awakening_Mohan

కల జారిన మెలకువ

Download PDF ePub MOBI

గై డి మొపాసా (Guy de Maupassant) రాసిన “The Awakening” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది. ఈ సంచిక నుంచి నరేష్ నున్నా నెలకొక్క మొపాసా అనువాదాన్ని అందించబోతున్నారు.

కల జారిన మెలకువ

గై డి మొపాసా

పెళ్ళయిన మూడేళ్ల వరకూ మెట్టినూరు వాల్ డి సిరెని విడిచి ఆమె ఎన్నడూ అడుగు బైటపెట్టలేదు. ఆమె భర్తకి ఆ ఊళ్లో రెండు కాటన్ మిల్లులుండేవి. పిల్లలు లేకపోయినా ఆమె చీకూచింత లేని జీవితాన్ని గడిపేది. పచ్చని గుబురుచెట్ల మధ్య ఒదిగి ‘రాజమహల్’ అని పనివాళ్లు పిలిచే లంకంత ఇంట్లో ఆమె ఏకాంతంగా, ఆనందంగా ఉండేది.

వాస్యుర్ ఆమె కన్నా చాలా పెద్దవాడైనా, ఆమె పట్ల ఎనలేని అనురాగం చూపించేవాడు. ఆమె కూడా అతనిని ఎంతో ప్రేమించేది. ఏ విధమైన చెడు తలంపు ఆమె మనసులోకి చొరబడేది కాదెన్నడూ. ఆమె తల్లి ప్రతి వేసవికి సిరె వచ్చి, మళ్ళీ ఆకురాలు కాలం మొదలై చలికాలం ప్రారంభమవుతున్నప్పుడు తిరిగి ప్యారిస్ వెళ్లిపోతుండేది.

ఏడాదికి ఐదు నెలలు దట్టమైన మంచుని మోస్తూ మంద్రంగా పారే నది ఇరుకులోయని ఒరుసుకుంటూ మరింత గాయపడేది. అటువంటి వాతావరణ ప్రభావంవల్ల జెన్నికి ప్రతి శిశిరంలో దగ్గు వస్తుండేది. బయళ్ళ మీద ఆవరించిన పల్చని మంచు తెర ఆ పల్లపు ప్రాంతమంతా ఒకానొక సరస్సుని తలపించేది. ఆ సరసు నుంచి మొలుచుకొచ్చినట్టు కనిపించేవి ఇంటి పైకప్పులు. దీనికి తోడు అలలా కదిలే పొగమంచు పరిసరాల్ని యావత్తు చుట్టేసి ఆ లోయనొక మార్మికలోకంలా, మనుషుల్ని అక్కడ తచ్చాడే ప్రేతాత్మల్లా మార్చేది. తేమలో మంచులో చెట్టు చేమా సర్వం కూరుకుపోయి పదిగజాల దూరంలో కూడా ఒకరినొకరు పోల్చుకునే పరిస్థితులు ఉండేవి కావు.

పొరుగున ఉన్న కొండల మీద వెళ్తుండే వారికి లోతైన తెల్లని దిగులు లోయలో గుబులుకుంటూ పొగలుకక్కే రెండు గొట్టాలు కనిపించేవి, ఆ మంచు తెరల ఎగువున. అవి వాస్యుర్ మిల్లుల పొగగొట్టాలు. దూదిపింజల్లాంటి మబ్బులతో కూర్చినట్టుగా ఉండే ఆ లోతైన లోయలో ఆ గొట్టాలు రేయింబవళ్ళు కక్కే నల్లని పొగే అక్కడ జనం అలికిడికి ఏకైక సాక్ష్యం.

