arava kathalu

అచ్చుచిత్తు దిద్దేవాడి పెళ్ళాం

Download PDF ePub MOBI

S. Ramakrishnaఈ సంచికతో మొదలుకొని నెలకు ఒక అరవ కథకు అనువాదాన్ని మీకందించబోతున్నారు అవినేని భాస్కర్. ప్రస్తుత కథకి మూల కథ “పిళై తిరుత్తుబవరిన్ మనైవి”ను ఎస్. రామకృష్ణన్ రాశారు. ఇది నడందు సెల్లుం నీరూట్జు (నడిచి వెళ్ళే నీటి వూట/ చెలమ) అనే కథా సంపుటిలో ప్రచురితమైంది. గత పాతికేళ్లుగా ఆయన తమిళంలో విస్తృతంగా రాస్తున్నారు. “అచ్చరం” సాహిత్య పత్రికకు ఐదేళ్ల పాటు సంపాదకత్వం వహించారు. చిన్న పిల్లల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి 30 స్టోరీ టెల్లింగ్ కాంప్స్ నిర్వహించారు. ఆయన వెబ్‌సైటు www.sramakrishnan.com సమకాలీన సాహితీ ప్రక్రియల్ని, ప్రపంచ సాహిత్యాన్ని యువ పాఠకులతో పంచుకునే ఒక విస్తృత వేదికగా పని చేస్తోంది. రామకృష్ణన్ కథలు ఆధునిక శైలీ రీతుల్ని అందిపుచ్చుకుని తమ ప్రత్యేకతను నిలబెట్టుకున్నాయి. చాలా కథలు ఇప్పటికే ఇంగ్లీషు, మలయాళం, హిందీ, బెంగాలీ, తెలుగు, కన్నడ, ఫ్రెంచు భాషల్లోకి అనువదించబడ్డాయి.

.

అచ్చుచిత్తు దిద్దేవాడి పెళ్ళాం

ఎస్. రామకృష్ణన్

ఆమెకు అచ్చుకాగితాలంటే ఇష్టంలేకుండా పోయి ఎన్నో ఏళ్ళయింది. స్నానాలగదిలో గోడలమీద దాక్కుని తిరిగే బొద్దింకలకంటే కాగితాలే ఎక్కువ భయపెట్టేవయ్యాయి. ఒక్కోసారి ఆమె కసి తీరేంతవరకు కాగితాలను చించుతుండేది. కాగితాలెప్పుడూ ప్రతిఘటించవు. బొద్దింకల్లా చెల్లా చెదరై పరుగులు తియ్యడం, మీసాలు తెంచుకుని పరిగెట్టడం లాంటివి కాగితాలెప్పుడూ చెయ్యవు.

కాగితాల్ని చించినప్పుడు చిన్న చప్పుడు చేస్తాయిగానీ అడ్డు చెప్పవు. ఆ చప్పుణ్ణి కూడా ఆమె భరించలేకపోయేది. కాబట్టి కాగితాలని నీటిలో నానబెట్టేసేది. ఆమెకు తెలిసినంతలో అదే కాగితాలకి ఇవ్వగలిగిన ఘోరమైన శిక్ష. వంటచేసేప్పుడు ఇనుప బక్కెట్లో ఉన్న నీళ్ళలో వేసేస్తే సాయంత్రం చూసేప్పటికి అవి పల్చనై తునకలుగా తేలుతూ నీటిలో కరిగిపోయేవి.

కాగితాలు నీటిలో కరిగేప్పుడు అందులో అచ్చువేయబడ్డ వాక్యాలు ఏమైపోతాయి? నీటిలో ఉప్పు కరిగినట్టు కంటికి కనిపించకుండా పోతాయా? బక్కెట్లోని నీటికేసి కళ్ళార్పకుండా చూస్తూ ఉండేది. కొన్ని సార్లు ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపించేది. కాగితాలకీ పదాలకీ ఉన్న అనుబంధం ఎలాంటిది? కాగితం తన మీద రాయబడే అక్షరాలకి సమ్మతి తెలుపుతుందా? కాగితాలకీ వాటిపై ముద్రించబడిన అక్షరాలకీ మధ్య ఖాళీ ఉంటుందా? ఇలా ఆలోచనలు మొదలవ్వగానే, ఎందుకు ఇలాంటి అనవసరపు ఆలోచనలు పెంచుకుంటూ ఉంటాను అని తనమీద తనకే చిర్రెత్తుకొచ్చేది.

