమైన అస్పృశ్యత గురించి చదివే అవకాశమేముంది తనకి?”

నిజమే, ఈ పుస్తకం చదివాకా అమెరికాలో జాతివివక్ష కన్నా ఇక్కడి అస్పృశ్యతే ఇంకా నీచమైందని అనిపించింది. కనీసం అక్కడ జాతివివక్ష వెనుక ఎలాంటి ధర్మాలూ సిద్ధాంతాలూ లేవు. మనకే అస్పృశ్యతకు దన్నుగా మనుసృతీ వర్ణాశ్రమ ధర్మాలున్నాయి. ఆ ధర్మాల రూపకల్పన వెనుక మంచి ఉద్దేశాలూ ఎన్నయినా ఉండొచ్చు గాక. ఏ ధర్మం విలువైనా తేలేది దాన్ని అన్వయించాకనే. గ్రంథాల్లో ఉన్నంతవరకూ ధర్మాలు వట్టి మాటల పేర్పు మాత్రమే. వాటిని మానవసమూహానికి అన్వయించాకనే మంచీచెడులు తేలతాయి. వర్ణాశ్రమ ధర్మం అంటున్నప్పుడు దాని సదుద్దేశాల కన్నా ముందు అది మన జాతిలో ఏర్పరిచిన అడ్డుగోడల్ని గురించీ, ఆ గోడల ఆవలే ఎన్నో తరాలు చరిత్రహీనంగా చీకటిలో కలిసిపోవటాన్ని గురించీ మాట్లాడాలి.

ఈ పుస్తకాన్ని రెండు సమాన భాగాలుగా విడదీశారు. మొదటి భాగం పేరు “నర్సయ్య లోకం”. నిజాం పాలనలోని వంగపల్లి అనే ఊళ్లో రచయిత ముత్తాత ఐన నర్సయ్యతో కథ మొదలవుతుంది. ఒకసారి నిజాం నవాబు ఆ గ్రామం మీంచి వెళ్తుంటే నర్సయ్య అతనికి దూడ చర్మంతో చేసిన మెత్తటి చెప్పులు కుట్టిస్తాడు. నవాబు సంతోషంతో కొంత పొలాన్ని ఇనాముగా ఇస్తాడు. ఈ నర్సయ్య కొడుకు పేరు కూడా నర్సయ్యే. తండ్రి నుంచి తనకు రావాల్సిన పొలం దొరల దాష్టీకం ఫలితంగా దూరమవుతుంది, మరో పక్క కలరా వల్ల భార్య చనిపోతుంది. ఆమె చనిపోయిన రోజే ఆమె శవాన్ని భుజాన వేసుకుని మూడేళ్ల కొడుకుని వెంటబెట్టుకుని ఊరు విడిచి వలసపోతాడు. మేనమామల ఊరు చేరి వాళ్ల సాయంతో అప్పటికి బ్రిటిష్ హయాంలో నడుస్తున్న రైల్వేలో ఒక చిరు ఉద్యోగంలో చేరతాడు. ఇక్కణ్ణించి తర్వాతి రెండు తరాల కథా ఆ రైల్వే క్వార్టర్సు నేపథ్యంగానే జరుగుతుంది. ఇన్నాళ్ళూ శూద్రుల కన్నా నీచంగా చూడబడిన కులానికి ఈ రైల్వే ప్రపంచంలో మాత్రం అస్పృశ్యత నుంచి పాక్షికంగానైనా విముక్తి లభిస్తుంది:—

“బ్రిటిష్ వారి కాలంలో కంటోన్మెంట్ ప్రాంతాలూ, రైల్వే కాలనీలూ అస్పృశ్యులకు సామాజికపరమైన ఆంక్షలు లేని ప్రదేశాలు… పని ప్రదేశాలలో హిందువులెవరైనా అస్పృశ్యత పాటించాలంటే కుదరదు. వ్యక్తిగత జీవనంలో తప్ప. ఉమ్మడి బావులలో నీళ్ళు తోడుకోవచ్చు. వూళ్ళలో వలె ఇక్కడ నిషేధాలు లేవు.”

