cover

అనుకోకుండా

Download PDF ePub MOBI

నీతో అన్నానా ఇప్పటికైనా?

దూరం ఒక భ్రమ అని, పొద్దు వాలక ముందే నీ పాటలన్నీ నన్ను చేరాయిగా ఇంకా దిగులెందుకనీ? నేను ముత్యాన్నీ నువ్వు సూర్యకాంతివీ కాదనీ, నిజం చెప్పాలంటే నేను కనీసం ఇసుకని కూడా కాదనీ, బాహుశా నువ్వు వాగువి, నేను నీళ్లలో తల విదుల్చుకునే పిట్టనీ అనీ. ఊహూ ఇవేం కావు, నేను నువ్వుగా మారలేని ఒక అపభ్రంశాన్ననీ అనలేదు కదా నీతో ఎప్పుడూ?

ఐనా తెలుస్తుందిలే నీకు. చూసే ఉంటావు ఆరోజు, అదే- మిగతా అన్ని రోజుల్లాగా నేన్నీకు అస్సలు కనపడని ఆరోజు కూడా, గుల్మొహర్ పూలు గుత్తులుగా నవ్వులతో బద్ధలవడం చూశావుగా, ఇంకెందుకు అడగడం? అవును అందుకే- పొడుగాటి చెట్లూ, నిద్రించిన గూళ్లలో రెక్కల మగత చప్పుళ్ళు, మంచు తడిపిన రహదారులు అన్నిటినీ నీ దారిలో అడ్డురాకుండా దాచిపెట్టి చీకటి పడే వేళకి కళ్లకింద నల్లటి లోయల్లోకి విసిరేసుకుంటాను. ఇక ఒక్కదాన్నే రాత్రిని జల్లెడ పడుతూ రాలిపడుతున్న వెన్నెల రవ్వలతో ఒడి నింపుకుంటాను.

అప్పుడిక నువ్వోస్తావో రావో నాకెందుకు?

చెప్పొద్దులే తెలుసు. గది తలుపులు వేసి బయల్దేరుతుంటే నీ పాటలన్నీ పసిపాపలై కాళ్లకి పెనవేసుకున్నాయనీ, ఒక్క అక్షరమైనా తాకని ఖాళీ కాగితాలన్నీ జాలిగా ఎగిరి రెక్కలార్చి నీ గుండెలపై వాలిపోయాయనీ. మరందుకేగా వచ్చాం నువ్వైనా నేనైనా ఈ లోకానికి. వాటికి ఋణం తీర్చుకుంటూ బతకడానికి. మట్టికుండీలో పావురం పిల్లల్లా పదాల్ని అరచేతుల్లో పొదువుకుంటూ నువ్వంటావు- వేరే పనులేం లేవు కానీ, నేనొచ్చేస్తే వీటికి దిక్కెవరని, నా గొంతు వేదనగా ఇక్కడ పగలకుంటే ఈ పాటలన్నీ గోరువెచ్చని నదులై ఒళ్ళు విరుచుకునే తావేదని?

ఇన్నీ చెబుతావు కానీ నీకూ రావాలనే ఉంటుంది. ఒక్కోసారి చాలా బలంగా అన్నిటినీ విదిలించేసుకుని కేవలం నాకోసం వచ్చెయ్యాలని ఉండదూ? అందుకే తప్పదిక. చెప్పేస్తాను. చిన్నోడా! తడి చెంపలని ముద్దాడటానికి నీకున్న ధైర్యం సరిపోదు. ఇంకా చాలా నేర్చుకోవాలి నువ్వు. భయం లేదులే. ఈ రాత్రి ఎక్కడికీ పోదు, మనిద్దరం చెరో కొసలో ఇలా మేల్కొని ఉన్నంత కాలం.

*

Download PDF ePub MOBI

Posted in 2014, మార్చి, మ్యూజింగ్స్ and tagged , , , .

8 Comments

  1. స్వాతి గారూ

    మీ రచనలను చాలా రొజులుగా గమనిస్తున్నాను. మీరు ఒకరు కాదు ఇద్దరు. ఇలా ఒకరిలొ ఇద్దరు వుండడం చాలా అరుదు. ఒక్కొసారి మీ వచనం పరమ నాసీగా వుంటుంది. వుదాహరణకు ఇలా- జయనామ సంవత్సర ఉగాది సందర్భంగా వాకిలి పత్రిక నిర్వహించిన కవి సమ్మేళనపు విశేషాలను ఇక్కడ అందిస్తున్నాం. కొత్త సంవత్సరపు వాకిలిలో గొంతులు సవరించుకున్న కవికోకిలల కూజితాల్ని, ఆనందోత్సాహాలతో మోగించిన కవిత్వపు జయభేరిని విందామా!

    ఒక్కొసారి మీ వచనం చాలా ఆరిందాలా వుంటుంది. వుదాహరణకు ఇలా- అప్పుడిక నువ్వోస్తావో రావో నాకెందుకు? చెప్పొద్దులే తెలుసు. గది తలుపులు వేసి బయల్దేరుతుంటే నీ పాటలన్నీ పసిపాపలై కాళ్లకి పెనవేసుకున్నాయనీ, ఒక్క అక్షరమైనా తాకని ఖాళీ కాగితాలన్నీ జాలిగా ఎగిరి రెక్కలార్చి నీ గుండెలపై వాలిపోయాయనీ. మరందుకేగా వచ్చాం నువ్వైనా నేనైనా ఈ లోకానికి. వాటికి ఋణం తీర్చుకుంటూ బతకడానికి. మట్టికుండీలో పావురం పిల్లల్లా పదాల్ని అరచేతుల్లో పొదువుకుంటూ నువ్వంటావు- వేరే పనులేం లేవు కానీ, నేనొచ్చేస్తే వీటికి దిక్కెవరని, నా గొంతు వేదనగా ఇక్కడ పగలకుంటే ఈ పాటలన్నీ గోరువెచ్చని నదులై ఒళ్ళు విరుచుకునే తావేదని?

    కుంతీదేవి సూర్యూణ్ని చూడగానె బిడ్డ కదుపులొ పడ్దట్టు మీకు ఒక్కొసారి దేన్నొ చూడగానె వచనం కడుపులొ పడుతొంది. మీ వాంగ్మూలం కధ కూడా మీరు రాసినది కాదు. యే అతీత శక్తొ మీ చేత రాయించింది. కొన్ని సార్లు మగభూతాలు ఆడవారిలొకీ మరికొన్ని ఆడ దయ్యాలు మగవారిలొకీ దూరి ఇలాంటి వింతలు చేస్తుంటాయి. ఏమైనా మీరిలా ద్విముఖంగా సాహిత్యంలో విరాజిల్లడం ఎంతైనా ముదావహం.

  2. quintessetial waiting ..the poignance of it .. if they play hide and seek in a blank paper emotions with lyrical emotive words .. it might be the visual treat to read in between lines.. kudos for your spirituality and by being the spirit behind unrelealed phylosophy of life.. so nice Swathi..!!

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.