ఆమె ఉన్న ఇంటి నిండా అచ్చువేయబడ్డ కాగితాలు ఉన్నాయి. ఆమె పదిహేడోయేట మంత్రమూర్తిని పెళ్ళిచేసుకుని మదరాసు వచ్చేంతవరకు పాఠ్యపుస్తకాలు తప్ప మరేవీ చూసెరుగదు. అది కూడా వాళ్ళూర్లో హైస్కూల్ లేకపోవడంతో ఐదో తరగతితో చదువు మానుకుంది.

ఆరేడేళ్ళ పాటు అగ్గిపెట్టెలు చేసే పనికీ, రబ్బర్ గింజలు ఒలిచే పనీకీ వెళ్తూ ఉండేది. అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో రేడియో ఉండేది. అందులో వచ్చే సినిమా పాటలు ఆమెకి చాలా ఇష్టం. ఆ రోజుల్లో చీటీ కట్టి ఒక రేడియో కొనుక్కోవాలని చాలా ఆశపడేది. అయితే ప్రతిసారీ చీటీ డబ్బులు చేతికొచ్చే సమయానికి మరో ఖర్చు కాచుక్కూర్చుని ఉండేది. అందువల్ల ఆమె పెళ్ళప్పుడు కచ్చితంగా ఒక రేడియో కొనివ్వాల్సిందే అని పట్టుబట్టి కొనిపించుకుంది. అయితే మంత్రమూర్తికి రేడియో వినడం ఇష్టముండదు కాబట్టి ఆ రేడియో పెట్టె ఎప్పుడూ మూగబోయే ఉండేది.

పెళ్ళి చేసుకుని మదరాసు వచ్చిన రోజుల్లో ఆమెకి మంత్రమూర్తిని చూడటానికి భయమేసేది. అతనప్పుడు రాయల్ ప్రింటర్స్ లో పని చేస్తుండేవాడు. అతని సంచిలో ఎప్పుడూ ఒక పెన్సిల్, ఒక రబ్బర్ ఉండేవి. కొన్ని సార్లు ఎర్ర పెన్ను ఉండటంకూడా గమనించింది.

ఆమెకు చిత్తుప్రతులు దిద్దటం (proof-reading) గురించి ఏమీ తెలియదు. ఎప్పుడైనా రాత్రివేళ మంత్రమూర్తి నేలపై దిండువేసి పడుకుని కాగితాల పెన్సిల్తో దిద్దేప్పుడు ఆమె దీక్షగా చూస్తూ ఉండేది. అతను తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు ఉండేవాడు. కొన్ని సార్లు అతను పైకి గట్టిగా నవ్వడంకూడా వినిపించేది. నడిరేయి దాటేవరకు దిద్దుతూ ఉండేవాడు. ఆపైన లేచి వెనక తలుపు తీసి లఘుశంక పోసివచ్చి పడుకునేవాడు.

తన ఒంటిపైన అతని వేళ్ళు పాకేప్పుడు ఎందుకో అచ్చుదిద్దటం గుర్తొచ్చేది ఆమెకు. అతను శృంగారంలో పెద్ద ఆసక్తి ఉన్నవాడు కాడు. దాన్ని ఒక అలవాటైన ఆచారంలా చెయ్యడం, ఒళ్ళు అలసి చెమటలు పట్టగానే ముఖం తిప్పుకుని పడుకోడం ఆమెకి విరక్తి కలిగించేది. నిద్రలోకూడా అతని వేళ్ళు కదులుతూ ఉండటమూ ముఖం అభావమవ్వడమూ ఆమె గమనించేది.

