Q

చెప్పుకోండి చూద్దాం

ఈ శీర్షికన ఏదైనా ఒక తెలుగు రచనలోంచి కొంత భాగాన్ని ఉదహరిస్తాం. దాని ఆధారంగా కింద అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. సరిగ్గా గుర్తించిన వారికి బహుమతులు.

1.

ఆకాశం పక్క మీద వెన్నెల పూలు జల్లుకుని రాత్రిని అనుభవించిన చంద్రుడు కూడా నిష్క్రమణానికి ఆయత్తమవుతున్నాడు. భూమి చుట్టూ దోమతెర కట్టినట్టూ ఉంది వెన్నెల.

“వెళ్ళి వస్తాను” అంటూ అడుగు ముందుకు వేశాడు. తలుపు తీసుకుని బయటకు రాబోతూ చివరిసారి ఆమె వైపు చూశాడు. చూరు నీడలో ఆమె మొహం అస్పష్టంగా కనిపిస్తూంది. ఆమె ముందుకు వస్తుందేమో, చివరిసారి నవ్వుతో వీడ్కోలు ఇస్తుందేమో అని ఒక క్షణం వేచి వున్నాడు.

ఆమె రాలేదు. శిలలా అక్కడే నిలబడి వుంది. అతడు రవ్వంత ఆశాభంగం చెంది, ఇది తాత్కాలికమే కదా అన్నట్టూ సర్ది చెప్పుకుని, అడుగు వేశాడు.

అటు అతడు కదలగానే ఆమె చప్పున తలుపు దగ్గిరకొచ్చింది. విశాల విశ్వంలోకి ఒంటరిగా సాగిపోతున్న అతడిని కనులారా చూసింది. అతడు చీకటిలో కలిసిపోయేవరకూ అలా చూస్తూనే ఉంది.

ఓ చంద్రుడా! విషంతో కలిసి పుట్టిన నువ్వు, విషం తాగిన వాడి నెత్తినలంకరించి, తిరిగి ఆ జుట్టుపాయల్లో విషసర్పాల మధ్య నెలవున్న నువ్వు – నీ నుండి ఇంతకన్నా ఏం ఆశిస్తాంలే? ఓ చంద్రుడా! నీ వెలుగులో నా చెక్కిలిపై నిలిచిన కన్నీటి చుక్క చివరిసారి మెరిసి, ఆ మెరుపు అతడిని కర్తవ్య విముఖుణ్ణి చేసి, తిరిగి వెనక్కి రప్పిస్తుందేమో అన్న భయమే లేకపోతే… ఈ రాత్రి నువ్వు ఇంత వెలుగుని కురిపించకుండా వుండి వుంటే ఒకసారి అతడి చేతుల్ని స్పృశించి, చివరి వీడ్కోలు చెప్పి వుండేదాన్ని.

ప్రశ్న: ఈ భాగం ఏ రచనలోది? ఏ సందర్భంలోది?

2.

ఇతను (క్లబ్బుకి) రాగానే ఇంతవరకు హుషారుగా మాట్లాడుతున్న వ్యక్తులు జోరు తగ్గించి మెల్లగా మాట్లాడడం మొదలెడతారు. వాళ్ళు అంతవరకూ తన విషయమే మాట్లాడుకుంటున్నారనీ, తన్ని చూడగానే విషయం మార్చేస్తున్నారనీ యితని అనుమానం.

వారు చెప్పుగునే రహస్యాలేమిటో తెలుసుకోకపోతే అతనికి పిచ్చెక్కేటట్లుగా ఉంది. సంఘం ఏమనుకుంటున్నదీ నా కక్కర్లేదనుకునే వ్యక్తి, సంఘం దాచుకున్న రహస్యాన్ని భేదించే యత్నాలెందుకు చేస్తాడో, ఒక వ్యక్తి బాధపడుతుంటే సంఘానికి సరదా కాబోలు. సంఘం వేసిన తారు రోడ్డమ్మట నడవక పొదల్లోంచి వేరే కాలిమార్గం చేసుకుని నడిచే వ్యక్తి సంఘాని కంత వినోదం కలిగించినప్పుడు, ఆ వ్యక్తికి సంఘం తన కృతజ్ఞత తెలియపరుస్తూ, ఆయనకొక రాతి శిల్పం చెక్కించి నడిరోడ్డులో ప్రదర్శించొద్దు? అతన్ని గురించి అనుకుంటున్నారన్న భావంలో కొంత గర్వం లేకపోలేదు. మంచో, చెడో ఏదో చెయ్యడంలో వోటమి లేదు. ఏమీ చెయ్యకపోవడంలో వుంది వోటమి. సంఘం ఏమీ చెయ్యదు. ఆఫీసుకెడుతుంది, భోజనం చేస్తుంది, పేకాడుతుంది, పిల్లల్ని కంటుంది. ఎవడో ఏదో చేస్తుంటే వింతగా చూసి, అది చెడేనని నిర్ణయించి ఆ చెడుగులో ఆనందం పొంది తృప్తి పడుతుంది.

ప్రశ్న: ఈ పుస్తకం మీ దగ్గరుంటే అందులో ఇది ఏ అధ్యాయంలో వస్తుందో చెప్పగలరా?

(Image Courtesy: http://www.flickr.com/photos/55255903@N07/6835060992/)

Posted in 2013, Uncategorized, చెప్పుకోండి చూద్దాం, డిసెంబరు.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.