cover

ఇస్కూలు బ్యాగు

Download PDF ePub MOBI

బడ్నుంచి ఇంటికోయి దర్వాజల నిలవడే పుస్తకాల సంచి ఇంట్లకి ఇసిరికొట్టి, నందుగాడు ఆటకు ఉరుకవోతుండు. ఇంటెన్క గూసోని బీడీలు జేత్తున్న లక్ష్మమ్మ “అరేయి.. నందుగా” అని కేక వెట్టింది. అమ్మ దేనికి పిల్తుందో ఆడికి తెలుసు. బీడీల దారం బింగిరికి సుట్టాలని నిన్న జెప్తే, లెక్కలసారు ఇంటిపని బాగిచ్చిండని అవద్దమాడి ఎగ్గొట్టిండు. గిప్పుడు ఇంట్ల డుగువెడితే కాళ్ళిరగ్గొట్టి దారం జుట్టిపిస్తది. గందుకే ఇనవడ్డా ఇనవడనట్టే నందుగాడు ఉరుకుతుండు. “అరేయి.. నందుగా సత్తుముద్దల్జేసిన తినివోరా” అని మళ్ళా కేక వెట్టింది లక్ష్మమ్మ. సత్తు ముద్దలనేవరకి నందుగాడి నోట్ల నీళ్ళు ఊర్నయి. గుర్రానికి కళ్ళెం ఏసినట్టు టక్కున ఆగి ఇంట్లకచ్చిండు. “ఏడున్నయ్ అమ్మా?” అని అంటింట్లో ఎనుకులాడుతుంటే, “నేనిత్తగాని, గాడున్న రెండు దారం పొట్టీలు ఇటు వట్కరారా” అంది. గప్పుడు తెలిసింది నందుగాడికి, “అమ్మ నాకు సత్తు ముద్దలద్దు, గిత్తు ముద్దలద్దు” అని అవుతలకి ఉరుకవోతుంటే, ఆకులో తంబాకేసి సుడ్తు “ఇయ్యాల్ల బీడీల దారం సుట్టకవోతివో ఇస్కూలు బ్యాగు కొనీమన్నప్పుడు జెప్తా నీ సంగతి” అని బెదిరిచ్చింది లక్ష్మమ్మ.

కొత్తగ బడి దెరిసినప్పట్నుంచడుగుతుండు, “అమ్మా నాకు ఇస్కూలు బ్యాగు కొనియ్యవే.. అమ్మా నాకు ఇస్కూలు బ్యాగు కొనియ్యవే..” అని. యాడాది పరీచ్చలు దగ్గరికొచ్చినయి, ఇగ బడి గూడ బందయితది, గిప్పటిగ్గూడ కొనియ్యలే. నందుగాడి దోస్తులల్ల ఆడి లెక్క బట్టసంచి భుజానికేస్కోని బడికెవ్వడూ పోడు. ఇస్కూలు బ్యాగు ఈపుకేస్కోని పోతరు. నందుగాడ్కి గూడ ఆల్ల దోస్తుగాళ్ళ లెక్క ఇస్కూలు బ్యాగు ఈపుకేస్కోని పోవాలని బాగా ఖాయిషు. ఈడి ఖాయిషుని గిసోంటప్పుడు క్యాష్ చేస్కొని బెదిరిత్తుందని అమ్మ మీద నందుగాడి పిరాదు.