కటువైన వర్ణాశ్రమ ధర్మానికి బీటలు వారటంలో బ్రిటిష్ పాలకుల పాత్ర కొంతా, పారిశ్రామిక విప్లవం పాత్ర కొంతా ఉందని అర్థమవుతుంది. ముందుమాటలో ఈ విషయాన్ని ఇలా చెప్తారు:—

“వలస ప్రభుత్వం తన ఆర్థిక ప్రయోజనాల కోసమే అయినప్పటికీ, చాలామంది దళితులకు వివిధ శాఖలలో ఉద్యోగాలిచ్చింది. ఆ ఉద్యోగాలు ప్రమాదభరితమైనవైనా, తక్కువ స్థాయివైనా వేలాదిమందికి ఉపాధి లభించింది. ముఖ్యంగా రైల్వేలో. దాని వలన వారికి క్రమబద్ధమైన వేతనం, ఊరుబయట వెలివేసినట్లుండే నివాసాల నుంచీ బయటపడి ఇతర శూద్రకులాల పొరుగున నివసించే అవకాశం లభించింది. ఇట్లా లబ్దిపొందిన ఎన్నో దళిత కుటుంబాలలో మాది కూడా ఒకటి.”

ఊరు వదిలి రావాలన్న నర్సయ్య నిర్ణయం వెనక ఇంత ఆలోచన లేదు. ఉన్న చోట గౌరవహీనంగా బతకలేక వేరే చోటకు వలస వచ్చేశాడంతే. కానీ నర్సయ్య తీసుకున్న ఈ చిన్న నిర్ణయం తర్వాతి తరాల జీవితాల్లో ఎంత పెద్ద మార్పును తీసుకొచ్చిందో చదువుతుంటే గమ్మత్తుగా అనిపించింది. మన జీవిత పరిధుల్లో మనం తీసుకునే నిర్ణయాలు ముందు తరాల్ని ఎంత విస్తారంగా ప్రభావితం చేస్తాయో అన్నది ఆలోచించకుండానే చాలా అలవోకగా నిర్ణయాలు తీసేసుకుంటాం. ఎవర్ని పెళ్లి చేసుకోదల్చుకున్నావు, ఎక్కడ ఉండదల్చుకున్నావు, ఏ ఉద్యోగం చేయదల్చుకున్నావు ఇవన్నీ పైకి చూస్తే నీకు సంబంధించిన వ్యక్తిగత నిర్ణయాలే. కానీ అవి భావి తరాల గమన దిశను మంచికో చెడుకో సమూలంగా మార్చేస్తాయి. ఈ మధ్య నాకో బిడ్డ పుట్టాకా ఆ సంగతి ఇంకా బాగా తెలుస్తోంది. నా విషయంలో చెడుకే అని అనిపిస్తోంది. నేను పల్లెటూళ్లలో గడిచిన నా బాల్యాన్ని ఎంతో అపురూపంగా తలుచుకుంటూ ఉంటాను. నేను అక్కడ కాకుండా ఇంకెక్కడైనా నగరంలో పెరిగి ఉంటే అన్న ఆలోచనే నాకు కిట్టదు. అలా నా బాల్యం అంతా సుఖంగా అనుభవించేసి ఇప్పుడు బతుకుతెరువుకు నగరానికొచ్చి బతుకుతున్నాను. కానీ ఈ నిర్ణయం వల్ల నా జీవితంలో అత్యంత విలువైందిగా ఎంచే ఒక అనుభవాన్ని నా బిడ్డకి దూరం చేస్తున్నాను. వాడి బాల్యం ఇక్కడ ఇరుకు వీధుల్లో ట్రాఫిక్ వాసనల్లో ఏమాత్రం నింపాదిలేని వాతావరణం మధ్య సాగాల్సిందే. మరి నేనే ఇలా అనుకుంటే, అమెరికాకో ఇంకో చోటకో ఉద్యోగార్థమై వలసపోయే వాళ్లేమనుకోవాలి? ఉందని వాడికే తెలియని ఒక వాతావరణం నుంచి నేను నా బిడ్డని దూరం చేస్తున్నాను. అంతేతప్ప దేశం కాని దేశంలో చర్మపు రంగు నుంచి మొదలయ్యే జీవితపర్యంత వివక్షకు, లేదా కనీసం ఎంతో కొంత వేర్పాటు చూపులకు వాణ్ణి గురి చేయటం లేదు; వాడి వెనక తరాలతో వాడికున్న సంబంధాన్ని పూర్తిగా తెంపేయటం లేదు; వాణ్ణి సాంస్కృతిక అనాథని చేయటం లేదు. అలా అనుకుని సమాధానపడాలేమో. వై.బి. సత్యనారాయణ గారు ఎంత ఈ పుస్తకం రాస్తే మాత్రం విదేశంలోని ఆ గులాబీ బుగ్గల మనుమరాలు తన ముందు తరాలతో కనెక్ట్ కాగలుగుతుందా? పూర్తిగా పరాయిదైన ఆ ప్రదేశంలో తన ముందు తరాల్ని ఊహామాత్రంగానైనా కల్పించుకోవటానికి ఆమెకు దొరికే రిఫరెన్స్ పాయింట్లేమున్నాయి. తెలుగు సినిమాలా? ఇంకా నయం!

