softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [8]

Download PDF ePub MOBI

దీని ముందు భాగం

ఒక రోజు ఉదయాన్నే నిషా, అజయ్ కి ఫోను చేసింది. “ఎక్కడున్నావ్?” అని అడిగింది. “ఆన్ లైన్ లో ఉన్నా” అని చమత్కరించాడు అజయ్. “ఒకసారి నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి”, “చెప్పు”, “ఫోనులో కాదు నేరుగా మాట్లాడాలి” అని నిషా అనటంతో, ఇద్దరూ హైటెక్ సిటీలో గల ఇనార్బిట్ మాల్ లో కలుసుకోవాలి అనుకున్నారు.

ఆర్ధిక మాంద్యం కావటంతో కొనేవాళ్ళకన్నా, చూసిపోయే వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. చెరొక పిజ్జా తీసుకొని ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. హైదరాబాదు మొత్తం మీద అంతకన్నా అందమైన ప్రదేశం లేదని అజయ్ కి ఉన్న బలమైన నమ్మకం. అక్కడున్న అమ్మాయిలను చూసి, ముఖ్యంగా పొట్టి పొట్టి బట్టలేసుకుని, నున్నటి శరీరం గల్ల అమ్మాయిలని చూసి అజయ్ మనస్సు విసిరేసుకునేవాడు. కానీ ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో అవేమీ పట్టించుకో లేదు.

“నీ ఉద్యోగ ప్రయత్నం ఎక్కడి దాకా వచ్చింది?” అడిగింది నిషా. “ప్రయత్నిస్తున్నాను, చాలా కష్టంగా ఉంది, చూస్తున్నావుగా నువ్వు కూడా! ఏంటో చెప్పాలన్నావు? కొంపతీసి నిన్ను కూడా తీసేశారా?” అని అడిగాడు వెటకారంగా.

“మా నాన్న నాకు ఒక పెళ్లి సంబందం తీసుకు వచ్చాడు. చేసుకోమని బలవంతం చేస్తున్నాడు” అని చెప్పింది. “అయితే చేసుకో అన్నాడు”, అజయ్ కోపంగా. “ఏంటి అంత తేలికగా మాట్లాడతావు?” అన్నది. “మరి ఏమి చేయమంటావు? మీ నాన్నకేమో నాతో పెళ్లి ఇష్టం లేదు. పోనీ మనం చేసుకుందాం అంటే నువ్వు వినవు. ఇంతకన్నా నన్ను ఏమి చేయమంటావు?” అన్నాడు, అసహనంతో.

“పోయి ఎలా పెళ్లి చేసుకుంటాము? నీకు అస్సలే ఉద్యోగం లేక తిరుగుతున్నావు”, అనటంతో అజయ్ కోపం ఒక్కసారిగా వచ్చేసింది. “ఇప్పుడు ఉద్యోగం లేకపోతే రాదా? మొన్నటి దాకా చేసింది అదే కదా?” అంటూ కోపంతో ఊగిపోయాడు. “అయినా నేను పెళ్లి గురించి మాట్లాడుతుంటే, నువ్వు ఉద్యోగం గురించి మాట్లాడతావే? ఉద్యోగం ఇవాళ కాకపోతే, రేపు వస్తుంది. పెళ్లి అనేది జీవితానికి ఒకసారే వస్తుంది” అన్నాడు. “అయితే వచ్చి మా నాన్నని ఒప్పించు. వాళ్ళను కాదని, ఇంట్లో నుంచి బయటకు రాలేను” అన్నది.

“రాకు, మీ నాన్న చూపించిన వాడినే చేసుకొని చావు, నా చావు నేను చస్తాను”, అంటూ విసురుగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిషా అజయ్ ని అనుసరించింది. బయటకు వచ్చి మాట్లాడకుండా ఇద్దరూ కాస్త దూరం నడిచారు. చివరికి ఒక చెట్టు దగ్గర ఆగి సిగిరెట్టు వెలిగించి నిలబడ్డాడు అజయ్.

