PuritiNoppulu

పునఃసృష్టికి పురిటినొప్పులు

Download PDF ePub MOBI

సైన్స్ ఫిక్షన్ రాయడం కత్తి మీద సాము లాంటిది. రచయితకి కల్పానా చాతుర్యంతో పాటు, శాస్త్ర వైజ్ఞానిక రంగాల్లో నిరంతరం జరుగుతున్న పరిశోధనలూ, వాటి ఫలితాలు, ఆయా రంగాల్లో వస్తున్న మార్పులు, జరుగుతున్న ప్రయోగాలు వంటి అంశాలపై అప్-టు-డేట్ అవగాహన ఉంటేగాని సైన్స్ ఫిక్షన్ రక్తి కట్టదు. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలూ, అంగారక గ్రహ యాత్రలు వంటి అంశాలపై వచ్చిన రచనలు సైన్స్ ఫిక్షన్‌ని ఇష్టపడే పాఠకులను ఎంతగానో అలరించాయి.

బహుగ్రంథకర్త అయిన కస్తూరి మురళీకృష్ణ కలం నుంచి జాలువారిన సైన్స్ ఫిక్షన్ నవల “పునఃసృష్టికి పురిటి నొప్పులు”. ఈ నవల గతంలో వార్త దినపత్రికలో ధారావాహికగా ప్రచురితమై పాఠకులను ఆకట్టుకుంది. జన్యు శాస్త్రంలోని నూతన ఆవిష్కరణలను, చంద్రగ్రహంపై మానవ నివాసం అనే భావనని మిళితం చేస్తూ కస్తూరి మురళీకృష్ణ అందించిన వినూత్న నవల ఇది

నిరంతరం పరిశోధనలలో మునిగి ఉండి, బాహ్యప్రపంచంలో ఏం జరుగుతోందో గమనించని ముగ్గురు జన్యుశాస్త్ర పరిశోధకులు ఓ కాన్ఫరెన్స్‌కి హాజరవడానికి బయల్దేరి దారిలో గొడవల్లో చిక్కుకుని గాయాల పాలవుతారు.

‘సృష్టి కొన్ని బిలియన్‌ సంవత్సరాల నుంచీ జీవంతో జరుపుతున్న ప్రయోగ ఫలితం మానవుడు. కొన్నివేల అణువుల అత్యద్భుతమైన విన్యాసాలకాలవాలం మానవుడు. ఉత్తమ వ్యక్తిత్వంతో, విచక్షణతో ఉండాల్సిన మానవుడు, తనలోని పశుత్వానికీ ప్రాధాన్యం ఇవ్వటం ఎంత ఆశ్చర్యం! ఓ నాయకుడి కోసం కొన్ని మిలియన్‌ సంవత్సరాల ప్రయోగ ఫలితాన్ని క్షణంలో నాశనం చేసేందుకూ వెనుకాడటం లేదు. అసలు తమ పరిణామ క్రమం వీరికి తెలుసా? ప్రకృతి ఎంత కష్టపడితే మనిషి తయారవుతాడో అన్న జ్ఞానం వీరికి ఉందా? తమ శరీరంలోని అణువణువూ ఎంత అమూల్యమో వీరికి తెలుసా? ఎంతో అమూల్యమైన జీవితాన్ని ఇలా ఎందుకూ పనికి రాని అంశాలలో వ్యర్థం చేసుకుంటున్నారు వీరు?’ అంటూ వాపోతాడో శాస్త్రవేత్త. ఈ ముగ్గురిని పరామర్శించడానికి మరో శాస్త్రవేత్త వచ్చినప్పుడు ”మీరు బహుశా…. మీ ప్రపంచం నుంచి బయటకు వచ్చి మా ప్రపంచాన్ని చూడడం ఇదే మొదటిసారి కావచ్చు. కానీ మాకిది అలవాటే. ఇక్కడ మనిషి విలువ కాగితం మీదనే. సమాజంలో విలువ డబ్బుతో. రాజకీయంలో విలువ అధికారంతో. అంతే తప్ప వ్యక్తిగత ప్రతిభకు, విజ్ఞానానికి, విలువలకు విలువ లేదు. మనుషులు ఇలా తయారయేందుకు కారణం తెలుసా?” అని అడుగుతాడు. బదులుగా, వారు ముగ్గురూ ‘జీన్స్‌’ అంటారు ఒకేసారి.

”మనిషి మంచితనం పుట్టుకతో వస్తుందా, పెంపకం వల్ల వస్తుందా అన్న చర్చ అనాదిగా సాగుతోంది. కానీ అనేక వాదాలు, వివాదాలు మనుషుల కళ్ళకు గంతలు కడుతున్నాయి. విచక్షణను హరిస్తున్నాయి. మనిషిని పశువులను చేస్తున్నాయి. అనేక ప్రచారాలకు, ప్రలోభాలకు తట్టుకొని, విచక్షణతో, విజ్ఞానంతో నిలబడే మనుషులు ఉంటే ఇటువంటి పరిస్థితి రాదు. చూడండి… మీరు జీన్లతో ఇటువంటి మనుషులను తయారు చేయగలరా?” అన్న సరదా ప్రశ్నని సీరియస్‌గా తీసుకున్న ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు హఠాత్తుగా మాయం అవడం అనే సంఘటన నవలకి నాంది పలుకుతుంది.