మంత్రమూర్తి ఎవరితోనూ మాట్లాడడు. అతను ఉదయం ఆరుగంటలకల్లా అచ్చుదిద్దటం మొదలుపెట్టేసేవాడు. అతను ఇంటి నుండి బయల్దేరేప్పుడు అతని పసుపుపచ్చ సంచిలో దిద్దిన ప్రతులూ, మధ్యాహ్న భోజనమూ ఉంటాయి. అతని కార్యాలయం రాయపేటలో ఉంటుంది. అతనికంటూ స్నేహితులో తెలిసినవాళ్ళో ఎవరూలేరు. అతను బయటెక్కడికీ కూడా వెళ్ళడు. అతనికున్న ఒకే ఒక వ్యాపకం తమలపాకులు నమలటం. తమలపాకులు పెట్టుకోడానికి ఒక చిన్న తోలుసంచి ఉంచుకునేవాడు. ఆ సంచిలోంచి పదినిముషాలకొకసారి రెండు ఆకులు మడిచి నోట్లో వేసుకునేవాడు.

ఒకసారి ఆమెను తను పనిచేసే ప్రెస్సులో జరిగిన వేడుకకు తీసుకెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద యంత్రంలో కాగితం ఉండలా చుట్టి అమర్చబడి ఉండటాన్నీ, అందులోనుండి ఉల్లి పొరలు ఒలిచినకొద్దీ వస్తున్నట్టు కాగితాలు వరుసగా వస్తూ ఉండటాన్ని మిటకరింపుగా చూసింది. ఆ కాగితపు ఉండ మొత్తం అచ్చు వేయబడుతుంది; అన్నిట్నీ ఆయనే అచ్చుదిద్దాలిగా? ఆమె భర్తనడిగింది. తెలివితక్కువగా వాగకు అంటూ బైండింగ్ సెక్షన్ చూపించడానికి తీసుకెళ్ళాడు.

ఆమె వయసున్న నాలుగైదుగురు ఆడవాళ్ళు కాగితాలను పేర్చి అంటిస్తున్నారు. వాళ్ళకెంత జీతం వస్తుంది అని అడిగింది. మంత్రమూర్తి జవాబు చెప్పకుండా అది మనకి సరిపడదు అన్నాడు. ఆమె ప్రెస్సుకి అటు చివర్లో ఉన్న టాయిలెట్ కి వెళ్ళేప్పుడు దార్లో నేలపైన గాగితాలు పడివున్నాయి. వాటిమీదే అందరూ నడుస్తున్నట్టున్నారు.

దక్షిణభాగంలో ఒక చిన్న ఇనుప తలుపు తెరచి ఉండటం చూసింది. లోనకి తొంగి చూసినప్పుడు తీసిపడేసిన చిత్తుకాగితాలు ఒక గది నిండుగా ఉన్నాయి. అవి చూడగానే ఆమెకు భయమేసింది. నీటి ఊట పొంగినట్టు కాగితాలు పొంగి పొర్లుతున్నాయా అన్నట్టు తోచింది. ఈ కాగితాలన్నీ ఎక్కడికెళ్తాయి? ఆమె టాయిలెట్ లోపలకి వెళ్ళాక కూడా ఆ ఆలోచనల్లోనుండి బయటపడలేకపోయింది.

ఆ ప్రెస్సులో ఆమె భర్త మాత్రమే అచ్చు దిద్దేవాడిలా ఎందుకున్నాడో ఆమెకి అర్థంకాలేదు. ఒకరోజు మంత్రమూర్తి అచ్చుదిద్దిన కాగితాలను ఆయనకి తెలియకుండా తీసి చూసింది. ప్రతి గీతకీ చాలాతప్పులు కనిపెట్టబడి , గిరిగీయబడీ, చెరిపేబడీ, మార్చబడీ ఉన్నాయి. ఆమెకు ఆ కాగితాలను చూసినప్పుడు ఏదో చిన్నపిల్లల ఆటలా తోచింది. అప్పుడప్పుడూ మంత్రమూర్తి అందరి రచయితలకంటేనూ పెద్ద మేధావిలా కూడా అగుపించాడు ఆమెకి. ఒకోకప్పుడు తనే ఆయన్ని అర్థం చేసుకోవట్లేదేమో అని కూడా అనిపించేది. ఆమె భయపడుతూ ఆ కాగితాలను అక్కడ పెట్టేసి ఆయనకి భోజనం పెట్టింది.

