softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [10]

Download PDF ePub MOBI

దీని ముందు భాగం

అలా నరకానికి వెళ్తూ ఉండగా ఉండగా మధ్యలో ఒక నల్లని మబ్బు ఒకటి అడ్డంగా వచ్చించి. ఆ మబ్బుకు అజయ్ కళ్ళు మూసుకుపోయాయి. ఏమీ కనిపించలేదు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసే సరికి , పైన ఫ్యాను గిర్రున తిరుగుతున్నది. చేతికి సెలైన్ గుచ్చి ఉన్నది. అంతా నిశబ్దం గా ఉన్నది. తల తిప్పి చూశాడు. మంచం పక్కన కుర్చీ మీద సెల్ ఫోనులో ఆటాడుకుంటూ వేణు కనిపించాడు. అయోమయంగా వేణు వైపు చూశాడు. “చావలేదు, బతికే ఉన్నావు ఆనందపడకు” అని అన్నాడు వేణు. “ఏమైంది?” అన్నాడు అజయ్. “పురుగుల మందు పవరు కాస్త తగ్గింది .గదిలో అపస్మారక స్థితిలో పడి ఉంటే తెచ్చి ఇక్కడ పడేశారు” అని చెప్పాడు. తానూ పురుగుల మందు తాగినట్టు ఎవరికి తెలిసి ఉంటుంది? ఎవరు చూసుంటారా అని ఆలోచించటం మొదలు పెట్టాడు.

తానూ పురుగుల మందు తాగినట్టు ఎవరికి తెలిసి ఉంటుంది? ఎవరు చూసుంటారా అని ఆలోచించటం మొదలు పెట్టాడు. అజయ్ మనస్సుని , ఆలోచనలని అంచనా వేస్తున్న వేణు అతని పరిస్థితిని అర్థం చేసుకొని “నీ అనుమానం నాకు అర్థమైంది. నిన్ను ఎవరు, ఎలా చేర్చారనేకదా!” అన్నాడు వేణు. అవును అనట్టు తల ఊపాడు అజయ్. నీ అదృష్టమో, దరిద్రమో, ఆఖరుసారి ఆ పనిమీద వెళ్ళినప్పుడు నీళ్ళ పంపు కట్టేయటం మర్చిపోయావు. ట్యాంకుడు నీళ్ళు కారిపోయాయి. ఓనరు ఎంతసేపు మోటరు వేసినా నీళ్ళు నిండా రాకపోవటంతో అనుమానం వచ్చి అందరినీ అడిగాడు. ఆఖరుకి నీ దగ్గరకు వచ్చారు. బయట తాళం వేసుంది ,లోపల నీళ్ళ చప్పుడు విని తలుపు బద్దలు కొట్టేసరికి, బాగా పిండి ఆరేసిన తుండుగుడ్డ లాగా నువ్వు పడి ఉన్నావట! ఆంబులెన్సులో ఆస్పత్రికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం నేను నీకు ఆఖరిసారి ఫోను చేశా కదా ! అందుకని వాళ్ళు నాకు చేసి విషయం చెప్పారు. మీ ఇంట్లో చెప్తామన్నారు. నేనే వద్దని మేనేజ్ చేశా” అని వేణు వివరించటం తో అజయ్ ఊపిరి పీల్చుకున్నాడు.

“తమాషా ఏంటంటే, నువ్వు పురుగుల మందు తాగావని ఎవ్వరికీ అనుమానం రాలేదు. డాక్టరు గారిని ఎవ్వరికీ చెప్పొద్దని బతిమిలాడానులే. అంతా నువ్వేదో విషాహారం తిన్నావనుకుంటున్నారు. విషం కలుపుకొని తిన్నావని తెలియదు. తెలిస్తే సానుభూతి చూపిస్తున్న ఓనరు నిన్ను చంపటం ఖాయం” అంటుండగానే అజయ్ ఇంటి యజమాని లోపలికి వచ్చాడు. వేణు తను నిలబడి కుర్చీ యజమానికిచ్చాడు. “ఇప్పుడెలా ఉన్నది అబ్బాయి” అని అడిగాడు. బాగుందన్నట్టు చెయ్యి ఎత్తాడు అజయ్. “ఏదో ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టరు గారు చెప్పారు. బయట తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏవేవో నూనెలు వాడుతుంటారు! ఇంతకీ ఏమి తిన్నవేంటి?” అని అడిగాడు. “డెబ్బై రూపాయలకు చికెన్ బిర్యానీ అంటే తిన్నాడట అంకుల్, వాడు కోడిని బదులు కుక్క మాంసం పెట్టుంటాడు” అన్నాడు వేణు కలగజేసుకుని. “ఆ !…. అదే దెబ్బకొట్టి ఉంటుంది. రెస్ట్ తీసుకోబాబు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళాడని ఖాయం చేసుకున్న వేణు, “ నీకు పెళ్ళే అనుకున్నా, చావటం కూడా రాదురా ! నీ దరిద్రం ఏంటో చెప్పనా ! పురుగుల మందు తాగటానికి ముందు పీకలదాకా తిన్నావటకదా! ఆ తిండే నిన్ను బ్రతికించింది. లేదంటే కధంతా నువ్వు అనుకున్నట్టుగానే జరిగేది. ఈ పాటికీ ఏ సింహంగానో, ఏ పులిగానో, అమెరికా అడవుల్లో కుక్కగానో పుట్టేవాడివి” అని వేణు అనటంతో, అజయ్ ఆశ్చర్యపోయి చూశాడు, ఇదంతా వీడికేలా తెలుసా అని. “కల అంతా కలవరించావు ,మొత్తం విన్నాలే” అని వేణు తాపీగా మళ్ళీ సెల్లులో ఆడుకోవటం మొదలు పెట్టాడు. మూడురోజులు మంచం మీద ఉంచి, ముప్పై వేలు బిల్లు బాదాక, ఇక ఇంటికి వెళ్ళొచ్చని చెప్పారు.