2051లో భూమి మీద కొన్ని ప్రాంతాలలోని ప్రజలు ఒకేతరహా రోగలక్షణాలతో జబ్బుపడి ప్రాణాలు కోల్పోతుండడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది.

దీనికి కారణాలు కనుక్కునేందుకు ఉపక్రమించిన కిరణ్ అనే డిటెక్టివ్, సంధ్య అనే శాస్త్రవేత్తతో కలిసి పనిచేస్తున్నప్పుడు భయంకరమైన నిజాలు తెలుస్తాయి. చివరికి ఏం జరిగిందనేది ఆసక్తిదాయకం.

మనిషి మారాలంటే, ప్రస్తుత మానవజాతిని సమూలంగా నాశనం చేసి పునః సృష్టి చేస్తే గాని సాధ్యం కాదా? యుక్తాయుక్త విచక్షణ కోల్పోకుండా వ్యవహరించడం మనిషికి చేతకాదా? భూమి మీద మనుషులను సమూలంగా తుడిచిపెట్టి, పరాయి గ్రహం నుంచి కొత్త మనుషులను భూమికి పంపి కొత్త జాతిని సృష్టించడం తప్ప గత్యంతరం లేదా? అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు, ఓ చిన్న నీలి చుక్కలా కనిపిస్తుందని, భూమికి కిందా పైనా కూడా అంతరిక్షమేనని, ఇలాంటి విశాల విశ్వంలో భూమి ఓ చిన్నపాటి గ్రహం అయినప్పుడు, భూమిలో నివసించే మానవుడెంతటి వాడు? పిపీలికం వంటి వాడు కదూ. మనిషి శరీరం ఎలా ఏర్పడిందో, శరీరంలోని జీన్స్ ఎంత తెలివిగా పనిచేస్తాయో చెబుతూ, ఆ జీన్స్ వల్ల ఏర్పడిన మనిషి ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తాడని ప్రశ్నిస్తుందీ నవల.

మనిషిలోని కుత్సితత్వాన్ని, సంకుచిత్వాన్ని ప్రశ్నిస్తూ, జీవితాన్ని అందంగా మలుచుకునే అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్న మనుషులపై జాలి చూపిస్తారు పరాయి గ్రహవాసులు. కానీ అక్కడి పౌరులై, పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలలోనూ సంకుచితత్వం పోలేదని, అది పోయిన నాడు మాత్రమే విశ్వమానవ సౌభాతృత్వం సాధ్యమని రచయిత సూచిస్తారు.

ఈ నవలలో ఉదహరించిన కాల్పనిక భావనలలో ఇప్పటికే కొన్ని వాస్తవం అవగా, మిగతావి కూడా భవిష్యత్తులో నిజమవ్వచ్చు అనిపించేలా సాగింది ఈ రచన.

“మనిషి విచక్షణని నిర్దేశించి జీన్ ఏది? దాన్ని సరిచేయడం సాధ్యమవుతుందా?” అని ఓ శాస్త్రవేత్త మధనపడతాడు. ఇప్పటికి ఇది సైన్స్ ఫాంటసీ అయినా, సమీప లేద సుదూర భవిష్యత్తులో సైన్స్ ఫిక్షన్ అయి, ఆ పిమ్మట ఫాక్ట్ అవ్వాలని కోరుకోడంలో తప్పు లేదు. గత శతాబ్దంలో సైన్స్ ఫాంటసీలనుకున్న ఎన్నో కల్పనలు ఈ శతాబ్దంలో ఫాక్ట్స్ అయిన సంగతి మరచిపోకూడదు.

వైజ్ఞానిక ఆవిష్కరణలకూ, తీవ్రవాదానికి, పెట్టుబడీదారివాదానికి లంకె కలుపుతూ ఆసక్తికరమైన కథనంతో సాగుతుంది నవల. చివరిదాక, ఉత్కంఠనూ ఉద్వేగాన్ని కలిగిస్తూ, చదవడం పూర్తి చేసాక పాఠకులలో ఆలోచనలను రేకెత్తిస్తుందీ నవల.

— కొల్లూరి సోమ శంకర్

PuritiNoppuluసాహితీ ప్రచురణలు, విజయవాడ వారు ప్రచురించిన ఈ నవల వెల 75/- రూపాయలు.

256 పేజీల ఈ నవల అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది.

డిజిటల్ రూపంలో కినిగె.కాం లోనూ లభిస్తుంది.

Download PDF ePub MOBI

Posted in 2014, పుస్తక సమీక్ష, మార్చి and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.