softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [9]

Download PDF ePub MOBI

దీని ముందు భాగం

చావటానికి సిద్ధపడ్డ అజయ్, తన కుడి చేతిలో బ్లేడు తీసుకొని, ఎడమ చేతిని ముందుకి చాపి, బ్లేడుతో తన ఎడమ చేతికి, లీలగా కనపడుతున్న నరాలను బ్లేడుతో కోశాడు. ఒక్కసారిగా భయంకరమైన నొప్పి పుట్టటంతో పెద్దగా అరిచాడు. బ్లేడుని అవతలికి విసిరేశాడు. అదృష్టమో, దురదృష్టమో చర్మం తెగిందే తప్ప నరాలు తెగలేదు. నొప్పి నరకాన్ని తలదన్నేట్టు ఉన్నది.

“చర్మం తెగితేనే ఇంత నొప్పి ఉంది. ఇంకా కోసుకుంటే తట్టుకోవటం నావల్ల కాదు” అని మనస్సులో అనుకోని, బ్లేడుతో చావాలనే ఆలోచనని విరమించాడు. కానీ రక్తం కారుతున్నది. కారుతున్న కొద్దీ నొప్పి రెట్టింపు అవుతున్నది. ఓర్చుకోలేక వెంటనే, దగ్గరలోని R.M.P డాక్టరు దగ్గరకి వెళ్ళాడు. ఆ రక్తాన్ని చూసి అతను నివ్వెరపోయాడు. ఏమైందని అడిగాడు. “వైరుని బ్లేడుతో కోస్తుంటే అనుకోకుండా చెయ్యి జారింది” అన్నాడు.

అతనికి తెలిసినంతలో ఏదో వైద్యం చేశాడు. రెండు ఇంజక్షన్లు చేశాడు. అరడజను టాబ్లెట్లు రాసి రోజుకి మూడు పూటలా వాడమన్నాడు. “దేనికిన్ని టాబ్లెట్లు” అని అడిగాడు. ఇది బలానికి, ఇది నొప్పులు తగ్గటానికి ,ఇది ఈ రెండు వాడినా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ,ఈ రెండు పనిచేయటానికి ఇంకో రెండు అనిచెప్పాడు. ఎలాగూ చావాలనుకున్న వాడికి ఇన్ని రకాల టాబ్లెట్లు ఎందుకని మనస్సులో అనుకున్నాడు. చిన్నగా అక్కడి నుంచి బయటపడి, ఒక మందుల షాపు దగ్గర ఆగాడు. డాక్టరు రాసిచ్చిన మందుల చీటీ బయటకు తీసి కేవలం నొప్పి తగ్గే మాత్రలు మాత్రం తీసుకున్నాడు.

మొదటి రోజుకి నొప్పి, రెండో రోజుకు కొంత తగ్గింది. మళ్ళీ చావు మీద మనస్సు మళ్ళింది అజయ్ కి. ఈ సారి ఎట్టి పరిస్థితులలో విఫలమవ్వకూడదని గట్టిగా అనుకున్నాడు. జాగ్రత్తగా ప్రణాళిక రచన చేసుకున్నాడు. ఈ సారి చచ్చినా బతకకూడదు. అనుకొన్నాడు. ఉరి వేసుకు చావటమనే మార్గాన్ని ఎంచుకున్నాడు. తానూ ఉంటున్న మేడ గట్టిదే, పైన తిరుగుతున్న రెక్కల ఫ్యాను కూడా గట్టిదే. తాడు కూడా గట్టిదే సంపాదించాడు. తన్నటానికి మంచి కుదమట్టమైన స్టూలు కూడా సిద్దం చేసాడు. రాత్రి పూట భోజనం ముగించుకొని తన గదికి వచ్చాడు. తాడు తీసుకొని, ఉరి వేసుకోవటానికి స్టూలు ఎక్కాడు. కానీ ఉరి వేసుకోవటానికి ఆ తాడు ఎలా ముడి వేయాలో అర్థం కాలేదు. అర్థరాత్రి దాకా ప్రయత్నించాడు. అర్థం కాక అర్థాంతరంగా ఆ ప్రయత్నాన్ని ఆపేశాడు.