విషపూరిత ఆహారం తినటం వల్ల ముప్పై వేలు కట్టాల్సి వచ్చిందని ఇంట్లో చెప్పాడు. ఇంట్లో వాళ్ళు గొడవ చేయటంతో తప్పక ఇంటికి చేరాడు. ఆ పురుగుల మందు ప్రభావం తగ్గటానికి, మళ్ళీ మామూలు మనిషి కావటానికి పది రోజులు పట్టింది. వెంటనే ఉద్యోగ ప్రయత్నం అని చెప్పి తిరిగి హైదరాబాదు వచ్చేశాడు. “ఏరా? ఇంకా చావలనుందా?” అన్నాడు వేణు. లేదురా మొన్నటి దెబ్బకు ఇంక చచ్చిన చావకూడదు అనిపిస్తున్నది, బుద్ధి వచ్చింది” అన్నాడు. మాట అయితే అన్నాడు కానీ అజయ్ కి ఏ మాత్రం బతకాలని లేదు. ఎలా చావాలా? అని మళ్ళీ ఆలోచించటం మొదలు పెట్టాడు.

ఇలా గింజుకొని, లాక్కొని, పీక్కొని, కాకుండా క్షణాల్లో అంతా అయిపోవాలి అని అనుకుంటుండగా, ఒకరోజు ఉదయాన్నే పేపరులో “బిల్డింగ్ పై నుండి దూకి టెక్కీ ఆత్మా హత్య” అనే వార్త అజయ్ కంటపడింది. దీనికి మాత్రం తిరుగులేదు. పైకి ఎక్కటం కళ్ళు మూసుకొని దూకటం. అదృష్టం బాగుంటే నేలను తగిలేలోపు ప్రాణం పోతుంది అని మనస్సులో ఆనందించాడు. కొంచెం ఆలస్యమైనా పొరపాటు జరగకుండా, ఎవ్వరికీ అనుమానం రాకుండా తన పని పూర్తి చేసుకోవాలని అనుకొన్నాడు. ఎంతెత్తు నుండి దూకితే, చావు ఖాయంగా వస్తుందో ఆలోచించాడు. చేతులు విరిగి బయపడటం లాంటివి జరగకూడదు, చచ్చినా ఈ సారి చావు తప్పకూడదు” అని అనుకొన్నాడు.

ఇలా చావుతో చెలగాటాలు ఆడి ,చివరి మజిలీ కి చేరిన అజయ్ జీవితం ,ఒక అనూహ్య మలుపు తిరిగింది.అది అజయ్ జీవిత గమనాన్నే మార్చేసింది.అజ్ఞానంతో ,అవివేకంతో ప్రాణాలు తీసుకుందామనుకున్న అజయ్ కి ఒక కొత్త వెలుగు,కొండంత బలము వచ్చేలా ప్రేరేపించింది.

మనిషి దేవుడిని రెండు విషయాల్లో నమ్ముతాడు. ఒకటి తను అనుకున్నది జరగనప్పుడు, రెండు తను ఊహించనది జరిగినప్పుడు. అజయ్ ఇప్పుడు రెండో కోవలోకి వస్తాడు. తన ఉద్యోగం పోయి అజయ్ రోడ్డున పడతాడని ఎప్పుడూ ఊహించలేదు. నిషా తనను విడిచి వేరొకరితో వెళ్ళిపోతుందని కూడా ఊహించలేదు. హైటెక్ సిటీలో కొత్తగా కడుతున్న ఇరవై అంతస్తుల భవనాన్ని తన చావుకి కేంద్రంగా ఎంచుకున్నాడు. ఇంకొక వారం రోజుల్లో తన ఒకప్పటి ప్రియురాలు నిషా పుట్టినరోజు వస్తుంది. ఆ రోజునే తానూ ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు.

Posted in 2014, మార్చి, సాఫ్ట్‌వేర్ ఇతిహాస్యం, సీరియల్ and tagged , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.