మంత్రమూర్తి కళ్ళకి తప్పులెంత చిన్నవైనా ఎలా కనిపిస్తాయి? ఈ గుణం ఆయనకి కాగితాలతో మాత్రమే ఉందా, లేక తననీ ఇలాగే తీక్షణంగా చూస్తూవున్నాడా? మొదట్లో ఆమె సాయంత్రాల్లో ఇంటి గుమ్మందగ్గర కూర్చుని వీధికేసి వేడుక చూస్తూ ఉండేది. వెనుతిరిగొచ్చే మంత్రమూర్తి ముఖం ఈ దృశ్యం చూడగానే కఠినంగా మారిపోవడం కూడా గ్రహించేది. ఇంటికిరాగానే కాగితాలను ముందరేసుకుని దిద్దుతుంటాడు. ఆమె ఇచ్చే కాఫీ, కారప్పూస ఎప్పుడు తాగుతాడో తింటాడో కూడా తెలిసేదికాదు. అతను ఎందుకిలా అక్షరాల మధ్య ఇరుక్కుపోతాడో ఆమెకి అర్థంకాదు.

మంత్రమూర్తికి భోజనం మీద కూడా పెద్ద తీపి లేదు. కొన్నిసార్లు తడిపంచె అన్న ఆలోచనైనా లేకుండా కట్టుకుని పనికెళ్ళిపోయేవాడు. ఎప్పుడైనా ఆమె సంకోచిస్తూ అతను మరేదైనా ఉద్యోగం చెయ్యచ్చుగా అని అడిగినప్పుడు కోపంగా చూసి ఈ వృత్తిలో ఏంటి సమస్య అనడిగేవాడు. ఆమె వివరించి చెప్పలేకపోయేది.

మంత్రమూర్తి ఒకరోజైనా ప్రెస్సుకి వెళ్ళడం మానేవాడు కాడు. ఆమెకి ఒంట్లోబాలేని రోజుల్లో కూడా గంజి కాచి పెట్టి బయల్దేరి వెళ్ళిపోయేవాడు. ఆమె చాపమీద పడుకుని పళ్ళు కొరుక్కుని పడుండేది. ఎందుకని ఇలాంటి వాణ్ణి పెళ్ళిచేసుకున్నాను? ఒక అక్షరం మారిపోయినా పట్టించుకోగలిగే మనిషి తననెందుకు గమనించడు? అని విరక్తిగా ఉండేది.

మంత్రమూర్తి దానిగురించే ఆలోచించడు. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళొద్దాం అంటాడు. అలాంటప్పుడు గబగబా చీర మార్చుకుని వచ్చేస్తుంది. థియేటర్ ముందు నిల్చున్నప్పుడు వాల్పోస్టరులో ఉన్న అక్షరాల్నీ, పల్లీపొట్లం కాగితాన్నీ కూడా శ్రద్దగా చూస్తూ అతని పెదవులు తప్పుల్ని గొణుగుతూ ఉండటం కూడా గమనించేది.

సినిమా థియేటరులో అతను నవ్వగా ఆమె చూసిందే లేదు. ఎడతెగని ఆలోచనలతో అతని ముఖం గడ్డగట్టిపోయినట్టు ఉంటుంది. సినిమా అవ్వగానే మరుక్షణం ఇంటికి వచ్చేయాలి అని కంగారు పడిపోతూ ఉండేవాడు. సినిమా చూసొచ్చిన రాత్రులలో అతను ఆమెతో కలిసేవాడు కాదు. అలా ఎందుకుంటాడో ఆమెకర్థం అయ్యేది కాదు.