“నర్సయ్య లోకం” అన్న మొదటి భాగంలో జరిగే కథంతా రచయిత సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో జరిపిన సంభాషణల నుంచి సేకరించింది. దీన్ని ఆసక్తికరం చేయాలంటే కొన్ని సందర్భాల్ని సన్నివేశాలుగా కల్పించక తప్పదు. రచయిత కథని ముందుకు నడిపే సందర్భాల్ని (పాత్రల జీవితాల్లో ముఖ్యమైన మలుపుల్ని: పెళ్లి చేసుకోవటం, ఉద్యోగాల్లో చేరటం వంటి వాటిని) సన్నివేశాలుగా మలిచారు. రచయితకు ప్రత్యక్షంగా తెలిసిన కాలం కాదు కాబట్టేమో, ఈ మొదటి భాగం చదవటం కాస్త నింపాదిగానే సాగింది.

రెండో భాగం “సత్తయ్య కథ” రచయితకు ఊహ తెలిసిందగ్గర్నించీ మొదలవుతుంది. ఇక్కణ్ణించీ కథ ఎంతో ఆసక్తికరంగా పుస్తకం పక్కన పెట్టనీయకుండా సాగుతుంది. తన కొడుకుల్ని రైల్వేలో పెద్ద ఉద్యోగులుగా చూడాలన్న ఒక్క కోరికతో బాలయ్య ఎన్నో కష్టాలకోర్చి వాళ్లను చదివిస్తాడు. బాలయ్య ఆరుగురు సంతానంతో పాటు, పెద్ద కొడుకు బాలరాజు సంతానం అంతా కలిసి ఒక చిన్న రైల్వే క్వార్టర్‌లో ముందు ఒక షెడ్డు వేసుకుని కుదురుకుంటారు.

ఉమ్మడి కుటుంబం అనే సంప్రదాయం అసలు ఎపుడైనా ఎలా మనగలిగిందో అంటూ ఆశ్చర్యపడే ఇప్పటి తరానికి, అది అలా మనగలిగేందుకు అప్పటి మనుషుల స్వభావాల్లో దోహదం చేసిందేమిటో ఈ పుస్తకం రెండో భాగం పరిచయం చేస్తుంది. బాలయ్య పెద్ద కొడుకుగా పుట్టిన కారణానికి చిన్న వయస్సులోనే బాధ్యతల బరువు మోయాల్సి వచ్చి చదువుకోలేకపోతాడు బాలరాజు. కుటుంబం నుంచి వేరేగా తనకు ఓ ఎదుగుదలని ఊహించుకోకుండా కుటుంబం ఎదుగుదలే తన ఎదుగుదలగా భావించి తమ్ముళ్లను చదివించటానికి కష్టపడతాడు. తమ్ముళ్ళందరూ చదువుకుని పెద్ద హోదాల్లోకి వెళ్తారు. కొన్నాళ్లకి స్టేషన్ మాస్టరు హోదా సంపాదించిన తమ్ముడు అబ్బసాయిలు కిందే పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది బాలరాజుకి. అన్నాదమ్ములు అహాన్ని వదిలి ఈ చిన్న ఇబ్బందికరమైన పరిస్థితిని అధిగమించిన సన్నివేశం హృద్యంగా ఉంటుంది:—

‘అదేంగాదన్నా! నీ పై ఆఫీసర్‌గా పనిజెయ్యలేను, నా వల్లగాదు’ అన్నాడు అబ్బసాయిలు.

‘అదే పట్టిచ్చుకోకు తమ్మీ! మనందరం పనిజేసేది రైల్వే వాళ్లకే! ఇంట్లో నాపై ఆఫీసర్‌వు గాదుగదా! నీకింద పనిజేయటం నాకు సంబురంగ ఉంటది’ అన్నాడు బాలరాజు.

అబ్బసాయిలుకి ఈ పరిస్థితి ఇబ్బందిగా వున్నా బాలరాజుకి మాత్రం తన తమ్ముడు తన పై అధికారిగా వచ్చినందుకు గర్వంగా వుంది. పాయింట్స్‌మన్‌గా బాలరాజు అబ్బసాయిలు కన్న అరగంట ముందు వెళ్ళాలి పనిదగ్గరకు. ఇంట్లో మాత్రం బాలరాజే అతనికన్న పెద్ద. అందరి మీద అజమాయిషీ అతనిదే. పనికి పోయేముందు అబ్బసాయిలు దిండు కింద ఒక అర్థణా పెట్టేవాడు బాలరాజు. అది అతను పని ప్రదేశంలో టీ తాగడానికి.

