గత సంచికలో ప్రకటించిన డిలాన్ థామస్ కవిత “In My Craft or Sullen Art” కు చాలా తక్కువమంది నుంచి స్పందన వచ్చింది. కేవలం ఐదుగురు మాత్రమే తమ అనువాదాలు పంపారు. వారిలో భైరవభట్ల కామేశ్వరరావు, గత సంచిక విజేత విజయాదిత్యల అనువాదాల్ని ఎంపిక చేశాం. భైరవభట్ల కామేశ్వరరావు అనువాదం మూలాన్ని చేరువగానూ అందంగానూ ప్రకటించింది. విజయాదిత్య అనువాదం మూలాన్నించి దూరం జరిగినా తనదైన శైలిలో భావం ప్రకటించింది.
భైరవభట్ల కామేశ్వరరావు అనువాదం
దిగులుగొన్న పద్యంలో తడుస్తూ
తీరైన పద్యమో దిగులుగొన్న పాటో,
ఏదో సాధనచేస్తూ
స్తబ్ధమైన నడిరాతిరి
ఒంటరిగా, నెలరాజు ఉద్రేకించే వేళ
తమ సమస్త దుఃఖాలూ చేతుల్లో పొదువుకొని
ప్రేమజంట పక్కమీద ఒదిగిపోయే వేళ
తేటగీతి వెలుగునీడ
నొప్పులుపడుతూ…
ఆశయాలకై కాదు
మృష్టాన్నభోజనాలకై కాదు
ప్రభువుల కేల పల్లకీల మోతలకై కాదు
కేవలమ్ము
ఆ ప్రణయమూర్తుల అతిరహస్యమైన
గుండెచప్పుళ్ళ గుప్పెడు కూలి కొరకు
కాగితాల అలలపైన ఈ చిత్తడి రాతలు
రాత్రి ఉద్రేకుడగు నెలరాజు ఊసు
సరకుసేయని విరసుని కొరకుగాదు
భజనకీర్తనాభారసంభారులైన కీర్తిశేషులకై కాదు,
కేవలమ్ము
తరతరాల దుఃఖాలను చేతలతో పెనవేసుకు
పక్కపక్క ఒదిగిపోవు ప్రేమజంట కొరకు
నజరానా, రోజుకూలి – ఏదీ ముట్టదు నాకు
ఏదీ పట్టదు వాళ్ళకు
నా పద్యమైనా, పాటైనా
విజయాదిత్య అనువాదం
నా విషాదా ‘కృతి’
కదలలేని రాతిరిలో
జాబిలి నిట్టూర్పులతో
ఏ కళనో … ఏ వ్యధనో
ఈ విషాదగీతికనై
తపించుపోదునా! రచించిపోదునా !
ఒకరి బాధనొకరి ఒడిని
పొదువుకున్న వేళలలో
ఒకరినొకరు కౌగిలిలో
కలుపుకున్న జీవులకై
తపించుపోదునా! రచించిపోదునా !
అందరు చూడాలనా?
విందులుచేయాలనా?
మోహవిలాసాలొసగే
మిడిసిపాటు కోసమా!?
బ్రతుకీడ్చే అనామకుల
స్పర్శించని గుండెకై
తపించిపోదునా రచించిపోదునా !
రాజసాల విహారాలు
రంగురంగులుగ జూపే
వందిమాగధులు నుడివే
నుతిగీతం కాదు కాదు
శ్రీభగవానువాచలతొ
మేళాలతొ తాళాలతొ
కీర్తిశేషులకు పాడే
స్మృతిగానం కాదు కాదు
నిటలాక్షుని చూడామణి
సోమించే కిరణాలకు
ఈ జగద్విషనిధిలో
ఎగసే కెరటాల చివర
చెదరే కన్నీటి పుటల
చిత్తడి గీతానికై
తపించిపోదునా రచించిపోదునా !
జనమ జనమ జ్ఞాపకాలు
దోసిళ్ళతొ పట్టుకున్న
వియోగాలు విషాదాలు
హృదయాలకు హత్తుకున్న
ఆ పందిరి మంచంపై
చెరిసగమై అల్లుకున్న
ఓ వలపులతీవియకై
నను తెలియని వారికై
మాటలతో పాటలతో
పనిలేని వారికై
తపించిపోదునా రచించిపోదునా !
—
విజేతలిరువురికీ హార్ధికాభినందనలు. పోటీలో పాల్గొన్న మిగతా వారందరికీ శుభాకాంక్షలు. మీ ప్రాతినిధ్యాన్ని ఆశిస్తున్నాం.