వాళ్ళకి పెళ్ళయి పదిహేనేళ్ళకి పైనే అయింది. ఇప్పటివరకు పిల్లల్లేరు. ఆమెకు ఒంటరిగా ఇంట్లో ఉండటం అలవాటైపోయింది. ఎప్పుడో ఒక్కోసారి ఒక నిమ్మపండు చేతబట్టుకుని నడిచి దక్షిణామూర్తి స్వామి దర్శనానికి వెళ్ళొచ్చేది. అలాంటప్పుడు దేవుడి దగ్గర ఏం కోరుకోవాలన్నది కూడా మరిచిపోయేది. దైవసన్నిదిలో నిల్చుని దేవుణ్ణి దీనంగా చూస్తూ ఉండిపోయేది. మరీ చిరాగ్గా ఉన్న రోజుల్లో అచ్చుకాగితాలన్నవే ఈ ప్రపంచంలో లేకుండాపోవాలి అని దేవుణ్ణి వేడుకునేది. ఆమె ద్వేషం కొంచం కొంచం పెరిగి పెన్సిళ్ళూ, రబ్బర్ల మీదకి కూడా పాకింది.

రెండేళ్ళ క్రితం ఒక పగటిపూట ఏం తోచక ఇంట్లో ఉన్న కాగితాల్ని ఒక్కోటి చించుతూ కూర్చుంది. సాయంత్రం ఇంటికొచ్చిన మంత్రమూర్తి ఇల్లంతా ఉన్న కాగితాల ముక్కల్ని చూసి కోపమొచ్చి గొంతుపెంచి “తంగమ్మా… నీకు కాగితాలు చించాలని అనిపిస్తే వీధిలో చెత్త కుండీ దగ్గరకెళ్ళు. అక్కడ చాలా కాగితాలుంటాయి. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు” అంటూ తన మేజా దగ్గరకెళ్ళి కూర్చుని సంచిలోని కాగితాలు తీసి దిద్దటం మొదలుపెట్టాడు. ఆమె గట్టిగా ఏడ్చింది. ఆ శబ్ధం అతని చెవులను తాకినట్టు లేదు. అతను దిద్దిన కాగితాలను సర్దుకుంటూ ఉన్నాడు. ఆ రాత్రి ఆమె నిద్రపోనేలేదు. కాగితాల్లో ఉన్న పదాలు మీద రాలుతున్నట్టూ, తన చేతులకీ, కాళ్ళకీ, ఒంటికీ అంటుకుపోతున్నట్టూ అనిపించింది.

ఆ తర్వాత ఆమెను వైద్యుడి దగ్గరకి తీసుకెళ్ళాడు మంత్రమూర్తి. ఆమె వణుకుతూ తనకి భయంగా ఉంది అంది. ఒక వారానికి సరిపడే నిద్రమాత్రలు ఇచ్చిపంపాడు వైద్యుడు. కమ్ముకొచ్చే అంత నిద్రలో కూడా అతను అచ్చు దిద్దుతుండటం ఆమె కళ్ళకి లీలగా కనిపించేది. ఏడవడానికి కూడా వీలు లేక నిద్రలోకి జారిపోయేది.

ఆమెని బాగు చెయ్యడానికి ఒక ఏడాది పాటు ప్రతి వారం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె వీధిలో మౌనంగా నడిచేది. ఆసుపత్రి వరకు అతనేమీ మాట్లాడడు. కేన్సరు వార్డులో ఆమెను కూర్చో బెట్టి ఎదురుగా ఉన్న దిరిసెన చెట్టుకేసి చూస్తూ కూర్చునేవాడు.

ఆసుపత్రి వాళ్ళిచ్చే తెలుపు, పచ్చ మాత్రలు తీసుకుని ఇల్లు చేరిన మరుక్షణం అతను తన అచ్చాఫీసుకు బయల్దేరివెళ్ళిపోయేవాడు. ఆ మాత్రల మీద కూడా ఏదో అచ్చువేయబడి వుండేది. అవి అచ్చు తప్పులు దిద్దబడినవో కావో అనుకుంటూ వాటికేసి చూసేది. మాత్రలు పొట్టలో కరిగేప్పుడు ఈ అక్షరాలూ తనలో కరిగిపోతాయి కదా అన్న ఆలోచన కలిగేది. కళ్ళు మూసుకుని మాత్రలు మింగేది.

రోజులు గడిచేకొద్ది కాగితాల మీద ఆమెకి ద్వేషమూ కోపమూ పెరుగుతూ వచ్చింది. ప్రపంచంలో ఉన్న అన్ని అచ్చు అక్షరాలనీ చెరిపేయాలని భీష్మించినట్టు ఆవేశపడసాగేది. మెల్లమెల్లగా అతనితో మాట్లాడటం మానుకుంటూ వచ్చింది. ఎప్పుడైనా అతను మంచినీళ్ళడిగినా ఆ మాట వినపడనట్టు అతనికేసి చూస్తూ ఉండిపోయేది. అతనే లేచి నీళ్ళు తాగొచ్చి కూర్చునేవాడు.

