mark

చెప్పుకోండి చూద్దాం – మార్చి 2014

ఈ శీర్షికన ఏదైనా ఒక తెలుగు రచనలోంచి కొంత భాగాన్ని ఉదహరిస్తాం. దాని ఆధారంగా అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. మీ సమాధానాన్ని ఇక్కడ కామెంటుగా గానీ (దాన్ని పెండింగ్ లో ఉంచుతాం), లేదా editor@kinige.com కు మెయిలుగా గానీ పంపవచ్చు.

1

ఈ కథ చదివితే బహుశా మీకు కూడా నా మాదిరిగానే దుఃఖం కలగవచ్చు. అయినా అతని వంటి దౌర్భాగ్యులతో, నిగ్రహం లేని వారితో, పాపిష్టులతో యెప్పుడైనా మీకు పరిచయం కలిగితే, వాళ్ళ కోసం మీరు కొంచెం ప్రార్థించండి. కనీసం అతని వంటి చావు మాత్రం యెవ్వరికీ రాకూడదని కోరండి! మరణం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. కాని, ఆ సమయంలో ప్రేమపూరితమైన కరస్పర్శ లలాటానికి సోకాలి; ఆఖరికి ఒకటైనా కరుణాపూరిత ముఖాన్ని చూస్తూ ఈ జీవితం అంతం కావాలి; చివరికి ఒక్కరి కంటి నుంచైనా కన్నీటి బిందువు రాలటం చూసి ప్రాణాలు వదలాలి. చాలు, ఇంతకంటే పెద్దకోరికలు అనవసరం!

2

మగతనిద్రలో నుంచీ ఉలికిపడిన వాడిలా వున్నట్టుండి మేలుకున్నాడు. శరీరంపైన ఏదో మెత్తని వస్తువు పరుచుకుంటున్నట్టు ఓ స్పృహ కలిగిందతనికి! విప్పారిన అతని కళ్ళకు అంగవస్త్రపు పొరలో నుంచీ మంచం దాపున ఓ ఆకారం నిల్చుని వున్నట్టు లీలగా భాసించింది. ముఖం పైనుంచి బట్టను తొలగించడానికి అతడి చేతులు కదిలాయో లేదో, ఆ చలనాన్ని పసిగట్టి తన చేతుల్లోని శాలువా అంచుల్ని అలాగే అతనిపైకి వదిలిపెట్టి, మంచం దాపున నిల్చున్న ఆ ఆకారం చీకటిలోకి జారిపోసాగింది. అతను తటాలున చేయిసాచి ఆ ఆకృతిని దగ్గరికి లాక్కోబోయాడు. కానీ అప్పటికే ఆ నీడలాంటి ఆకారం చేయి దాటిపోయింది. అతని చేతికి జడ మాత్రం దొరికింది. ఆ జడ కూడా ఒకటి రెండు క్షణాలు గిలగిలలాడి చేతి వ్రేళ్ళ మధ్య నుంచీ జారిపోయింది. జడ పొడుగున గ్రుచ్చుకున్న చేమంతుల్లో నాలుగు పువ్వులు మాత్రం అతనికి దక్కాయి.

ప్రశ్న:—

పైన ఇచ్చిన రెండు రచనా భాగాలూ రెండు రచనల ముగింపు దగ్గర ఉంటాయి. ఒకటి కథ, ఒకటి నవల. మరీ సులభంగా అర్థమైపోకుండా ఉండటానికి పాత్రల పేర్ల స్థానంలో సర్వనామాలు వాడాం. ఆ రచనల పేర్లేమిటో, రచయితల పేర్లేమిటో చెప్పండి. తగిన బహుమతి ఉంటుంది.

*

గత సంచికలో అడిగిన మూడు ప్రశ్నలకూ కేవలం ఒక్క సమాధానమే వచ్చింది. సరైన జవాబులివి:—

smile

1. మొదటి ప్రశ్నలో ప్రస్తావించిన కవితలోని పంక్తులు స్మైల్ రాసినవి. ఆయన “ఖాళీసీసాలు” కథ ప్రసిద్ధం.

ViswanathaSatyanarayana

2. రెండవ ప్రశ్నలో ఇచ్చిన పేరాలో చుక్కల ద్వారా లుప్తం చేసిన రచయిత విశ్వనాథ సత్యనారాయణ. ఆ వృత్తాంతం అబ్బూరి రాజేశ్వరరావు ద్వారా తెలిసింది.

Gopichand

3. మూడవ రచనా భాగం త్రిపురనేని గోపీచంద్ “అసమర్థుని జీవయాత్ర” లోది. ఆ నవల్లోని ఏంటీ హీరో సీతారామారావుకి ఇలా ఉద్భోద చేస్తున్న పాత్ర పేరు రామయ్య తాత.

ఈ మూడు జవాబుల్నీ సరిగ్గా ఇచ్చిన వారు గొరుసు జగదీశ్వర రెడ్డి. ఆయనకు శుభాకాంక్షలు.

Posted in 2014, చెప్పుకోండి చూద్దాం, మార్చి and tagged , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.