అయితే ఆధునిక యుగంలో అనివార్యమైన కల్మషమేదో చివరకు ఈ మనుషుల్నీ infiltrate చేసి ఈ కుటుంబాన్ని కూడా న్యూక్లియర్ కుటుంబాలుగా విడిపోయేట్టు చేస్తుంది. అలాంటి సందర్భాన్ని చెప్పాల్సి వచ్చినపుడు రచయిత అది తన కుటుంబం అన్న వానిటీతో దాన్ని ఆదర్శీకరించే ప్రయత్నం చేయలేదు. ఎన్నో త్యాగాలతో తమని చదివించిన తండ్రి కూడా చివరి దశలో తన అవసరం కోసం కొడుకుల్ని నెలనెలా ఇంతింత పంపమని అడుగుతూ, “నేను ఆస్తి పంచలేదు బిడ్డలూ! నా ఖర్చు పంచుతున్నాను” అని వాపోవాల్సి రావటంలోని విషాదాన్ని కూడా దాచకుండా చెప్పుకొస్తారు. ఈ సందర్భంలోనే కాదు, రచయిత ఎక్కడా తన అనుభవాల్ని చెలామణీలో ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా మలిచే ప్రయత్నం చేయలేదు. వాటి నుంచి సార్వజనీన సత్యాల్ని ప్రతిపాదించే దురుసుతనానికి పోలేదు. తను ఎదుర్కొన్న వివక్షల్ని చెప్తూనే, తన స్నేహితుల్లో అత్యధికులు బ్రాహ్మణులే అన్న సంగతీ చెప్తారు.

రెండో భాగంలోని కథంతా వేరే వాళ్ల నుంచి విన్నది కాక, తిన్నగా రచయిత జ్ఞాపకం నుంచి చెప్తున్నది కావటం మూలాన అందులోని వాతావరణమంతా ఎంతో నిజంగా మన చుట్టూ అలుముకుంటుంది. అలాగని రచయిత ఈ పాత్రల్ని దగ్గర చేయటానికీ, ఈ సన్నివేశాల్ని వాస్తవం చేయటానికీ ఎలాంటి లిటరరీ డివైజ్‌లతోనూ శ్రమపడడు. జీవితం నుంచి చెప్పుకునే కథలకు అవేమీ అంటనప్పుడే బాగుంటుందనిపిస్తుంది. ఇదే పద్ధతిలో ఒక జీవితాన్ని ఇంత దగ్గరిగానూ నా కళ్ళముందుంచిన మరో పుస్తకం బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ రాసిన స్వీయకథాత్మక నవల “అపరాజితుడు”. (దీన్ని కూడా హైదరాబాద్ బుక్ ట్రస్టు వాళ్లే తెలుగులోకి తెచ్చారు.)

తండ్రి బాలయ్య పెంపకంలో సత్యనారాయణ గారు ఎంతో క్రమశిక్షణతో పెరిగారని, ఆయన జీవితం ఆయనలో ఎన్నో దృఢమైన నమ్మకాలను స్థిరపరిచిందనీ మనకు కథ చెప్తున్న గొంతును బట్టి గ్రహించవచ్చు. ఈ గొంతు ఆరితేరిన గొంతు కాదు, అలాగని అమాయకపు గొంతూ కాదు. పాఠకుణ్ణి మరీ దగ్గర చేసుకోదు, అలాగని మరీ దూరం పెట్టదు. అసలిది పెద్దగా బయటకు మాట్లాడే గొంతు కాదు. గతంలో లీనమై కథ చెప్తుంది. ఏ ప్రభావం కోసమూ పనిగట్టుకు ప్రయత్నించదు. ఆయన వాక్యాలు “శైలి” అని పేరుమోసేంతగా ఏ అలంకారాల్ని తెచ్చిపెట్టుకోవు. సొంత కథని ఏదో సొంత అవసరం కోసం చెప్పుకుంటున్నప్పుడు వచనంలో ఉండే తేటదనం ఉంటుంది. పి. సత్యవతి గారి అనువాదం తిన్నగా తెలుగులో రాసిన రచనే చదువుతున్న భావన కలుగజేస్తుంది. అనువాదకురాలి ప్రతిభని ముఖ్యంగా సంభాషణల దగ్గర మెచ్చుకోవాలి. అవి తెలంగాణ యాసని ఎంతో వాస్తవంగా పట్టుకున్నాయి. చదువుతున్నది అనువాదం అన్న ఊహ ఎక్కడా కలగక పోవటానికి ముఖ్య కారణం సంభాషణలు యాస పరంగా సఫలం కావటమే.