“మాట్లాడుతుంటే అలా లేచి వస్తే ఏంటి అర్ధం?” అన్నది నిషా. “ఏమిటి నీతో, మీ నాన్నతో ఇంకా మాట్లాడేది? ఆఖరి సారి అడుగుతున్నా, మీ నాన్న ఎలాగూ పెళ్ళికి ఒప్పుకోడు, నాతో వచ్చేయి, పెళ్లి చేసుకుందాం. ఉద్యోగం అంటావా అదే వస్తుంది. కొన్నాళ్ళయితే మీ నాన్న మర్చిపోతాడు, ఎంతమందిని చూడలేదు”, అన్నాడు. “ఆఖరిగా, నా కోసం, ఒక్కసారి మా నాన్నతో మాట్లాడచ్చు కదా?” అన్నది. “సరే! నీ కోసం ఆఖరి సారి మీ నాన్నతో మాట్లాడతాను. మీ నాన్న కాదు, కూడదు, చస్తాను, చంపుతాను అంటే, నువ్వు వచ్చేయాలి” అన్నాడు. “ఒప్పుకోడని నెగటివ్ గా ఎందుకు ఆలోచిస్తావు? ఒప్పుకుంటాడని నమ్మకం నాకు ఉంది” అన్నది నిషా. సరేనన్నాడు అజయ్.

ఆ తర్వాత వారాంతంలో నిషా వాళ్ళింటికి మళ్ళీ వెళ్ళాడు అజయ్. వాళ్ళ నాన్న అభిప్రాయం రవ్వంత కూడా మారలేదు. “ఉద్యోగం పోయింది కదా! ముందు దాని సంగతి చూసుకో, పెళ్లి గిళ్ళీ తరువాత ఆలొచించచ్చు. ఇంకోసారి నన్ను కలవాలని నీ సమయం వృధాచేసుకోకు” అన్నాడు నిషా నాన్నగారు. ఉద్యోగం పోయిన సంగతి తనకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు అజయ్. నిరాశతో అక్కడ నుండి వెనుదిరిగాడు.

“మనం పెళ్లి చేసుకుందాము” అన్నాడు అజయ్. “మా నాన్న చూపించిన సంబందం చేసుకోకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. నాకు భయమేస్తుంది” అన్నది నిషా. తనని ఒప్పించటానికి చాలా ప్రయత్నించాడు అజయ్. కానీ లాభం లేకపోయింది.

చివరగా ఆ రోజు రానే వచ్చింది. నిషా ఫోను చేసి “మా నాన్న నాకు పెళ్లి ఖాయం చేశాడు, నెలలో పెళ్లి, అబ్బాయి అమెరికాలో పని చేస్తున్నాడు. నేను ఈ పెళ్ళికి ఒప్పుకోక పోయినా, నువ్వు ఈ పెళ్లిని ఆపటానికి ప్రయత్నించినా చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. మా అమ్మ, నాన్నలు లేకుండా నేను ఉండను. ఇక ఇదంతా ఇక్కడితో వదిలేయి. నన్ను మర్చిపో. ఇంకెప్పుడూ కలవటానికి కూడా ప్రయత్నించకు” అని చెప్పి, అజయ్ ఏదో మాట్లాడే లోపే ఫోను పెట్టేసింది. అజయ్ కి ఏమి చేయాలో అర్ధం కాలేదు. మళ్ళీ తనకి ఫోను చేశాడు. తను స్పందించలేదు. కాసేపటికి ఫోను స్విచ్ ఆపు చేసింది.

అనంతమైన చీకటి అంతటా అలుముకున్నట్టు అజయ్ కి అనిపించింది.ఎక్కడా అవకాశాలు రావటం లేదు,మరొక ప్రక్క నిషా లేదన్న బాధ. ఇలాంటి కష్టాల్లో, కాకరకాయ తిన్నా, ఖర్జూరం తిన్నా పెద్దగా తేడా తెలియదు. ఉదయాన్నే లేవటం, ఉద్యోగం కోసం తిరగటం, ఉసూరుమంటూ సాయంత్రానికి ఇంటికి చేరటం, అజయ్ కి దినచర్య అయిపోయింది. పొరపాటున ఎప్పుడైనా మర్చిపోయినా వెంటనే గుర్తు చేసే జనాలు ఉండనే ఉన్నారు. అసలు భాదలకన్నా సానుభూతి భాదలు ఎక్కువయ్యాయి అజయ్ కి. ఎవరిని కలిసినా “అయ్యో అలా జరిగిందిట కదా పాపం” అని అంటుండటంతో, తనమీద తనే జాలిపడే పరిస్థితికి వచ్చేశాడు.

Posted in 2014, ఫిబ్రవరి, సాఫ్ట్‌వేర్ ఇతిహాస్యం, సీరియల్ and tagged , , , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.