ఆ ఏడాది అక్టోబర్‌లో ఆ లోయలోని తేమగాలి బలహీనమైన ఆమె ఊపిరితిత్తులకు ప్రమాదకరమని హెచ్చరించారు డాక్టర్లు. ప్యారిస్‌లో తన తల్లి దగ్గర ఆ చలికాలమంతా గడపటం మంచిదని సలహా ఇచ్చారు. దాంతో ఆమె ప్యారిస్ మకాం మార్చింది. మొదటి నెలరోజుల వరకూ ఆమె మనసు మనసులో లేదు. భర్త ఇంటికి సంబంధించిన ఆలోచనలే ముసిరేవి. తన కుదుళ్లేవో అక్కడే ఉన్నట్టు అక్కడి ధ్యాసే. ఆ ఇంట్లో తాను ఇష్టంగా అమర్చుకున్న ఫర్నిచర్ గురించి కూడా ఆలోచిస్తుండేది. అయితే క్రమేణా కొత్త జీవితంలోని సరదాలకి అలవాటు పడటం ప్రారంభించింది. విందులు, వినోద ప్రదర్శనలు, హుషారు సాయంత్రాలు, బాల్‌రూమ్ డాన్సులు… ఏవో వింతైన కొత్త మోజులు.

అప్పటి వరకూ ఆమె ఓ ముగ్ధ. ప్రతి కదలికలో ఏదో బెరుకు, సోమరితనం, బిడియమైన నడకలు, అంతలోనే అలసిసొలసినట్టు బరువైన చిర్నవ్వులు. కానీ ఇప్పుడు ఆమెలో కొత్త చైతన్యం, ఉత్సాహం, సుఖభోగానికి సన్నద్ధమైన దుందుడుకుతనం. అనాది స్త్రీత్వం కట్టలు తెంచుకొని తనలో విజృంభించినట్టుగా తోచేది. ఈ స్వాతిశయ స్త్రీత్వ పరిమళాన్ని ఏమాత్రం ఏమారని పురుష పుంగవులు ఆమె చుట్టూ తుమ్మెద ఝంకారాలై మూగారు. వారి సరస ప్రియ మధుర భాషణలు ఆమెని పరవశింపజేసేవి. వారి ధీర పటాటోపాన్ని ఆమె ఆటపట్టించేది. అయితే, వారి బారి నుంచి తనను తాను కాపాడుకోగలనని ధృఢ విశ్వాసం ఆమెకి. పెళ్ళితోనే ప్రేమ గురించి బోలెడు బోధపడి, ఆ పదం అంటేనే విసిగిపోయిన ఆమెకి స్వీయరక్షణ పెద్ద కష్టమనిపించలేదు.

సూదంటు మీసాలు మొలిచే ఈ మగకీటకాల మోటు కౌగిళ్లకి తన శరీరాన్ని అప్పగించడమనే ఆలోచనే ఆమెకి వెగటుగా ఉండేది. అలా అర్పించుకోవడానికి ఎలా మనస్కరిస్తుందో ఆమెకి అంతుపట్టేది కాదు. ముక్కూమొహం తెలియని వాళ్లతో ఈ ఆడవాళ్ళు రంకు ఎలా పెట్టుకుంటారో అనుకుంది ఆమె. మొగుళ్లకి లొంగడమే నీచమనుకుంటే, అలా పరాయి మగాళ్ళ కోసం కూడా ఎందుకు వెంపర్లాడతారో ఆమెకి బొత్తిగా అర్థమయ్యేది కాదు. ఆత్మల ఆలింగనం వంటి నిష్కల్మషమైన ముద్దులకి పరిమితమైపోయి అచ్చం స్నేహితుల్లా సహజీవనం చేయగలిగినట్లయితే తన భర్తని మరింకెంతో ప్రేమించి ఉండేది.