Untitled“మళ్ళా ఇస్కూలు బ్యాగు ఎప్పుడు గొనిత్తవు జెప్పు” అనడిగిండు నందుగాడు. గిట్లా అడిగిడంటే ఈడు తొవ్వకొచ్చిండని లక్ష్మమ్మకి తెలిసిపోతది. యాడికి వోతవు బిడ్డా అన్నట్టు నందుగాడి దిక్కు ఓ సూపు జూసి బీడీ తోకొత్తుకుంటూ “బీడీల పైసలచ్చినంక” అని జెప్పింది. అయితే లక్షమ్మ గిట్ల మస్తు సార్లు జెప్పింది, మస్తు సార్లు బీడీల పైసలచ్చినయి.. పోయినయి. నందుగాడి ఇస్కూలు బ్యాగయితే రాలే. అయిన గూడ ఆడికి ఆశ సావక “గిప్పుడు బీడీల పైసలొచ్చినంక నిజంగనే కొనిత్తవానే” అని అడిగిండు. అప్పటిదాకా జేసిన బీడీలు ఎన్నయినయో వాటి మూతుల్లెక్కవెడుతూ “గిప్పుడు దారం జుట్టకపోతివో బరబ్బరి కొనియ్యా” అన్చెప్పింది.

ఇగ నందుగాడు సేసేది లేక, సక్లముక్లం ఏసి మోకాళ్ళకు దారం పొట్టీసుకొని బింగిరికి దారం సుట్టుడు వెట్టిండు. కాని ఆడి జివునవంతా ఆట మిన్నే ఉంది. సూరిగాడు నిన్న గోఠిలాటల తొండివెట్టి నందుగాడి సగం గోఠీలు దొబ్బిండు. ఇయ్యాల్ల ఎట్లయినా ఆడి గోఠిలన్నీ దొబ్బాలనుకున్నడు. ఇగ యాడాది పరిచ్చలని రేపట్నుంచీ సూరిగాడు ఆటకు రానన్నాడు, పరీచ్చలయినంక ఆళ్ళ అమ్మమ్మ ఇంటికోతడు, నందుగాడి గోఠిలన్నీ ఆడికాన్నే ఉంటాయి. గీదంతా లక్ష్మమ్మకు జెప్పాలనుకునుండు. కానీ “గోటీలాటకి పోతానే” అంటే ఈపు సాపు జేత్తదని ఊరుకుండు.

లక్షమ్మ బీడీల సాట పక్కకు వెట్టి సేతులు కడుక్కొని అంటింట్లకోయింది. ముంతల మూడు సత్తు ముద్దలు తెచ్చి నందుగాడి ముందు వెట్టింది. ఇగ హుషారొచ్చి మూడు దారం పొట్టీలు సుట్టేసిండు.

యాడాది పరిచ్ఛలయినయి, బడి బందైంది, అమ్మమ్మ, నాయినమ్మ ఊర్లకు తిరిగచ్చుడయింది. ఇగ నాలుగొద్దులయితే మళ్ళా బడి తెరుత్తరు. గప్పుడు యాదికొచ్చింది నందుగాడికి, ఇస్కూలు బ్యాగు సంగతి. “ఏడో తరగతి పోతున్న, స్కూలు బ్యాగు లేకపోతే నా దొస్తులందరు ఎక్కిరిత్తరు. అమ్మను కొనియవంటెనెమో బీడీల పైసలంటది. సప్పుడు జేయక బొంబాయిల ఉన్న బాపుని ఇస్కూలు బ్యాగు పంపియమనాలే. గీడకన్న గాడ మస్తు ఉంటయి. దోస్తుగాళ్ళ దగ్గర గుడ బొంబాయి నుండి మా బాపు ఇస్కూలు బ్యాగు పంపిండని బడాయి కొట్టచ్చు” అని అనుకోంగనే నందుగాడికి హుషారొచ్చింది.