అదే స్టూలు మీద కూర్చొని ఆలోచించటం మొదలుపెట్టాడు. అసలు ఉరి వేసుకుంటే మనిషి ఎందుకు చస్తాడు? ఊపిరి ఆడకపోవటంతో చస్తాడు. కాబట్టి ఉరి వేసుకోకపోయినా ఊపిరి ఆడకుండా చేయగలిగితే మనిషి చచ్చినట్టే అన్న ఆలోచన చేశాడు. ఇప్పుడు ఊపిరి ఆడకుండా చేయటం ఎలాగా అని ఆలోచించాడు.

ఎదురుగా ఒక ప్లాస్టిక్ కవర్ కనబడింది, ఇంజనీరింగ్ చదివినన్నాళ్ళు కూడా వాడని బుర్రను ఇప్పుడు వాడటం మొదలుపెట్టాడు. ఆ ప్లాస్టిక్ కవర్ ముఖానికి ఊపిరి ఆడకుండా చేయచ్చు కదా అనే దరిద్రపు ఆలోచన తట్టింది. ఆలస్యం చేయకుండా ఆ ప్లాస్టిక్ కవర్ తలకు కప్పుకున్నాడు. ఒక మందపాటి పురికొస తీసుకొని ఆ కవర్ మీదుగా మెడ పైకి కట్టాడు. గాలి ఏమాత్రం ఆ కవర్ లోకి వెళ్ళకుండా జాగ్రత్తపడ్డాడు. ఆక్సిజన్ తీసుకోవటం ఇబ్బందిగా మారింది. కాసేపటికే ఓర్చుకోలేక, ఊపిరాడక, తనంతట తానే కవరుని చించేశాడు. అప్పుడు అజయ్ కి అర్థమైన విషయం ఏంటంటే ,మెడకన్నా ముందు చేతులు కట్టేసుకోవాలి, లేదంటే చేతులు వాటి పని అవి చేస్తాయని. కానీ చేతులు కట్టేసుకుంటే మెడకు కవరు ఎవరు కడతారని ఆలోచించాడు.

ఈ ప్రయత్నం కూడా విఫలమైనదని అర్థం అయింది అజయ్ కి. అప్పటికే సమయం తెల్లవారుఝామున ఐదు అయ్యింది.చేసేది లేక అమాంతం మంచం మీద పది నిద్రపోయాడు. మద్యాహ్నం రెండు గంటలకు నిద్రలేచి, భోజనం చేసి మళ్ళీ తన గదికి వచ్చి ఆలోచించటం మొదలుపెట్టాడు. నొప్పి పుట్టకుండా తొందరగా చచ్చే మార్గం ఏదా అని? అజయ్ కి తట్టిన తరువాతి ఉపాయం విషం తాగటం. ఆ ఆలోచన అజయ్ చావుమీద ఆశను బ్రతికించింది. విషం తాగితే ఖచ్చితంగా చావచ్చు అనుకున్నాడు.

కానీ విషం ఎలా సంపాదించాలో అర్థం కాలేదు.ఇంటర్నెట్ లో విషం కోసం వెతికే ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా విషం గురించిన విషయ సమాచారం దొరకలేదు. “రాష్ట్రంలో ఎంతమంది రైతులు పురుగుల మందు తాగి చావటం లేదు”, అనుకున్నాడు అజయ్. తానూ కూడా అన్నదాత అడుగుజాడల్లో నడవాలి అనుకున్నాడు. హైదరాబాద్ లో ఎంతసేపు సెల్ ఫోను షాపులు, బట్టల షాపులు తప్ప పురుగుల మందు షాపు కనపడలేదు. ఎందుకు లేవా? అని ఆలోచించాడు. “అయినా హైదరాబద్ లో పురుగుల మందు ఎవరికి అవసరం,ఉన్న చెట్లే నరికేస్తుంటే, ఎవడో నాలా చావబోయేవాడు తప్ప వాడరు కదా!” అనుకున్నాడు. చివరకు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఒక పురుగుల మందు దుకాణం ఉందని తెలుసుకున్నాడు. పైగా అక్కడికి వెళ్లి కొంటే ఎవ్వరికి అనుమానం కూడా రాదనుకున్నాడు.

Posted in 2014, మార్చి, సాఫ్ట్‌వేర్ ఇతిహాస్యం, సీరియల్ and tagged , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.