అయితే, తన చుట్టూ వెంటపడే మగాళ్ళ పొగడ్తలకి తాను ఎంతో మురిసిపోయేది. శంఖం వంటి చెవిలో ఒంపులు తిరుగుతూ జారే వారి ప్రణయ కవిత్వాలు ఆమెకిచక్కిలిగింతలు పెట్టేవి. ఆమె ఎంతమాత్రమూ ఆమోదించలేని వాంఛ వారి కళ్ళలో నెత్తుటి జీరలా మెరుస్తుండగా వారు ఆమె అందాన్ని ప్రశంసించేవారు. పెద్ద విందులు తర్వాత వారి ఇళ్ళకు తిరుగు ముఖం పడుతూ ఏవో ప్రేమ సందేశాలు ఆమె చెవిలో గుసగుసలాడేవారు. మంద్రంగా స్పష్టాస్పష్టంగా అవి వినిపించడం వల్ల ఎక్కువ భాగం ఆమె ఊహించుకోవాల్సి వచ్చేవి. ఆ కొంటె మాటలు, ప్రేమ సందేశాలు ఆమె రక్తాన్ని ఉద్రేకించకపోయినా, హృదయాన్ని తాకకపోయినా, ఆమె ఆంతరంగిక చాంచల్యాన్ని తట్టేవి; లోలోపల ఏదో తీయని మంట రేపేవి; కళ్ళు ప్రకాశించి, పెదాలు అరవిచ్చుకునేవి తమకంగా. ఎవరూ చొరబడని ఆమె మది గది చిరుగమకంతో కంపించేది.

ఓపలేని మోహంతో నలిగిపోతూ, సంకోచపడుతూ, వణుకుతూ పురుషుడు తన ముందు మోకరిల్లే సూర్యాస్తమయ వేళల్లో తరచూ దొర్లే అటువంటి సగం సగం సంభాషణలంటే ఆమెకి వల్లమాలిన ఇష్టం. అతనలా వాంఛాగ్రస్తుడై తనకు పాదాక్రాంతమై పోతున్నప్పుడు తాను కించిత్తయినా కరగకుండా, పట్టు సడలనీకుండా తల కదలికతో తృణీకరిస్తూ, పెదాల విరుపుతో నిరాకరిస్తూ తన చేతులను విడిపించుకోడంలో ఆమె వింతైన ఆనందాన్ని అనుభవిస్తుంది. దీపాలు వెలిగించేందుకు పనివాడ్ని పిలిచి, ప్రేమ బిచ్చగాళ్ల వేడికోళ్ళకి అంతరాయం కలిగించడంలో భలే తమాషా అనుభవించేది. పనివాడి అడుగుల సవ్వడి విని తన ముందు మోకాళ్ళ మీద కూలబడి దేబిరిస్తున్న ప్రేమికుడు రోషంతో, అవమానంతో దిగ్గున లేవడం కూడా ఆమెకి సంబరాన్ని కలిగించేది. ప్రజ్వలించే ప్రేమాలాపనలన్నీ ఒక్కసారిగా గడ్డకట్టేలా ఆమె తరచూ నవ్వేది, వెటకారంగా. చాలా కఠినంగా కూడా మాట్లాడేది, ప్రగాఢమైన వారి ప్రశంసల మీద చన్నీళ్ళు కుమ్మరిస్తూ. అప్పుడు ఆమె గొంతులో ధ్వనించే కాఠిన్యం చాలు ఆమెని నిజంగా ప్రేమించిన వాడు ఆత్మహత్య చేసుకోవడానికి.