బీడీల ఆకు కత్తిరిత్తున్న లక్ష్మమ్మ దగ్గరికి వొయి, “అమ్మా బాపుకి జల్ది లెటర్ రాయాల్నె” అని అన్నాడు. “గిప్పుడెందుకురా! మొన్న రాసిందే ఇంక ముట్టిందో లేదో.. బాపు దగ్గర్నుండి లెటర్ అచ్చినంక మనం రాద్దాం గని, గీడ గూసోని ఆకు నార తీయి” అంది లక్ష్మమ్మ. ఇస్కూలు బ్యాగు జల్ది పంపమని లెటర్ రాయాల్నే అన్జెప్దామనుకున్నడు, మళ్ళ ఏమంటదో అని అనుమాన పడ్తుంటే “ఆకు నార తీయవంటే నోరు తెరిసి జూస్తున్నవేందిరా” అని లక్షమ్మ అనంగనే తెరిసిన నోరు మూసుకొన్నడు. “బళ్ళె పుస్తకాలిత్తరు గాని, ఇస్కూలు బ్యాగు ఇయ్యరు. ఇస్కూలు బ్యాగు లేకుండా పుస్తకాలెట్ల బడికి తీసకత్తరు” అని అనుకుంట నార దీసుడు మొదలువెట్టిండు.

తెల్లారి బీడీల గంప తీస్కోని బీడీల ఖార్కానాకి పోతుంటే సూరిగాడు పిలిసిండు. “ఒరేయి దుబాయి నుంచి మా బాపొచ్చిండు, నాకు కొత్త ఇస్కూలు బ్యాగు కొనిచ్చిండు… ఇగ జూడు” అని నందుగాడికి చూపిచ్చిండు. నందుగాడికి గా స్కూలు బ్యాగు మస్తు నచ్చింది. కొనుక్కుంటే గిసోంటిదే కొనుక్కోవాలనుకున్నడు. నందుగాడికి మస్తు ఈర్ష గూడ పుట్టింది. గంతల్నే, “గిదేం ఇస్కూలు బ్యాగు మా బాపు బొంబాయి నుండి ఇస్కూలు బ్యాగు పంపిత్తడు, గసోంటిది మన బళ్ళనే ఎవ్వల దగ్గరుండదిగ” అని బడాయి కొట్టిండు.

ఎట్లయినా ఇస్కూలు బ్యాగు కొనుక్కోవాలని నందుగాడికి పగలు రాత్రి గదే రంధి పట్టుకుంది. పాత కాపీల్నుంచి జంటకమ్మ చింపి బొంబాయిల ఉన్న బాపుకి లెటర్ రాసుడు మొదలువెట్టిండు.

ఓం

పూజ్యులైన తండ్రి గారికి మీ కుమారుడు నల్లపాలు నందుగాడు నాంపల్లి నుండి స్వహస్తాలతో రాయునది ఏమనగా నేను క్షేమంగా ఉంటిని, అమ్మ కూడా క్షేమంగా ఉందని తెలియజేస్తుంటిని. మీరు కూడా క్షేమమని తలచితిని. ఆరోవతరగతిలో నేను ప్రథమ శ్రేణిలో పాసయితిని. ఇప్పుడు ఏడోవ తరగతికి పోవుచుంటిని. కాని నాకు స్కూలు బ్యాగు లేదని రోజు చింతించుచుంటిని. నా మిత్ర బృందం కూడా నాకు స్కూలు బ్యాగ్గు లేదని అవమానపరుస్తున్నారని తెలియజేస్తుంటిని. కనుక మీరు నాకు ఒక స్కూలు బ్యాగు పంపించగలరని కోరుచుంటిని.

ఇట్లు

మీ కుమారుడు,

నల్లపాలు నందుగాడు

- “నేను మీకు ఈ లేఖ రాసినట్టు అమ్మకు తెలియదని మీకు తెలియజేస్తుంటిని. మీరు కూడా చెప్పకూడదని కోరుకుంటుని”

ఇంతేసంగతులు

మళ్ళీ ఇట్లు

మీ కుమారుడు

నల్లపాలు నందుగాడు

బళ్ళె నేర్పిన “లేఖా రచన” ని యాదికి తెచ్చుకొని నందుగాడు ఆ లెటర్ రాసి పోస్ట్ బాక్స్‌లో యేసిండు.