ఈ పుస్తకంలోని ప్రపంచం నేను తెలుగు పుస్తకాల్లో ఎన్నడూ చూడని తెలుగు ప్రపంచం. ఇప్పటి దాకా వచ్చిన ఆత్మకథలూ, స్వీయచరిత్రలూ అన్నీ ఎక్కువశాతం ఒక వర్గం వారి నుంచే రావటం మూలాన అవి ఆనాటి ప్రపంచ పటంలో ఒక చిన్న ఎత్తరి భాగం మీద మాత్రమే వెలుగు ప్రసరించగలిగాయి. శ్రీపాద అనుభవాలూ జ్ఞాపకాలూను, దువ్వూరి స్వీయచరిత్ర, చెళ్ళపిళ్ల కథలూ గాథలూ, ఆదిభట్ల నారాయణ దాసు నా యెరుక… ఇవన్నీ ఆనాటి ఊళ్ళల్లోని ప్రధాన వీధుల కథల్నే మనకు చెప్పాయి. అవన్నీ అగ్రహారాల్లోనూ, మండువా లోగిళ్ల ఎత్తరుగుల మీదనూ జరిగిన కథలు. మరి అవి జరుగుతున్న కాలంలోనే ఆ ఊరి శివార్లలోని గుడిసెల్లోనూ, పందులదొడ్లలోనూ, కల్లుపాకల్లోనూ, పొలం గట్ల మీదనూ, అమ్మవారి జాతరల నేపథ్యంలోనూ ఏవో కథలు జరుగుతూనే ఉండి ఉంటాయి కదా. వర్ణవ్యవస్థ కారణంగా విద్య కొన్ని వర్గాలకే అందుబాటులో ఉండటం వల్లనూ, ఆ వర్గాల్లోని విద్యావంతులే తమ కథలు చెప్పుకోగలగటం వల్లనూ మనం వాళ్ల కథలే విన్నాం. (నాకు వాళ్ల కథలపైనా అందులోని వాతావరణంపైనా ఏ ఫిర్యాదూ లేదు, కానీ ఆ వాతావరణం ఒక అసంపూర్ణ చిత్రంగా మాత్రమే నాకు అందేట్టు చేసిన పరిస్థితుల పట్ల నా ఫిర్యాదు.) ఆ ఊరి చివరి వాడల్లోని మనుషులూ వారి జీవితాలూ కథలుగా చెప్పాల్సినంత విలువైనవని ఎవరూ భావించలేదు, పోనీ అక్కడి వాళ్లే చెప్పుకుందామంటే వాళ్లకి చదువు రాదు. ఆ తరాలు ఎలాగో అలాగే మూగగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు కనీసం తర్వాతి తరాల వారు ఆ పని చేస్తున్నారు. ఇప్పటికన్నా మించిపోయింది లేదు.

– మెహెర్

ప్రాప్తి:
MaaNaayanaBalaiahCoverమా నాయన బాలయ్య
ప్రథమ ముద్రణ: జూన్ 2013
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ఫ్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ 500 006
ధర: రూ. 100/-
పేజీలు: 184
కినిగెలో లభ్యం (click )

Download PDF ePub MOBI

Posted in 2014, పుస్తక సమీక్ష, ఫిబ్రవరి and tagged , , , , , , , , , , .

3 Comments

  1. మెహెర్ … మా నాయన బాలయ్య పరిచయం బాగుంది. మీరన్నట్టు అలనాడు వర్ణ వ్యవస్థ మూలంగా విద్య కొన్ని వర్గాలకే అందుబాటు కావడం చేత బ్రాహ్మణేతర కులాల సంస్క్రుతి మనకు అంతగా అందుబాటులో లేకపోయింది. నిమ్న కులాల కథలు చెప్పినా అగ్ర వర్ణ రచయితలే చెప్పారు. 80 ల తర్వాత గానీ కొంత వాళ్ళ గురించి తెలియలేదు . నావరకు నేను ముఖ్యంగా నాగప్పగారి సుందర్ రాజు కథలు చదివి కొంత తెలుసుకున్నాను .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.