ఆమెనలా ప్రాణాధికంగా ప్రేమించిన వారు ఇద్దరున్నారు. ఒకరితో ఒకరికి ఏ మాత్రం పొంతనలేని వారా ఇద్దరు ప్రేమికులు. ఒకడు పాల్ పెరొనెల్. పొడగరి, గడసరి. చాలా సరదా యువకుడు. ప్రేమ వ్యవహారాల్లో ఆరితేరినవాడు. సహనంగా వేచి చూడటంలో, అదను చూసి అవకాశాన్ని చేజిక్కించుకోవడంలోనూ బహునేర్పరి. మరొకడు ది ఎవంసెల్లి. మొదటిసారి ఆమెని సమీపించినప్పుడు చాలా తడబడ్డాడు. తన ప్రేమని వ్యక్తం చేయడంలో బహుసిగ్గరి. అయితే ఆమెను అనుక్షణం నీడలా వెన్నంటే ఉండేవాడు. ఆమెపట్ల అతని తత్పరత, బెదురు చూపులు అతని వ్యర్థవాంఛకి, మూగప్రేమకి ఉనికినిచ్చేవి. ఆమె కూడా అతనినొక సేవకుడిలా చూస్తూ, అతనొక బానిస అన్నట్టు వ్యవహరించేది. అతన్ని ఆమె ప్రేమిస్తుందని ఎవరైనా ఆమెతో అన్నట్లయితే కచ్చితంగా ఆమె ఎంతో ముచ్చటపడి ఉండేది. ఒక విధంగా చూస్తే అతన్నామె ప్రేమించిందనడంలో సందేహమేలేదు. అతన్ని అలా చూస్తున్న కొద్దీ, క్రమేణ అతని గొంతుకు, అతని కవళికలకి, కదలికలకి ఆమె అలవాటుపడిపోయింది. ఎప్పుడూ చేరువగా ఉండే వారిపట్ల ఏర్పడే దగ్గరితనం వంటిదది. తరచూ కలల్లో ఆమెని అతని ముఖం వెంటాడేది. స్వాభావికంగా ఉండే అతని వినయం, ఒద్దిక, అతని చేష్టల్లో నాజూకుతనం, తనపట్ల ప్రగాఢమైన ప్రేమ…. అన్నీ ఆమెకు కలల్లోకి వచ్చేవి. మరింత తాదాత్మ్యంగా అతన్ని వింటున్నట్టు, చేరువై అతనిలో మమేకమైనట్టు మధురోహలు పోతూ ఆమె ఆ స్వప్నాల్ని మరింత గాఢంగా తట్టిలేపేది. జ్వరపడిన ఓ రోజు రాత్రి ఒక చిట్టడవిలో పచ్చిక తివాచీల మీద అతనితో తాను ఏకాంతంగా కూర్చుని ఉన్నట్టు కలగనేంత వరకూ ఈ స్వప్న వృత్తాంతం కొనసాగుతూనే ఉంది. ఆమె చేతుల్ని మృదువుగా నొక్కుతూ, ముద్దాడుతూ అతనేవో గమ్మతైన కబుర్లు చెబుతున్నాడు. అతని జుత్తులో వేళ్ళు జొనిపి చాలా గోముగా పాయలు తీస్తున్నప్పుడు అతని స్పర్శలోని వెచ్చదనం, నిట్టూర్పుల శ్వాసలోని గిలిగింతని ఆమె అనుభవించింది.

మనం వాస్తవిక జగత్తులో కంటే కలల ప్రపంచంలోనే చాలా విభిన్నంగా ఉంటాం. బహుశా అందుకేనేమో ఆ కలల్లో అతని నిండైన కోరికని, ప్రశాంతమైన ప్రగాఢమైన ప్రేమని గుర్తించిందామె. అతని నుదుటిని తాటిస్తూ తనకి అభిముఖంగా దగ్గరకు తీసుకోవడంలో ఆమె ఎనలేని ఆనందాన్ని పొందింది. క్రమేణ అతని చేతులు ఆమెని పెనవేశాయి. అతన్ని విడిచి వెళ్ళాలని ఆమె ఎంత మాత్రమూ ప్రయత్నించని ఆ కౌగిలిలో ఆమె కళ్ళని, చెక్కిళ్ళని ముద్దాడాడతను. రెండు జతల పెదాలు కలిశాయి. ఆమె దాసోహమయింది.