ఇగ నందుగాడు పిట్టకు వెట్టినట్టు రోజు పోస్ట్‌‍మాన్ కోసం ఎదిరి జూత్తుండు. పోస్ట్‌మాన్ అత్తుండు గాని బాపు దగ్గర్నుండి లెటర్ తెత్తలేడు. సూడగా.. సూడగా.. ఓ రోజు లెటర్ అచ్చింది. ఆశగా చింపి సదివితే దాంట్ల ఈ స్కూల్ బ్యాగు సంగతే లేదు. “ఇగ బాపు దగ్గర గూడ పైసల్లేనట్టున్నయి” అని అనుకుండు. బీడీలన్నీ జమాయించి కట్టలు కడుతున్న లక్ష్మమ్మ దగ్గరకోయి “అమ్మా.. అమ్మా.. గిప్పుడు నేను ఏడో తరగతికి వోతున్న గదనే.. గిప్పుడన్న ఇస్కూలు బ్యాగు గొనిత్తవా?” అని అడిగిండు. “బడి తెరిచినంక సూద్దాం గని.. గా సంచిలో ఆకు తీసి తడుపుకొని రాపో” అని అంది. యాడాది నుంచి గిట్నే జెప్తుందని కోపం, దుఃఖం తన్నుకొచ్చాయి. “నేను జెయ్యను పో.. నాకేం తెల్వది.. నాగ్గిప్పుడు ఇస్కూలు బ్యాగు కొనియి” అని ఏడుసుడు వెట్టిండు. “అరేయి.. గిట్ల ఏడుసుడు గీడుసుడు వెట్టి మొండికెత్తే, అసలుకే ఎసరత్తది బిడ్డా.. ఆ.. జెప్పిన గదా.. బీడీల పైసలచ్చినంక కొనిత్తా అని”

“గిట్లనే మస్తు సార్లు జెప్పినవు.. ఎప్పుడు కొనిచ్చినవ్” అంటూ నందుగాడు కిందవడి బొర్రుతూ.. కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుసుడు వెట్టిండు.

లక్ష్మమ్మకు కోపమచ్చి నందుగాడి ఈపుల నాల్గు జరిసింది. వాడు ఊరంత ఇనవడెట్టు ఏడ్సి ఏడ్సి మూలకు వోయి, ముడుసుకొని పన్నడు. కడుపుల కాల్తే వాడే లేత్తడని లక్ష్మమ్మ బీడీల ఆకు తడుపుకుంది.

గా రాత్రి నందుగాడు నిద్రల “అమ్మా.. స్కూలు బ్యాగు కొనియ్యే.. అమ్మా స్కూలు బ్యాగు కొనియ్యే” అని ఒకటే కలవరిచ్చుడు పెట్టిండు. గిద్జూసి లక్ష్మమ్మ కండ్ల నిండా నీళ్ళు తిరిగినయి.

తెల్లారి, లక్ష్మమ్మ పక్కింటి పార్వతమ్మ దగ్గర పచ్చనోటు చేబదులు తీసుకొంది, నందుగాడికి ఇస్కూలు బ్యాగు కొనిద్దామనుకుంది, గాని నందుగాడికి జరం ఎక్కో అయి ఆ పచ్చ నోటల్లా డాక్టర్ పీజుకి, మందులకే కరిగిపోయింది. నందుగాడికి పెయిల జరం మగ్గింది గాని మనసుల మనాది మాత్రం గట్లనే ఉంది. బీడీల పైసలచ్చినంక ఎట్లయిన స్కూలు బ్యాగు గొనిత్తా అని లక్ష్మమ్మ పమాణం జేత్తే గాని వాడు మంచిగాలే.