రాత్రుళ్ళు నిద్రపట్టక ఆమె చాపమీద కూర్చునే ఉండటాన్ని చూసినప్పుడు కూడా అతను అచ్చుదిద్దటం మానడు. ఒకరోజు ఆమె అతని వీపు వెనక నిలబడి అతను చేస్తున్న పనిని చూస్తూ ఉంది. క్రూరమృగం తన ఎరను వేటాడినట్టు అతను పదాలను తన చేతిలో ఉన్న పెన్సిల్తో కొట్టి, దిద్ది మారుస్తూ ఉన్నాడు.

ఆమె ఆత్రంగా అడిగింది, కాగితాల్లో అంతలా ఏముందసలు? అతను తిరిగైనా చూడకుండానే “నాకూ తెలియడంలేదు” అన్నాడు. ఆమె కాగితాలకేసి దీనంగా చూస్తుండగా పదాలు వరసల్లోంచి విరిగి, విడిపోయి, ఒంటరిగా నర్తిస్తున్నట్టు తోచింది. హఠాత్తుగా అతణ్ణి హత్తుకుని ఏడవసాగింది. అతని చేతిలో ఉన్న పెన్సిలు నేల మీదకు జారిపడి మొన విరిగింది. అతను ఆమె చేతులను విడిపించుకుని కిందపడిన పెన్సిల్ని తీసుకుని అతి శ్రద్ధతో దాన్ని పదును చెక్కడం మొదలుపెట్టాడు. అతని ముందు వేయి పేజీల నవలొకటి అచ్చుతప్పులు దిద్దటానికి సిద్ధంగా ఉంది. తంగమ్మ ఏడుపు గాలిలో కలిసి ఆ ఇల్లంతా పరుగెడుతుంది.

*

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, అరవ కథలు, మార్చి and tagged , , , , , , , .

12 Comments

  1. అనువాదకత అని చెబితే తప్ప తెలుసుకునేట్టు లేదు భర్త పూర్తిగా తన సమయమంతా ఉద్యోగానికే కేటాయించి భార్యను పట్టించుకోకపోతే ఎమౌతున్ధొ తెలిపింది ఇకత

  2. అబ్బ ఏం రాసారండి కధ చాలా రోజుల తరువాత బుచ్చిబాబు గుర్తుకొచ్చాడు.ప్రపంచ సాహిత్యం ఎంత విలువైనదో ఇలాంటి కధల వల్ల తెలుస్తుంది.

  3. అంటే భర్త తనకన్నా ఆ అచ్చుకాగితలతోనే సాన్నిహిత్యంగా వుండటం అనేది ఆమె భరించలేకపోయింది. అదే ఆమెని మానసిక వేదనకు గురిచేసింది. చదువుతూవుంటే నా చుట్టురా కాగితాలే వున్నట్లు గా అనుభూతి చెందాను. హృదయానికి హత్తుకొనే కధ.

  4. Pingback: தெலுங்கு இணைய இதழில்

  5. Women should be honoured by the society. As per this story it is observed that the hero is not honoured his eswife and his dedication is only on his work.,This type of persons should not get marry to avoid the depression of his wife.There not any mistake from his wife.

  6. వర్ణనాత్మకంగా భలే రాశారు ఈ కథ .. అనువాద కథే అయినా ఒక లాంటి మానసిక సంఘర్షణని, పాఠకుడు కూడా చదివేప్పుడు ఫీల్ అయ్యేట్టు రాసారు .. విభిన్న కధాంశం .. కాగితాల మీద అసహ్యం ఎందుకో అని మొదటినుండి చివరి వరకు చదివేలా ఆసక్తి పెంచారు .. ఇలాంటి ప్రవర్తనలు కూడా సమాజంలో ఉంటాయి అనడానికి ఈ కధాంశం ఒక ఉదాహరణ