తనలో ఇంత అలజడి కలిగించానన్న స్పృహ ఎంత మాత్రంలేని అతన్ని చూసినప్పుడు ఆమెలో క్రోధం అకారణంగా పెల్లుబకడాన్ని గ్రహించిందామె. అతను తన ప్రేమ గురించి వెల్లడి చేస్తునప్పుడు, గుర్తు తెచ్చుకోవడమనే యాతన నుంచి బైటపడలేని సంకట స్థితిలో ఆమె అంతకుముందటి తమ సమాగమాన్ని తలుచుకుంటూనే ఉంది.

awakening_Mohanఆమె అతన్ని వలచింది. ఆమె అంతర్లోకాల్లో విజృంభించిన కాంక్షల్ని గుర్తించడానికి ఆమె వెరసినా, తొట్రుపడని తన కలల సాక్షిగా అతన్ని స్ఫటిక స్వచ్ఛమైన మనసుతో ప్రేమించింది. ఆ విషయం అతను గ్రహించాడు. అంతే కాదు, ఆమె కూడా మొత్తం దాపరికం లేకుండా చెప్పేసింది, కలలో అతని అధరాల సయ్యాటలతో సహా మొత్తం- అయితే తనని లోకువ చేయకూడదని వాగ్దానం తీసుకుంది. అతను ప్రమాణం చేశాడు, పాటించాడు కూడా. ఇక అప్పటి నుంచి వారు దివ్య ప్రేమానుభవంలో, ఆత్మల సంయోగంతో గంటల తరబడి గడిపారు. విడిపోయిన క్షణాలు నరకప్రాయమై, వారు బేలపడి, దిగులుతో జ్వరపడ్డారు.

సుదీర్ఘమైనది, అయినా ఎంతో పవిత్రమైన కావలింతలో కళ్ళు అరమోడ్పులైనప్పుడు కొన్నిసార్లు వారి పెదవులు మృదువుగా కలుసుకునేవి.

అయితే, మరెంతో కాలం అతను నిగ్రహించుకోలేడని ఆమెకు అర్థమై, పూర్తిగా లొంగిపోవడం ఇష్టంలేక ఆమె భర్తకు ఉత్తరం రాసింది, అతని దగ్గరికి రావాలనుకుంటున్నానని, తన ప్రశాంత, ఏకాంత స్థితి తిరిగి పొందాలనుకుంటాన్నాననీనూ-

ప్రియమైన తన ప్రత్యుత్తరంలో భర్త ఆమె నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ, చలికాలం మధ్యలో అలా అర్ధాంతరంగా వాతావరణం మార్పుకిలోనయితే చాలా ప్రమాదమని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆమె హృదయంలో చెలరేగుతున్న సంఘర్షణని కించిత్తయినా అర్థంచేసుకోలేని, లేదా కనీసం ఊహించనైనా ఊహించలేని భర్త ఉత్తరం ఆమెకి అశనిపాతంలా తోచింది. తనని అంతగా నమ్ముతున్న భర్తని తలుచుకుని ఆమె ఉక్రోషపడింది.

ఫిబ్రవరి నెలలో మంచు తగ్గి నులివెచ్చదనం, వెలుగు వచ్చాయి లోకంలోకి. ఎవంసెల్లిని దాదాపు దూరంగా ఉంచుతున్నా, సాయం సంధ్యా సమయాల్లో సరస్సు ఒడ్డుకు వెళ్దామనే అతని ఆహ్వానాల్ని కొన్నిసార్లు ఆమె ఆమోదించేది.

ఓరోజు సంజెవేళ వాతావరణం వెచ్చగా హాయిగా ఉంది. ప్రతి చెట్టు, చేమా కొత్తచేవ సంతరించుకున్నట్టు తోస్తుంది. మెల్లగా పొద్దుగుంకుతుంది. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని, వేళ్ళలోకి వేళ్ళు జొనిపి వారిద్దరూ సన్నిహితంగా కూర్చున్నప్పుడు ఆమె తనలో తాను చెప్పుకుందిలా:

“అంతా అయిపోయింది. నేను ఓడిపోయాను, నన్ను నేను కోల్పోయాను”. కలలో జారిపోయిన ఆ గాఢాలింగనాన్ని ఆ క్షణంలో తీవ్రంగా వాంఛించి, లోన నైరూప్యమైన కాంక్షలన్నీ కొత్తరంగుల్లో కదం తొక్కుతూ పెల్లుబికుతున్న క్షణంలో ఆమె అలా స్వగతించింది. అయితే బలహీనమైన ఆ స్వగతాలతో, బాహ్యస్పృహలతో సంబంధంలేని క్రొన్నెత్తురు పోటెత్తుతున్న ఆ కొత్త మోజులో కంపించే వారి పెదవులు పరస్పరం వెదుకులాడాయి. రెండు శరీరాలు మహోధృతిలో ఏకమై అంతలోనే విడిపోతున్నాయి, మరో చిక్కని పెనవేత కోసం.

తిరిగి వచ్చాక, ఆమె ఇంట్లోకి చొరవగా వెళ్లే సాహసం చేయలేదతను. అతని మీద అలవికాని మోహంలో, స్పృహ అరకొరగా ఏమారిన వివశంలో నిండా మునిగిన ఆమెని తలుపు దగ్గరే దిగవిడిచాడతను. లోపల దీపం వెలిగించని చిరుచీకటి గదిలో పాల్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమెతో కరచాలనం చేసినప్పుడు ఆమె ఒళ్ళెంత సెగలు కక్కుతుందో అర్థచేసుకున్నాడు. అటువంటి పరిస్థితుల్ని పసిగట్టడంలో ఆరితేరినవాడు కాబట్టి మంద్ర స్వరంతో కొంటె మాటలు ప్రారంభించాడు. అలసిన ఆమె మనసుకి సాంత్వనలా గమ్మత్తు వ్యామోహాన్ని గొంతులో పలికిస్తూ లాలించాడు.

మనసులో ఎవంసెల్లిని తలుస్తూ మౌనంగా వింటుందామె పాల్ మాటలు.

ఎవంసెల్లే మాట్లాడుతున్నాడని, తనపై వాలుతున్నాడన్న భ్రాంతికి గురయింది. అతను, అతను మాత్రమే కనిపిస్తున్నాడామెకి. ఈ భూగోళంమీద మరో మగాడు ఉన్నాడన్న స్పృహే లేదామెకి. ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే తీయని పలుకులు ఆమె చెవుల చెంత తారాడుతున్నాయి. అవి అతనివే, మరొకరివికావు. అంతకు ముందే తనని పెనవేసి విశాలమైన ఛాతిలో గువ్వలా ఇముడ్చుకున్న అతనివే. గొప్ప గెలుపుని సూచించే తడి ముద్రల్ని ఆమె పెదాల మీద అద్ది, నాజూకు రాక్షసలతలై చుట్టిన ఆమె బాహువుల్లోకి ఐచ్ఛికంగా చిక్కిన అతనిదే ఆ స్పర్శ. అతిశయించిన తన్మయ పరిమళాలు పిగిలిపోతున్న మేనుతో, సలసల మరిగే మోహలాలసతో ఆమె పిలుపు ఎవరికోసం తీగలు సాగిందో అతనే….. తననిప్పుడు అల్లుకుంటున్న వాడు….!?

ఎప్పుడైతే ఆమె కలలోంచి మెలకువలోకి జారిపడిందో, అప్పుడు చెప్పలేని రోషంతో ఊగిపోయింది. చెదిరిన ఆమె జుట్టుని మెత్తని ముద్దులలో కప్పేసిన పాల్, తమకపుభారంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆమె ముందు మోకరిల్లుతున్నాడా క్షణం. ఆమె దాదాపు అరిచినంత పనిచేసింది: “పో..పో..వెళ్ళిపో….”

ఆమె ఏమంటుందో, తన ఉద్దేశమేమిటో అర్థంకాని పాల్ చొరవగా ఆమె నడుము చుట్టూ చేయివేయబోయాడు. పురుగుని విదిల్చినట్టు విదిలిస్తూ కోపంతో మాటలు తడబడుతుండగా అంది మళ్ళీ:

“నువ్వొక నీచుడివి, నువ్వంటే నా కసహ్యం. పో ఇక్కడ్నుంచి…..”. అయోమయంతో లేచి నిలబడి, కిందపడిన తన టోపి తీసుకుని మెల్లగా వెళ్ళిపోయాడతను.