వారం రోజులు గడిసినంక బీడీల పైసలచ్చినయి. ఇగ నాకు ఇస్కూలు బ్యాగు కొనిత్తరని నందుగాడు సంబరంగా ఖార్కానకు పోయిండు. ఎప్పుడు వెట్టినట్టే బీడీల ఫారంల పైసలు వెట్టి నిక్కరు జేబులో దోపుకున్నడు. బీడీల ఖార్కనా నుండి ఉరుక్కుంటు, ఉరుక్కుంటు ఇంటికొచ్చిండు. లక్ష్మమ్మ ఇంటెనకుంది. జెబులకెళ్ళి తీత్తే బీడీల ఫారం భద్రంగా ఉంది. గాని గా ఫారంల పెట్టిన పైసల్లెవ్వు. పైసలు కనవడకపోయేసరికి నందుగాడి గుండాగినంత పనయింది. వాడొచ్చిన తొవ్వెంబడి యెనుకకు పోయి, ఏడుస్కుంటూ ఎంత ఎతికినా దొరకలే. గజ గజ వణుకుతు కడపల అడుగువెట్టిండు. అమ్మను జూసుడుతోనే మగ్గిందనుకున్న జరం సల సల మసులుతూ పొంగి కళ్ళకు చీకట్లు కమ్మి షోషచ్చి కిందవడ్డడు.

గా రాత్రి నిద్రలో “అమ్మ.. ఇగ నాకు ఇస్కూలు బ్యాగు వద్దె, అమ్మా.. ఇక నాకు ఇస్కూలు బ్యాగు వద్దే” అని ఒకటే కలవరిస్తానే ఉన్నడు.

బీడీల ఖార్కానాలో నిక్కరు జేబులో పెట్టుకునేటప్పుడే ఫారంల నుంచి పైసలు కిందవడిన సంగతి, పక్కకు నిల్సున్న సూరిగాడి అమ్మ జూసి లక్ష్మమ్మకి ఇచ్చిన సంగతి, బొంబాయి నుండి బాపు స్కూలు బ్యాగు తెస్తున్న సంగతి.. పాపం నందుగాడికి గా రాత్రి తెల్వది.

*

Download PDF ePub MOBI

Posted in 2014, కథ, మార్చి and tagged , , .

4 Comments

 1. కథ అదిరింది! మీరు తెలంగాణ యాసను పట్టుకున్న విధానం కాని, నందుగాడి need ని portray చేసిన విధానంగాని చాలా బగున్నాయి. And that letter was just hilarious. కానీ, సురభిగారనట్టు, కథ హఠత్తుగ ముగిసింది. ఇంకొంచెం elaborate చెసుంటే ఇంకా చాలా బాగుండెది. Nevertheless, wonderfully written.

 2. కొన్ని కథలను ఏదో రెండు లయిన్లు చదివి వదిలేద్దాం అనుకుంటా … కాని అవి నా పిలక పట్టుకుని కథ పూర్తి చదివేదాకా వదలవు. ముఖ్యంగా ఇలాంటి మాండలీక కథలు. కథ బాగుంది. ఎందుకు పారేస్తాను నాన్నా (చాసో) కథ మనసులో మెదిలింది.
  ఉత్తర తెలంగాణ లోని ఒక బీద కుటుంబం కళ్ళకు సాక్షాత్కరించింది.

 3. ఆనంద్ గారు
  బాగుంది.
  యాసను ఎంత బాగా పట్టుకున్నారు ! ఇలాంటి సంబాషణలు విన్న వారికే తప్ప మిగితా వారికి అంత తొందరగా అర్ధం కావడం కష్టం.
  ఒక ప్రాంతంపు పళ్ళెలొని రొజువారి సంబాషణ చాలా బాగా వాడారు కధలో.
  ఒక్క Cash చేసుకొవడం అన్న పదం కొంచెం మార్చి వుండవచ్చునేమో
  ఇక కధ ముగింపు అసంపూర్ణంగా అనిపించింది తొందరపడి ముగించినట్టు.
  చాలా మంచి ప్రయత్నం.

  సురభి

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.