మర్నాడు ఆమె తన భర్త దగ్గరకి వెళ్ళిపోయింది. ఎంతమాత్రం ఆమె రాక ఊహించని ఆమె భర్త, తన తొందరపాటుకు మందలించాడు.

“మిమ్మల్ని విడిచి నేను మరిక ఉండలేను,” చెప్పిందామె. అంతకు ముందుకన్నా చాలా విచారగ్రస్తంగా ఉండటం, ప్రవర్తనలో పెనుమార్పులేవో కనిపించడం గమనించి భర్త అడిగాడామెని:

“ఏమయింది, చాలా దిగులుగా ఉన్నావు. ఏంకావాలి నీకు”

“ఏమీ అక్కర్లేదు. ఈ లోకంలో సంతోషమనేది కేవలం కలల్లోనే దక్కుతుందంతే….” – ఆమె బదులిచ్చింది.

వేసవిలో ఆమెని చూసేందుకు వచ్చాడు ఎవంసెల్లి. ఎటువంటి ఉద్వేగమూ, ఏదోచేజారిందన్న విచారమూ లేని ప్రశాంత స్థితిలోనే అతన్ని ఆహ్వానించింది. ఏ మహత్తర మైన స్వప్నం నుంచైతే పాల్ తనని మ్కేలిపాడో, ఆ కలలో తప్ప మరెన్నడూ అతనిని ప్రేమించనట్టుగా నిర్మోహంగా చూసిందామె ఎవంసెల్లి వంక.

కానీ, ఆమెనే మనసంతా నింపుకున్న ఆ యువకుడు మాత్రం ప్యారిస్‌కు తిరుగు ప్రయాణమౌతూ అనుకున్నాడు దిగులుగా:

“ఈ ఆడవాళ్ళు అర్థంకాని రహస్యాలు, అంతుచిక్కని ప్రశ్నలు, వీడని చిక్కుముళ్లు…”

*

(చిత్రకారుడు: మోహన్)

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, మార్చి and tagged , , , , , .

4 Comments

  1. ఒక స్త్రీ హృదయం లో చెలరేగే సంఘర్షణ,అంతరంగపు లోతులను స్పృశిస్తూ రాసిన ఈ కధ ఒరిజినల్ గా యెంత బావుందో తెలియదు కాని . మీరుచేసిన అనువాదం బావుంది.నాకు నచ్చింది .

  2. చాలా బావుంది, మీ సహజమైన భావుకత్వంతో. రెండు గమనికలు పంచుకోవాలనిపిస్తున్నది. కొన్ని చోట్ల అవసరానికి మించిన బలమైన మాటలు వాడారు – మీకు అర్ధం తెలియకుండా ఉందని అనుకోను. సూదంటు అంటే అయస్కాంతం .. మీసాల్ని అయస్కాంత మీసాలు అనడం ఎక్కడా లేదు. బహుశా సూది మొనలా కొనదేలిన మీసాల్ని మీ భావం కావచ్చు. ఒక చోట “ఆమెకి అశనిపాతంలా తగిలింది” అని రాశారు. పిడూగు పడ్డం అంటే ఇంచుమించు సర్వనాశనమైపోయే పరిస్థితి, సాధారణమైన షాక్ కాదు కదా. ఇటువంటివి కొంచెం గమనించుకోవాలి.
    రెండోది – వాక్యం వాక్యాన్ని తర్జుమా చేసినట్టున్నారు. ఇలా కాకుండా, పేరా లేదా సెక్షనుగా అనువదిస్తే అనువాదం ఇంకా సహజంగా బలంగా అందంగా ఉంటుంది అని నా ఉద్దేశం.
    All the best.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.